ఈ వెయ్యి పిల్లులను ఎందుకు చంపాలనుకున్నారు?

పిల్లుల అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లి మాంసాన్ని దక్షిణ చైనాలో పంది, గొర్రె మాంసంగా చెప్తూ విక్రయిస్తారు
    • రచయిత, నికోలస్ యోంగ్
    • హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్

అక్రమ రవాణా చేస్తున్న 1,000కి పైగా పిల్లులను రక్షించారు చైనా పోలీసులు. ఒకవేళ అలా జరగకపోయి ఉంటే, ఇవన్ని మాంసపు ముద్దలుగా మారి, పోర్క్ లేదా మటన్‌ పేరుతో మార్కెట్‌లో విక్రయానికి సిద్ధం అయ్యేవి.

జంతు సంరక్షణ కార్యకర్తలు ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారని చైనాలోని ప్రభుత్వ అనుబంధిత మీడియా వెల్లడించింది.

ఝాంగ్‌జియాగంగ్ నగరానికి ఉత్తర భాగాన ఈ ఘటన చోటుచేసుకోగా, పిల్లులను శిబిరానికి తరలించినట్లు ‘ది పేపర్’ పత్రిక కథనం ప్రచురించింది.

ఈ ఘటనతో పిల్లుల అక్రమ రవాణా, పిల్లుల మాంస విక్రయాలు, ఆహార భద్రతపై అనుమానాలు తలెత్తాయి.

పిల్లి మాంసం క్యాటీ 4.5 యువాన్లు(దాదాపు 51 రూపాయలు) ధర పలుకుతుందని ఓ యాక్టివిస్టు చెప్పారు. క్యాటీ అనేది చైనాలో ఒక కొలమానం. క్యాటీ అంటే 600 గ్రాములకు సమానం.

పిల్లి ఒక ఈతలో నాలుగు నుంచి ఐదు పిల్లలకు జన్మనిస్తుంది.

పోలీసులు రక్షించిన పిల్లులు వీధి పిల్లులా, లేదా పెంపుడు పిల్లులా అన్నది ఇంకా తెలియలేదు. వీటిని చైనాలోని దక్షిణ ప్రాంతానికి తరలిస్తున్నారు. అక్కడ ఈ పిల్లుల మాంసాన్ని పోర్క్, మటన్ సాసేజెస్‌గా విక్రయిస్తున్నారు.

‘ది పేపర్’ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఝాంగ్‌జియాగంగ్‌ నగరంలోని ఓ శ్మశానంలో భారీ సంఖ్యలో పిల్లులను చెక్కపెట్టెల్లో, ఆరురోజుల పాటు ఉంచడాన్ని జంతు సంరక్షణ కార్యకర్తలు గుర్తించారు.

అక్టోబర్ 12న వాటిని ట్రక్కులో ఎక్కించి, రవాణా చేస్తుండగా, ఆ వాహనాన్ని నిలిపివేసి, పోలీసులకు సమాచారం అందించారు.

సోషల్ మీడియాలో పెల్లుబికిన ఆగ్రహం

పిల్లుల అక్రమ తరలింపుపై చైనా సోషల్ మీడియా వేదిక వీబోలో ఆగ్రహం పెల్లుబికింది. దీనిని నిరసిస్తూ వేలల్లో స్పందనలు వచ్చాయి. ఆహార పరిశ్రమల్లో తనిఖీలు పెంచాలని కొంత మంది యూజర్లు అభిప్రాయపడ్డారు.

ఈ పనులు చేస్తున్నవారు దారుణమైన మరణాన్ని పొందాలని కోరుకుంటున్నా అని ఓ యూజర్ కామెంట్ చేశారు.

మరొకరు, జంతు సంరక్షణ చట్టాలు ఇంకెప్పటికి అమలులోకి వస్తాయి, పిల్లులు, కుక్కల ప్రాణాలకు విలువలేదా అని ప్రశ్నించారు.

ఇక మీదట నేను బయట బార్బిక్యూలు తినబోయేది లేదని మరొక యూజర్ అన్నారు.

ఈ ఏడాది జూన్‌లో, జియాంగ్‌షి ప్రావిన్స్‌లోని ఓ కాలేజీలో విద్యార్థి తినే భోజనంలో ఎలుక తల కనిపించిన ఘటనపై పెద్ద దుమారమే రేగింది.

కాలేజీ యాజమాన్యం తొలుత అది బాతు మాంసమని వాదించింది, ఆ తరువాత విద్యార్థి వాదనను సమర్థించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)