బీర్ ట్యాంకులో మూత్రం పోసిన వర్కర్, వీడియో వైరల్

సింగ్టావో చైనాలో రెండో అతిపెద్ద బీర్ తయారీదారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సింగ్టావో చైనాలో రెండో అతిపెద్ద బీర్ తయారీదారు
    • రచయిత, ఫ్యాన్ వాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

చైనాలో సింగ్టావో బీర్ కంపెనీకి చెందిన వర్కర్ ఒకరు బీర్ ట్యాంకులో మూత్రం పోస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది.

ఈ వీడియోపై చైనా అధికారులు విచారణ చేపట్టారు.

ఈ బీర్ పాపులర్ కావడానికి ప్రధాన కారణం దాని ఇంగ్రీడియంట్సేనని చాలా మంది నమ్ముతారు.

ప్రస్తుతం వైరల్ అయిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో కోట్ల మంది వీక్షించారు.

వర్కర్ ఒకరు మూత్రం పోసే వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే తాము పోలీసులను అప్రమత్తం చేశామని కంపెనీ తెలిపింది.

అంతేకాక, ఆ ఇంగ్రీడియంట్స్‌ను సీల్ చేసినట్లు చెప్పింది.

సింగ్టావో చైనాలో అతిపెద్ద బీర్ తయారీ సంస్థల్లో ఒకటి. ఇది అతిపెద్ద ఎగుమతిదారు కూడా.

బీర్ ట్యాంకులో కార్మికుడు మూత్రం పోస్తున్న వీడియో గురువారం ఆన్‌లైన్‌లో కనిపించింది.

కంపెనీ యూనిఫామ్, హెల్మెట్ ధరించిన ఈ వర్కర్, ఎత్తయిన గోడ మీదుగా కంటైనర్‌లోకి దూకి, ఆ తర్వాత కంటైనర్ లోపల మూత్రం పోస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది.

ఈ వీడియో క్లిప్‌లో కనిపిస్తున్న లొకేషన్‌లో ‘‘సింగ్టావో బీర్ నం.3 ఫ్యాక్టరీ’’ అని రాసి ఉందని స్థానిక వార్తా సంస్థ ది పేపర్ రిపోర్టు చేసింది.

అయితే, ఆ వీడియోలో కనిపించే వ్యక్తి, వీడియో తీసిన అతను ఇద్దరు కూడా కంపెనీ డైరెక్ట్ ఎంప్లాయీస్(ప్రత్యక్ష ఉద్యోగులు) కాదని సంస్థ అంతర్గత వర్గాలు చెప్పినట్లు బిజినెస్ అవుట్‌లెట్ ‘‘నేషనల్ బిజినెస్ డైలీ’’ తెలిపింది.

ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి, ఆన్-సైట్ విచారణను ప్రారంభించినట్లు ఈ ఫ్యాక్టరీ ఉన్న పింగ్డు సిటీ మార్కెట్ సూపర్‌విజన్, అడ్మినిస్ట్రేషన్ బ్యూరో తెలిపింది.

వివరాలు పూర్తిగా నిర్ధరణ అయిన తర్వాత ఈ విషయంపై బ్యూరో కఠిన చర్యలు చేపట్టనుందని కూడా చెప్పింది.

పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించినట్లు శుక్రవారం సింగ్టావో తెలిపింది.

ఈ వీడియోపై కంపెనీ అభిప్రాయం తెలుసుకునేందుకు సింగ్టావోను బీబీసీ సంప్రదించింది.

సింగ్టావో వర్కర్

ఫొటో సోర్స్, WEIBO

ఫొటో క్యాప్షన్, గోడపై నుంచి బీర్ కంటైనర్‌లోకి దూకి మూత్రం పోసే వీడియో వైరల్

ఈ క్లిప్‌ను చూసి చైనా సోషల్ మీడియా ప్రజలు తీవ్ర షాక్‌‌కు గురయ్యారు.

ఈ బ్రాండ్‌కి చైనాలో, విదేశాల్లో మంచి పేరుంది.

‘‘ ఈ మూత్రం పెద్ద మొత్తంలో డబ్బును హరింపజేస్తుంది. కంపెనీకి ఈ వర్కర్ చేసిన అసలు డ్యామేజ్ ఇదే’’ అనే కామెంట్‌‌కు చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబీలో భారీగా లైకులు వచ్చాయి.

‘‘నేను బీర్ తాగకపోవడం మంచిదైంది. కానీ, ఒకవేళ దీనివల్ల బ్రాండ్ ప్రస్థానం ముగిస్తే, అది ఊహకు అందనిదే’’ అని మరో యూజర్ కామెంట్ చేశారు.

ఇలా జరగడం ఇదే తొలిసారా అని మరో యూజర్ కామెంట్ చేశారు.

బీర్ కంటైనర్‌లో మూత్రం పోసే వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, సోమవారం ఉదయం షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్‌లో సింగ్టావో బ్రేవరీ షేర్లు బాగా పడిపోయాయి. మధ్యాహ్నం సమయానికి ఈ కంపెనీ షేర్లు ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)