ఎన్టీఆర్ మేకప్ టెస్ట్ ఫోటో మీరెప్పుడైనా చూశారా... ఆ ఫోటోగ్రాఫర్ వద్ద ఉన్న మూడు లక్షల ఫోటో నెగెటివ్‌లపై అమెరికా యూనివర్సిటీకి ఎందుకంత ఆసక్తి?

ఫొటో సోర్స్, PREMNATH
- రచయిత, ప్రమీలాకృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రనటుడు నందమూరి తారక రామారావుని మేకప్ టెస్ట్ చేసినప్పుడు తీసిన ఫోటో మీరెప్పుడైనా చూశారా?
ఉదయం రెండు గంటలకు ఎన్టీఆర్ మేకప్ టెస్ట్ ఫోటోతో పాటు, ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి తొలి ఫిల్మ్ ఫోటో వంటి అరుదైన ఫోటోలు తీశారు లెజండరీ ఫోటోగ్రాఫర్ నాగరాజారావు.
ఇప్పుడు ఆయన తీసిన సినీ ఫోటోలను డబ్బులు చెల్లించి మరీ భద్రపరిచేందుకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ముందుకొచ్చింది.
అలాంటి అరుదైన ఫోటోలు తీసిన ఆ నాగరాజరావు ఎవరు? ఆయన ఫోటోగ్రాఫ్‌ల ప్రత్యేకతేంటి? ఎందుకు అమెరికన్ యూనివర్సిటీ అంత ఆసక్తి చూపిస్తోంది?
స్టిల్ ఫోటోగ్రాఫర్ నాగరాజారావు
చెన్నైకి చెందిన నాగరాజరావు 1950ల నుంచి 1980ల వరకూ చాలా సినిమాలకు ఫుల్ టైమ్ సినీ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు.
నాగరాజారావు మరణానంతరం ఆయన తీసిన వేల ఫోటోలను, వాటి నెగెటివ్‌లను భద్రపరిచే బాధ్యత తీసుకున్నారు ఆయన కుమారుడు ప్రేమ్‌నాథ్ రావు. కాలక్రమేణా వేలకొద్దీ ఫోటో ప్రింట్లు, నెగెటివ్‌లు చెదల బారినపడ్డాయి.
అయితే, ఇప్పుడు ఆ నెగెటివ్ షీట్లను భద్రపరిచే అవకాశం వచ్చింది. పుదుచ్చేరిలోని ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫోటోగ్రఫిక్ డివిజన్ హెడ్‌గా ఉన్న రమేష్ కుమార్ 'ప్రిజర్వింగ్ ఎన్‌డేంజర్‌డ్ కల్చరల్ డాక్యుమెంట్స్' (అంతరించిపోతున్న సాంస్కృతిక పత్రాల సంరక్షణ) కార్యక్రమం కింద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు ఒక దరఖాస్తు పంపారు. ఆ కార్యక్రమం కింద దక్షిణ భారత సినిమాల్లో తీసిన ఫోటోగ్రాఫ్స్‌ను భద్రపరిచే ప్రాజెక్టును ఎంపిక చేశారు.

ఫొటో సోర్స్, PREMNATH
చాలా అరుదైన లక్ష ఫోటో నెగెటివ్‌లు
ఫోటోలను భద్రపరిచే ప్రక్రియ మొదలైన నెల రోజుల్లోనే దాదాపు లక్ష ఫోటో నెగెటివ్‌లను శుభ్రం చేసి భద్రపరిచారు. ఈ చొరవ కారణంగా అక్కడ దాదాపు రెండు లక్షల నెగెటివ్‌లు ఉన్నట్లు బయటపడింది.
''నాగరాజారావు ఫోటోలు చాలా అరుదైనవి. ఆయన దాదాపు 35 ఏళ్ల పాటు ఫుల్ టైమ్ సినీ ఫోటోగ్రాఫర్‌గా సినిమా ఫోటోలు తీశారు'' అని బీబీసీతో రమేష్ కుమార్ చెప్పారు.
''ఆయన ఫోటోలు కేవలం సినిమాకు మాత్రమే సంబంధించినవి కావు. అప్పట్లో చారిత్రక ప్రదేశాలు, సామాజిక నిర్మాణాలు, బహిరంగ ప్రదేశాలు, రాజకీయ నేతల జీవితం ఎలా ఉండేదో ఆయన ఫోటోలు చెప్పేస్తాయి'' అన్నారు.
చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోనే కొంత భాగాన్ని నాగరాజరావు ఫోటో స్టూడియోగా మార్చుకున్నారు. ఆయన కుమారుడు ప్రేమ్‌నాథ్‌రావు కూడా ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటున్నారు. తండ్రికి అసిస్టెంట్‌గా ఉండేవారు ప్రేమ్‌నాథ్‌రావు. తన తండ్రి తీసిన ఫోటోల వెనకున్న ఆసక్తికరమైన విషయాలను ఆయన బీబీసీతో పంచుకున్నారు.
సెన్సార్ చిక్కుల్లో ఎన్టీఆర్ సినిమా
ఇది 1981లో వచ్చిన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత సినిమాలో ఎన్టీఆర్ మేకప్ టెస్ట్ ఫోటో అని ప్రేమ్‌నాథ్‌రావు చెప్పారు.
''ఆ మేకప్ వేయడానికి గంటకి పైగా సమయం పట్టింది. అప్పట్లో ఆయన తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలు చేస్తున్నారు. రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయనకు పనిభారం ఎక్కువైంది. ఈ ఫోటో ఉదయం రెండుగంటల సమయంలో తీసింది'' అని ఆయన చెప్పారు.
''శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత సినిమా 1981లో తీశారు. అయితే, అందులోని కొన్ని సీన్లను తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. ఆయనే ఆ సినిమాను నిర్మించారు. దీంతో కోర్టుకు వెళ్లి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకుని మరీ ఎలాంటి సీన్లు తొలగించుకుండా 1984లో సినిమాను విడుదల చేశారు'' అన్నారు.

ఫొటో సోర్స్, PREMNATH
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీసిన సినిమా
1963లో వచ్చిన లవకుశ సినిమా అప్పటిది ఈ ఫోటో. ఇందులో ఎన్టీఆర్ రాముడిగా నటించారు.
ఇది ఒకేసారి తెలుగు, తమిళ్‌లో తీశారు. సెట్‌లో తెలుగు, తమిళ్ సినిమా సీన్లు వెంటవెంటనే తీసేవారు. సీతను అడవికి పంపించాలా, లేక రాజ్యాన్ని వదిలివెళ్లాలా అని రాముడు ఆలోచిస్తున్న సన్నివేశంలో తీసిన ఫోటో ఇది. సినిమాలో ఇదొక ముఖ్యమైన సన్నివేశమని ప్రేమ్‌నాథ్ అన్నారు.

ఫొటో సోర్స్, PREMNATH
మా నాన్న ఫోటోలంటే ఎంజీఆర్‌కి చాలా ఇష్టం
ఇది 1947లో సినిమా కోసం ఎంజీఆర్ తొలి మేకప్ టెస్ట్ ఫోటో అని ఆయన చెప్పారు.
''ఫైతియాకరణ్ సినిమా కోసం తీసిన ఫోటో. ఈ ఫోటో కోసం ఆయన రెండు గంటలపాటు వేచివున్నారు. లక్ష్మీకందన్ హత్య కేసులో జైలు నుంచి ఎన్‌ఎస్ కృష్ణన్ విడుదలైన సమయంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఎన్ఎస్‌కే అభ్యర్థన మేరకు ఎంజీఆర్ ఈ సినిమాలో నటించారు'' అని ప్రేమ్‌నాథ్ చెప్పారు.
''మా నాన్న తీసిన ఫోటోలను ఎంజీఆర్ బాగా ఇష్టపడేవారు. ఎంజీఆర్ సినిమాల్లో ఎక్కువ సినిమాలకు ఆయన ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన ఫోటోలను నాగరాజరావులా తీయాలని వార్తాపత్రికల ఫోటోగ్రాఫర్లతో ఎంజీఆర్ అనేవారు'' అన్నారు.

ఫొటో సోర్స్, PREMNATH
శివాజీ గణేశన్‌ను చాలెంజ్ చేసిన భానుమతి
ఇది 'రాణి లలితాంగి' సినిమాలో యువరాజు కోసం వేచిచూస్తున్న సన్నివేశంలో తీసిన ఫోటో. ఆ పాత్రలో ప్రముఖ నటి భానుమతి నటించారు.
1957లో ఈ సినిమా విడుదలైంది. మొదట ఈ సినిమా ఎంజీఆర్‌తో తీయాలనుకున్నారు. కానీ, శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర పోషించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ చెప్పినట్లుగా చేస్తూ, బాగా వచ్చిందా లేదా అని మళ్లీ చూసుకుంటూ ఉండేవారు భానుమతి. అసలు సీన్ తీసేప్పుడు ఆమె ఇంకా మెరుగ్గా హావభావాలు పలికించేవారు.
అందువల్ల ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో శివాజీని సవాల్ చేసే రీతిలో భానుమతి నటించినట్లు అనిపిస్తుంది. కొన్నిసీన్లను రీషూట్ కూడా చేశారని ప్రేమ్‌నాథ్ చెప్పారు.

ఫొటో సోర్స్, PREMNATH
శివాజీ గంభీరం
ఈ ఫోటో మహాకవి కాళిదాసు చిత్రంలోని 'కలిమమల్ మనాహు ఒరు కమినితాల్' పాట చిత్రీకరిస్తున్న సమయంలో తీసింది.
ఈ పాటలో శివాజీ ధరించిన దుస్తులు, ఆయన ఆహార్యం ఓ పేద్ద కవీంద్రుడిలా కనిపిస్తాయి. ఆయన దుస్తులు ప్రత్యేకంగా కనిపించేందుకు వెనక మరో నలుగురిని పెట్టారు. ఆ సెట్ కూడా చాలా ప్రత్యేకంగా అనిపించేది. సినిమాను చాలా గంభీరంగా తెరకెక్కించారు.

ఫొటో సోర్స్, PREMNATH
జయలలిత అద్భుత నటన
ఇది 1967లో విడుదలైన 'అరస కార్యకోన్' సినిమాలో జయలలిత ఫోటో. ఈ సీన్‌లో 'నీన్నై పా వైటవన్ ఒరువన్' అంటూ జయలలిత పాట పాడుతుంది.
ఇందులో ఆమెది ప్రధాన పాత్ర కాకపోయినప్పటికీ, గ్రామీణ యువతి పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా తర్వాత ఆమె లండన్‌లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరుకావాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ తర్వాత ఆమె నటనను కొనసాగించారు. ఎంజీఆర్ సరసన హీరోయిన్‌గా ఆమె చాలా చిత్రాల్లో నటించారు.

ఫొటో సోర్స్, PREMNATH
అమెరికన్ డైరెక్ట్ చేసిన తమిళ్ సినిమా
ఈ ఫోటో ఎంఎస్ సుబ్బులక్ష్మి సినిమా 'మీరా'లోది.
ఇది ప్రజాదరణ పొందిన 'కైరినిలే వాడి గీతం' పాటలోని సన్నివేశం. ఈ సినిమాకు అమెరికన్ ఎలిస్ ఆర్ డంకన్ దర్శకత్వం వహించారు. తన భారతీయ స్నేహితుడు మానిక్‌లాల్ టాండన్‌తో కలిసి ఈ సినిమా తీశారు.
''మీరా సినిమాను తమిళంలో తెరకెక్కించాలని డంకన్ అనుకున్నారు. ఆయనకేమో తమిళ్ రాదు. అప్పుడు సినిమా స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా ఉన్న నాగరాజరావు ఇంగ్లిష్ పరిజ్ఞానం సినిమాకు ఉపయోగపడింది. ఈ సినిమా సమయంలో తమిళ సంస్కృతి, తమిళ ప్రజల అంచనాల గురించి నాగరాజరావును డైరెక్టర్ డంకన్ అడిగేవారు. ఈ సినిమా ఇక్కడ భారీ విజయం సాధించిన తర్వాత, అదే సినిమాను డంకన్ హిందీలో కూడా తెరకెక్కించారు'' అని వివరించారు ప్రేమ్‌నాథ్‌రావు.
ఇవి కూడా చదవండి:
- ఓపెన్‌హైమర్ చిత్రంలో భగవద్గీతపై వివాదమేంటి... అణుబాంబు తయారు చేసిన సైంటిస్ట్‌కు ఈ గ్రంథంతో ఏమిటి సంబంధం?
- డీప్‌ఫేక్: ఒక్క రోజులోనే వందల వీడియోలు క్రియేట్ చేయొచ్చా? సెలబ్రిటీలు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెర్స్ రహస్యం ఇదేనా
- ఐఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: యాపిల్ వివరణపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు?
- ఖతార్ మరణశిక్ష నుంచి 8 మంది మాజీ నేవీ అధికారులను కాపాడటానికి భారత్ ముందున్న ఆప్షన్లు ఇవే
- కోచి: ‘జెహోవా విట్నెస్’ అంటే ఎవరు... జంట పేలుళ్లకు తానే బాధ్యుడినన్న మార్టిన్ వీడియోలో ఏముంది?














