బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్: 'నేను అలా అన్నది నిజమే.. ఆ కామెంట్లను ఇప్పటికీ సమర్థిస్తా'

భారతదేశంలో బీజేపీ నేతలు చేస్తున్న విద్వేషపూరిత కామెంట్లపై చర్యలు తీసుకోడానికి ఫేస్‌బుక్ వెనకాడుతోందని 'ది వాల్‌స్ట్రీట్ జర్నల్' ఇటీవల ఒక కథనం ప్రచురించింది. అతి పెద్ద మార్కెట్ ఉన్న భారత్‌లో తన వ్యాపార ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఉండేందుకే ఫేస్‌బుక్ ఇలా వ్యవహరిస్తోందని ఈ కథనం పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలోని గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ఒక వర్గానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్లే కేంద్రంగా ఈ కథనం సాగింది. చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా, రాజాసింగ్ తోపాటు మరో ముగ్గురు బీజేపీ నేతలపై చర్యలు తీసుకోడానికి ఫేస్‌బుక్ సాహసించలేదని ఈ కథనం వ్యాఖ్యానించింది. దీనిపై ఫేస్‌బుక్ స్పందించింది. హింసను ప్రేరేపించే వ్యాఖ్యలను ఎవరు చేసినా, ఏ రాజకీయ పార్టీ వారు చేసినా అనుమతించమని ప్రకటించింది.
ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా విమర్శల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో మాట్లాడారు.
తన పేరు మీద నకిలీ ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రాం ఎకౌంట్లు నడుస్తున్నాయని, అయితే, వాటిలో తాను చెప్పినట్లుగా వస్తున్న వ్యాఖ్యలు, అందులో వాడిన భాష మీద తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజాసింగ్ అన్నారు.

ప్ర. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం మీరు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా ఫేస్‌బుక్ మిమ్మల్ని ప్రమాదకరంగా పరిగణించింది. దీనిపై మీరు ఏమంటారు ?
రాజాసింగ్: నాకు కూడా నిన్ననే తెలిసింది. అమెరికాలో వాల్‌స్ట్రీట్ జర్నల్ అనే పేపర్‌లో నా గురించి రాశారని తెలిసింది. ఇది తెలిశాక నేను షాక్ అయ్యా. అసలు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలో చాలామంది ఉన్నారు. దేశం గురించి చెడుగా మాట్లాడేవారు ఉన్నారు. హిందూ ధర్మం గురించి చెడుగా మాట్లాడేవారున్నారు. అలాంటి వారిని వదిలేసి నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. దీని వెనక ఏదో కుట్ర కనిపిస్తోంది నాకు. రాజాసింగ్‌ను టార్గెట్ చేసి బీజేపీపై కామెంట్ చేయవచ్చు అని కాంగ్రెస్, ఎంఐఎం ఇంకా కొన్ని పార్టీల వాళ్లు కుట్ర పన్ని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ప్ర. రొహింజ్యా ముస్లింలను మీరు చీడ పురుగుల్లాంటి వారని అన్నారు. మన దేశం నుంచి వాళ్లను పంపేయాలని, అలా వెళ్లని వారిని కాల్చి పడేయాలని కూడా అన్నారు. 2018 ఆగస్ట్‌లో ఫేస్‌బుక్‌లో మీరు ఈ కామెంట్స్ చేశారని వాల్‌స్ట్రీట్ చెబుతోంది. ఇవి మీరు ఇచ్చిన స్టేట్‌మెంట్లేనా ?
రాజాసింగ్: అందులో కొన్నిస్టేట్‌మెంట్లే నావి. నా అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్‌ను 2018లోనే కొందరు హ్యాక్ చేసి అన్‌పబ్లిష్ చేశారు. నేను దీనిపై సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాను. మీకు ఆ కాపీ కూడా ఇస్తాను. అయితే మీరు చెప్పిన వాటిలో కొన్ని స్టేట్‌మెంట్లే నేను చేశాను. రొహింజ్యాల మీద ఆ కామెంట్లు చేశాను. ఇవాళ భారతదేశం ఒక అనాథాశ్రమం కాదు. ఎవరైనీ ఇల్లీగల్‌గా మన భారతదేశంలోకి వచ్చి , ఇక్కడే ఉంటూ ఈ దేశానికే వ్యతిరేకంగా పని చేస్తుంటే వారిని ఎందుకు దేశంలో ఉండనివ్వాలి. ఇవాళ బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచిగానీ ఎక్కువశాతంమంది వచ్చి బెంగాల్‌లో ఉంటున్నారు. తెలంగాణలో 8 వేలమంది వరకు రొహింజ్యాలు ఉన్నారని సమాచారం.
ప్ర. వెళ్లని రొహింజ్యాలను కాల్చేయాలని అన్నది మీ స్టేట్ మెంట్ కాదా ?
రాజాసింగ్: అవును నేనే అన్నాను.

ఫొటో సోర్స్, facebook/Rajasingh
ప్ర. మీరు ద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని, ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రాజాసింగ్: అమెరికాలో కూడా అక్కడ ఆశ్రయం పొందుతూ ఆ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తే, కుట్ర పన్నితే ఆ దేశం ఊరుకోరు. వాళ్లను అరెస్టు చేస్తారు. దేశం నుంచి పంపిస్తారు. నేను కూడా అదే చెబుతున్నా. దేశం సురక్షితంగా ఉండాలంటే ఇలాంటి వారు ఉండకూడదు. ఇవాళ మయన్మార్‌లో చూస్తే అక్కడి ప్రజలను, ఆర్మీ మీదా దాడులు చేస్తున్నారు. పేదలను చంపుతున్నారు. అలాగే, బంగ్లాదేశ్‌లో ప్రజలను రొహింగ్యాలు ఏ విధంగా హింసిస్తున్నారో, చంపుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.
ప్ర. ఒక ప్రజాప్రతినిధిగా మీరు వాడిన భాషను ఎలా సమర్ధించుకుంటారు?
రాజాసింగ్: ప్రజాప్రతినిధి అంటున్నారు కాబట్టి నేను నా నియోజకవర్గంలో అందరికీ సేవ చేస్తా. అలాగే నా ధర్మం పట్ల కూడా నేను మాట్లాడాలి. నా దేశం గురించి నేను మాట్లాడాలి. అదే నేను చేశాను. నా తెలంగాణ సేఫ్‌గా ఉండాలంటే రొహింజ్యాలుగానీ, పాకిస్థానీలుగానీ ఇక్కడ ఉండకూడదు. నా దేశం బాగుండాలంటే, ఒక్క దేశద్రోహిని కూడా ఇక్కడ ఉండనివ్వద్దు. అదే నేను చెబుతున్నా. నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పింది కరెక్టే.
ప్ర. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాప్రతినిధి అయ్యారు. ఇటువంటి భాషను, స్టేట్‌మెంట్‌ను ఎలా సమర్ధించుకుంటారు.
రాజాసింగ్: రాజ్యాంగం మీద ప్రమాణం చేసే అందరూ పని చేస్తున్నారు. నేను కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేశాను. హిందువులు, ముస్లింలు, సిక్కులను అందరినీ సమానంగా చూస్తానని ప్రమాణం చేశాను. నేను ఇప్పడు అదే పని చేస్తున్నా. లాక్‌డౌన్ సమయంలో హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా ప్రతి ఏరియాకు, ఇంటికి నేను భోజనం పంపించాను. నాలో ఎలాంటి భేదభావం లేదు.
నేను హిందువుగా పుట్టాను. హిందూ ధర్మం గురించి నేను మాట్లాడాలి. అయోధ్య గురించి మాట్లాడాలి. కాశీ మధుర గురించి మాట్లాడాలి. మా టార్గెట్ ఉంది. అయోధ్యలో సుప్రీం కోర్టు ద్వారా గెలిచి మందిరాన్ని కడుతున్నట్లే కాశీ మథురలలో కూడా న్యాయబద్ధంగా గుడికడతాం. రాజ్యాంగం పట్ల అందరూ ప్రమాణం చేశారు. కానీ, వాళ్లనెందుకు అడగడం లేదు. ఎందుకంటే రాజాసింగ్‌ను అడ్డం పెట్టుకుని మా ప్రధానిని బ్లేమ్ చేయాలని కొందరు కుట్రపన్నుతున్నారు. అందులో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారు.
ప్ర. మీ భాష పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదు మీకు..?
రాజాసింగ్: నా భాషలో ఎలాంటి తప్పు లేదు. నేను చేసిన కామెంట్లపై నేను వ్యక్తిగతంగా నిలబడి ఉంటా.
ప్ర. మీ ఫేస్‌బుక్ పేజ్‌ను రీఓపెన్ చేయడానికి అంగీకరించడం లేదు కదా. దీన్ని ఎలా సమర్ధించుకుంటారు?
రాజాసింగ్: నా భాషలో ఎలాంటి తప్పు లేదు. ఇవాళ కొంతమంది నా దేశం పట్ల, నా ధర్మంపట్ల కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు నేను సమాధానం ఇవ్వక తప్పదు. అది నా బాధ్యత. వారు మాట్లాకపోతే నేను కూడా మాట్లాడను. నేను దీని కోసం కేసులు ఎదుర్కొంటున్నాను. కోర్టులకు తిరుగుతున్నాను. మేం చేసిన వ్యాఖ్యలకు వివరణ కూడా ఇస్తున్నాం. ఇందులో మా వైపు నుంచి తప్పేమీ లేదు. నా పేరు మీద ఒకేఒక్క అఫిషియల్ ట్విటర్ ఎకౌంట్ ఉంది. అందులో నేను బ్యాలన్స్‌డ్‌గానే కామెంట్లు పెడుతున్నా.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- భారత్, చైనాల సంబంధాల్లో మార్పులు రాబోతున్నాయా? మోదీ, జిన్‌పింగ్ భేటీ సాధ్యమేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









