తెలంగాణలో బీసీని సీఎం చేస్తామన్న బీజేపీ... తెలుగు ముఖ్యమంత్రుల్లో ఏ కులం వారు ఎందరున్నారు?

ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి, రోశయ్య, పీవీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి, రోశయ్య, పీవీ
    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘అబ్ భారతీయ్ జనతా పార్టీ కో ఆశీర్వాద్ దీజియే.. భాజపాకీ సర్కార్ బనాయియే, భాజపాకా అగలా తెలంగాణాకా ముఖ్యమంత్రీ బేక్‌వర్డ్ కాస్ట్ సే హోగా’

అక్టోబర్ 27న సూర్యాపేటలో ‘జన గర్జన’ పేరిట బీజేపీ నిర్వహించిన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ఓటర్లకు ఇచ్చిన మాట ఇది.

ఆయన మాటలను మక్కీకి మక్కీగా తెలుగులో చెప్పుకొంటే ‘భారతీయ జనతా పార్టీని ఈసారి ఆశీర్వదించండి, భాజపా సర్కారు వచ్చేలా చేయండి, తెలంగాణలో బేక్‌వర్డ్ కాస్ట్(బీసీ) నుంచి ముఖ్యమంత్రిని చేస్తాం’ అని అర్థం.

కేంద్ర ప్రభుత్వంలో, బీజేపీలో ప్రధాని మోదీ తరువాత అంతటి ప్రాధాన్యమున్న నేతగా చెప్పుకొనే అమిత్ షా నోటి నుంచి వచ్చిన ఈ మాట తరువాత తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

బీజేపీ నాయకులు, కార్యకర్తలు దీనిపై ఉత్సాహంగా మాట్లాడుతుంటే... ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

బీజేపీలో సీఎం అయ్యే చాన్స్ అంటూ కొందరు బీసీ నాయకుల పేర్లూ ప్రస్తావనకు వస్తున్నాయి.

బీజేపీ తెలంగాణలో అధికారం దక్కించుకునే స్థాయిలో సీట్లు సాధిస్తుందా.. సీట్లు సాధిస్తే ఇచ్చిన మాట ప్రకారం బీసీని సీఎం చేస్తుందా అనేది డిసెంబర్ 3న రాబోయే ఫలితాల తరువాతే తేలుతుంది.

కానీ, తెలుగు నేలన ముఖ్యమంత్రి పీఠం బీసీలకు ఎప్పుడైనా దక్కిందా?

ఉమ్మడిగా ఉన్నప్పుడైనా, వేరుపడిన తరువాతైనా సీఎం కుర్చీ ఏ కులాల చేతిలో ఉంది?

ఏ కులం నేతలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రులయ్యారు?

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ సంస్థానం నిజాం రాజు పాలనలో ఉండేది. సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’ తరువాత భారతదేశంలో చేరింది.

అలా విలీనమైన సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా ప్రకటించి ముల్లాత్ కల్లాడి వెల్లోడీ(ఎంకే వెల్లోడీ) అనే సివిల్ సర్వీసెస్ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించింది అప్పటి ప్రభుత్వం.

ప్రస్తుత తెలంగాణ ప్రాంతం అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోనే భాగం.

వెల్లోడీ 1950 నుంచి 1952 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఆయన తరువాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు.

వీరిద్దరిలో వెల్లోడీ అసలు తెలుగువారు కాదు. ఆయన తమిళనాడుకు చెందిన అధికారి.

ఇక హైదరాబాద్‌ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు బ్రాహ్మణ కులానికి చెందినవారు.

1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినంత వరకు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బూర్గుల ఉన్నారు.

కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.

ఆ తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా పునర్వ్యవస్థీకరించారు. దాంతో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది.

ఈ క్రమంలో 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు అనేక మంది నేతలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

Neelam Sanjeeva Reddy

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీలం సంజీవరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందున్న ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారిలో ప్రకాశం బ్రాహ్మణ కులానికి, గోపాలరెడ్డి రెడ్డి కులానికి చెందినవారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి. ఆయన తరువాత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు.

సంజీవరెడ్డి రెడ్డి కులానికి చెందినవారు కాగా సంజీవయ్య దళితులు. సంజీవయ్య తరువాత నీలం సంజీవరెడ్డి రెండోసారి సీఎం పదవి చేపట్టి 1964 ఫిబ్రవరి వరకు కొనసాగారు.

అనంతరం 1971 వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి, 71 నుంచి 73 వరకు పీవీ నరసింహరావు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.

వీరిలో కాసుది రెడ్డి కులం కాగా పీవీ బ్రాహ్మణ కులానికి చెందినవారు.

ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయిన తొలి తెలంగాణ ప్రాంత నేత పీవీ నరసింహరావు.

అనంతరం 1973 జనవరి నుంచి డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింది. రాష్ట్రపతి పాలన ముగిసిన తరువాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు.

వెంగళరావు శ్రీకాకుళంలో జన్మించినప్పటికీ ఆయన రాజకీయ జీవితమంతా ఖమ్మం కేంద్రంగానే సాగింది. వెంగళరావు వెలమ కులానికి చెందిన నాయకుడు.

ఆయన తరువాత తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు మర్రి చెన్నారెడ్డి, టంగుటూరు అంజయ్య సీఎం అయ్యారు.

వీరిలో మర్రి చెన్నారెడ్డిది రెడ్డి కులం కాగా టంగుటూరు అంజయ్య ఏ కులానికి చెందినవారనే విషయంలో వేర్వేరు వాదనలున్నాయి. ఆయనది గౌడ కులమని, దళితులని, రెడ్డి అనే వాదనలున్నాయి.

అయితే, టంగుటూరి అంజయ్య ఓ సందర్భంలో తన కులం గురించి తానే స్పష్టత ఇచ్చారని సీనియర్ జర్నలిస్ట్ మెరుగుమాల నాంచారయ్య చెప్పారు.

తాను రెడ్డి కులానికి చెందినవాడినని.. తన తండ్రి, తల్లిది రెడ్డి కులమేనని అంజయ్యే స్వయంగా అప్పట్లో వెల్లడించారని నాంచారయ్య గుర్తు చేశారు.

NTR

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్టీ రామారావు

అంజయ్య తరువాత 1982లో ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు భవనం వెంకట్రామి రెడ్డి, 1982-83 కాలంలో కోట్ల విజయభాస్కర రెడ్డి, 1983-84 కాలంలో ఎన్టీఆర్, 1984లో కొద్ది రోజులు నాదెండ్ల భాస్కర రావు, ఆ తరువాత 1989 వరకు మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

వీరిలో భవనం, కోట్ల రెడ్డి కులానికి చెందిన నాయకులు కాగా ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కరరావులు కమ్మ కులానికి చెందినవారు.

1990 నుంచి 95 మధ్య కోట్ల విజయభాస్కర రెడ్డి, ఎన్టీఆర్‌లు మళ్లీ సీఎంలుగా పనిచేశారు.

అనంతరం 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు.

వీరిలో చంద్రబాబుది కమ్మ కులం కాగా వైఎస్ రెడ్డి కులానికి చెందిన నాయకుడు.

2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆయన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. రోశయ్య వైశ్య కులానికి చెందినవారు.

రోశయ్య తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రెడ్డి కులానికి చెందిన నాయకుడు. 2014లో రాష్ట్రం విడిపోయేవరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

KCR

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేసీఆర్

2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ వెలమ కులానికి చెందినవారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 10 మంది రెడ్డి నేతలు, ముగ్గురు కమ్మ నేతలు, ఇద్దరు వెలమ నేతలు.. బ్రాహ్మణులు, వైశ్యులు, దళితులు ఒక్కొక్కరు చొప్పున ముఖ్యమంత్రులయ్యారు.

ఏపీలో ముఖ్యమంత్రుల కులాలు

ఫొటో సోర్స్, bbc

దక్షిణాదిలో ఒక్క బీసీ సీఎం కూడా లేని రాష్ట్రం

దక్షిణ భారతదేశంలో బీసీలు ముఖ్యమంత్రులు కానిది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనేనని నాంచారయ్య చెప్పారు.

కేరళలో ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్, అంతకుముందు అచ్యుతానందన్, ఆర్.శంకర్ వంటివారు బీసీలేనని చెప్పారు.

తమిళనాడులో అన్నాదురై, కరుణానిధి, స్టాలిన్, పన్నీర్ సెల్వం, పళనిస్వామి వంటివారంతా బీసీ కులాలకు చెందినవారేనని చెప్పారు నాంచారయ్య.

కర్ణాటకలో బంగారప్ప, వీరప్ప మొయిలీ వంటివారు వృత్తులున్న బీసీ కులాలకు చెందినవారని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కానీ బీసీలకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదని ఆయన తెలిపారు.

దామోదరం సంజీవయ్య

ఫొటో సోర్స్, Congress Party

ఫొటో క్యాప్షన్, దామోదరం సంజీవయ్య

దళితుడికి అవకాశం వచ్చినా..

1960లో దళిత వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయినప్పటికీ రెండేళ్లు మాత్రమే పదవిలో ఉన్నారు.

సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1962లో ఎన్నికలు జరిగాయి.

ఆ ఎన్నికలలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ పార్టీ మళ్లీ నీలం సంజీవరెడ్డికి అవకాశం కల్పించి సంజీవయ్యను పక్కనపెట్టింది.

కల్లు గీత కార్మికుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కల్లు గీత కార్మికుడు

జనాభాలో 50 శాతం బీసీలున్నా

జనాభా పరంగా తెలుగు నేల బీసీలు 50 శాతానికి పైగానే ఉన్నప్పటికీ రాజకీయ చైతన్యం ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే తక్కువేనని నాంచారయ్య అభిప్రాయపడ్డారు.

వివిధ పార్టీలలో బీసీ నాయకులకు పదవులు లభించినా ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరూ ఎదగలేదని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని బీసీ కులాల నుంచి నాయకులుగా ఎదిగినా వారంతా ప్రాంతీయ వెనుకబాటుతనం కారణంగా బీసీలే తప్ప సామాజిక, ఆర్థిక స్థాయి వారిది భిన్నమని నాంచారయ్య అభిప్రాయపడ్డారు. వృత్తి కులాల నుంచి ఎదిగిన నేతలు తక్కువేనన్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు గౌతు లచ్చన్న, అనగాని భగవంతరావు వంటివారు పెద్ద నాయకులని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి, రఘువీరారెడ్డి వంటి బీసీ నాయకులు ఎక్కువ కాలం పాటు ప్రభావం చూపారన్నారు.

1978లో నిజామాబాద్‌కు చెందిన మున్నూరు కాపు నేత గడ్డం రాజారాం ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారని, చివరి నిమిషంలో కాంగ్రెస్(ఐ) అధిష్ఠానం నచ్చజెప్పడంతో మర్రి చెన్నారెడ్డి సీఎం కావడానికి ఆయన మార్గం సుగమం చేశారని నాంచారయ్య గుర్తు చేశారు.

వీడియో క్యాప్షన్, తెలుగు ముఖ్యమంత్రుల్లో ఏ కులం వారు ఎందరున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)