ఇజ్రాయెల్ పక్షాన ఉంటూ గాజాకు సాయం చేయడంలో మోదీ ఆంతర్యం ఏమిటి?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌పై రష్యా 2022 ఫిబ్రవరిలో దాడి చేసినప్పుడు, పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా భారత్ తన ప్రయోజనాలకు కట్టుబడి ఉందంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై చాలా ప్రశంసలు వచ్చాయి.

మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని భారత్‌లోని ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశంసించాయి. ఈ విషయంలో తాను ప్రభుత్వంతో ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.

యుక్రెయిన్-రష్యా యుద్ధంలో ‘గ్లోబల్ సౌత్‌’ గళంగా కనిపించడానికి భారత్ గట్టి ప్రయత్నం చేసింది. దిల్లీలో జరిగిన జీ20 సదస్సులో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంలో విజయం సాధించింది.

కానీ, ఇప్పుడు హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం విషయంలో మాత్రం భారత విదేశాంగ విధానంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై తీసుకున్న వైఖరికి పూర్తి భిన్నంగా హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో భారత్ వైఖరి ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం విషయంలో పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా భారత్ గట్టిగా నిలబడిందని, ఇజ్రాయెల్ విషయంలో మాత్రం బహిరంగంగానే పశ్చిమ దేశాల పక్షాన నిలిచిందని చెబుతున్నారు. దీన్ని భారతదేశ ద్వంద్వ వైఖరిగా చాలా మంది అభివర్ణిస్తున్నారు.

ఈ వాదనలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తోసిపుచ్చారు. ఉగ్రవాదంపై ఏ రూపంలోనూ భారత్ కనికరం చూపదన్నారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న ఉగ్రవాద దాడి జరిగిందని, దానికి వ్యతిరేకంగా తాము గట్టిగా నిలబడతామని భారత్ చెబుతోంది.

మోదీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఐక్యరాజ్య సమితిలో భారత్ వైఖరిపై సవాళ్లు

గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడానికి, మానవతా సహాయం అందించడానికి గత వారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణ ప్రతిపాదన తెచ్చారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఈ ప్రతిపాదనపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.

యుక్రెయిన్-రష్యా యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానాలపై ఓటింగ్‌లో కూడా భారత్ పాల్గొనలేదు.

ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేక తీర్మానంపై ఓటు వేయాలని అమెరికా సహా పాశ్చాత్య దేశాలు భారత్‌పై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కానీ, భారత్ ఎలాంటి ఒత్తిడికి లొంగలేదు.

రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించడానికి అనుకూలంగా అనేక బలమైన వాదనలు ఉన్నాయి.

కానీ, గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో వేల మంది పౌరులు చనిపోతున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో మరణించిన పౌరుల సంఖ్య కంటే అనేక రెట్లు ఎక్కువగా పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనిక చర్యలో మరణించారు. ఇప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.

ఇలాంటి సమయంలో, మానవతా సహాయం అందించడానికి కాల్పుల విరమణ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో తీసుకువచ్చినప్పుడు, భారతదేశం ఓటింగ్‌కు దూరంగా ఉంది.

ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకు భారత్ దగ్గర సరైన వాదన లేదని చెబుతున్నారు.

ఐరాస తీర్మానంలో హమాస్ అక్టోబరు 7 దాడుల ప్రస్తావన లేదని భారత్ వాదించింది. హమాస్ దాడికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావాలని, దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయాలని భారత్ కోరింది.

గాజా

ఫొటో సోర్స్, Getty Images

అరబ్ దేశాల తీరులో నిజాయతీ ఎంత?

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ వైఖరి గురించి ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి ‘ద హిందూ’లో ఇలా వ్రాశారు.

"ఇజ్రాయెల్‌లో ఉగ్రవాద దాడులపై భారత్ ఆందోళన చెందడం సహజం. ఇజ్రాయెల్‌తో సంబంధాలను అరబ్ దేశాలు సాధారణీకరిస్తున్నాయి. భారత్ కూడా ఈ అంశాన్ని విస్మరించలేదు. ఐ2యూ2 (ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ, యూఎస్) సమూహం కూడా ఈ విషయాన్నే నిర్ధరిస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడటమే కాకుండా గాజాలో మానవతా విషాదానికి వ్యతిరేకంగా నిలబడటం కూడా భారతదేశానికి చాలా ముఖ్యం.

ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభంలో పశ్చిమ దేశాలపై కపటత్వం, ద్వంద్వ ప్రమాణాల విషయంలో విమర్శలు రావొచ్చు. కానీ, ఈ విషయంలో అరబ్బులు నిర్దోషులా? పాలస్తీనియన్లను అరబ్ దేశాలు తక్కువ చేసి చూడట్లేదా? ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించే క్రమంలో అరబ్ దేశాలు... పాలస్తీనియన్ల సమస్య గురించి మాట్లాడుతూ, పాలస్తీనాలోని ఏ ప్రాంతాలను ఆక్రమించబోమని ఇప్పుడు ఇజ్రాయెల్ అంగీకరించిందని చెప్పాయి. కానీ, ఇందుకు విరుద్ధంగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది.

పాలస్తీనియన్లకు మద్దతుగా వీధుల్లో చేసే నిరసనలను ఆపడం ఇప్పుడు అరబ్ దేశాల పని. పాలస్తీనియన్ల హక్కులను విస్మరించడం ద్వారా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించడం అరబ్ దేశాలకు భద్రతను అందించదు’’ అని ఆయన రాసుకొచ్చారు.

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ(జనరల్ అసెంబ్లీ)లో కాల్పుల విరమణ ప్రతిపాదనపై మొత్తం 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. 120 దేశాలు ఓటింగ్‌కు మద్దతుగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.

ఓటింగ్‌కు దూరంగా ఉన్న చాలా దేశాల్లో పశ్చిమ దేశాలే ఉన్నాయి. ఆసియాలో చూస్తే ఓటింగ్‌కు దూరంగా ఉన్న ముఖ్యమైన దేశాలు భారత్, జపాన్‌. ఈ ప్రతిపాదనకు మద్దతుగా చైనా, రష్యా ఓటేశాయి.

అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ప్రయోజనాలపై ప్రభావం ఎంత?

అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ చెప్పినట్లు దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పశ్చిమాసియా స్టడీ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఏకే పాషా అన్నారు.

‘‘ఇజ్రాయెల్‌పై దాడిని ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు. కానీ, హమాస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పాలస్తీనియన్ల హక్కుల గురించి మాట్లాడలేదు. అయిదు రోజుల తర్వాత, భారత విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ‘రెండు దేశాల పరిష్కారం’ గురించి ప్రకటన వచ్చింది. గాజాకు మానవతా సహాయం కింద సామగ్రిని పంపినప్పుడు భారత్ ప్రపంచవ్యాప్తంగా డోలు కొట్టి చాటుకుంది. గాజాకు మానవతా సహాయం అందించడానికి ఐరాసలో కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చినప్పుడు మాత్రం భారత్ ఓటు వేయకుండా దూరంగా ఉంది’’ అని ఆయన చెప్పారు.

మోదీ ప్రభుత్వ వైఖరి వెనుక వ్యూహం ఏమిటి?

దీని గురించి ప్రొఫెసర్ పాషా మాట్లాడుతూ, "వారికి ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. భారత్‌ ప్రజల సెంటిమెంట్ ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉందని బీజేపీకి తెలుసు. సహజంగానే మతపరంగా ప్రజల్లో ఈ సెంటిమెంట్ ఏర్పడింది. కానీ, మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి భారతదేశ ప్రయోజనాలను, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పణంగా పెట్టిందని నేను భావిస్తున్నాను.

దీనివల్ల గ్లోబల్ సౌత్ గళంగా మారడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు దెబ్బ తగిలింది. గల్ఫ్‌లోని ఇస్లామిక్ దేశాలలో కూడా భారతదేశ ప్రయోజనాలపై దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం పడుతుంది. గాజాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేస్తున్న సైనిక చర్య చాలా కాలం పాటు కొనసాగుతుంది. అరబ్ దేశాలు ఎక్కువ కాలం ప్రేక్షకులుగా ఉండలేవు. ఇంధన సరఫరా నిలిపివేయడంపై అవి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే, భారతదేశం తీవ్రంగా ప్రభావితం అవుతుంది’’ అని ఆయన విశ్లేషించారు.

మోదీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు సవాళ్లు పెరిగాయా?

మధ్యప్రాచ్యంలో ఇప్పుడు జరుగుతున్నదానితో భారతదేశానికి సవాళ్లు పెరిగాయని జేఎన్‌యూలో పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ అశ్విని మహాపాత్ర అన్నారు.

"ఖతార్‌లో ఎనిమిది మంది భారతీయులకు మరణశిక్ష విధించడానికి ఇజ్రాయెల్‌ విషయంలో భారతదేశ వైఖరికి సంబంధం ఉంది. భారత వైఖరితో గల్ఫ్‌లోని ఇస్లామిక్ దేశాల్లో అశాంతి పెరుగుతుంది. భారత్‌కు ఇది సవాలుగా మారుతుందని చెప్పొచ్చు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భారత్ వైఖరి తప్పు కాదని నేను భావిస్తున్నా. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనకు భారత్‌ వ్యతిరేకం కాదు. ఈ తీర్మానంలో హమాస్ చేసిన ఉగ్రవాద దాడి గురించి విమర్శించాలనేది భారత్ వాదన. ఈ డిమాండ్ కచ్చితంగా సమర్థించదగినది. ఉగ్రవాదాన్ని పక్కనబెట్టి గ్లోబల్ సౌత్ గురించి భారత్ మాట్లాడదు’’ అని వివరించారు.

గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్‌ను తీవ్రవాదంపై పోరాటంగా భారతదేశం చూస్తోందని మేధో సంస్థ ది విల్సన్ సెంటర్‌లోని సౌత్ ఏసియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మన్ అభిప్రాయపడ్డారు.

‘‘ఉగ్రవాదంపై పోరులో కాల్పుల విరమణ కుదరదని భారత్ నమ్ముతోంది. పాలస్తీనియన్లకు మానవతా సహాయానికి భారత్ మద్దతు ఇస్తోంది. కానీ, ఇజ్రాయెల్ సైనిక చర్యను కూడా భారత్ వ్యతిరేకించడం లేదు’’ అని మైఖేల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)