డైమండ్ మర్చంట్స్ ముంబయి వదిలి సూరత్‌కు ఎందుకు వెళ్ళిపోతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రజక్తా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముంబయి నుంచి సూరత్ కు పరిశ్రమలు ముఖ్యంగా వజ్రాల కంపెనీలు తరలి వెళుతున్నాయి. ఇదిప్పుడు రాజకీయం వివాదంగా మారింది.
1980లో గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా నుంచి ముంబయికి వచ్చారు వల్లభాయ్ లఖానీ. ముంబయిలో డైమండ్ ట్రేడింగ్ వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారం అభివృద్ధిలో వెళుతోంది. సూరత్‌లో తయారీ, ముంబయిలో విక్రయించడం ఈ బిజినెస్ ఫార్మాట్.
లఖానీ ముంబయిలోని బీకేసీ (బాంద్రే-కుర్లా కాంప్లెక్స్)లో సొంత కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 20,000 కోట్లు.
కానీ, ఇన్నేళ్ల తర్వాత, ముంబయిలో పెరిగిన ఖర్చు, ద్రవ్యోల్బణం, ప్రయాణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వల్లభాయ్ తన వ్యాపారాన్ని ముంబయి నుంచి సూరత్‌కు మార్చాలని నిర్ణయించుకున్నారు. లఖానీ ముంబయి డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా.
కేవలం ద్రవ్యోల్బణం కారణంగా ఇంత పెద్ద వ్యాపారం తరలించాలని నిర్ణయించుకున్నారా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? దీనిపై లఖానీ స్పందించారు.
“మేం ఎవరి వల్ల కలత చెందలేదు. కేంద్ర ప్రభుత్వ పన్ను అన్ని రాష్ట్రాలకు ఒకటే. కానీ ముంబయిలో ద్రవ్యోల్బణం సమస్య పెద్దది. ముంబయిలోని బీకేసీలో ఆస్తి రేట్లు, ఇతర ఖర్చులు సూరత్ కంటే 10 రెట్లు ఎక్కువ. ఇది డబ్బును ఆదా చేస్తే, మేం మా వినియోగదారులకు 2-5 శాతం తక్కువ ధరలకే ప్రోడక్టులు అందజేస్తాం. దీని వల్ల చిరు వ్యాపారులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. వాళ్లు వ్యాపారాన్ని సూరత్‌కు మార్చాలని కోరారు. నేనూ ఒప్పుకున్నా. నవంబర్ 21న నా కంపెనీని ముంబయి నుంచి సూరత్‌కి తరలిస్తున్నా. ఇక్కడి 50 శాతం వజ్రాల వ్యాపారులు తమ వ్యాపారాన్నిసూరత్‌లోని డైమండ్ బోర్స్‌కు మార్చారు'' అని అన్నారు లఖానీ.
''ముంబయి నుంచి వేలాది మంది సిబ్బంది సూరత్‌కు రానున్నారు. కంపెనీ ఉద్యోగుల కోసం టౌన్ షిప్ నిర్మిస్తున్నాం''అని అన్నారు లఖానీ.

ఫొటో సోర్స్, PRAJAKTA POL/BBC
ముంబయి లోటును భర్తీ చేస్తుందా?
సూరత్‌లోని వజ్రాల వ్యాపారులు దాదాపు రూ. 3,400 కోట్లు వెచ్చించి ప్రపంచ స్థాయి వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
అయితే, సూరత్ డైమండ్ బోర్స్‌లోని ఈ భవనానికి ' ప్రపంచంలోనే అతిపెద్ద భవనం' అనే పేరు వచ్చిందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు.
ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని 'భారత్ డైమండ్ బోర్స్' అనేది ప్రపంచ స్థాయి డైమండ్ కాంప్లెక్స్. ఇందులో 2,500 కార్యాలయాలున్నాయి.
ఇది 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ భవనంలో 40 వేల మంది ఉండొచ్చు.
కాగా, 'సూరత్ డైమండ్ బోర్స్' భవనంలో ఒకేసారి లక్ష మంది కూర్చునే సామర్థ్యం ఉంది.
ఇది 6.6 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. మొత్తంగా తొమ్మిది టవర్లు, వాటిలో 4,700 కార్యాలయాలు ఉంటాయి.
16 అంతస్తుల ఈ భవనం 81.9 మీటర్ల ఎత్తులో ఉందని సూరత్ డైమండ్ బోర్స్ యాజమాన్యం తెలిపింది. ఈ భవనంలో ఆధునిక సౌకర్యాలు కల్పించామంది.
ఈ భవనాన్ని నిర్మించడానికి నాలుగేళ్లు పట్టింది. ఈ డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌ను డిసెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

ఫొటో సోర్స్, PRAJAKTA POL
సూరత్ ప్రత్యేకత ఇదే..
“బీకేసీ బోర్స్‌లో అద్దెకు ఒక చిన్న కార్యాలయం ఉంది. దానికి పెట్టే ఖర్చులు, ముంబయిలో ప్రయాణ సమయం, అదనపు ఖర్చులు చాలా ఎక్కువ. ఈ కారణాలే మా వ్యాపారాన్ని సూరత్‌కు మార్చేలా చేశాయి. పరిశ్రమలోని అవసరాలను పరిగణనలోకి తీసుకుని సూరత్ డైమండ్ బోర్స్‌లో అన్ని సౌకర్యాలు కల్పించాం. కాబట్టి, తక్కువ ఖర్చుతో సూరత్‌లో మంచి వ్యాపారం చేయవచ్చు'' అని అన్నారు సూరత్ డైమండ్ బోర్స్ మేనేజ్‌మెంట్‌లో ఒకరైన దినేష్ నవాడియా.
సూరత్‌లో చాలా డైమండ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వజ్రాల ఉత్పత్తి అత్యధికంగా జరిగేదీ అక్కడే.
ప్రపంచంలోని 11 రకాల వజ్రాలలో 9 రకాల వజ్రాలు సూరత్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. వజ్రాల తయారీకి అవసరమైన ముడిసరుకూ ఇక్కడి నుంచి వస్తోంది.
అయితే, సూరత్ ఫ్యాక్టరీలలో తయారయ్యే వజ్రాలు ప్రపంచానికి ఎగుమతి చేయాలంటే గుజరాత్ నుంచి ముంబయి, జైపూర్, దిల్లీలకి వెళ్లాలి.
దీంతో కస్టమ్ హౌస్, అంతర్జాతీయ కనెక్టివిటీ కారణంగా ముంబయి వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా మారింది.
అయితే గుజరాత్ ప్రభుత్వం సూరత్ డైమండ్ బోర్స్‌లో పెద్ద కస్టమ్ హౌస్‌నూ ఏర్పాటు చేస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ విమానాల సంఖ్య పెంచే ప్రయత్నంలో ఉన్నారు.
సూరత్ నుంచి వీలైనన్ని దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే హామీ ఇచ్చింది.
ఇది మొదలైతే కనెక్టివిటీ కోసం ముంబయి లాంటి నగరాల అవసరం ఉండదని వ్యాపారులు భావిస్తున్నారు.
మార్కెట్ మొత్తం సూరత్‌కే వెళుతోందా? అని వజ్రాల వ్యాపారి ఘనశ్యామ్ ధోకల్కియాను ప్రశ్నించగా..
“మహారాష్ట్రపై మాకు ఎలాంటి కోపం లేదు. కేంద్ర ప్రభుత్వమే పన్ను భరిస్తుంది. కాబట్టి ఈ పన్ను అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. మా ప్రొడక్షన్ సూరత్‌లో జరుగుతోంది. కోవిడ్ తర్వాత భారత వినియోగదారులు తగ్గారు. అందువల్ల గరిష్ట వజ్రాలు ఎగుమతే చేయాలి. ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయం, కస్టమ్స్ హౌస్‌లు ఎగుమతి వల్ల ప్రయోజనం పొందుతాయి. వజ్రాలు ఎగుమతి చేయాలనుకుంటే ముంబయి లేదా సూరత్ ఎక్కడి నుంచైనా చేయవచ్చు. ఇప్పుడు ఆ సౌకర్యాలు రెండింటిలోనూ ఉన్నాయి. ఖర్చు కూడా తగ్గుతోంది. అయితే వ్యాపారులందరూ గుజరాత్‌కు వెళ్లరు. ముంబయిలో వ్యాపారం ఉన్నవారు ముంబయిలోనే ఉంటారు'' అని అన్నారు.
గుజరాత్‌కు తరలివెళుతున్న ప్రాజెక్టులు
మహారాష్ట్రకు రావల్సిన రూ. 21,935 కోట్ల విలువైన టాటా ఎయిర్‌బస్ పెద్ద ప్రాజెక్ట్ కూడా గుజరాత్‌కు వెళ్లింది. దీనిపై రాష్ట్రంలో బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.
ఇప్పుడు ముంబయి నుంచి సూరత్ డైమండ్ బోర్స్‌కు వ్యాపారవేత్తల వలసల కారణంగా బీజేపీ ముంబయి ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఇదే క్రమంలో మహారాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు.
“ముంబయిలోని వజ్రాల పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా గుజరాత్‌కు వెళుతోంది. మరో ముఖ్యమైన పరిశ్రమ తరలిపోతోంది. ముంబయి ప్రాముఖ్యతను తగ్గించడానికి బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తన పారిశ్రామిక విధానం ఎక్కడికి వెళుతుందో సమీక్షించుకోవాలి. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రాష్ట్ర యువత హక్కు దూరం కావడం విచారకరం'' అని ట్విటర్‌లో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సుప్రియా సూలే విమర్శలపై మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ స్పందించారు. దేశంలోనే అతిపెద్ద డైమండ్ క్లస్టర్ నవీముంబయిలో ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
“దేశంలోని చాలామంది ప్రజలు నవీ ముంబయి , మహారాష్ట్రకు వస్తారు. వాణిజ్యం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళుతుంటుంది. నేను సూరత్ నుంచి నందుర్బార్, నవాపూర్ వెళ్లాను. ఇపుడు నవీముంబయిలో డైమండ్ క్లస్టర్ రాబోతోంది. ఇందులోకి పెట్టుబడులు వచ్చిన తర్వాత గుజరాత్, మహారాష్ట్రల్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయో మంత్రిగా నేనే చెబుతాను'' అని తెలిపారు ఉదయ్ సామంత్.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














