తెలంగాణ ఎన్నికలు: ఏడాదికి 20 రోజులు కూడా జరగని తెలంగాణ అసెంబ్లీ, ఎందుకింత తక్కువ?

తెలంగాణ శాసన సభ

ఫొటో సోర్స్, legislature.telangana.gov.in

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గడచిన ఐదేళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఏ‌డాదికి 20 రోజులు కూడా జరగలేదు.

తెలంగాణ అసెంబ్లీ పనిచేసిన రోజుల ఆధారంగా పీఆర్ఎస్ ఇండియా ఓ విశ్లేషణ చేసింది. నవంబరులో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పనిదినాల గురించి అందులో పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ అసెంబ్లీనే అతి తక్కువ రోజులు జరిగింది.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో (తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం) అసెంబ్లీ సగటు పనిదినాలు తెలంగాణలోనే అతి తక్కువగా నమోదయ్యాయి.

ఐదేళ్లలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సగటు 15 రోజులుగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌ 23 రోజులు, మధ్యప్రదేశ్ 16 రోజులు, మిజోరాం 18 రోజులు, రాజస్థాన్‌లో సగటు 29 రోజులుగా ఉంది.

తెలంగాణ అసెంబ్లీ

తక్కువ పనిదినాలు ఎందుకు?

అసెంబ్లీ సమావేశాలు తక్కువగా జరగడానికి ప్రధాన కారణం కోవిడ్-19 అని చెప్పారు ఎంపీ, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్ రెడ్డి.

‘‘2020 మార్చి నుంచి రెండేళ్లపాటు దేశంలో కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. దేశంలో కోవిడ్ మూడు వేవ్‌లు రావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు. సభలు, సమావేశాలపై ప్రభుత్వాలే ఆంక్షలు విధించడంతో శాసన సభ సమావేశాలు సాధ్యం కాలేదు. బడ్జెట్‌ వంటివి ఆమోదించేందుకు సమావేశాలు జరిపినా, అవి ఒకటి, రెండు రోజులకే పరిమితమయ్యాయి. అందుకే, గత ఐదేళ్లలో దేశంలోని అన్ని శాసనసభలు, పార్లమెంటు సహా తక్కువ పనిదినాలే ఉన్నాయి’’ అని కేఆర్ సురేశ్ రెడ్డి బీబీసీతో అన్నారు.

‘‘తెలంగాణలో ప్రతిపక్ష సభ్యులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వమే చాలా సందర్భాల్లో కొన్ని అంశాలను చర్చకు తీసుకువచ్చింది. భూములు(ధరణి), ఆర్థికం, అభివృద్ధి వంటి అంశాలను తీసుకువచ్చి చర్చించడం గమనించాం. పరిమిత సంఖ్యలో ఉన్న ప్రతిపక్షాల కారణంగా అధికార పక్షంలోని సభ్యులు చర్చలో పాల్గొని సలహాలు, సూచనలు చేశారు.’’ అని సురేశ్ రెడ్డి అన్నారు.

ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2004-2009 మధ్య స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

తెలంగాణ శాసన సభ

ఫొటో సోర్స్, legislature.telangana.gov.in

ఎన్ని రోజులకు సమావే‌శమవ్వాలి?

సాధారణంగా శాసనసభలు ఏడాదిలో మూడుసార్లు సమావేశమవుతాయి. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనేది స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్(బీఏసీ) తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

బీఏసీ ప్రతిపాదనల మేరకు సభ ఎన్ని రోజులు జరుగుతుందనేది విషయంపై స్పీకర్ కార్యాలయం ప్రకటన చేస్తుంది.

కనీసం ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే విషయంపై బీబీసీతో కేఆర్ సురేశ్ రెడ్డి మాట్లాడారు.

‘‘సభ ఎన్ని రోజులు జరగాలన్నది కచ్చితంగా ఎక్కడా లేదు. సభ ఎన్ని రోజులు జరిగిందనే ఆలోచన కంటే, ఎంత ఫలవంతంగా చర్చలు జరిగాయన్నది ముఖ్యం. గతంలో స్పీకర్ల సదస్సులు జరిగినప్పుడు ఎక్కువ సభ్యులు ఉన్న శాసన సభలు, మధ్యస్తంగా ఉన్నవి, తక్కువ సభ్యులున్నవి నిర్దేశిత రోజులు జరగాలని సలహాలు, సూచనలు వచ్చాయి. కానీ, సభ నిర్వహణ ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది.’’ అని చెప్పారు.

సాధారణంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులపై అన్ని పక్షాలు చర్చించిన తర్వాత వాటికి అదనంగా ఏదైనా జత చేయాల్సి ‌ఉంటే జత చేసేవారు. కానీ ఈ ఐదేళ్లలో, 48 శాతం బిల్లులను ఒక్క రోజులోనే అసెంబ్లీ ఆమోదించిందని పీఆర్ఎస్ ఇండియా సంస్థ విశ్లేషించింది.

అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు మాత్రమే ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేస్తుంది. ఈ ఐదేళ్లలో తెలంగాణ అసెంబ్లీ 14 ఆర్డినెన్సులు జారీ చేసింది. మధ్యప్రదేశ్(39) తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా ఆర్డినెన్సులు తీసుకొచ్చారు.

శాసన సభలో కేసీఆర్

ఫొటో సోర్స్, TelanganaCMO

పనిదినాలు తగ్గితే చర్చలపై ప్రభావం

ఒక సమావేశం నుంచి మరో సమావేశం మధ్య గడువు ఆరు నెలలకు మించకూడదనే ఆనవాయితీని పార్లమెంట్, శాసనసభలు పాటిస్తున్నాయి.

రాజ్యాంగ సవరణలపై 2000 ఫిబ్రవరి 22న అప్పటి వాజ్‌పేయీ ప్రభుత్వం జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అధ్యక్షతన కమిషన్ వేసింది.

దీన్ని ‘నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్‌’గా పిలుస్తారు. ఇందులో 11 మంది సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిషన్ రాజ్యాంగానికి చేయాల్సిన సవరణలపై అధ్యయనం చేసి 2002లో తన నివేదికను అందించింది.

సభలో 70 మంది కంటే తక్కువ సభ్యులున్న శాసనసభలు ఏడాదికి కనీసం 50 రోజులు సమావేశమవ్వాలి. మిగిలిన సభలు ఏడాదికి కనీసం 90 రోజులు.. అంటే మూడు నెలలు సమావేశం కావాలని కమిషన్ సూచించింది.

అలాగే, 2016లో గాంధీనగర్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో రాష్ట్రాల అసెంబ్లీలు కనీసం ఏడాదికి 60 రోజులు సమావేశం కావాలనే అభిప్రాయానికి వచ్చారు. కానీ, ఈ సలహాలు, సూచనలేవీ రాష్ట్రాల అసెంబ్లీలు పాటించలేదు.

2016 నుంచి 2021 మధ్య కాలంలో దే‌‍శంలో 23 శాసనసభ సమావేశాలను పీఆర్ఎస్ సంస్థ విశ్లేషించింది. అందులో సగటున 25 రోజులపాటే సమావేశాలు జరిగినట్లు తేలింది.

ప్రస్తుతం పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పనిదినాలు తగ్గుతున్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.

‘‘నాకు తెలిసినంత వరకూ కచ్చితంగా ఇన్ని రోజులు జరగాలనేది లేదు. తక్కువ రోజులు పనిచేయడం వల్ల చర్చలపై ప్రభావం ఉంటుంది. ఎక్కడైనా ప్రభుత్వం నుంచి మెజార్టీ సభ్యులున్నచోట సభ నిర్వహణ కచ్చితంగా తక్కువగానే ఉండటం గమనించవచ్చు’’ అని నాగేశ్వర్ బీబీసీతో చెప్పారు.

కేఆర్ సురేశ్ రెడ్డి

ఫొటో సోర్స్, twitter@krsureshreddy

ప్రోరోగ్ చేయకుండా కొనసాగింపు

తెలంగాణ అసెంబ్లీ గత రెండేళ్లుగా వి‌‍భిన్న పద్ధతిలో నడిచిందని చెప్పొచ్చు.

సాధారణంగా అసెంబ్లీలో బడ్జెట్, లేదా వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఆ తర్వాత స్పీకర్ స‌‍భను ప్రోరోగ్(నిరవధికంగా వాయిదా) చేస్తారు. ఆ తర్వాత సమావేశాలు మళ్లీ కొత్తగా నిర్వహిస్తారు. కానీ, తెలంగాణలో గడచిన రెండేళ్లుగా సభను ప్రోరోగ్ చేయకుండా కేవలం వాయిదా వేసుకుంటూ వచ్చారు.

అందుకు గవర్నర్ తో ఉన్న వి‌‍భేదాలే కారణమనే వాదనలు ఉన్నాయి.

ప్రోరోగ్ చేస్తే మరుసటి సమావేశం గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కావాల్సి ఉంటుంది. అందువల్ల సభ వాయిదా వేసుకుంటూ రావడంతో గత సమావేశాలకే కొనసాగింపు అన్నట్లుగా శాసనసభ కొనసాగింది.

‘‘సహజంగా ప్రోరోగ్ చేస్తే చట్టాలు చేసేందుకు ఆలస్యమవుతుంటాయి. ఆర్డినెన్స్‌ల రూపంలో బిల్లులు తీసుకురావాల్సి ఉంటుంది. అదే ప్రోరోగ్ కాకపోతే బిల్లులు ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చి ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది’’ అని బీబీసీతో చెప్పారు కేఆర్ సురేశ్ రెడ్డి.

తెలంగాణ మొదటి అసెంబ్లీ ఎలా జరిగింది?

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది మే 20వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఏర్పడింది.

తర్వాత జూన్ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడంతో అదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.

2018 సెప్టెంబర్ 6న రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఆ నాలుగున్నరేళ్ల కాలంలో 9 సెషన్లపాటు అసెంబ్లీ జరిగింది. 126 రోజులపాటు అసెంబ్లీ నడిచింది. అసెంబ్లీ 612.27 గంటలు పని చేసినట్లు అసెంబ్లీ వ్యవహారాల నివేదిక తెలియజేస్తోంది.

గ్రాంట్సుకు సంబంధించిన డిమాండ్స్‌పై 114.41 గంటలు చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల కోసం 125.24 గంటలు కేటాయించారు.

మొదటి విడతలో తెలంగాణ అసెంబ్లీలో 71 బిల్లులు ప్రవేశపెట్టి.. అన్నింటికీ ఆమోదం తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత 2017లో అత్యధికంగా 37 రోజులపాటు అసెంబ్లీ జరిగింది.

తెలంగాణ
కేసీఆర్

ఫొటో సోర్స్, TelanganaCMO

ఉమ్మడి ఏపీలోనూ ఎక్కువే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అసెంబ్లీ ఎక్కువ రోజులే నడిచింది. అప్పట్లో తెలంగాణ ఉద్యమం కారణంగా స‌‍భ వాయిదా వేసుకుంటూ వచ్చినప్పటికీ, సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది.

తెలంగాణ

2009-14 మధ్య సమయంలో అసెంబ్లీ సగటున ఏడాదికి 26 రోజులు పనిచేసింది. 612 గంటలపాటు సభ సాగింది.

పీఆర్ఎస్ ఇండియా గణంకాల ప్రకారం 21శాతం క్వశ్చన్ అవర్‌ నడిచింది. 20 శాతం సమయం ని‌‍ధుల విడుదల చేసే డిమాండ్లపై సభ సాగింది. 10 శాతం సమయం అసెంబ్లీ వ్యవహారాలకు, 9 శాతం బడ్జెట్‌పై చర్చకు, 6 శాతం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించారు.

ఒక మాజీ సభాపతిగా సభ ఎక్కువ రోజులు నడిచి ఫలవంతమైన చర్చలు జరగాలనే కోరుకుంటానని చెప్పారు సురేశ్ రెడ్డి.

‘‘ఇన్ని గంటలు కూర్చున్నాం.. ఇన్ని రోజులు సభ జరిపామనే కంటే ఇన్ని అంశాలు చర్చించాం.. ఇన్ని చట్టాలు ఆమోదించాం.. ఇన్ని ప్రశ్నోత్తరాలు జరిగాయి.. ఇన్ని జీరో ఆవర్లు జరిగాయి.. అనేది ముఖ్యం. సభ జరగని సమయంలో అసెంబ్లీ లేదా లోక్ సభ కమిటీలు కొనసాగాలి. రాజకీయాలకు అతీతంగా కమిటీలు పనిచేస్తాయి. కనుక కమిటీలు ఎంత సమర్థంగా నడిపిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థను అంతగా బలపరిచినట్లు అవుతుంది ’’ అని సురేశ్ రెడ్డి అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)