కోవిడ్‌ తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయా, కరోనా వచ్చినవారు పరిగెత్తవద్దని ఆరోగ్యమంత్రి ఎందుకు హెచ్చరించారు?

గుండెపోటు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం, తీవ్రమైన కోవిడ్ బారిన పడిన వారు పరిగెత్తడం, అధికంగా వ్యాయామం చేయడం, కఠిన శ్రమకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ అన్నారు.

నవరాత్రి సమయంలో గుజరాత్‌లో గుండెపోటుతో ప్రజలు మరణించినట్లు వార్తలు వచ్చిన తరుణంలోనే కేంద్ర మంత్రి నుంచి కూడా ఈ ప్రకటన వెలువడింది.

12వ తరగతి విద్యార్థి మృతి విషయం కూడా నవరాత్రుల సమయంలోనే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.

‘‘ఐసీఎంఆర్ ఇటీవల దీనిపై విస్తృత అధ్యయనం చేసింది. ఈ మధ్యకాలంలో తీవ్రమైన కోవిడ్ బారిన పడిన వారు గుండెపోటును తప్పించుకునేందుకు కనీసం ఒక రెండేళ్ల వరకు కఠిన శ్రమ, అధిక వ్యాయామం, పరిగెత్తడం, తీవ్రమైన కసరత్తులకు దూరంగా ఉండాలని ఆ అధ్యయనం తెలుపుతోంది’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ అన్నారు.

దీనికంటే ముందు కూడా మాన్సుక్ మాండవీయ ఒక కార్యక్రమంలో కరోనా-గుండెపోటు అంశం గురించి చర్చించారు.

‘‘కోవిడ్ తర్వాత మనం అకస్మికంగా గుండెపోటు మరణాల కేసులను చూస్తున్నాం. దీనిపై ఐసీఎంఆర్ అధ్యయనం ప్రారంభించింది. వ్యాక్సినేషన్, కో-మార్బిడిటీకి సంబంధించిన డేటా మా దగ్గర ఉంది’’ అని అన్నారు.

దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా వస్తుందని మాండవీయ చెప్పారు.

ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ అనా డోగ్రా, బీబీసీ హిందీతో మాట్లాడుతూ, ‘‘ఐసీఎంఆర్ తన అధ్యయన నివేదికను పూర్తి సమీక్ష కోసం నిపుణులకు అందించింది. సమీక్ష పూర్తయిన తర్వాత అందులోని సమాచారాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది’’ అని అన్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

కోవిడ్‌తో గుండెపోటును ముడిపెట్టడం సబబేనా?

ఐసీఎంఆర్ అధ్యయన నివేదిక ఇంకా బయటకు రాలేదు. కానీ, దీనికంటేముందు దిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రిలో ‘శరీరంపై కరోనా ప్రభావాల’పై ఒక పరిశోధన జరిగింది.

2020-2021లో 135 మందిపై చేసిన ఈ పరిశోధనలో గుండెపై కరోనా ప్రభావం చూపినట్లు తేలింది.

ఈ పరిశోధనలో పాల్గొన్న వారిని నిరంతరం పరిశీలించారు. గుండె మీద కరోనా ప్రభావం తగ్గుతుండటాన్ని ఈ పరిశీలనలో గమనించారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్యుడొకరు బీబీసీతో మాట్లాడారు.

గుండె మీద కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని ఆ డాక్టర్ చెప్పారు.

‘‘వ్యక్తి గుండెలోని విద్యుత్ వ్యవస్థ, కండరాలు, రక్తాన్ని సరఫరా చేసే ధమనులను ప్రభావితం చేస్తుంది. గుండె మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున తీవ్రంగా కరోనా బారిన పడినవారు ఎక్కువగా వ్యాయామాలు చేయొద్దని సూచిస్తున్నారు. అందుకే వారికి కఠిన శ్రమ, కసరత్తులు చేయొద్దని చెబుతున్నారు’’ అని తెలిపారు.

కోవిడ్‌తో బాధపడుతున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరిగినట్లు తమ అధ్యయనంలో తేలినట్లు డాక్టర్ చెప్పారు.

అంటే, కోవిడ్ బారిన పడిన వారికి కచ్చితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందా? అని ఉత్పన్నమవుతున్న ప్రశ్నలకు డాక్టర్ బదులిచ్చారు.

‘‘దీనిపై పెద్ద ఎత్తున అధ్యయనం జరిగి, దాని ఫలితాలు వెల్లడించేవరకు స్పష్టంగా ఏమీ చెప్పలేం’’ అని అన్నారు.

టీకా

ఫొటో సోర్స్, Getty Images

టీకాకు గుండెపోటుకు సంబంధం ఉందా?

కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ చేసిన ప్రకటనను వైద్యులు కూడా సరైనదేనని అంటున్నారు.

తీవ్రంగా కోవిడ్‌ బారిన పడినవారు అధికంగా లేదా కఠోర శ్రమ చేస్తే గుండె మీద ఒత్తిడి పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి వల్ల గుండె సాధారణం కంటే వేగంగా కొట్టుకుంటుందని తెలిపారు.

దీర్ఘకాలంగా కోవిడ్ లక్షణాల నుంచి కోలుకోని వారు ఒక్కసారిగా తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకుండా, నెమ్మదిగా తేలికపాటి వ్యాయామాలు చేయాలని ఆయన చెప్పారు.

కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు తీసుకున్న తర్వాత గుండెపోటు వస్తుందనే భయాలు పెరిగాయి. దీనిపై అందరిలో తీవ్ర చర్చ కూడా జరిగింది.

అయితే, టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటు వచ్చిన కేసులు పెద్దగా లేవని జీబీ పంత్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడైంది.

కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత హార్ట్ ఎటాక్ కేసులు ఎక్కువయ్యాయని చెప్పలేమని వైద్యులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, రాజస్థాన్‌లో 25 లక్షల ఆరోగ్య బీమా పథకం అశోక్ గెహ్లోత్‌కు మళ్లీ అధికారం కట్టబెడుతుందా?
యువత

ఫొటో సోర్స్, Getty Images

గతంలో యువత గుండెపోటు బారిన పడలేదా?

గత రెండు, మూడు దశాబ్దాల క్రితం చూస్తే 40 ఏళ్ల లోపు వారిలో దాదాపు 10 శాతం గుండెపోటు కేసులు నమోదయ్యేవని నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఓపీ యాదవ్ చెప్పారు.

అంతేకాకుండా బైపాస్ సర్జరీలు జరిగే వారిలో కూడా 10 శాతం జనాభా 40 ఏళ్లలోపు వారిదేనని ఆయన వెల్లడించారు.

గతంలోనూ యువతలో గుండెపోటు కేసులు నమోదయ్యేవని చెప్పారు. అయితే, ఇటీవల కాలంలో గుండెపోటుతో కొందరు సెలెబ్రిటీలు చనిపోవడంతో ఈ మధ్య కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయంటూ చర్చ జరుగుతోందని అన్నారు.

గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఊబకాయం వంటి ఇతర వ్యాధులు ఉన్నాయా? వారి లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది? అనే విషయాలను గమనిస్తున్నారా అని డాక్టర్ ఓపీ యాదవ్ ప్రశ్నించారు.

గుండెపోటు

ఫొటో సోర్స్, Getty Images

కరోనా తర్వాత తీవ్ర కసరత్తులు చేయొద్దని ఎందుకు సూచిస్తున్నారు?

తీవ్రమైన కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు, గతంలో తాము చేయనటువంటి భారీ కసరత్తులు, కఠిన శ్రమను వెంటనే చేయకూడదని ఇద్దరు వైద్యులు సూచించారు.

కరోనా కారణంగా రక్తం చిక్కగా మారడంతో పాటు గడ్డ కడుతుందని డాక్టర్ ఓపీ యాదవ్ చెప్పారు.

కోలెస్ట్రాల్ పేరుకుపోయినప్పటి కంటే రక్తం గడ్డకట్టినప్పుడే గుండెపోటు త్వరగా వస్తుందని అన్నారు.

అందుకే కోవిడ్ సమయంలో రక్తాన్ని పల్చగా మార్చడానికి మందులు ఇచ్చారని చెప్పారు.

గుండెలో రక్తం గడ్డకడితే గుండెపోటుకు, మెదడులో ఇలా జరిగితే బ్రెయిన్‌స్ట్రోక్‌కు కారణం అవుతుందని తెలిపారు.

అలాగే, శరీరంలోని వివిధ భాగాల్లో కూడా రక్తం గడ్డకట్టొచ్చని అన్నారు.

కరోనా నుంచి కోలుకున్న ఏడాది లేదా ఏడాదిన్నర తర్వాత నెమ్మదిగా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

వైద్యులు ఇంకా ఏం సిఫార్సు చేస్తున్నారంటే...

  • మీరు మొదట 200మీ. నడకతో మొదలుపెట్టి, తర్వాత కొన్ని రోజులకు 400మీ. నడవండి. క్రమంగా వేగాన్ని పెంచవచ్చు.
  • కఠిన వ్యాయామాలు చేయకూడదు
  • గతంలో ఏదైనా వ్యాయామం లేదా పని చేస్తున్నప్పుడు శ్వాస ఇబ్బంది లేకపోగా, కరోనా తర్వాత అదే వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాసలో ఇబ్బంది తలెత్తితే వెంటనే వైద్యులకు చెప్పాలి.
  • కళ్లకు చీకట్లు రావడం
  • తల తిరగడం
  • శ్వాసలో ఇబ్బందులు
  • ఛాతి నొప్పి

ఒకవేళ గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించినా, పైన చెప్పిన లక్షణాలు కరోనా నుంచి కోలుకున్న తర్వాత నుంచి కనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ వయస్సులో వారైన కచ్చితంగా వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, కఠిన వ్యాయామాల జోలికి పోకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలని అంటున్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: రూఢకోట గ్రామంలో తల్లులకు దడ పుట్టిస్తున్న పసికందుల మరణాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)