తెలంగాణ ఎన్నికలు: పాతబస్తీలో హ్యాట్రిక్ కొట్టిన ఒకే ఒక్క హిందూ నాయకుడు

మాజీ ప్రధాని వాజ్‌పేయితో బద్దం బాల్ రెడ్డి

ఫొటో సోర్స్, Twitter/BaddamBalReddy1

ఫొటో క్యాప్షన్, కార్వాన్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు బాల్ రెడ్డి.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘పాతబస్తీ అంటే మజ్లిస్ అడ్డా. అక్కడ ఎంఐఎం నాయకులు.. ముస్లిం అభ్యర్థులు తప్ప మరొకరు గెలిచే చాన్సే లేదంటారా’’ - ఎన్నికల వేళ తరచూ వినిపించే మాట ఇది.

కానీ, పాతబస్తీలో వరుసగా మూడుసార్లు ఒక హిందువు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయనే బద్దం బాల్‌రెడ్డి.

పాతబస్తీలో అంతర్భాగమైన కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఆయన బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు.

బాల్‌రెడ్డి రికార్డును దాదాపు నాలుగు దశాబ్దాలుగా మరెవరూ అందుకోలేకపోయారు.

పాతబస్తీలోనే పుట్టారు

బాల్‌రెడ్డిది హైదరాబాద్‌ పాతబస్తీలోని అలియాబాద్ ప్రాంతం. ఆయనకు విద్యార్థి దశలో జనసంఘ్‌లో పనిచేసిన అనుభవం ఉంది.

1977లో జనతా పార్టీలో చేరారు బాల్‌రెడ్డి. అనంతరం భారతీయ జనతా పార్టీ ఏర్పాటుతో ఆ పార్టీలో కొనసాగారు.

బాల్ రెడ్డి ప్రచారం

ఫొటో సోర్స్, Twitter/BaddamBalReddy1

అప్పట్లో కార్వాన్‌ను బీజేపీ అడ్డాగా మార్చారు

అప్పట్లో కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ అడ్డాగా మార్చడంలో బాల్ రెడ్డిది కీలకపాత్ర.

1982లో తెలుగుదే‌‍శం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కార్వాన్ నుంచి బకర్ అఘా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.

ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికలలో ‌బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాల్‌రెడ్డికి కార్వాన్ నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు.

ఆ ఎన్నికల్లో ‌ఎంఐఎం నుంచి పోటీ చేసిన విరాసత్ రసూల్ ఖాన్‌పై 9,777 ఓట్ల మెజార్టీతో గెలుపోందారు బాల్‌రెడ్డి.

అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో బకర్ అగాపై 3,066 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

1994లో ఎంఐఎం అ‌‍భ్యర్థి సయ్యద్ సజ్జాద్‌పై విజయం సాధించారు. ఈసారి ఆయనకు మెజార్టీ మరింత పెరిగింది. ఆ ఎన్నికల్లో 13,293 ఓట్లతో గెలుపొందారు.

ఇలా హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాల్‌రెడ్డిని ఆయన అభిమానులు ‘కార్వాన్ టైగర్’, ‘గోల్కొండ సింహం’ అని పిలుచుకునేవారు.

వరుస విజయాల తర్వాత ఆయన మరోసారి చట్టసభలకు ఎన్నిక కాలేకపోయారు.

అయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా 2014 వరకు వరుసగా కార్వాన్ లో పోటీ చేస్తూ వచ్చారు.

2014లోనూ కార్వాన్ నుంచి పోటీ చేసి 48,614 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.

ఆయన చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజేంద్రనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 19,627 ఓట్లే వచ్చాయి.

బాల్‌రెడ్డి 2019 ఫిబ్రవరిలో చనిపోయారు. ఇలా ఆయన రాజకీయ జీవితం అంతా ‌‍బీజేపీలోనే గడిపారు.

నరేంద్రమోదీతో బాల్ రెడ్డి

ఫొటో సోర్స్, Twitter/BaddamBalReddy1

హైదరాబాద్ లోక్‌సభ స్థానం: 1991లో ఎంఐఎంకు గట్టి పోటీ

బాల్‌రెడ్డి లోక్‌సభకు కూడా పోటీ చేశారు. 1991, 1998, 1999లో బీజేపీ తరఫున హైదరాబాద్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు.

1991లో గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీకి 4,54,823 ఓట్లు రాగా, బాల్‌రెడ్డికి 4,15,299 ఓట్లు వచ్చాయి. ఒవైసీ చేతిలో 39,524 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు.

హైదరాబాద్ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు ఎంఐఎంకు వచ్చిన అతి తక్కువ మెజార్టీ ఇదే కావడం విశేషం.

అలాగే 1998 ఎన్నికల్లో బాల్‌రెడ్డి 4,14,173 ఓట్లు, 1999 ఎన్నికల్లో 3,87,344 ఓట్లు సాధించి రెండో స్థానం సాధించారు.

బాల్ రెడ్డి

ఫొటో సోర్స్, Twitter/BaddamBalReddy1

బాల్‌రెడ్డి‌పై హత్యాయత్నాలు

సం‌‍ఘ్ నేపథ్యం నుంచి వచ్చిన బాల్‌రెడ్డిపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి.

1978లో శాలిబండ ప్రాంతంలో బాల్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో తీవ్రంగా గాయపరిచారు. ఆయన చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ఆయన బతికారు.

పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని 2017లో పలువుర్ని ఎన్ఐఏ అరెస్టు చేసింది. 2004లో బాల్‌రెడ్డి హత్యకు వీరు కుట్ర పన్నారని ఎన్‌ఐఏ ఆరోపించింది.

పాతబస్తీలో ఇంకెవరైనా హిందువులు గెలిచారా?

బాల్‌రెడ్డి కాకుండా పాతబస్తీ ప్రాంతంలో మరికొందరు హిందూ నాయకులు విజయం సాధించారు. కానీ వారెవరూ మూడుసార్లు వరుసగా గెలవలేదు.

1952లో ‌‍చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఎక్బోటే గోపాల్ రావు విజయం సాధించారు. ఈయన కాంగ్రెస్ అ‌‍భ్యర్థిగా గెలిచారు.

మలక్‌పేట నియోజకవర్గం నుంచి 1967, 1972లో సరోజినీ పుల్లారెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు.

ఇదే నియోజకవర్గం నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి మూడుసార్లు గెలిచినా, మ‌‍ధ్యలో బ్రేక్ వచ్చింది. 1983, 1985లో ఇంద్రసేనారెడ్డి బీజేపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత మళ్లీ 1999లో గెలిచారు. ఈయనకు మూడు విజయాలు వరుసగా దక్కలేదు.

1989లో కాంగ్రెస్ నుంచి పి.సుధీర్ కుమార్, 1994లో టీడీపీ నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి గెలిచారు. 2004లోనూ మరోసారి రంగారెడ్డి గెలిచారు. తర్వాత మలక్ పేట నుంచి వరుసగా ఎంఐఎం గెలుస్తూ వస్తోంది.

రాజాసింగ్

ఫొటో సోర్స్, FACEBOOK/RAJASINGH

ఫొటో క్యాప్షన్, రాజాసింగ్ రెండు సార్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలిచారు.

రాజాసింగ్ ఆ రికార్డు అందుకుంటారా?

పాతబస్తీ ప్రాంతంలో వరుసగా మూడు సార్లు గెలిచిన బద్దం బాల్‌రెడ్డి రికార్డును అదే పార్టీకి చెందిన రాజా సింగ్ అందుకుంటారా, లేదా అన్నది తేలాల్సి ఉంది.

బీజేపీ నుంచి రాజాసింగ్ ఇప్పటివరకు రెండు సార్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలిచారు.

2008లో జరిగిన నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో ‌‍భాగంగా గోషామహల్ స్థానం ఏర్పడింది. 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అ‌భ్యర్థి ముఖేష్ గౌడ్ గెలిచారు.

తర్వాత 2014, 2018లలో వరుసగా రెండుసార్లు బీజేపీ నుంచి టి.రాజాసింగ్ విజయం సాధించారు.

నవంబరు 30న జరిగే తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ సీటును బీజేపీ మళ్లీ రాజాసింగ్‌కే కేటాయించింది.

గతంలో ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసి మరోసారి బరిలో నిలిపింది బీజేపీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)