అమ్మ ఎవరికైనా అమ్మే...తుపానులో రెండు రోజులుగా ఆహారంలేని పసిబిడ్డకు వీధిలోనే పాలిచ్చిన పోలీసాఫీసర్

అకాపుల్కో

ఫొటో సోర్స్, SSC

ఫొటో క్యాప్షన్, అంబ్రాసియో నాలుగునెలల పసిబిడ్డకు పాలిచ్చారు.
    • రచయిత, ముండో సర్వీస్
    • హోదా, బీబీసీ న్యూస్

అమ్మ ఎవరికైనా అమ్మే అని ఆ పోలీసాఫీసర్ నిరూపించారు. రెండురోజులుగా ఎటువంటి ఆహారం లేకుండా గుక్కపట్టి ఏడుస్తున్న ఓ నాలుగు నెలల పసివాడికి పాలివ్వడంతో సోషల్ మీడియాలో భావోద్వేగ ప్రశంసలు వస్తున్నాయి.

ఓటిస్ తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న అకాపుల్కో నగరంలో 33 ఏళ్ళ పోలీసు అధికారి అర్జిబెత్ డియోనిసియో అంబ్రాసియో తన సహచరులతో కలిసి రక్షణ చర్యలలో నిమగ్నమై ఉన్నారు.

దూరంగా వినిపిస్తున్న ఓ పసిబిడ్డ ఏడుపును అంబ్రాసియో, ఆమెతోపాటు ఉన్న మరో ఇద్దరు కూడా విన్నారు.

ఈ పసివాడి ఏడుపు ఎక్కడి నుంచి వస్తోందో ఆ వైపు వెదకాలని నిర్ణయించుకున్నారు.

ఈక్రమంలో వారికి ఓ నాలుగునెలల పసివాడి తల్లి ఎదురయ్యారు. ఆవిడ సహాయం అర్థించడానికి వీరిదగ్గరకు వచ్చారు.

గత రెండురోజులుగా తన బిడ్డకు ఎటువంటి ఆహారం లేదని, వాడు ఆకలితో ఉన్నాడని చెప్పారు.

‘‘మీకు అభ్యంతరం లేకపోతే బిడ్డకు నేను పాలిస్తాను అని ఆ తల్లికి చెప్పాను’’ అని అంబ్రాసియో N+నెట్‌వర్క్ కు తెలిపారు.

చిన్నారికి పాలిచ్చిన పోలీసాఫీసర్

ఫొటో సోర్స్, REDES SOCIALES

ఫొటో క్యాప్షన్, చిన్నారికి పాలిస్తున్న పోలీసాఫీసర్

ఆమె అంగీకరించడంతో అంబ్రాసియో ఆ బిడ్డను చేతుల్లో పొదువుకుని చనుబాలు అందించారు.

‘‘ఓ బిడ్డ ఆకలి తీర్చడం ఆనందంగా ఉంది. బిడ్డలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం ఏ తల్లినైనా కలిచివేస్తుంది’’ అని అంబ్రాసియో తెలిపారు.

అంబ్రాసియో బిడ్డకు పాలిస్తున్న ఫోటోను మెక్సికన్ నగరానికి చెందిన సెక్రటేరియట్ సిటిజెన్ సెక్యూరిటీ విడుదల చేసింది.

ఈ సంస్థే తుపానుతో దెబ్బతిన్న అకాపుల్కో పట్టణానికి రక్షణ దళాన్ని పంపింది.

మీడియాలో ఈ ఫోటోపై భావోద్వేగ ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి.

అకాపుల్కోలో తుపాను విధ్వంసం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓటిస్ తుపాను ధాటికి అకాపుల్కోలో అనేకభవనాలు దెబ్బతిన్నాయి

ఓటిస్ పెను విధ్వంసం

అకాపుల్కోతో పాటు చుట్టుపక్కల పట్టణాలన్నీ ఓటిస్ తుపాను దెబ్బతో విలవిల్లాడాయి.

ఈ తుపాను కారణంగా 45 మరణించగా, 47 మంది గల్లంతయ్యారని మంగళవారం అధికారిక లెక్కలు వెలువడ్డాయి.

మృతులలో అమెరికా, బ్రిటన్, కెనడాకు చెందిన ముగ్గురు విదేశీయులు కూడా ఉన్నారు.

కేటగిరి 5గా నిర్థరించిన ఈ ఓటిస్ తీవ్రతుపాను అక్టోబరు 25న తీరాన్ని తాకిన తరువాత చేసిన చేసిన నష్టాన్ని, గల్లంతైన మనుషుల గురించిన సమాచారాన్ని వెలికితీసే పని మొదలైంది.

ఈ ఉష్ణ మండల తుపాను కేవలం 12 గంటలలోనే అతి తీవ్ర తుపానుగా మారడంతో దీనిని కేటగిరి 5గా వర్గీకరించారు.

ఇది తుపానుల నమోదు మొదలైనప్పటినుంచి పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన అతిపెద్ద తుపానుగా చెపుతున్నారు.

తుపాను ధాటికి సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రాథమిక సౌకర్యాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

అకాపుల్కో లో తుపాను బీభత్సం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, లూటీలు జరగకుండా స్థానికులే రాత్రివేళ కాపలా కాస్తున్నారు

పెరిగిన లూటీలు

అకాపుల్కో శివారు ప్రాంతాలలో తుపాను బీభత్స సమయాన్ని ఉపయోగించుకుని కొన్ని వందల దుకాణాలలో లూటీ జరిగింది.

దీంతో ప్రభుత్వం 15వేలమందికి పైగా సైనికులు, పోలీసులను రంగంలోకి దించి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తోంది.

తుపాను కారణంగా అనేక ప్రాంతాలలో ఇప్పటికీ కరెంట్, విద్యుత్, ఇంధన సరఫరా పరిమితంగానే కొనసాగుతోంది.

ఇవి సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.

హోగార్ మోడర్నోలాంటి పొరుగు ప్రాంతాలలోని ప్రజలు తమ ఆస్తులు దోపిడీ పాలు కాకుండా కాపాడుకోవడానికి , కొత్తవారెవరూ రాకుండా అల్యూమినియం షీట్లు, చెట్టుకొమ్మలు, రాళ్ళతో మార్గాలను మూసివేస్తున్నారు.

రాత్రివేళల్లో గస్తీ కోసం గార్డులను కూడా నియమించుకున్నారు.

అనేకమంది ప్రజలు తమ ఇళ్ళు పాక్షికంగా ధ్వంసం కావడంతో నిద్రలేని రాత్రుళ్ళు గడపాల్సి వస్తోంది.

అకాపుల్కోలో తుపాను బీభత్సం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అకాపుల్కోలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

అకాపుల్కోలో భద్రతను పునరుద్ధరించి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు సెక్యూరిటీ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ తెలిపారు.

అకాపుల్కోలో రహదారులు, విద్యుత్, మంచినీటి సౌకర్యాల పునరుద్ధరణపై పౌర, మిలటరీ అధికారులు శ్రమిస్తున్నారు.

దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఈ ఆపత్కాలంలో పర్యాటక ప్రాంతమైన అకాపుల్కోను ఆదుకొనేందుకు జనం ముందుకు వస్తున్నారు.

తుపాను మిగిల్చిన విధ్వంసం, గందరగోళం మధ్యనే పగిలిన గుండెలతో చాలామంది మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు. మరికొందరు శిథిలాల మధ్యన తమవారి కోసం వెదుకుతున్నారు.

అకాపుల్కోలో తుపాను

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటే ఓటిస్ లాంటి తుపానులు తప్పువు

అత్యంత ప్రమాదకర తుపాను

వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల గురించి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు.

అయితే ఓటిస్ అత్యంత త్వరగా తీవ్ర తుపానుగా మారడంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కేవలం 12 గంటలల వ్యవధిలోని ఈ తుపాను కేటగిరి 5లోకి చేరడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మెక్సికోలోని అటానమస్ యూనివర్సిటీ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ సైన్సెస్ డైరక్టర్ జార్జ్ జావ్లా మాట్లాడుతూ తుపాను విషయంలో అన్ని అంచనాలు విఫలమయ్యాయని చెప్పారు.

చివరకు మియామిలోని నేషనల్ హరికేన్ సెంటర్ కూడా ఓటిస్‌ను అంచనా వేయలేక పోయిందన్నారు.

భవిష్యత్తులో కూడా తుపానులు అత్యంత తీవ్రంగానూ, భారీవర్షపాతంతోనూ విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సముద్రం ఉపరితలంపై ఉన్న అత్యధిక ఉష్ణోగ్రత, సముద్రం లోపలి భాగంలో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రత, తేమలోని వివిధస్థాయులు, సముద్ర గాలుల్లోని ప్రత్యేక పరిస్థితులు కలిసి ఈ తుపాను తీవ్రమయ్యేందుకు దోహదపడ్డాయని జావ్లా తెలిపారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)