కేజ్రీవాల్ అరెస్టయితే ఆమ్ ఆద్మీ కథ ముగిసినట్లేనా... 5 ప్రశ్నలు-జవాబులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ ప్రభుత్వ పాత మద్యం విధానానికి సంబంధించి తమ ఎదుట హాజరు కావాలంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది.
నవంబరు 2న విచారణకు రావాలంటూ సమన్లు పంపింది.
కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారేమోనని ఆమ్ అద్మీ పార్టీ నేత, దిల్లీ మంత్రి అతిషి ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం ఆమ్ అద్మీ పార్టీని నాశనం చేయాలని చూస్తోందని ఆ పార్టీ అధికారప్రతినిధి సౌరభ్ భరద్వాజ ఆరోపించారు.
ఇప్పటికే దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ముగ్గురు ఆప్ మంత్రులు సత్యేంద్ర జైన్, మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.
తాజాగా ఈ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేయడంతో ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారనే భయాందోళనలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి.
నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీకి ఆమ్ అద్మీ పార్టీ మాత్రమే గట్టిపోటీ ఇచ్చే స్థితిలో ఉండటంతో తమను వేధిస్తున్నారని ఆప్ నేతలు నమ్ముతున్నారు.

ఫొటో సోర్స్, ANI
1. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందా?
అరవింద్ కేజ్రీవాల్‌ను రాజకీయసమాధి చేయాలని బీజేపీ కోరుకుటోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. వారు ఆప్‌ను మనుగడలో లేకుండా చేయాలని చూస్తున్నట్టు ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆప్ చేస్తున్న ఈ ఆరోపణల్లో ఎంత బలముంది? ఒక పార్టీగా ఆప్ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితిని బీజేపీ సృష్టిస్తోందా?
‘‘దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ‘మనీ ట్రయల్’కు ఆధారాలు ఎక్కడున్నాయని కోర్టు పదేపదే అడుగుతోంది. కానీ ఇప్పటిదాకా సీబీఐ కానీ, ఈడీ కానీ ఆధారాలు సమర్పించలేదు’’ అని సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా చెప్పారు.
‘‘ కోర్టులు కూడా ఇప్పటిదాకా అరెస్ట్ అయిన ఆప్ నేతలకు సంబంధించి విచారణా ఏజెన్సీలు ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోతున్నాయని చెపుతున్నప్పుడు ఈ విచారణ సాగదీత ఎందుకోసం? వీరి బెయిల్ పై పదేపదే ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇదంతా చూసినప్పుడు ఈడీ సమన్ల అంతరార్థం ఏమిటో అర్థంచేసుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు.
ఇప్పటికే ముగ్గురు పెద్దనాయకులు జైల్లో ఉన్న నేపథ్యంలో నవంబరు 2న విచారణ తరువాత అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆప్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది.
‘‘ఇలాంటి పరిస్థితులలో ఆప్ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది’’ అని శరద్ గుప్తా వివరించారు.
బీజేపీకి అతిపెద్ద పోటీదారుగా ఆప్ కనిపిస్తుండం వలనే బీజేపీ ఆగ్రహంగా ఉందా?
‘‘మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బలం లేకపోయినా తన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ఆప్ బీజేపీకి సాయపడుతోంది. గుజరాత్‌లోనూ ఆప్ ఇలాగే చేసింది. దీనివల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండిపడుతుంది. ఇది కేవలం బీజేపికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ బీజేపీకి ఆప్ ఇంత సాయం చేస్తున్నా ఆ పార్టీ ఇబ్బందులకు గురవుతోంది’’ అని శరద్ గుప్తా చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
2. బీజేపీకి ఆప్ అతిపెద్ద పోటీదారా?
బీజేపీకి అతిపెద్ద పోటీదారు కాకపోతే ఆ పార్టీ బీజేపి బాధితురాలిగా ఎందుకు మారుతోంది?
‘‘బీజేపీ ఓ సక్సెస్‌ఫుల్ రాజకీయపార్టీ. ఇలాంటి పార్టీలు ప్రతిపక్షాలు ఎదగడానికి ఎటువంటి అవకాశాలు ఇవ్వవు. బీజేపీ కూడా ఈ పనే చేస్తోంది. ప్రతిపక్షాలను అణచివేయడంలో నిర్దయగా ప్రవర్తిస్తోంది’’ అని శరద్ గుప్తా తెలిపారు.
‘‘మోదీని, అమిత్ షాను విమర్శించేవారు తమ ఆర్థిక కార్యకలాపాలు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. లిక్కర్ పాలసీకి సంబంధించి ఆప్‌లో గందరగోళం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం ఆప్‌ను ఎందుకు వదులుతుంది’’ అని శరద్ గుప్తా చెప్పారు.
హరియాణాలోనూ ఇదే విధమైన లిక్కర్ పాలసీని అమలు చేశారని, కానీ మోదీ ప్రభుత్వం తమనే లక్ష్యంగా చేసుకుందని విమర్శిస్తోంది ఆప్. కేవలం మోదీ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందని చెప్పడం వల్ల ఉపయోగం ఉండదని శరద్ గుప్తా విశ్లేషించారు.

ఫొటో సోర్స్, ANI
3. ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా చేయడానికి కేజ్రీవాల్‌కు సమన్లు పంపారా?
ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ చేసిన ఆరోపణల్లో నిజమెంత?
దీనిపై ఆప్ కార్యకలాపాలను దీర్ఘకాలంగా కవర్ చేస్తున్న జర్నలిస్టు కృష్ణ మోహన్ శర్మ మాట్లాడుతూ ఆప్ ఎదుర్కొంటున్న ముప్పు క్రమంగా పెరుగుతోందన్నారు.
‘‘సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లాంటి పెద్దనాయకులు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈడీ ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. ఇలా పార్టీ నిస్సహాయస్థితిలోకి జారడం ప్రమాదమే’’ అని కృష్ణ మోహన్ వివరించారు.
‘‘అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు ఈడీ దగ్గర తగినన్ని ఆధారాలు ఉన్నాయనే సమాచారం ఉంది. ఆయనగనక అరెస్ట్ అయితే ఆప్ వెన్ను విరిచినట్టే అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్, లేదంటే మంత్రి అతిషిని సీఎంగా చేయవచ్చు. కానీ అదేమీ పెద్దగా ఉపయోగపడదు’’ అని ఆయన అన్నారు.
అరవింద్ అరెస్ట్ ఆప్ మనుగడను ప్రమాదంలోకి నెడుతుందని కృష్ణమోహన్ అంటున్నారు. దిల్లీని పాలించడానికి వీరిలో ఎవరికీ తగినంత సామర్థ్యం లేదు. పరిస్థితులలో అరవింద్ అరెస్ట్‌తో ఆప్ పతనం మొదలైనట్టే భావించాలి.
అయితే ఆప్ గట్టిపోటీదారు కావడం వలనే బీజేపీ ఆగ్రహంగా ఉందా అనే పశ్నపై కృష్ణమోహన్ స్పందిస్తూ ‘‘ ఇది అలాంటిది కాదు. దిల్లీలోని మొత్తం ఏడు పార్లమెంటు స్థానాలు బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా 104 స్థానాలు ఉన్నాయి. ఇన్ని సీట్లు వస్తాయని కూడా ఎవరూ ఊహించలేదు. బీజేపీ ఇప్పుడు చాలా బలమైన పార్టీ. అందుకే ఆప్ ఆ పార్టీకి అంత పెద్ద పోటీదారు కాదు’’ అన్నారు కృష్ణమోహన్ శర్మ.

ఫొటో సోర్స్, Getty Images
4. అద్దాల గదిలో కూర్చుని ఆప్ అందరిపై రాళ్లు విసురుతోందా?
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆప్ అదేపనిగా గళమెత్తడం వల్లే ఆ పార్టీని బీజేపీ లక్ష్యంగా చేసుకుందా? మోదీ, అమిత్‌షా లాంటి అగ్రనేతలపై ఆప్ వీరావేశంతో నిందలు వేస్తోందా?
‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అందరినీ అవినీతిపరులంటూ ఆరోపణలు చేస్తుంది. ఆప్ చెప్పే అవినీతిపరుల చిట్టాలో రాహుల్ గాంధీ, షీలాదీక్షిత్, సోనియాగాంధీ, అదానీ, అంబానీ కూడా ఉన్నారు, కానీ వీరిపై చేసే ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారం బయట పెట్టదు. కానీ అదే పార్టీ ఇప్పడు తమ నేతలను ఎటువంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టారని చెపుతోంది. మరి ఈ నేతలకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేనప్పుడు ఈ కేసులు కోర్టుల్లో దీర్ఘకాలంగా ఎందుకు ఉన్నాయో ఆలోచించాలి’’ అని కృష్ణమోహన్ శర్మ చెప్పారు.
‘‘సుప్రీం కోర్టు కూడా మనీ ట్రయల్ గురించి ప్రస్తావించింది. ఆప్ లీడర్లకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరిగే ఆస్కారం ఉంది. కానీ అందరినీ తెల్లకాగితంపై నిందితులుగా చూపి జైలుకు పంపేంత కుట్ర జరగదు’’ అని శర్మ తెలిపారు.
‘‘ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలను తప్పుడు కేసులలో ఇరికించారని చెపుతోంది. కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లోనూ కాంగ్రెస్ నేతలను ఇలాగే తప్పుడు కేసులలో ఇరికిస్తోంది. ఇదెలా ఉందంటే అద్దాలగదిలో కూర్చుని ఇతరులపై రాళ్ళు వేస్తున్నట్టుగా ఉంది’’ అని శరద్ గుప్తా చెప్పారు.
5. సీఐబీ ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదు, కానీ, ఈడీ సమన్లు పంపడంలో పరమార్ధమేంటి?
దిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. కానీ ఎఫ్ఐఆర్‌లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా చేర్చలేదు.
కానీ, ఇదే కేసులో ఇప్పడు ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేసింది. మాజీ ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్ ఈ కేసులో ఇప్పటికే అరెస్టయ్యారు.
సోమవారం సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ఈడీ కేజ్రీవాల్‌కు జారీచేసిన సమన్లలో రూ.338 కోట్లు సొమ్ము చేతులు మారాయడానికి ఆధారాలు ఉన్నట్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఐఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: యాపిల్ వివరణపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు?
- జెహోవా విట్నెస్: ఇంగ్లిష్ టీచర్ ఎందుకు బాంబులు పెట్టారు?
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
- ఖతార్ మరణశిక్ష నుంచి 8 మంది మాజీ నేవీ అధికారులను కాపాడటానికి భారత్ ముందున్న ఆప్షన్లు ఇవే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















