అజహరుద్దీన్: యూపీలో గెలిచి, రాజస్థాన్‌లో ఓడి, ఇప్పుడు తెలంగాణ బరిలో దిగిన టీమిండియా మాజీ కెప్టెన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఈ మాజీ క్రికెటర్ తొలిసారి సొంత రాష్ట్రం నుంచి బరిలో నిలుస్తున్నారు. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం కూడా ఆయనకు ఇదే తొలిసారి.
కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు ఆయన్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోయిన అజహర్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అజహరుద్దీన్‌కు ఇవే తొలి ఎన్నికలు కావు. ఇంతకుముందు రెండు సార్లు లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసిన ఆయన ఓసారి విజయం సాధించారు.
భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన తరువాత 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన్ను బరిలో దించింది కాంగ్రెస్.
ఆ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ కుమార్ సింగ్‌పై 49 వేల పైచిలుకు మెజారిటీతో అజహర్ విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు.
2014లో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజహరుద్దీన్‌కు ఓటమి ఎదురైంది. బీజేపీ అభ్యర్థి సుఖ్బీర్ సింగ్ జోనాపురియా చేతిలో 1,35,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు.
2019 ఎన్నికలలో కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ పదవిలో ఉన్న ఆయన్ను పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది.
పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేసిన అజహరుద్దీన్‌ను అందుకు భిన్నంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్దేశించింది కాంగ్రెస్.
జూబ్లీహిల్స్‌లో టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి నుంచి ఇప్పుడు అజహరుద్దీన్‌కు సహాయ నిరాకరణ ఎదురవుతోంది.
జూబ్లీహిల్స్ టికెట్ తనకు కాకుండా అజహర్‌కు ఇవ్వడంతో విష్ణువర్దన్ రెడ్డి ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులలో గత పదేళ్లుగా చట్టసభలకు దూరంగా ఉన్న అజహరుద్దీన్ ఈసారి ఎన్నికలలో గట్టెక్కుతారో లేదో చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్, క్రికెట్ రాజకీయాలు.. రెండింట్లో వివాదాస్పదుడే
టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్‌గా మంచి పేరు సాధించిన అజహర్, చెడ్డ పేరు కూడా మూటగట్టుకున్నాడు.
మణికట్టు కదలికలతో బ్యాట్‌ను సొగసుగా తిప్పుతూ పరుగుల వరద పారించిన ఈ బ్యాటర్ కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేసుకున్నాడు.
కెరీర్‌లో 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డేలు ఆడిన అజహరుద్దీన్ 47 టెస్ట్‌లు, 174 వన్డేలలో కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అజహరుద్దీన్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 14 టెస్టులు, 90 వన్డేలలో విజయం సాధించింది. టెస్ట్ విజయాల రికార్డును సౌరబ్ గంగూలీ, వన్డే విజయాల రికార్డును ధోనీ చెరిపేసేవరకు అత్యధిక విజయాల కెప్టెన్‌గా అజహర్‌కు పేరుండేది.
అయితే, 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని సీబీఐ విచారణను ఎదుర్కొన్న అజహరుద్దీన్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది.
సుదీర్ఘ విచారణ తరువాత ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, అప్పటికే ఆయన సుమారు 50 ఏళ్లకు సమీపంలో ఉండడంతో మళ్లీ క్రికెట్ ఆడలేదు.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్‌సీఏ ఎన్నికల వివాదం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లోనూ అజహర్ చుట్టూ వివాదాలున్నాయి.
ఆయన హెచ్‌సీఏతో పాటు డెక్కన్ బ్లూస్ క్లబ్‌కు కూడా ఒకే సమయంలో అధ్యక్షుడిగా ఉండడం కోర్టుల వరకు వెళ్లింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఆయనపై అనర్హత వేటు వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ ఎన్నికలలో మరో క్రికెటర్
తెలంగాణకు చెందిన మరో మాజీ క్రికెటర్ పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీచేస్తున్నారు.
హైదరాబాద్ జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన కౌశిక్ రెడ్డి అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. 2018లో హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌పై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అనంతరం ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో 2021లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కౌశిక్‌కు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు.
కొద్దికాలానికే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. గవర్నర్ తొలుత కౌశిక్ రెడ్డి నామినేషన్‌ను ఆమోదించకపోయినా అనంతరం ఆమోదం పలకడంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ అభ్యర్థిగా ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
అంబటి రాయుడు, వేణుగోపాలరావు
తెలుగు రాష్ట్రాలలో అజహరుద్దీన్, కౌశిక్ రెడ్డే కాకుండా మరో ఇద్దరు క్రికెటర్లు కూడా రాజకీయాలపై ఆసక్తి చూపారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా మాజీ సభ్యుడు వేణుగోపాలరావు 2014లో జనసేన పార్టీలో చేరారు.
కానీ, ఆ తరువాత జనసేన కార్యక్రమాలలో పెద్దగా కనిపించని ఆయన ప్రస్తుతం కామెంటేటర్‌గా బిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు కొద్ది నెలల కిందట ప్రకటించారు.
ప్రజలకు సేవచేయడానికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అంతకుముందు ఆయన ఏపీలో ముఖ్యమంత్రి జగన్ పాలనపై ప్రశంసలు కురిపించడం, జగన్‌ను వ్యక్తిగతంగా కలవడంతో ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఒకటి ఉంది.
ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది క్రికెటర్లు కూడా రాజకీయాలలో అవకాశాలను పరీక్షించుకున్నారు. వారిలో కొందరు విజయాలు సాధించగా కొందరు అపజయాలు ఎదుర్కొన్నారు.
కొందరు రాజకీయ పార్టీలలో చేరినప్పటికీ ఎన్నికల బరిలో నిలవలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సిద్ధూ.. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, పీసీసీ ప్రెసిడెంట్
రాజకీయాల్లో చురుగ్గా ఉన్న క్రికెటర్ల గురించి మాట్లాడితే తొలుత చెప్పాల్సిన పేరు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూది. టీమిండియాకు ఒకప్పుడు ఓపెనర్‌గా ఆడిన సిద్ధూ పంజాబ్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ తెరపైకి వచ్చారు.
క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత తొలుత బీజేపీలో చేరిన సిద్ధూ 2004లో అమృత్‌సర్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి మంచి ఆధిక్యంతో విజయం సాధించారు. కొద్దికాలానికే ఓ కోర్ట్ కేసు కారణంగా ఆయన రాజీనామా చేశారు.
దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగే నాటికి కోర్టులో స్టే రావడంతో మళ్లీ పోటీ చేశారు. 2007లో జరిగిన ఈ ఉప ఎన్నికలోనూ ఆయన విజయం సాధించారు.
అనంతరం 2009 జనరల్ ఎలక్షన్లలో అమృత్‌సర్ నుంచే మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. కానీ, 6,858 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు.
2014లో బీజేపీ అమృత్‌సర్ టికెట్ సిద్ధూకు కాకుండా అరుణ్ జైట్లీకి ఇచ్చింది. జైట్లీ ఆ ఎన్నికలలో అమరీందర్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు.
సిద్ధూను బీజేపీ 2016లో రాజ్యసభకు పంపించింది. కానీ, కొద్ది నెలలకే సిద్ధూ బీజేపీకి రాజీనామా చేశారు. మరికొందరు నేతలతో కలిసి ‘ఆవాజ్ ఎ పంజాబ్’ అనే పార్టీని స్థాపించారు.
అక్కడికి కొద్ది నెలలలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున అమృత్‌సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అమరీందర్ సింగ్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కానీ, 2022 అసెంబ్లీ ఎన్నికలలో అదే అమృత్‌సర్ ఈస్ట్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఓటమి పాలయ్యారు.
అంతకుముందు 2021 నుంచి 2022 వరకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
గౌతమ్ గంభీర్: ఓపెనింగ్‌లోనే భారీ స్కోర్
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన గౌతమ్ గంభీర్‌ను ఆ పార్టీ ‘ఈస్ట్ దిల్లీ’ నియోజకవర్గం నుంచి పోటీ చేయించింది. ఈ టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ తన తొలి ఎన్నికలలోనే భారీ విజయం అందుకున్నాడు.
కాంగ్రెస్ నుంచి అర్వీందర్ సింగ్ లవ్లీ, ఆప్ నుంచి ఆతిషి ఆయనతో పోటీ పడగా 3,91,222 ఓట్ల భారీ ఆధిక్యంతో గంభీర్ గెలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
కీర్తి అజాద్: నాన్న సీఎం.. కొడుకు మూడు సార్లు ఎంపీ
మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ తండ్రి భగవత్ ఝా ఆజాద్ 1980ల చివర్లో బిహార్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కీర్తి ఆజాద్ తొలుత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ ఆ తరువాత తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చారు.
బీజేపీలో చేరి 1993లో దిల్లీలోని గోల్ మార్కెట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
అనంతరం 1999, 2009, 2014 ఎన్నికలలో బిహార్‌లోని దర్భాంగ నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
2015లో బీజేపీ నుంచి సస్పెండై కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2019 ఎన్నికలలో దర్భాంగలో ఓటమి పాలయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
చేతన్ చౌహాన్: యోగి కేబినెట్లో మంత్రిగా పనిచేస్తూ మృతి
చేతన్ చౌహాన్ ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన, 1991, 1998 ఎన్నికలలో విజయం సాధించారు.
ఆ తరువాత 2017లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ‘నోగావా సాదాత్’ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలోనూ పనిచేశారు. కోవిడ్ సమయంలో మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
మనోజ్ ప్రభాకర్: హెవీ వెయిట్లతో తలపడి ఓడిపోయిన ఆల్‌రౌండర్
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మనోజ్ ప్రభాకర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. భారత క్రికెట్ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ‘ఓపెనర్’గా ఆడేవారు ప్రభాకర్. భారత్ తరఫున పదుల సంఖ్యలో వన్డే మ్యాచ్‌లలో ఆయన ఇలా ఆడారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఫీట్ సాధించినవారు చాలా అరుదు.
క్రికెట్ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన మనోజ్ ప్రభాకర్ 1996 జనరల్ ఎలక్షన్లలో ఎన్డీ తివారీ పార్టీ అయిన ‘ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్-తివారీ’ నుంచి దక్షిణ దిల్లీ నియోజకవర్గంలో పోటీ చేశారు.
ఆ ఎన్నికలలో దక్షిణ దిల్లీలో బీజేపీ అభ్యర్థిగా సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ పోటీ చేయడం, ఎన్డీ తివారీ పార్టీకి పెద్దగా ఆదరణ లేకపోవడంతో మనోజ్ ప్రభాకర్‌కు ఘోర పరాజయం తప్పలేదు. ఆయనకు 17,690 (3.28 శాతం) ఓట్లే వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ: రెండు సార్లు ప్రయత్నించినా పార్లమెంటులో అడుగుపెట్టలేకపోయిన ‘టైగర్’
టైగర్ పటౌడీగా అభిమానులు పిలుచుకునే భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ రెండు సార్లు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేశారు.
1971లో తొలిసారి గుర్‌గావ్ నియోజకవర్గం నుంచి వికాస్ హరియాణా పార్టీ తరఫున బరిలో దిగిన ఆయన ఓటమి పాలయ్యారు.
1996లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండోసారి కూడా ఆయనకు పరాజయం తప్పలేదు.

ఫొటో సోర్స్, Getty Images
మహ్మద్ కైఫ్: రాజకీయ క్రీడలో రాణించలేకపోయిన బ్యాటర్
టీమ్ఇండియా గొప్ప ఫీల్డర్లలో ఒకడిగా పేరున్న మిడిలార్డర్ బ్యాటర్ మహ్మద్ కైఫ్ పేరు చెప్తే 2002 నాటి నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గుర్తొస్తుంది.
ఆ మ్యాచ్‌లో 326 పరుగుల భారీ టార్గెట్‌ను యువరాజ్ సింగ్‌తో కలిసి కైఫ్ ఛేదించడం క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తే.
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత కైఫ్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫూల్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. యూపీ బీజేపీకి చెందిన కీలక నేత కేశవ ప్రసాద్ మౌర్యపై కైఫ్‌ను పోటీ చేయించింది కాంగ్రెస్ పార్టీ.
ఆ ఎన్నికలలో కైఫ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. సుమారు 58 వేల ఓట్లు సాధించి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
లక్ష్మీ రతన్ శుక్లా: మంత్రిగా పనిచేస్తూ రాజకీయాలను వదిలేసిన ఫాస్ట్ బౌలర్
ఇంటర్నేషనల్ క్రికెట్లో తక్కువ మ్యాచ్‌లే ఆడినా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పశ్చిమ బెంగాల్‌కు దీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ లక్ష్మీ రతన్ శుక్లా 2016లో ‘హావ్డా నార్త్’ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు.. మమత బెనర్జీ కేబినెట్లో క్రీడల మంత్రిగానూ పనిచేశారు.
కానీ, 2021లో ఆయన తన మంత్రి పదవికి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టేందుకు రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించిన ఆయన మళ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
మనోజ్ తివారీ: డాషింగ్ బ్యాట్స్‌మన్ నుంచి క్రీడల మంత్రి వరకు..
పశ్చిమ బెంగాల్‌కే చెందిన మరో క్రికెటర్ మనోజ్ తివారీ ప్రస్తుతం మమతా బెనర్జీ ప్రభుత్వంలో క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.
2021 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా శివపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేసి గెలిచారు.
ఆ తరువాత ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీశాంత్: ప్రత్యర్థుల వికెట్ తీయలేకపోయిన పేసర్
ఫిక్సింగ్ ఆరోపణలతో కెరీర్ ముగిసిపోయిన టీమ్ ఇండియా పేసర్ శ్రీశాంత్ 2016లో కేరళ అసెంబ్లీ ఎన్నికలలో తిరువనంతపురం నుంచి పోటీ చేశారు.
బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత శివకుమార్ చేతిలో ఓడిపోయారు. మూడో స్థానంలో నిలిచినప్పటికీ 27 శాతానికిపైగా ఓట్లను సాధించారు శ్రీశాంత్.

ఫొటో సోర్స్, Getty Images
వినోద్ కాంబ్లీ: సొంత గడ్డపై ఓటమి
క్రికెట్‌లో వినోద్ కాంబ్లీకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఇప్పటికీ ఆయనకు అభిమానులున్నారు. 30 ఏళ్ల లోపే క్రికెట్ కెరీర్ ముగించిన కాంబ్లీ 2009లో లోక్ భారతి పార్టీ నుంచి ముంబయిలోని విక్రోలీ అసెంబ్లీ సీటుకు పోటీ చేశారు.
సుమారు నాలుగు వేల ఓట్లు సాధించిన ఆయన నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రవీణ్ కుమార్: పార్టీలో చేరినా పోటీ చేయలేదు
టీమ్ ఇండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ సొంత రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీలో చేరారు.
2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్పీలో చేరినప్పటికీ ఆయన ఎన్నికలలో పోటీ చేయలేదు.
ఇవి కూడా చదవండి:
- మేకప్ కిట్‌లో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు, పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ టెస్టులు - ఏంటీ వివాదం?
- జీడిమెట్ల: ‘ఈ నీరు కింద పడితే నేల ఎర్రగా మారిపోతోంది’.. హైదరాబాద్ శివార్లలోని భూగర్భ జలాన్ని బీబీసీ టెస్ట్ చేయిస్తే బయటపడిన వాస్తవం ఇదీ
- రాహుల్ గాంధీ: భారతీయ నేతలపై ప్రవాస భారతీయులకు ఎందుకంత ఆసక్తి?
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: పోరు గెలిచారు, పాలనలో గెలిచారా
- లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్...ఈ పదాల మధ్య తేడా ఏంటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














