ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంలో ఏ దేశం ఎటువైపు?

ఇజ్రాయెల్ - పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్ - పాలస్తీనా వివాదంపై దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు విడిపోయాయి. అయితే, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడితో ఆ విభజన రేఖ మరింత స్పష్టమైంది.

దాడి జరిగిన వెంటనే కొన్ని దేశాలు హమాస్ దాడిని ఖండిస్తూ ఇజ్రాయెల్‌కి మద్దతు తెలిపాయి. మరికొన్ని దేశాలు హమాస్‌ని సమర్థించాయి.

ఇరుదేశాల మధ్య శాంతి పునరుద్ధరణ జరగాలని కొన్నిదేశాలు విజ్ఞప్తుల చేస్తుంటే, మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్ యుద్ధాన్ని తప్పబడుతున్నాయి.

అయితే, ఇజ్రాయెల్‌కు మద్దతుగా పశ్చిమ దేశాలు క్యూ కడుతుంటే, మరోవైపు అరబ్ దేశాలు హమాస్‌ను సమర్థిస్తున్నాయి.

ఇజ్రాయెల్‌‌తో దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నప్పటికీ అరబ్ దేశాల్లో అశాంతి పెరుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి తమ రాయబారులను వెనక్కి రప్పించాయి.

ఇజ్రాయెల్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపేయాలని అన్ని ఇస్లామిక్ దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి చేసింది.

మరోవైపు అమెరికా, బ్రిటన్, జర్మనీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. యుద్ధంలోనూ సహకారం అందిస్తున్నాయి.

యుద్ధం మొదలై ఇప్పటికే 27 రోజులు గడచిపోయాయి. గాజాలో ఇప్పటి వరకూ దాదాపు 8,700 మంది చనిపోయినట్లు హమాస్ పాలన‌లోని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌లో 1,400 మంది చనిపోయారు.

ఈ యుద్ధానికి అంతమెప్పుడు? హమాస్ చెరలోని బందీల విడుదలెప్పుడు? గాజా నగర ప్రజల జీవనం ఎప్పుడు మళ్లీ గాడిపడుతుంది? వంటి ప్రశ్నలకు ఇప్పుడు ఎవరి దగ్గరా సమాధానం లేదు.

ఇదిలా ఉంటే, సాధారణ పౌరుల రక్షణ, గాజాలో మానవతా సాయం కొనసాగించేందుకు మద్దతుగా అక్టోబర్ 26న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ(యూఎన్ జనరల్ అసెంబ్లీ)లో కాల్పుల విరమణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 120 దేశాలు మద్దతు తెలుపగా, అమెరికా సహా 14 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్ సహా 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

జోబైడెన్ - నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జో బైడెన్ అక్టోబర్ 18న ఇజ్రాయెల్‌లో పర్యటించారు

అండగా అమెరికా

1948లో ఇజ్రాయెల్‌ను మొట్టమొదట దేశంగా గుర్తించింది అమెరికా. గత నెలలో హమాస్ దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించడమే కాకుండా ఇజ్రాయెల్‌కి అండగా ఉంటామని ప్రకటించారు.

మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ను ప్రధాన మిత్రదేశంగా అమెరికా భావిస్తోంది. ఇజ్రాయెల్ భూభాగాన్ని కాపాడే ప్రయత్నాలు అమెరికా విదేశాంగ విధానంలో భాగంగా ఉన్నాయి. అమెరికాలో డెమోక్రాట్లు లేదా రిపబ్లికన్లు ఎవరు అధికారంలో ఉన్నా ఇదే విధానాన్ని కొనసాగించారు.

2020లో ఇజ్రాయెల్‌కి అమెరికా 3.8 బిలియన్ డాలర్లు అంటే, సుమారు 31,640 కోట్ల రూపాయలు సాయం అందించింది. 2017 నుంచి 2028 మధ్య 38 బిలియన్ డాలర్లు (దాదాపు 3,16,398 కోట్లు) ఆర్థిక సాయం అందించే ఒప్పందంపై 2016లో అమెరికా సంతకం చేసింది.

తమ దేశంలో యూదులను స్థిరపరిచేందుకు మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్ సైన్యాన్ని ప్రపంచంలోనే అధునాతన సైన్యంగా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది అమెరికా.

ఫ్రాన్స్ హెచ్చరికలు

యూరప్‌లో అటు యూదులు, ఇటు ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం ఫ్రాన్స్. దాదాపు ఐదు లక్షల మంది యూదులు ఇక్కడ నివసిస్తున్నారు. ముస్లం జనాభా 50 లక్షల వరకూ ఉన్నట్లు అంచనా. యూరప్‌లోని మిగిలిన దేశాలతో పోలిస్తే యూదులు, ముస్లిం సంఖ్య ఫ్రాన్స్‌లోనే ఎక్కువ.

హమాస్ దాడి అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఈ యుద్ధంలో హమాస్ గెలిస్తే ఇజ్రాయెల్‌తో పాటు యూరప్ కూడా ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు. ఈ పోరాటం కేవలం ఇజ్రాయెల్ కోసం మాత్రమే కాదని, యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ భవిష్యత్తు కోసమని మాక్రాన్ చెప్పారు.

పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్‌ను టెర్రరిస్టు సంస్థగా మాక్రాన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సంస్థ ఇజ్రాయెల్ ప్రజల మరణాలను కోరుకుంటోందని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడుల్లో పది మందికి పైగా ఫ్రాన్స్ పౌరులు కూడా మరణించారు. డజన్ల కొద్దీ ఫ్రాన్స్ పౌరులు ఇప్పటికీ కనిపించడం లేదు.

పాలస్తీనాకి అనుకూలంగా తమ దేశంలో నిరసన ప్రదర్శనలపై కూడా ఫ్రాన్స్ నిషేధం విధించింది. ఒకవేళ ఇక్కడ నివసిస్తున్న విదేశీయులు ఆదేశాలను పాటించకపోతే వారి దేశాలకు పంపించేస్తామని ఫ్రాన్స్ హోం మంత్రి గెరాల్డ్ డెర్మవిన్ హెచ్చరికలు కూడా చేశారు.

అయితే, ఐక్యరాజ్యసమితిలో గాజా తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది ఫ్రాన్స్. ఏ కారణంచేతనైనా సాధారణ పౌరులను చంపడాన్ని సమర్థించబోమని తెలిపింది. కాల్పుల విరమణ తీర్మానానికి మద్దతిస్తూనే, హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలని ఫ్రాన్స్ కోరింది.

ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ కూడా హమాస్‌ని విమర్శిస్తూనే ఇజ్రాయెల్‌కి మద్దతుగా నిలిచాయి.

అయతొల్లా అలీ ఖమినే

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమినే

ముస్లిం దేశాలు ఏకమవ్వాలంటున్న ఇరాన్

1948లో ఐక్యరాజ్యసమితి తీర్మానం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇజ్రాయెల్ పొరుగునున్న అరబ్ దేశాలతో పలుమార్లు యుద్ధాలు చేసింది.

మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికాలోని దాదాపు రెండు డజన్లకు పైగా దేశాలకు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. ఆ దేశాల్లో అత్యంత ముఖ్యమైనది ఇరాన్.

ఇజ్రాయెల్‌ ఉనికిని ఇరాన్ ఖండిస్తోంది. పాలస్తీనియన్ల భూభాగాన్ని ఇజ్రాయెల్ అక్రమంగా ఆక్రమిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది.

ఇజ్రాయెల్‌తో నేరుగా సరిహద్దులు లేనప్పటికీ దాని పొరుగు దేశాలైన లెబనాన్, సిరియా, పాలస్తీనాపై ఇరాన్ ప్రభావం ఉంటుంది.

ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడి వెనక ఇరాన్ నేరుగా లేకపోయినా, హమాస్ ఫైటర్స్‌కి శిక్షణ, ఆయుధాలు సమకూర్చడం వంటి వాటిలో ఇరాన్ ప్రధానపాత్ర పోషించి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ యుద్ధంలో హమాస్‌కి బహిరంగంగానే మద్దతు తెలుపుతున్న ఇరాన్, పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పదేపదే ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తోంది.

ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే ముస్లింలను ఎవరూ అడ్డుకోలేరని ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమినే అన్నారు. అలాగే, ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా అన్ని ముస్లిం దేశాలు ఏకం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

''గాజాపై దాడులను ఆపేయాలి. ఇజ్రాయెల్‌కి ఆహారం, చమురు సరఫరాను ముస్లిం దేశాలు వెంటనే నిలిపేయాలి. ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌కి ఆర్థికంగా సహకరించాల్సిన అవసరం లేదు'' అని ఆయన అన్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ

భారత్ వైఖరేంటి?

ఇజ్రాయెల్‌పై దాడి జరిగిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, హమాస్ దాడిని టెర్రరిస్ట్ దాడిగా పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామన్నారు.

చాలా దేశాల మాదిరిగానే భారత్ కూడా రెండు దేశాల ఏర్పాటును సమర్థించింది. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన రెండు దేశాల ఫార్ములా కింద పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే చర్చ జరుగుతోంది. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌తో పాటు తూర్పు జెరూసలెంలోని భాగాలను కలిపి పాలస్తీనాగా ఏర్పాటు చేయాలని 1967లో కాల్పల విరమణ ఒప్పంద సమయంలో ప్రతిపాదనలు వచ్చాయి.

ఇలాంటి నేపథ్యంలో, అక్టోబర్ 26న ఐక్యరాజ్యసమితి గాజా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. భారత విధానం కూడా పశ్చిమ దేశాల తీరులోనే ఉందని చెబుతున్నారు.

చైనా ఏమంటోంది?

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనియన్లకు అనుకూలంగా చైనా ఓటేసింది. రెండు దేశాల ఫార్ములాను చైనా ఉద్ఘాటించింది. పాలస్తీనాను స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఏర్పాటు చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చైనా అభిప్రాయపడింది.

హమాస్‌కు మద్దతిస్తున్న ఇరాన్‌తో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరాన్‌తో సంబంధాల నేపథ్యంలో చైనా కూడా మధ్యవర్తి పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే, చైనా మోదటి నుంచీ పాలస్తీనీయన్లకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చింది. గతంలో మావో జెడాంగ్ హాయంలోనూ పాలస్తీనియన్లకు ఆయుధాలు పంపించింది.

కానీ ఆ తర్వాత ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంది. అయినప్పటికీ పాలస్తీనియన్లకు అనుకూలంగానే కొనసాగుతూ వచ్చింది.

ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఆ దేశ ఉన్నతాధికారులు కూడా పాలస్తీనా స్వతంత్ర దేశ ఏర్పాటును సమర్థించారు.

పాకిస్తాన్

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని పాకిస్తాన్ కనీసం వ్యతిరేకించలేదు. ఇది పాలస్తీనాను సమర్థించినట్లుగానే కనిపిస్తోంది.

"పాకిస్తాన్ పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తుంది. ఇజ్రాయెల్ దళాల హింస, దౌర్జన్యాలను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తోంది'' అంటూ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

అలాగే రెండు దేశాల ఫార్ములాను కూడా సమర్థించింది పాకిస్తాన్. ఇది మిడిల్ ఈస్ట్‌లో శాంతిని నెలకొల్పగలదని, పాలస్తీనా సమస్యకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం న్యాయమైన, సమగ్రమైన పరిష్కారం లభిస్తే మాత్రమే ఈ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ సాధ్యమని పాకిస్తాన్ చెబుతోంది.

రజబ్ తయ్యిప్ ఎర్డోగన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుర్కియే అధ్యక్షుడు రజబ్ తయ్యిప్ ఎర్డోగన్

జోర్డాన్, తుర్కియే

అరబ్ దేశమైన జోర్డాన్ వెస్ట్‌ బ్యాంక్‌తో సరిహద్దు పంచుకుంటోంది. భారీ సంఖ్యలో పాలస్తీనియన్ శరణార్థులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు.

ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు ఈ ప్రాంతం నుంచి భారీగా జనాభా జోర్డాన్‌కు పారిపోయారు. ఈ యుద్ధంలో పాలస్తీనియన్లకు అండగా నిలిచింది జోర్డాన్. అలాగే, రెండు దేశాల ఫార్ములాను సమర్థిస్తోంది.

యుద్ధం ప్రారంభమైన తర్వాత తమ రాయబారిని కూడా ఇజ్రాయెల్‌ నుంచి వెనక్కి రప్పించింది. పెద్దఎత్తున నిరసనల కారణంగా ఇజ్రాయెల్ రాయబారి కూడా స్వదేశానికి వెళ్లిపోయారు.

ఇక, ఇజ్రాయెల్‌ను గుర్తించిన మొదటి ముస్లిం మెజార్టీ దేశం తుర్కియే. 1949 నుంచి ఇజ్రాయెల్‌తో తుర్కియేకి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి.

2002 నుంచి తుర్కియే, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పాలస్తీనా సమస్య గురించి ఇజ్రాయెల్‌పై తుర్కియే ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంది.

గాజాలో పాలస్తీనియన్ నిరసనకారులపై ఇజ్రాయెల్ అణచివేతను వ్యతిరేకిస్తూ 2018లో తుర్కియే తన రాయబారిని వెనక్కి రప్పించింది. నాలుగేళ్ల స్తబ్ధత తర్వాత 2022లో మళ్లీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

పాలస్తీనాకు మద్దతుగా ఇస్తాంబుల్‌లో అక్టోబర్ 28న జరిగిన ర్యాలీలో తుర్కియే అధ్యక్షుడు రజబ్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రసంగించారు. ఈ ర్యాలీలో హమాస్‌ను విముక్తి కోసం పోరాడుతున్న గ్రూపుగా, ఇజ్రాయెల్‌ను యుద్ధ నేరస్తుడిగా ఎర్డోగన్ అభివర్ణించారు.

ఖతర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ

సౌదీ అరేబియా, ఖతార్

సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు గతంలో చర్యలు చేపట్టినా, ఇజ్రాయెల్-హమాస్ వివాదంతో మళ్లీ గాడి తప్పాయి.

ఖతార్ విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. "వివాదాన్ని తీవ్రతరం చేయొద్దని ఖతర్ మరోసారి అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇరువర్గాలు హింసను పూర్తిగా వదిలేయాలి'' అని పేర్కొంది.

ఖతార్‌కు ఇజ్రాయెల్‌తో అధికారిక సంబంధాలు లేకపోయినప్పటికీ చర్చల విషయంలో ఖతార్ ప్రధాన పాత్ర పోషించింది.

ఇప్పుడు ఖతార్ సాయంతో హమాస్ నుంచి బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బందీలను విడిపించే అంశంపై ఖతర్ అధికారులు ఇజ్రాయెల్ రాయబారులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు.

ఇటీవల హమాస్ నలుగురు బందీలను విడుదల చేయడంపై అమెరికా అధ్యక్షుడు, బ్రిటన ప్రధాన మంత్రి ఖతర్‌కు అభినందనలు తెలిపారు.

ఇక లాటిన్ అమెరికన్ దేశమైన బొలీవియా గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యను నిరసిస్తూ ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బహిష్కరించింది. కొలంబియా, చిలీ వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిచేందుకు సిద్ధమయ్యాయి.

ఇవి కూడా చదవండి: