ట్యూషన్ టీచర్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని బడా వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి చంపేశారు... మతం రంగు పులిమిన ఈ కుట్రను పోలీసులు ఎలా ఛేదించారు?

ఫొటో సోర్స్, KANPUR POLICE
- రచయిత, అమన్ ద్వివేదీ
- హోదా, లక్నో నుంచి బీబీసీ కోసం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి కొడుకు కిడ్నాప్, హత్య కేసులో నిందితులు మతపరమైన నినాదాలతో తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని యూపీ పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ట్యూషన్ చెప్పేందుకు ఇంటికొచ్చే టీచర్, ఆమె స్నేహితులు వ్యాపారి కొడుకైన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేశారని చెప్పారు.
ట్యూషన్ టీచర్ రచిత వత్స్, ఆమె స్నేహితుడు ప్రభాత్ శుక్లా, అతని స్నేహితుడు శివను అరెస్టు చేసి జైలుకి పంపించారు.
నిందితులు వ్యాపారి నుంచి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మత నినాదాలు
బాలుడి హత్య తర్వాత, రూ. 30 లక్షలు డిమాండ్ చేస్తూ నిందితులు వ్యాపారి ఇంటికి ఒక లేఖ పంపించారు. ఆ లేఖలో అల్లాహ్, అల్లాహో అక్బర్ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు.
నిందితులు ప్రభాత్ శుక్లా, శివ, ట్యూషన్ టీచర్ రచిత వత్స్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే ఒక మతానికి సంబంధించిన పదాలను లేఖలో రాశారని పోలీసులు చెప్పారు.
బాలుడి హత్య కేసులో ముగ్గురికీ ప్రమేయం ఉందని, ఆ తర్వాత అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో డబ్బులు డిమాండ్ చేస్తూ వ్యాపారి ఇంటికి లేఖ పంపించారని తెలిపారు.
లేఖలో రాసిన మతపరమైన నినాదాల గురించి సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
''కాన్పూర్‌లో వస్త్ర వ్యాపారి కొడుకును హత్య చేసి, ఆ కేసును తప్పుదోవ పట్టించేందుకు మతపరమైన నినాదాలు రాయడం చాలా తీవ్రమైన విషయం. ఇలాంటి పోకడలు సమాజానికి, దేశానికి హానికరం. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని ఆయన ట్వీట్‌లో రాశారు.

ఫొటో సోర్స్, KANPUR POLICE
మిస్టరీ ఎలా ఛేదించారు..
రోజూ వెళ్లినట్లుగానే ఆ విద్యార్థి కోచింగ్ కోసం సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లాడని, తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మొదట ఎక్కడికి వెళ్లాడో తెలుసుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు చెప్పారు.
ఆ తర్వాత రాత్రి 9.45 గంటల సమయంలో తమ కొడుకు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు కాన్పూర్‌లోని రాయ్‌పూర్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
బాలుడు సాయంత్రం నాలుగు గంటలకు స్వరూప నగర్‌లోని కోచింగ్ సెంటర్‌కి వెళ్తాడని నిందితుడు ప్రభాత్ శుక్లాకు ముందే తెలుసని పోలీసులు చెప్పారు. ఆ సమయంలోనే అతన్ని కిడ్నాప్ చేసేందుకు ముందుగానే పథకం రచించాడని అన్నారు.
''సోమవారం బాలుడి దగ్గరికి వచ్చి బైక్‌పై ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి జరీబ్ చౌకీ వద్ద బండి ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత డ్రగ్స్ కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు.
ఆ తర్వాత అతన్ని సమీపంలోని తన గదికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసిన తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తూ నిందితుడు వ్యాపారికి లేఖ రాశాడు'' అని పోలీసులు తెలిపారు.
హత్యకు కారణమేంటి?
నిందితుడు ప్రభాత్, అతని ప్రియురాలైన ట్యూషన్ టీచర్ రచిత వత్స్ ఈ మొత్తం కుట్రకు పథకం పన్నారని విచారణలో తేలినట్లు పోలీసులు చెప్పారు.
అసలు ఈ హత్యకు కారణమేంటి? డబ్బులు హత్య తర్వాత ఎందుకు డిమాండ్ చేశాడని పోలీసులను అడిగినప్పుడు వారు సమాధానమిస్తూ ''ట్యూషన్ టీచర్ రచితతో విద్యార్థి సన్నిహితంగా ఉండడాన్ని ప్రభాత్ తట్టుకోలేకపోయాడు. అందుకే ఈ పథకం పన్నాడు. ఆ తర్వాత రచిత, శివ ఇందులో భాగం పంచుకున్నారు'' అని చెప్పారు.
ఇప్పటికే విద్యార్థి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, దాని ద్వారా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, KANPUR POLICE
సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తి
తన కొడుకు కనిపించడం లేదని చెల్లెలు ఫోన్ చేసి చెప్పగానే ఆమె ఇంటికి వచ్చామని బాలుడి మేనమామ చెప్పారు.
స్కూటర్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఒక లెటర్ ఇచ్చి బాలుడి ఇంట్లో ఇవ్వాలని చెప్పాడని సెక్యూరిటీ గార్డ్ చెప్పినట్లు బాలుడి మేనమామ తెలిపారు. సెక్యూరిటీ గార్డు అందుకు అంగీకరించకపోయినా లెటర్ తీసుకెళ్లి ఇవ్వాలని బతిమిలాడినట్టు చెప్పాడని ఆయన చెప్పారు.
ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు స్కూటర్ నంబర్ నోట్ చేసుకున్నాడని చెప్పారు. ఆ నంబర్ ఆధారంగా పోలీసులు స్కూటర్ యజమాని ప్రభాత్ శుక్లాని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఆ లెటర్ ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తులు ప్రభాత్ శుక్లా, అతని స్నేహితుడు శివ అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో ఆగ్రహం చెందిన కాన్పూర్‌కి చెందిన వస్త్ర వ్యాపారులు, కాన్పూర్ టెక్స్‌టైల్ కమిటీ అధికారులు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు.
''నిందితులకు కఠిన శిక్ష విధించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని డిమాండ్ చేస్తున్నాం. వాళ్లని ఉరి తీయాలి'' అని బాలుడి మేనమామ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ది గ్రేట్ ట్రైన్ రాబరీ: రైల్లో చొరబడి 120 డబ్బు సంచులను దోచుకెళ్లారు.. థ్రిల్లర్ సినిమాను తలదన్నే ఈ దోపిడీ ఎలా జరిగింది?
- కొండచిలువ నూనెతో పక్షవాతం చికిత్సకు ప్రయత్నం, చివరికి ఏం జరిగిందంటే....
- సైకిల్‌పై వెళ్తుంటే చున్నీ లాగిన ఆకతాయి, రోడ్డుపై పడి చనిపోయిన విద్యార్థిని, అసలేం జరిగిందంటే..
- వాఛాతీ: 30 ఏళ్ళనాటి ఈ రేప్ కేసులో అసలేం జరిగింది? పోలీసులకు వేసిన శిక్షలపై హైకోర్టు ఏం చెప్పింది?
- శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక కండోమ్ లేకుండా సెక్స్ చేశారనే కేసులో కోర్టు ఏం చెప్పిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














