ఆంధ్రప్రదేశ్‌లో కరవు తీవ్రతను ప్రభుత్వం దాస్తోందా? వాస్తవాలు ఏమిటి?

కరవు

ఫొటో సోర్స్, Andhra Pradesh Raithu Sangham

ఫొటో క్యాప్షన్, ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో సాగునీరు లేక ఎండిన పొలాల్లో బండి నడిపి రైతుల నిరసన
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

"నిరుడు పత్తి, మిరప పంటలు బాగా పండాయి. మాకు పని కూడా దొరికేది. ఈసారి వర్షాలు లేక పంటలు వేయలేదు. మాకు పనుల్లేవు. అందుకే బేల్దారి పనికోసం హైదరాబాద్ వచ్చేశాను. సంక్రాంతి వరకు ఈసారికి అంతే. నేను, నా భార్య కూడా వచ్చేశాం. పిల్లలు మాత్రం మా పెద్దోళ్లతో అక్కడే ఉన్నారు. ప్రభుత్వ సాయం ఏమీ అందలేదు. అందుకే పొట్ట గడుపుకోవడానికి వలస తప్పడం లేదు" అంటూ కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన పి. అర్జునుడు వాపోయారు.

8, 6 తరగతులు చదువుతున్న వారి పిల్లలు ఊళ్లో ఉండగా, తల్లిదండ్రులు మాత్రం పనుల కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. ఆ గ్రామం నుంచి సుమారుగా 20 కుటుంబాల వారు ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేసుకుంటున్నట్టు ఆయన బీబీసీకి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరవు పరిస్థితుల తీవ్రతను ఇది సూచిస్తోంది.

ఉపాధి దొరక్కపోవడంతో, వర్షాభావ మండలాల నుంచి పలువురు దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

తగినన్ని వానల్లేక ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రైతులు అవస్థలు పడుతున్నారు.

మరికొన్ని ప్రాంతాల్లో వానాకాలం చివరి నుంచే తాగునీటి ఎద్దడి మొదలైంది.

నిబంధనల ప్రకారం అక్టోబర్ ఆఖరు నాటికి వర్షాభావం ఏర్పడిన ప్రాంతాలను కరవు మండలాలుగా ప్రకటించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా కరవు సహాయ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31 రాత్రి కరవు మండలాలను ప్రకటించింది.

103 మండలాల్లో కరవు సమస్య ఉన్నట్టు గుర్తించింది. 80 మండలాల్లో తీవ్రమైన, 23 మండలాల్లో ఓ మోస్తరు కరవు ఉందంటూ గెజిట్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో కరవు సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం అరకొరగా కరవు మండలాలను గుర్తించి చేతులు దులుపుకుంటోందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఏపీలో మొత్తం మండలాల సంఖ్య 680.

కరవు

సుమారు 25 లక్షల ఎకరాల్లో సాగని సాగు

రాష్ట్రంలో ఖరీఫ్‌లో సాధారణంగా సగటున 72 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారు. ఈసారి సుమారు 25 లక్షల ఎకరాల్లో సాగు ముందుకు సాగడం లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలు కూడా కరవు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత, కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సరఫరా సమస్య ఏర్పడుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన వివిద గ్రామాల్లో తాగునీటి కోసం అక్టోబర్ నెలలోనే ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చింది.

కొన్ని ప్రాంతాల్లో ఎండిపోతున్న పత్తి, పొగాకు, మిరప వంటి పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

కృష్ణా డెల్టాలో వరి సాగుదారులకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. వరి పొలాలు బీటలు వారుతుండటంతో ఏలూరు, పల్నాడు జిల్లాల్లో కూడా రైతులు ఆవేదనతో కనిపిస్తున్నారు.

కరవు కారణంగా సాగు లేక, ఉపాధి లభించని కూలీలు వలస వెళ్లాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరిగాయి.

కృష్ణా డెల్టాలో నెర్రలు బారిన వరి పొలం

ఫొటో సోర్స్, Andhra Pradesh Raithu Sangham

ఫొటో క్యాప్షన్, కృష్ణా డెల్టాలో నెర్రలు బారిన వరి పొలం

ప్రభుత్వం లిస్టులో మా మండలం లేదు: రైతు

పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని వర్షాభావంతో దెబ్బతిన్న రైతులు వాపోతున్నారు.

"వర్షాలు సహకరించలేదు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయై ఉంటే మా పొలాలకు గోదావరి నీరు వచ్చేది. గోదావరి నదీ జలాలను పంట పొలాలకు మళ్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. మా కళ్లెదురుగా గోదారి నీళ్లు సముద్రం పాలవుతుంటే, మా భూములు మాత్రం బీటలు వారిపోతున్నాయి. 4 ఎకరాల భూమి కౌలుకి చేస్తున్న నేను లక్షా యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు పొలమంతా ఎండిపోయింది. కరవు మండలంగా ప్రకటించి సాయం చేస్తారని ఆశిస్తున్నాం. కానీ, ప్రభుత్వం ప్రకటించిన లిస్టులో మా మండలమే కాకుండా మా జిల్లాలో ఒక్క మండలం కూడా లేదు" అంటూ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమ్మెటవారి గూడెం గ్రామానికి చెందిన రైతు చిట్టూరి అంజిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కరవు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.

కరవు

9 జిల్లాల్లోనే సగటుకు చేరువగా వర్షపాతం

నైరుతితో పాటుగా, ఈశాన్య రుతుపవనాలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఏపీలో నవంబర్ 1 నాటికి అధికారిక లెక్కల ప్రకారమే 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కేవలం 9 జిల్లాల్లో మాత్రమే సగటు వర్షపాతానికి చేరువలో కనిపిస్తోంది.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వంటి చోట్ల సగటు వర్షపాతంలో సగం కన్నా తక్కువగా నమోదైంది.

రాష్ట్రవ్యాప్త సగటు 742.22 మి.మీ వర్షం కురియాల్సి ఉండగా ఈసారి కేవలం 501.57 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదయ్యింది. అంటే 32.42 శాతం లోటు వర్షపాతం ఉంది.

లోటు వర్షపాతం కారణంగా ప్రధాన నదులు కూడా వెలవెలబోతున్నాయి. గోదావరి మినహా కృష్ణా, తుంగభద్ర, పెన్నా వంటి నదులలో ప్రవాహం కనిపించడం లేదు.

2018 తర్వాత గడిచిన అయిదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారి. అంతకుముందు వరుసగా 2015 నుంచి 2018 వరకు ఏటా కరవు సమస్య ఉండేది. కరవు మండలాలను ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చేది.

ఈసారి లోటు వర్షపాతం మూడోవంతు ఉండటంతో సమస్య తీవ్రంగా కనిపిస్తోంది.

కరవు

ఆ 2 మండలాలు తప్ప కోస్తాలో కరవే లేదా?

కరవును గుర్తించడానికి నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అందులో సగటు వర్షపాతం 20 శాతం కన్నా తగ్గితే ఆ ప్రాంతాన్ని కరవుగా గుర్తించాల్సి ఉంటుంది.

మండలాన్ని యూనిట్‌గా తీసుకొని కరవుని కొలుస్తారు. ఆ మండలం పరిధిలో ఖరీఫ్‌లో పంటల విస్తీర్ణం 50 శాతం తగ్గినా కరవుగా ప్రకటించాల్సి ఉంటుంది.

వర్షాల సీజన్‌లో కనీసం 20 రోజుల పాటు వరుసగా వర్షం ఛాయలు కనిపించకపోతే కరవు మండలంగా గుర్తించాలి. ఆ మండలం పరిధిలో వ్యవసాయ దిగుబడులు 50 శాతం తగ్గినా కరవు ప్రాంతం అవుతుంది.

వీటిని పరిగణనలోకి తీసుకుని కరవు మండలాలు ప్రకటించాల్సి ఉంటుంది. కానీ, ఏపీలో ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 22, నంద్యాల జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 28, సత్యసాయి జిల్లాలో 7, అన్నమయ్య జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో రెండింటిని తీవ్ర కరవు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది.

వాటితో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, నంద్యాల జిల్లా 1, అన్నమయ్య జిల్లాలో 2, చిత్తూరు జిల్లా 2, సత్యసాయి జిల్లాలో 14 మండలాలను ఓ మోస్తరు కరవు మండలాలుగా ప్రభుత్వం పేర్కొంది.

మొత్తం 80 తీవ్ర కరవు మండలాలు, మరో 23 ఓ మోస్తరు కరవు మండలాలు అంటూ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది.

అదే సమయంలో వర్షపాతం వివరాల ప్రకారం చూస్తే ఏపీలోని 680 మండలాలకుగాను సుమారు 300కి పైగా మండలాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది.

అయినప్పటికీ రాయలసీమ మినహా మిగిలిన కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు గానూ కేవలం ఎన్టీఆర్ జిల్లాలో రెండు మండలాలు మినహా కరవు మండలాలు జాబితాలో లేవు.

కరవు మండలాల సంఖ్యలో కోత తగదు: రైతు సంఘం

2019లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కరవు మండలాలు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబునాయుడి పాలనలో కరవు సమస్య వస్తుందని పదే పదే విమర్శించిన వైసీపీ పాలనలో కూడా అలాంటి సమస్య ఉత్పన్నం కావడంతో రాజకీయంగానూ ఈ కరవు ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

అయినప్పటికీ అధికారిక జాబితాలో ఉన్న కరవు మండలాలు అరకొరగానే ఉన్నట్టు ఏపీ రైతు సంఘం అంటోంది. సెప్టెంబర్ నెలలో పంటకాలం దాటిపోయిన తర్వాత కురిసిన వర్షాలను కూడా లెక్కించి, కరవు మండలాల సంఖ్యలో కోత పెట్టడం తగదని చెబుతోంది.

"రాష్ట్రంలో మూడోవంతు మండలాల్లో దుర్భిక్షం ఉంది. పంటలు పండటం లేదు. కూలీలకు ఉపాధి లేదు. ప్రభుత్వం ప్రమాణాలను అనుసరించి కనీసం 319 మండలాలను కరవు జాబితాలో చేర్చాల్సి ఉంది. అందులో మూడో వంతు మండలాలను మాత్రమే కరవు మండలాలుగా గుర్తించడం విడ్డూరం. కరవు ఉందనే విషయాన్ని గుర్తించడానికి కూడా ఇంత ఆలస్యం చేస్తే ఇక ఆయా మండలాల్లో సహాయక చర్యలకు ప్రభుత్వం ఏమాత్రం సిద్దమవుతుందన్నది అంతుబట్టడం లేదు" అంటూ ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కృష్ణయ్య వ్యాఖ్యానించారు.

కరవు బాధితులను ఆదుకునేందుకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, ఉపాధి హామీ పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని ఆయన కోరారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి

ఫొటో సోర్స్, Kakani Govardhan Reddy/fb

ఫొటో క్యాప్షన్, వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

అన్నీ పరిశీలించే నిర్ణయం: మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

కరవు మండలంగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలకు అనుగుణంగా సబ్సిడీపై విత్తనాలు, పశుగ్రాసం పంపిణీ, తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు, కరవు సహాయ నిధి పంపిణీ వంటి వివిధ రూపాల్లో స్పందించాలి.

"అన్ని పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్నూలు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో కరవు తీవ్రంగా ఉంది. ఆశించిన మేరకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సమస్య ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే కరవు మండలాలు గుర్తించాం. ముందస్తు చర్యలు తీసుకున్నాం. తాగునీటి ఎద్దడి రాకుండా చూస్తాం. రైతాంగానికి మా ప్రభుత్వం అండగా ఉంటుంది" అంటూ ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.

ప్రకృతి విపత్తుల్లో రైతులకు అండగా నిలవడంలో జగన్ ప్రభుత్వం ఓ మార్గదర్శిగా నిలుస్తోందని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: కంచె కోసం కాశీ నుంచి తెచ్చిన మొక్క లక్షలు తెచ్చిపెడుతోంది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)