బాల్‌ఫోర్ డిక్లరేషన్: ఆ 67 పదాల ఉత్తరమే ఇజ్రాయెల్ ఏర్పాటుకు, దశాబ్దాల హింసకు కారణమా?

ఫొటో సోర్స్, BRIDGEMAN VIA GETTY IMAGES
ఒక చిన్న కాగితం మీద రాసిన 67 పదాలే ఆధునిక ప్రపంచానికి కొరకరాని కొయ్యగా మారిన సంఘర్షణకు ఆజ్యం పోసిందా?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి.
ఈ పోరులో ఇప్పటికే ఇజ్రాయెలీ పౌరులు 1400 మంది వరకు చనిపోయారు. గాజాలో మృతుల సంఖ్య 8,500 దాటినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సంఘర్షణ 106 ఏళ్ళ కిందటి డిక్లరేషన్‌తో మొదలైంది. అదే బాల్‌ఫోర్ డిక్లరేషన్.
ఈ చరిత్రాత్మక పత్రం ఇజ్రాయెల్ ఏర్పాటుకు మార్గం సుగమం చేయడంతో పాటు, మధ్యప్రాచ్య చరిత్రను శాశ్వతంగా మార్చివేసింది.

ఫొటో సోర్స్, UNIVERSAL HISTORY ARCHIVE/GETTY IMAGES
నవంబర్ 2, 1917
ఆ రోజు నవంబర్ 2, 1917.
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది.
‘పాలస్తీనాలో యూదుల మాతృభూమిని’ ఏర్పాటు చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం మొదటిసారిగా మద్దతు తెలిపింది. అప్పట్లో బ్రిటన్ ప్రభుత్వానికి పాలస్తీనా ప్రాంతంపై నియంత్రణ ఉండేది.
అంటే, దీనర్థం పాలస్తీనా ప్రాంత పరిపాలన అంతా బ్రిటిష్ వారి చేతిలో ఉందని కూడా.
ఓ పక్క నేటి ఆధునిక ఇజ్రాయెల్ ఏర్పడటానికి బాల్‌ఫోర్ డిక్లరేషన్‌ను ఇజ్రాయెలీలు పునాదిగా భావిస్తుండగా, అదే డిక్లరేషన్‌ను కొంతమంది అరబ్బులు ద్రోహంగా పరిగణిస్తున్నారు.
అయితే, ఒట్టోమాన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అరబ్బులు బ్రిటన్‌కు మద్దతు తెలపడం కూడా బాల్‌ఫోర్ ఇలాంటి లేఖ రాయడానికి కారణమై ఉండవచ్చు.
బాల్‌ఫోర్ డిక్లరేషన్ తరువాత దాదాపు లక్షమంది యూదులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, PHOTO12/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES
బాల్ఫోర్ డిక్లరేషన్‌లో ఏముంది?
డియర్ లార్డ్ రోత్‌షీల్డ్,
ప్రభుత్వం తరపున ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. యూదులు ఆకాంక్షలను కేబినెట్ ముందుకు తీసుకురాగా, కేబినెట్ దానిని ఆమోదించింది.
‘‘యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం యూదుల కోసం పాలస్తీనాలో ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు సుముఖంగా ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. దీనివలన పాలస్తీనాలో నివసిస్తున్న యూదేతరులకు, అలాగే ప్రపంచంలోని మిగతాదేశాలలోని యూదుల రాజకీయ, మతపరమైన హక్కులపై ఎటువంటి వివక్ష ఉండదు’’
ఈ నిర్ణయాన్ని మీరు జియోనిస్టు సమాఖ్యకు తెలియజేస్తే నేనెంతో రుణపడి ఉంటాను.
మీ,
ఆర్ధర్ జేమ్స్ బాల్ఫోర్

ఫొటో సోర్స్, UNIVERSAL HISTORY ARCHIVE/GETTY IMAGE
ఎవరీ అర్థర్ జేమ్స్ బాల్‌ఫోర్
ఆర్థర్ జేమ్స్ బాల్‌ఫోర్ రాసిన ఈ డిక్లరేషన్ ఆయన పేరుతోనే బాల్‌ఫోర్ డిక్టరేషన్‌గా ప్రసిద్ధి చెందింది.
ఆయన అప్పటి ప్రధాని డేవిడ్ లాయ్డ్ జార్జి కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా ఉన్నారు.
బ్రిటన్‌లోని సంపన్నవర్గానికి చెందిన ఆర్థర్ జేమ్స్ బాల్ఫోర్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తన చదువును పూర్తి చేశారు.
కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధిగా ఆయన పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.
స్కాట్లాండ్‌లో జన్మించిన బాల్ఫోర్ బ్రిటన్‌కు 1902 నుంచి 1905 మధ్య ప్రధానిగా కూడా ఉన్నారు.
ఆయన బ్రిటన్ విదేశాంగ విధానానికి ఒక రూపును ఇవ్వడానికి ఎక్కువ సమయం గడిపారు.
బ్రిటన్ ప్రభుత్వం యూదులకు బహిరంగంగానే మద్దతు తెలుపుతోందనడానికి బాల్‌ఫోర్ ప్రకటనే ఉదాహరణ.
19వ శతాబ్దం చివరిభాగంలో యూరప్‌లో జియోనిజం ఓ రాజకీయ ఆలోచనగా తెరపైకి వచ్చింది.
ఈ ఆలోచనకు మద్దతుగా నిలిచేవారందరూ పాలస్తీనా ప్రాంతంలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఉండాలని కోరుకున్నారు.
పాలస్తీనాను పురాతన ఇజ్రాయెల్ మాతృభూమిగా యూదులు విశ్వసించేవారు.
డిక్లరేషన్ కోసం వార్‌కేబినెట్‌ను సమావేశపరిచిన ఘనత బాల్ఫోర్‌కే దక్కింది.
ఈ డిక్లరేషన్ కోసం ఆయన బ్రిటన్‌లోని ప్రసిద్ధ యూదు నేతలు చైమ్ వైజ్‌మాన్, లియోనల్ వాల్టర్ రోత్‌షీల్డ్ మద్దతు పొందారు.
బాల్ఫోర్‌ను క్రిస్టియన్ యూదుడని చాలామంది నమ్మేవారు.
బైబిల్ పాతనిబంధనలలోని యూదుల చరిత్ర నుంచే బాల్ఫోర్‌కు యూదుల రాజ్యస్థాపనపై ఆసక్తి ఏర్పడిందని కొందరంటారు.
అయితే, రాజకీయప్రయోజనాలు పొందేందుకు ఇజ్రాయెల్ ఏర్పాటుకు బాల్ఫోర్ ఆసక్తి చూపారని కొంతమంది నమ్ముతున్నారు.

ఫొటో సోర్స్, ARCHIV HUBMANN/IMAGNO/GETTY IMAGES
లయోనల్ వాల్టర్ రోత్‌షీల్డ్ ఎవరు?
బాల్‌ఫోర్ రాసిన లేఖను లయోనల్ వాల్టర్ రోత్‌షీల్డ్ లండన్‌లోని తన ఇంటిలో అందుకున్నారు.
బాల్‌ఫోర్ ఈ చరిత్రాత్మక లేఖను వాల్టర్ ఇంటి చిరునామాకే పంపారు.
బ్రిటన్‌లో ఆ సమయంలో వాల్టర్ శక్తిమంతమైన బ్యాంకింగ్ వ్యాపార కుటుంబానికి చెందినవారే కాకుండా, బ్రిటన్‌లో నివసించే యూదు కమ్యూనిటీకి ప్రసిద్ధ నేతగానూ ఉన్నారు.
పాలస్తీనాలో యూదురాజ్యం ఏర్పడటానికి భారీగా సహాయ సహకారాలు అందించిన అతిపెద్ద సంపన్న కుటుంబాలలో రోత్‌షీల్డ్ కుటుంబం ఒకటి.
19వ శతాబ్దం చివరిలో వాల్టర్ కుటుంబానికే చెందిన ఎడ్మండ్ రౌత్‌షీల్డ్ పాలస్తీనాలో యూదుల సెటిల్మంట్స్ కోసం పెద్దఎత్తున భూమిని కొనుగోలు చేశారు.
ఆ సమయానికి ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్న వ్యాపార కుటుంబాలలో ఒకటైన రౌత్‌షీల్డ్ కుటుంబం అందించిన విరాళాలు భారీగా ఉండేవి.
ఈ ఉదారత కారణంగానే ఆయనను గొప్పశ్రేయోభిలాషిగా పిలిచేవారు. ఇజ్రాయెలీ జాతినిర్మాణంలో ఈ కుటుంబం కీలక పాత్ర పోషించింది.

ఫొటో సోర్స్, CULTURE CLUB/BRIDGEMAN VIA GETTY IMAGES
బాల్ఫోర్ డిక్లరేషన్‌కు సంబంధించిన సమాచారంతో కూడిన లేఖను లయోనల్ వాల్టర్ రోత్‌షీల్డ్‌కు బాల్‌ఫోర్ రాయడంతో ఆయన ప్రాముఖ్యం బాగా పెరిగిపోయింది.
ఈ లేఖ స్టువర్ట్ శామ్యూల్‌కు కాకుండా రౌత్‌షీల్డ్‌కు ఎందుకు పంపారని చాలామంది ఆశ్చర్యపోయారు.
బ్రిటీష్ యూదుల ‘బోర్డు ఆప్ డిప్యూటీస్’కు స్టువర్ట్ శామ్యూల్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ సంస్థ బ్రిటన్‌లో యూదులకు అధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తోంది.
అయితే, అప్పట్లో బోర్డు ఆఫ్ డిప్యూటీస్‌లో జియోనిజంపై బ్రిటీష్ యూదులలో భిన్నాభిప్రాయాలు ఉండేవి.
కొందరు దీనిని సమర్థిస్తే... మరికొందరు వ్యతిరేకించేవారు. రౌత్‌షీల్డ్‌కు ఆర్థర్ జేమ్స్ బాల్‌ఫోర్‌తో నేరుగా సంబంధాలు ఉండేవి.
దీంతో, ఈ లేఖను రౌత్‌షీల్డ్‌కు పంపాలని బాల్‌ఫోర్ నిర్ణయించుకున్నారు.
ఈ డిక్లరేషన్‌ను రూపొందించడంలో రౌత్‌షీల్డ్ వ్యక్తిగత పాత్ర కూడా ఉందనే ప్రచారం ఉంది. అయితే, దీనిని ధ్రువీకరించే ఆధారాలేవీ లేవు.
కొన్నేళ్ళ తరువాత 1925లో బ్రిటిష్ యూదుల ‘బోర్డ్ ఆఫ్ డిప్యూటీస్’కు రౌత్‌షీల్డ్ చైర్మన్ అయ్యారు.

ఫొటో సోర్స్, PHOTO BY HISTORY & ART IMAGES VIA GETTY IMAGE
ఈ లేఖ ప్రయోజనం ఏంటి?
ప్రపంచయుద్ధంలో మిత్రరాజ్యాల పక్షం వహించేందుకు అమెరికాలో నివసిస్తున్న యూదులను ఈ లేఖ ఒప్పించగలదని బ్రిటన్ ప్రభుత్వం భావించింది.
యుద్ధం తరువాత తన అడుగుజాడలు మధ్యప్రాచ్యంలో కొనసాగాలని బ్రిటన్ భావించేదని చాలామంది నిపుణులు నమ్ముతున్నారు.
ఈ లెటర్ రాయడం వెనుక ఉద్దేశం ఏదైనా కావచ్చు. కానీ, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడటంలో అది కీలకపాత్ర పోషించడంతో పాటు అనేకమంది పాలస్తీనీయన్లను వలసపోయేలా చేసింది.
పురాతన ఇజ్రాయెల్ నేలపై తమ రాజ్యాన్ని స్థాపించుకోవాలనే యూదుల కలకు బాల్‌ఫోర్ డిక్లరేషన్ రెక్కలు తొడిగింది. కానీ, ఇదే పాలస్తీనియన్ల కష్టాలకు ప్రారంభంగానూ నిలిచింది.
బాల్‌ఫోర్ డిక్లరేషన్‌లో తమను కేవలం యూదేతరులుగా పేర్కొన్నారని ఇప్పటికీ పాలస్తీనియన్లను చెపుతుంటారు.

ఫొటో సోర్స్, FRANCE PRESSE VOIR/AFP VIA GETTY IMAGES
ప్రపంచ యుద్ధంలో ఒట్లోమాన్ సామాజ్య్రం ఓడిపోయాక లీగ్ ఆఫ్ నేషన్స్ బాల్‌ఫోర్ డిక్లరేషన్‌కు మద్దతు ఇచ్చింది.
అప్పట్లో లీగ్ ఆఫ్ నేషన్స్ ఇప్పటి ఐక్యరాజ్యసమితిలా వ్యవహరించేది.
ఈ మద్దతు ద్వారా బ్రిటన్‌కు ఈ ప్రాంతాన్ని పాలించే అధికారం వచ్చింది. ఈ ప్రాంతంలో యూదుల జనాభా పెరగడంపై 1930లో అరబ్బులు అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.
ఈ రెండు వర్గాల మధ్య నిరంతరం హింస ప్రజ్వరిల్లుతూనే ఉంది. అల్లర్లను నియంత్రించేందుకు యూదుల వలసపై బ్రిటన్ పరిమితి విధించింది.
కానీ, రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూదుల రాజ్యం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. హిట్లర్ పాలన కాలంలో జర్మనీలో యూదుల ఊచకోత తరువాత ఈ డిమాండ్‌కు మరింత బలం చేకూరింది.
1948 మే 14 అర్థరాత్రి పాలస్తీనాలో బ్రిటన్ పాలనకు తెరపడింది.
ఈ ప్రాంతం నుంచి బ్రిటన్ వైదొలగింది. అదేరోజున ఇజ్రాయెల్ స్వతంత్రం ప్రకటించుకుంది.
ఇవి కూడా చదవండి:
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
- 'గాజా నగరాన్ని చుట్టుముట్టాం'.. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన
- ట్యూషన్ టీచర్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని బడా వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి చంపేశారు... మతం రంగు పులిమిన ఈ కుట్రను పోలీసులు ఎలా ఛేదించారు?
- తెలంగాణలో బీసీని సీఎం చేస్తామన్న బీజేపీ... తెలుగు ముఖ్యమంత్రుల్లో ఏ కులం వారు ఎందరున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














