విజయనగరం రైలు ప్రమాదం ఎలా జరిగింది? కారణాలపై గోప్యత ఎందుకు?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విజయనగరం జిల్లాలో ఆదివారం నాటి రైలు ప్రమాదానికి కారణాలను రైల్వేశాఖ, అధికారులు ఇప్పటివరకు వెల్లడించకపోవడం చర్చనీయమైంది.
ట్రాక్ పునరుద్ధరణ జరిగి, రైళ్ల రాకపోకలను అనుమతిస్తున్నా ప్రమాదానికి కారణాలను చెప్పకుండా గోప్యత ఎందుకు పాటిస్తున్నారనే ప్రశ్న వినిపిస్తోంది.
ఘటనా స్థలానికి వచ్చిన రైల్వే అధికారులను, ఆంధ్రప్రదేశ్ మంత్రులను ప్రమాద కారణాలపై మీడియా ప్రశ్నిస్తే ఎవరి నుంచీ సరైన సమాధానం రాలేదు.

కారణాలపై మాట్లాడేందుకు డీఆర్ఎం నిరాకరణ
విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ మధ్య ఆగివున్న పలాస ప్యాసింజర్‌ను అదే ట్రాక్‌పై వచ్చిన రాయగడ ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 13 మంది మరణించినట్లు విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు.
ఘటనా స్థలంలో రైళ్ల రాకపోకలకు అనుగుణంగా సోమవారం పట్టాలను పునరుద్ధరించారు. విశాఖ-విజయనగరం వైపు గూడ్స్ రైలును నడిపి, ట్రయల్ రన్ నిర్వహించారు. గూడ్స్ వెళ్లిన తర్వాత అదే పట్టాలపై ప్రశాంతి ఎక్స్ ప్రెస్ వెళ్లింది. దీంతో పునరుద్దరణ పనులు పూర్తయ్యినట్లు అధికారులు ప్రకటించారు.
పునరుద్దరణ పనులు పర్యవేక్షించేందుకు వాల్తేరు డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ఘటనా స్థలానికి వచ్చారు. ప్రమాదం ఎలా జరిగింది, దానికి కారణాలేంటి అనే విషయాలను మాట్లాడేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.
ఆదివారం రాత్రి ఏడు గంటలకు ప్రమాదం జరిగితే యుద్ధ ప్రాతిపదికన 19 గంటల్లోనే ట్రాక్ పునరుద్ధరణ చేశామని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు చెప్పారు.
రైలు సేవల పునరుద్ధరణ కోసం 1000 మందికి పైగా కార్మికులు, ఇతర అన్ స్కిల్డ్ సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన సూపర్ వైజర్లు పని చేశారని తెలిపారు.
సిగ్నల్ సమస్యే కారణమా?
ఈ ప్రమాదానికి కారణమిదని ఇప్పటీవరకు రైల్వే అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ, మంత్రులు కానీ ప్రకటించలేదు. ఎవరు కూడా ప్రమాదానికి కారణాలపై స్పందించలేకపోవడంతో దీనిపై అనేక రకాలైన ఊహగానాలు వస్తున్నాయి.
అలాగే, రైలులో ప్రయాణించిన వారు, ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారు సిగ్నల్ సమస్యతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
“విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్‌పై వెనుకనే విశాఖ నుంచి రాయగడ ట్రైన్ 6 గంటలకు బయలుదేరింది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య ఎదురవ్వడంతోనే కంటకాపల్లి నుంచి చాలా నెమ్మదిగా రైలు ట్రాక్‌పై వెళ్లింది. ఈలోగా వెనుక నుంచి వచ్చిన రాయగడ ఎక్స్ ప్రెస్ రైలు బలంగా ఢీకొట్టింది. ఒకే ట్రాక్‌లో సిగ్నల్ క్రాస్ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారనేది అంతుపట్టడం లేదు” అని సహాయక చర్యల్లో పాల్గొన ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉద్యోగి, రిలీఫ్ వ్యాన్ డ్రైవర్ బీబీసీతో చెప్పారు.
ఈ ప్రమాదంలో మరణించిన 13 మందిలో పలాస రైలులోని వెనక బోగీలో ఉన్న గార్డు ఎంఎస్ రావు, రాయగడ రైలు లోకో పైలట్ కూడా ఉన్నారు.
బాలాసోర్ ప్రమాదం జరిగిన వెంటనే ఏం జరిగిందనే అంశంపై వెంటనే అక్కడి అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందచేశారు.
కానీ ఇక్కడ కూడా అదే తరహా ప్రమాదం జరిగితే కారణాలను చెప్పపోవడం చర్చనీయాంశమైంది. అధికారులు ఈ విషయంలో గోప్యత పాటించడం వెనుక మతలబు ఏంటని ప్రమాదానికి గురైన వారు ప్రశ్నించారు.
సంఘటన స్థలానికి వచ్చిన రైల్వే అధికారులను, ఏపీ మంత్రులను ప్రమాద కారణాలపై మీడియా ప్రశ్నిస్తే ఎవరి నుంచీ సరైన సమాధానం రాలేదు. త్వరలో చెప్తామని చెప్పడం తప్ప మరే సమాచారం వెల్లడించలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రమాదం రాత్రి వేళ జరగడంతో సహాయక చర్యలు వేగంగా చేసేందుకు ఆటంకం ఏర్పడింది. పైగా ప్రమాద విషయం తెలిసిన వెంటనే స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ, చుట్టుపక్కల నుంచి ఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో వారిని అదుపు చేయడంతోనే ఎక్కువ సమయం గడిచిపోయింది.
సోమవారం ఉదయం నుంచి ఎన్టీఆర్ఎఫ్, రైల్వే పోలీసులు ప్రమాద స్థలానికి ఎవరు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మీడియా సహా ఎవర్ని సహాయక చర్యలు చేపడుతున్న ప్రదేశానికి అనుమతించలేదు.
చుట్టుపక్కల నుంచి ట్రాక్ నిర్మాణ పనులలో అనుభవమున్న కూలీలను పెద్ద సంఖ్యలో తీసుకుని వచ్చారు. పనుల వేగం పెరిగింది. దీంతో మధ్యాహ్నం 4 గంటల సమయానికి ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేయడం, ట్రయిన్ రన్ చేయడం అంతా వేగంగా జరిగిపోయాయి.

ఫొటో సోర్స్, YSRCP/FB
క్షతగాత్రులను పరామర్శించిన సీఎం జగన్
కంటకాపల్లి రైలు ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు.
అంతకుముందు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను సీఎం జగన్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆ వెంటనే అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను జగన్ పరామర్శించారు.
తొలుత సీఎం జగన్ రైలు ప్రమాదం జరిగిన చోటును పరిశీలించాలని అనుకున్నారు. కానీ, రైలు అధికారుల సూచనతో దాన్ని విరమించుకున్నారు.
ప్రస్తుతం ప్రమాద స్థలంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్, విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చెల్లా చెదురుగా పడిపోయిన బోగీలను తొలగిస్తున్నారు. సీఎం ఆ ప్రదేశానికి వెళ్తే పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దాంతో సీఎం నేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ: కొచ్చిలోని క్రైస్తవ కమ్యూనిటీ సెంటర్లో బాంబు పెట్టిన వ్యక్తి గురించి పోలీసులు ఏం చెప్పారు?
- 'దమ్ మారో దమ్' హిప్పీలు ఏమయ్యారు?
- ఆంధ్రప్రదేశ్: కులగణన పై ఏపీ సర్కార్ తొందరపడుతోందా, వలంటీర్ల పాత్రపై విమర్శలు ఏమిటి?
- పులి గోరును ధరించిన ‘బిగ్‌బాస్’ పోటీదారును ఎందుకు అరెస్ట్ చేశారు?
- తెలంగాణ: మేడిగడ్డ బరాజ్ కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే..
- వీరపాండ్య కట్టబొమ్మన్ తెలుగు వారా? శత్రువులు కూడా మెచ్చుకున్న ఆయన్ను ఎందుకు ఉరి తీశారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















