ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: ప్రకటనలు లేని సేవల కోసం ఇకపై సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి... దీనికి ఎంత చెల్లించాలి?

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం : చందా చెల్లిస్తేనే మెటా సేవలు
    • రచయిత, టామ్ గెర్కెన్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్

వినియోగదారులకు ప్రకటనల అంతరాయం లేని సేవలు అందించేందుకు సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూరప్‌లోని చాలా దేశాలలో చందా విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చాయి.

మెటా ఆధారిత ఫ్లాట్‌ఫామ్స్ వాడే వినియోగదారులు నెలకు దాదాపు 883 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, యూకేలో ఈ విధానం అందుబాటులో లేదు.

నిబంధనలు అతిక్రమించినందుకు జనవరిలో యురోపియన్ యూనియన్ మెటాకు 39 కోట్ల యూరో డాలర్ల జరిమానా విధించింది.

యూరోపియన్ యూనియన్ ప్రజలకు, యూరోపియన్ ఎకనమిక్ ఏరియా, స్విజ్టర్లాండ్ ప్రజలకు నవంబరు నుంచి ప్రత్యేకంగా చందా విధానం తీసుకురానుంది.

ప్రస్తుతం ఈ విధానం 18 ఏళ్ళు దాటినవారికే పరిమితం చేస్తున్నారు. యురోపియన్ యూనియన్ నిబంధనలు అతిక్రమించకుండా యువకులకు ప్రకటనలు ఎలా చేరవేయగలదనే విషయాన్ని మెటా పరిశీలించనుంది.

తమ కొత్త చందా విధానం యురోపియన్ యూనియన్ ఆందోళనను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చామని, డబ్బు సంపాదనకు కాదని మెటా తెలిపింది.

‘‘ప్రకటనలతో కూడిన ఇంటర్నెట్ వ్యవస్థను మేం నమ్ముతాం. దీనివలన ప్రజకు తమ వ్యక్తిగత అభిరుచులకు అనుగుణమైన ఉత్పత్తులు సేవలు చూసేందుకు తమ స్థితిగతులకు అతీతంగా అవకాశం కలుగుతుంది’’ అని మెటా సంస్థ ఓ బ్లాగ్‌లో రాసింది.

యూజర్లు చందాదారులుగా మారే అవకాశం వలన యురోపియన్ నియంత్రణలను సమతుల్యం చేయడంతోపాటు ఈయూ, ఈఈఏ, స్విజ్జర్లాండ్‌లలో మెటా సేవలు కొనసాగించడానికి అనుమతి లభిస్తుంది.

‘‘మేం యురోపియన్ నిబంధనలను గౌరవిస్తాం. వాటితోపాటు కొనసాగేందుకు సిద్ధంగాఉన్నాం’’ అని మెటా తెలిపింది.

యూజర్లు ఉచితంగా కొనసాగాలంటే ప్రకటనలతోపాటు తమ డేటా వివరాలను ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలని, లేదంటే చందా చెల్లిస్తే ప్రకటనలు లేని మెటాను ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.

సామాజిక మాధ్యమాలు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా యూజర్లకు చందాలు తప్పవు

ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ద్వారా చెల్లించేవారు అదనంగా మూడు యూరోలు చెల్లించాల్సి ఉంటుందని, అదే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెల్లించేవారు ఈ అదనపు రుసుము చెల్లించక్కరలేదని తెలిపింది.

మార్చి 2024 నుంచి యూజర్లు తమకు ఈ ఫ్లాట్‌ఫామ్స్‌పై ఎన్ని ఖాతాలు ఉంటే అన్నింటికీ అదనపు సొమ్ము చెల్లించాలని పేర్కొంది. అంటే బిజినెస్ ఖాతాలు, వ్యక్తిగత వేరువేరుగా నిర్వహించేవారు ఈ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది.

ఎలాన్‌మస్క్ తన ఎక్స్ (గతంలో ట్విటర్) కు ప్రకటనలు లేని ప్రీమియం ప్లస్ సర్వీసులకు 16 పౌండ్లు ( దాదాపు 1620 రూపాయలు ) నిర్ణయించాకా మెటా ఈ ప్రకటన చేసింది.

‘ఎక్స్‌’లో మరింత చౌక అయిన చందా విధానం కూడా ఉంది. అందులో ప్రకటనలు ఉంటాయి. కాకపోతే యూజర్లు తమ పోస్టులను ఎడిట్ చేసుకోవచ్చు,దీంతోపాటు ఇతర ప్రయోజనాలతోపాటు బ్లూటిక్ చెక్‌మార్క్‌ను అందించే ప్రామాణిక ప్రీమియం కూడా అందుబాటులో ఉంది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)