కార్బన్ డయాక్సైడ్ తగ్గించడానికి.. భూమిని కాపాడటానికి 5 చవకైన ఉపాయాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యాట్ మెక్‌గ్రాత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భూతాపం 1.5 లేదా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరగనుందని పరిశోధనలు చెబుతున్న నేపథ్యంలో.. కేవలం కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తిని నియంత్రించడం మాత్రమే సరిపోదు.
దానితో పాటు గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను పెద్ద ఎత్తున తొలగించాల్సి ఉంటుందని వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్జాతీయ ప్యానెల్, ఇతర సంస్థలు స్పష్టం చేశాయి.
అయితే ఈ ఆలోచన కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తిని నియంత్రించాలని చేస్తున్న ప్రయత్నాల నుంచి దృష్టి మరల్చడంగా కొందరు భావిస్తున్నారు.
అమెరికాకు చెందిన నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ఇలాంటి చర్యలను వెంటనే పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
ఇందుకోసం ఆ నివేదికలో 5 ప్రధానమైన విధానాలను సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
1. కోస్టల్ బ్లూ కార్బన్
సముద్ర తీరానికి, నదీ ముఖానికి దగ్గరలో ఉండే బురద నేలల్లో కొన్ని రకాల మొక్కలకు, బురద నేలలకు పెద్ద ఎత్తున కార్బన్‌ను తమలో నిలువ చేసుకునే శక్తి ఉంటుంది. మడ అడవులు, సముద్రనాచు పెరిగే ప్రదేశాలు దీనికి ఉదాహరణ. దీనిని ఉపయోగించుకుని కార్బన్‌ను అలా నిలువ చేయొచ్చు.
ఇలాంటి బురదనేలలకు అతి తక్కువ వైశాల్యంలో అతి ఎక్కువ కార్బన్‌ను దాచుకునే శక్తి ఉంటుంది. దీనిని కోస్టల్ బ్లూ కార్బన్ అంటున్నారు.
ఇలాంటి సరికొత్త బురద నేలలను సృష్టించడం, ఇప్పటికే ఉన్న వాటిని సంరక్షించడం వల్ల వాతావరణం నుంచి సంగ్రహించే కార్బన్ పరిమాణాన్ని పెంచవచ్చని అమెరికా నేషనల్ అకాడెమీ పరిశోధనలో వెల్లడైంది.
ఇది అత్యంత చవకైన విధానమని కూడా తెలిపింది. ఈ విధానం ద్వారా ఒక టన్ను కార్బన్‌ను సంగ్రహించడానికి కేవలం రూ.1600 ఖర్చు అవుతుంది.
దురదృష్టవశాత్తూ ఏటా సుమారు 3.5 నుంచి 9.8 లక్షల హెక్టార్ల బురద నేలలు నాశనం అవుతున్నాయి.
వీటిని నిర్మూలించడం వల్ల, అవి కార్బన్ డయాక్సైడ్‌ను సంగ్రహించే మాట అటుంచి, కార్బన్ డయాక్సైడ్ మరింత ఎక్కువగా విడుదలవుతోంది.
కోస్టల్ బ్లూ కార్బన్ మన ముందున్న అతి చవకైన ప్రత్యామ్నాయమని ఆ నివేదిక రూపకల్పనలో పాలు పంచుకున్న ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ పకల తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
2. చెట్ల పెంపకం
కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అడవుల వినాశనం ఒక కారణం. అందువల్ల పరిశోధకులు కొత్తగా చెట్లను పెంచడం లేదా పోయిన అడవులను పునరుద్ధరించడం చవకైన విధానమని అంటున్నారు.
అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే, కలప కోసం ఏ చెట్లను ఎక్కువగా పెంచాలో పరిశోధకులకు తెలుసు కానీ, వాతావరణం నుంచి కార్బన్‌ను సంగ్రహించడానికి ఎలాంటి చెట్లను పెంచాలన్న విషయం గురించి మాత్రం వారికి పెద్దగా అవగాహన లేదు.
దాదాపు అన్ని దేశాలు కూడా చెట్లను పెంచడం కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడానికి ఒక దారిగా భావిస్తున్నాయి.
అయితే ఎప్పుడైతే మనం కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడానికి చెట్లను పెంచాలన్న ప్రతిపాదన తెస్తామో, అప్పుడు భూమిని ఆహారోత్పత్తికి ఉపయోగించడమా లేక కార్బన్ డయాక్సైడ్ సంగ్రహించడానికి ఉపయోగించడమా అన్న ఘర్షణ ఏర్పడుతుంది అని ఈ నివేదికను సమీక్షించిన బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఫిల్ రెన్‌ఫోర్త్ అన్నారు.
ఈ పద్ధతిలో కూడా టన్ను కార్బన్ తొలగించడానికి సుమారు రూ.1600 ఖర్చు అవుతుందని ఈ నివేదికలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
3. అటవీ నిర్వహణ
చెట్లను పెంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న అడవులను కూడా మరింత సమర్థంగా కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించే విధంగా వాటిని నిర్వహించుకోవాలని ఈ నివేదిక పేర్కొంది.
ఇందుకోసం కార్చిచ్చులాంటివి అడవులను నాశనం చేసినపుడు వెంటనే వాటిని పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. ఇందులో టన్ను కార్బన్‌ను సంగ్రహించడానికి రూ.1600 కన్నా తక్కువ ఖర్చవుతుంది.
కలపతో చేసిన వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, విద్యుత్ ఉత్పత్తి కోసం కలప వినియోగాన్ని నిర్మూలించడం ఇతర మార్గాలు.

ఫొటో సోర్స్, Getty Images
4. వ్యవసాయ పద్ధతులు
రైతులు తమ వ్యవసాయ భూమిని నిర్వహించుకునే విధానంలో చిన్నచిన్న మార్పుల ద్వారా వాతావరణం నుంచి కార్బన్ సంగ్రహాన్ని గణనీయంగా పెంచవచ్చని నివేదిక వెల్లడించింది.
పొలాల్లో వాణిజ్య పంటలను పెంచనప్పుడు వాటిలో కార్బన్‌ను సంగ్రహించే మొక్కలను పెంచడం దానిలో ఒక విధానం. మొక్కల నుంచి తయారు చేసిన 'బయోచార్' అనే పదార్థాన్ని నేలలో చల్లడం కూడా కార్బన్ సంగ్రహణలో బాగా ఉపయోగపడుతుంది.
ఈ విధానంలో టన్ను కార్బన్‌ను తొలగించడానికి రూ.1600 నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతుంది.

ఫొటో సోర్స్, ronemmons
5. బయోమాస్ ఎనర్జీ విత్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ (బీఈసీసీఎస్)
ఈ విధానంలో కార్బన్‌ను బాగా సంగ్రహించే మొక్కలను పెంచి, వాటిని విద్యుత్ ఉత్పాదనలో ఉపయోగిస్తారు. ఆ సందర్భంగా విడుదలైన కార్బన్ డయాక్సైడ్‌ను శాశ్వతంగా భూమిలో పాతిపెడతారు.
అయితే చాలా మంది బీఈసీసీఎస్ విధానాన్ని తోసిపుచ్చుతున్నారు. ఎందుకంటే అలాంటి మొక్కలు చాలా భూమిని ఉపయోగించుకోవడంతో పాటు, ఆ విధానంలో టన్ను కార్బన్‌ను సంగ్రహించడానికి సుమారు రూ.8 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.
దీని వల్ల ఆహారోత్పత్తి తగ్గి, ధరలు పెరుగుతాయని వరల్డ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కెల్లీ లెవిన్ తెలిపారు.

ఫొటో సోర్స్, RuudMorijn
ఈ నివేదికలో ఇంకా ఏమేం మార్గాలను ప్రతిపాదించారు?
ఈ పరిశోధనలో సరాసరి గాలిలోని కార్బన్‌ను బంధించడం, కార్బన్‌ను ఖనిజంగా మార్చడం గురించి కూడా చర్చించారు.
సరాసరి గాలి నుంచి కార్బన్‌ను బంధించే ప్రక్రియలో, కార్బన్‌ను పీల్చుకునే భారీ యంత్రాలను ఉపయోగిస్తారు. ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీ పలు దేశాలలో అందుబాటులోకి వచ్చింది. స్విట్జర్లాండ్‌లో క్లైమ్ వర్క్స్, కెనడాలోని కార్బన్ ఇంజనీరింగ్ ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. అయితే వాటి ఖర్చు మాత్రం భారీగా ఉంటుంది.
కార్బన్ మినరలైజేషన్‌లో రాళ్లను కార్బన్ డయాక్సైడ్‌తో సంయోజనం చేస్తారు. దీని వల్ల కార్బన్ ఆ రాళ్ల మధ్య ఉన్న ఖాళీలలో నిండిపోతుంది. దీనిపై ఇప్పటికే ఐస్‌ల్యాండ్‌లో ప్రయోగాత్మకంగా పరిశోధనలు జరిగాయి.
ఇలాంటి ఉపాయాలు ప్రయోజనకరమేనా?
పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం భూగోళ ఉష్ణోగ్రతను 2 డిగ్రీలకన్నా తక్కువకు తగ్గించడానికి - 2100 వరకు ప్రతి ఏడాది సుమారు 20 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తొలగిస్తూ పోవాలి.
టన్ను కార్బన్ డయాక్సైడ్ సంగ్రహించడానికి రూ.8 వేలకన్నా తక్కువయ్యే ఇలాంటి టెక్నాలజీని భారీ స్థాయిలో ఉపయోగించి, కార్బన్‌ను నిలువ చేసి, ప్రమాదకరమైన వాతావరణ మార్పులను అరికట్టవచ్చు.
అయితే ఇలాంటి టెక్నాలజీ వల్ల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తిని తగ్గించే చర్యలకు బదులు దానిని సంగ్రహించే చర్యలు పెరిగిపోతాయని ప్రొఫెసర్ స్టీఫెన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘భారత్ నీళ్లను ఆయుధంలా ఉపయోగిస్తోంది’ - పాకిస్తాన్ ఆరోపణ
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపుకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
- డేజా వూ: ‘ఎక్కడో చూసినట్టుందే’ అని మీరెప్పుడైనా అనుకున్నారా? అయితే ఈ 8 విషయాలూ మీకోసమే
- నటుడు డి నీరో రెస్టారెంట్ వద్ద అనుమానాస్పద ప్యాకేజ్
- ‘గూగుల్ క్యాంపస్ మాకొద్దు’.. బెర్లిన్‌లో ఆందోళనలు
- జంతువులతో ఆటాడుకున్న భారతీయ రింగ్ మాస్టర్
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జపాన్ తీరంలో 'ఘోస్ట్ షిప్స్’.. ఎక్కడి నుంచి వస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








