హమాస్‌ను తుడిచిపెట్టడం ఇజ్రాయెల్‌కు అంత ఈజీ కాదా?

గాజా

ఫొటో సోర్స్, REUTERS

    • రచయిత, పాల్ ఆడమ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు "మిడిల్ ఈస్ట్‌ను మార్చేస్తాం" అని ప్రతిజ్ఞ చేశారు. జో బిడెన్ "వెనక్కి తగ్గేది లేదు" అని వ్యాఖ్యానించారు.

తాజాగా ఇజ్రాయెల్ దళాలు గాజాపై దాడులను తీవ్రతరం చేశాయి. ఇదే సమయంలో అక్కడి నుంచి కదలాలంటూ పాలస్తీనియన్లకు తాజా, అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్. ఇంతకీ ఇపుడేం జరగనుంది?

అక్టోబర్ 7 ఘటన తర్వాత ఇజ్రాయెల్ అధికారులు సైనికంగా, రాజకీయంగా గాజా నుంచి హమాస్‌ను నిర్మూలించాలనుకుంటున్నట్లు చెబుతూనే ఉన్నారు.

అయితే ఈ ఆశయం ఎలా సాధిస్తారో స్పష్టంగా చెప్పలేదు.

"రేపటి ప్రణాళిక లేకుండా మీరు ముందడుగు వెయ్యలేరు'' అని మైఖేల్ మిల్‌స్టెయిన్ అంటున్నారు.

మైఖేల్ 'టెల్ అవీవ్' యూనివర్శిటీ మోషే దయాన్ సెంటర్‌లోని పాలస్తీనియన్ స్టడీస్ ఫోరమ్ అధిపతి. అంతేకాదు ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌లో పాలస్తీనియన్ వ్యవహారాల శాఖ మాజీ అధిపతి కూడా.

అయితే దీనికి సన్నాహాలు ఇంకా ప్రారంభం కాలేదని మైఖేల్ ఆందోళన చెందుతున్నారు. "మీరు ఇప్పుడే దీన్ని చేసేయాలి" అని ఆయన సూచించారు.

తాము భవిష్యత్తు గురించి ఇజ్రాయెల్‌తో చర్చలు జరుపుతున్నామని పాశ్చాత్య దౌత్యవేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఏమీ స్పష్టంగా తెలియలేదు.

ఇజ్రాయెల్ దగ్గర ఖచ్చితంగా స్థిరమైన ప్రణాళిక లేదని అందులో ఒకరు చెప్పారని ఆయనన్నారు.

"మీరు కాగితంపై కొన్ని ఆలోచనలు రాయొచ్చు, కానీ వాటిని నిజం చేయడానికి వారాలు, నెలలు పడుతుంది" అని తెలిపారు మైఖేల్.

హమాస్

ఫొటో సోర్స్, Getty Images

హమాస్ అంత తొందరగా పోయేది కాదు

హమాస్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించడం నుంచి గాజాలోని పెద్ద భాగాలను స్వాధీనం చేసుకునే వరకు సైనిక ప్రణాళికలు ఉన్నాయి.

కానీ మునుపటి సంక్షోభాలను చూసిన సుదీర్ఘ అనుభవం ఉన్నవారు ప్రణాళికాబద్ధంగా వెళుతున్నట్లు చెబుతున్నారు.

"మేం మా బలగాలను గాజా నుంచి వెనక్కి రప్పించినా దానికి సరైన పరిష్కారం దొరుకుతుందని అనుకోవడం లేదు" అని ఇజ్రాయెల్ విదేశీ ఇంటెలిజెన్స్ సర్వీస్ మొస్సాద్‌లోని మాజీ సీనియర్ అధికారి హైమ్ టోమర్ చెప్పారు.

‘‘ఇజ్రాయెలీలు అందరూ ‘హమాస్‌ను ఓడించాలి. అక్టోబర్ 7 ఊచకోతలు చాలా భయంకరమైనవి. గాజాలో హమాస్ పాలనకు మళ్లీ అనుమతించకూడదు' అనే అభిప్రాయంలో ఉన్నారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ''హమాస్ ఒక భావజాలం, ఇజ్రాయెల్ అంత సులభంగా తుడిచేస్తే పోయేది కాదు'' అని మైఖేల్ అంటున్నారు.

సద్దాం హుస్సేన్ విగ్రహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాగ్దాద్‌లోని సద్దాం హుస్సేన్ విగ్రహాన్ని తొలగిస్తున్న అమెరికా బలగాలు

ఇరాక్ ఘటన గుర్తుందా?

2003లో ఇరాక్ నుంచి సద్దాం హుస్సేన్ గుర్తులను తొలగించడానికి అమెరికా ప్రయత్నించిన మాదిరే ఇజ్రాయెల్ ఆలోచనలు ఉన్నాయని మైఖేల్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో దీనిని "డి-బాతిఫికేషన్" అని అన్నారు.

అయితే, ఇదొక డిజాస్టర్‌గా మిగిలిందని, వందలు, వేల మంది ఇరాకీ పౌర సేవకులు, సాయుధ దళాల సభ్యులకు పని లేకుండా చేసిందని, చివరకు తిరుగుబాటుకు బీజాలు వేసిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. .

అప్పటి అమెరికన్ అనుభవజ్ఞులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. ఫల్లూజా, మోసుల్ వంటి ప్రదేశాలలో వారి అనుభవాల గురించి ఇజ్రాయెల్ సైన్యంతో మాట్లాడుతున్నారు.

"ఇరాక్‌లో వారు చేసిన తప్పులను ఇజ్రాయెల్‌లకు వివరిస్తారనుకుంటున్నా" అని మైఖేల్ చెప్పారు.

"ఉదాహరణకు అధికార పార్టీని నిర్మూలించడం లేదా ప్రజల ఆలోచనలను మార్చడం వంటి వాటిపై భ్రమలు పెట్టుకోకూడదు. అది జరగదు" అని ఆయన సూచించారు.

దీనిని పాలస్తీనియన్లూ కూడా అంగీకరిస్తున్నారు.

గాజా

ఫొటో సోర్స్, Getty Images

'ఈజిప్టుకు పంపే ప్రణాళిక'

"హమాస్ స్థానికంగా బలంగా పాతుకుపోయింది" అని పాలస్తీనియన్ నేషనల్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు ముస్తఫా బర్ఘౌతి చెప్పారు.

"వారు హమాస్‌ లేకుండా చేయాలనుకుంటే, గాజా మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి" అని ముస్తఫా అన్నారు.

ఇజ్రాయెల్ అనేక మంది పాలస్తీనియన్లను గాజా నుంచి ఈజిప్టులోకి పంపడానికి ప్లాన్ చేస్తుందనే ఆలోచన పాలస్తీనియన్లలో చాలా భయాన్ని కలిగిస్తోంది.

చాలామంది పాలస్తీనియన్లు ఇప్పటికే శరణార్థులుగా ఉన్నందున ఇది వారికి ఇబ్బందికరమే.

1948లో ఇజ్రాయెల్ ఏర్పడినపుడు ప్రస్తుత పాలస్తీనియన్ల పూర్వీకులు తమ ఇళ్లను విడిచి పెట్టవలసి వచ్చింది. ఇపుడు మరొక వలస అనేది అప్పటి కష్టమైన, బాధాకరమైన సంఘటనలను గుర్తు చేస్తుంది.

"వెళ్లిపోవడమంటే వన్‌వే టికెట్‌. మళ్లీ తిరిగి రాలేం'' అని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మాజీ ప్రతినిధి డయానా బుట్టు అభిప్రాయపడ్డారు.

పాలస్తీనియన్లు తాత్కాలికంగా సినాయ్ సరిహద్దులో నివాసం ఉండవలసిన అవసరాన్ని మాజీ సీనియర్ అధికారులతో సహా పలువురు ఇజ్రాయెల్ వ్యాఖ్యాతలు తరచుగా ప్రస్తావించారు.

అమాయక పాలస్తీనియన్లను చంపకుండా ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని సాధించాలంటే వారిని గాజా నుంచి ఖాళీ చేయించడమే మంచి మార్గమని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి మాజీ అధిపతి గియోరా ఐలాండ్ చెప్పారు.

పాలస్తీనియన్లు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఈజిప్టుకు వెళ్లాల్సిందిగా ఆయన సూచించారు.

ఇజ్రాయెల్, యుక్రెయిన్‌లకు నిధులను ఆమోదించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్టోబర్ 20న కాంగ్రెస్‌కు చేసిన అభ్యర్థన పాలస్తీనా భయాలను మరింత పెంచుతోంది.

ఈ సంక్షోభం సరిహద్దులో వలస, ప్రాంతీయ మానవతా సంక్షోభాలకు దారి తీస్తుంది. ఇప్పటివరకైతే పాలస్తీనియన్లను సరిహద్దు దాటాలని ఇజ్రాయెల్ చెప్పలేదు. దక్షిణ గాజాలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మాత్రమే చెప్పింది.

గాజా

ఫొటో సోర్స్, REUTERS

ఇది మిలియన్ డాలర్ ప్రశ్న

గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం అక్కడి పౌరులను ఈజిప్ట్‌కు వలస పంపే ప్రయత్నం కావచ్చని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సిస్సీ వ్యాఖ్యానించారు.

అంతా ముగిశాక గాజాలో ఇంకా ప్రజలు ఉంటే వారిని ఎవరు పాలిస్తారు? "అది మిలియన్ డాలర్ల ప్రశ్న" అని మైఖేల్ అభిప్రాయపడ్డారు.

గాజన్లతో ఏర్పడే పాలనకు ఇజ్రాయెల్ మద్దతు తెలపాలని మైఖేల్ సూచిస్తున్నారు. దీనికోసం అమెరికా, ఈజిప్ట్, సౌదీ అరేబియాల సాయం తీసుకోవాలన్నారు.

పాలస్తీనా వర్గమైన ఫతాకు చెందిన నాయకులను కూడా ఇందులో చేర్చాలన్నారు. 2006 ఎన్నికలలో గెలిచిన ఏడాది తర్వాత గాజా నుంచి హమాస్ హింసాత్మకంగా వారిని తొలగించింది.

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లా నగరంలో ఉన్న పాలస్తీనా అథారిటీ (పీఏ)ని ఫతా నియంత్రిస్తుంది.

కానీ పీఏ, దాని వృద్ధ నాయకుడు మహమూద్ అబ్బాస్ వెస్ట్ బ్యాంక్, గాజాలోని పాలస్తీనియన్లలో అంతగా ప్రజాదరణ ఉన్న వ్యక్తి కాదు.

''పీఏ రహస్యంగా గాజాకు తిరిగి రావాలని కోరుకుంటోంది. అయితే ఇజ్రాయెల్ వెనక నుంచి పాలించడానికైతే కాదు'' అని డయానా బుట్టు అన్నారు.

ఇదేం చదరంగం కాదు

1990లలో పీఏలో పనిచేశారు పాలస్తీనా రాజకీయవేత్త హనన్ అష్రావి.

ఇజ్రాయెల్‌తో సహా బయటి వ్యక్తులు మరోసారి పాలస్తీనియన్ల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని అష్రావి భావిస్తున్నారు.

"ఇది చదరంగం అని భావించేవారు కొన్ని బంట్లను అక్కడ, ఇక్కడకు తరలించి, చివరలో చెక్‌ చెప్పొచ్చనుకుంటున్నారు. కానీ, అది జరగదు" అష్రావి అన్నారు.

"మీకు సాయం చేసేవారు దొరకొచ్చు, కానీ గాజన్లు వారిని దయతో చూడరు" అని ఆమె చెప్పారు.

ఇజ్రాయెల్ దళాలు

ఫొటో సోర్స్, Getty Images

2012 నాటి ప్రణాళిక అవసరం

గాజాలో మునుపటి సంఘర్షణలు అనుభవించిన వాళ్లు ప్రస్తుత పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నారు.

తానైతే బందీల విడుదల కోసం సైనిక కార్యకలాపాలను ఒక నెలపాటు నిలిపివేస్తానని మొసాద్ మాజీ అధికారి హైమ్ టోమర్ అంటున్నారు

2012లో గాజాలో పోరాటం తర్వాత, రహస్య చర్చల కోసం కైరోకు మొసాద్ డైరెక్టర్‌తో కలిసి వెళ్లారు టోమర్. ఈ చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించారు.

ఇపుడు హమాస్ ప్రతినిధులు ఒక వైపు ఉన్నారు. ఈజిప్టు అధికారులు మధ్యలో ముందుకు, వెనుకకు కదులుతున్నారు.

ఇజ్రాయెల్‌ ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చినప్పటికీ, ఇలాంటి విధానాన్ని మళ్లీ అనుసరించాలని టోమర్ భావిస్తున్నారు.

"2 వేల మంది హమాస్ ఖైదీలను విడుదల చేసినా పట్టించుకోను. మా బందీలు ఇంటికి తిరిగి రావడం చూడాలనుకుంటున్నా" అని అన్నారు.

ఇజ్రాయెల్ పూర్తి స్థాయి సైనిక కార్యకలాపాలను పునఃప్రారంభించాలా లేదా దీర్ఘకాలిక కాల్పుల విరమణను ఎంచుకోవాలా అనేది అప్పుడు నిర్ణయించుకోవచ్చని టోమర్ సూచించారు.

గాజాను ఇజ్రాయెల్ దూరం పెట్టకపోతే దానిని నిరంతరం ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అది ఒక నిరంతర, సవాలుతో కూడిన సమస్యగా అభివర్ణించారు టోమర్. "ఇది గొంతులో ఎముక ఇరుక్కుపోవడం లాంటిది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, బాంబు పేలుళ్ల మధ్యే బిడ్డకు జన్మనిచ్చిన గాజా జర్నలిస్ట్ జుమానా...

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)