దక్షిణ గాజా: ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న ఇజ్రాయెల్ సైన్యం అక్కడ కూడా బాంబులు వేస్తోందా?

ఇజ్రాయెల్ గాజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 19న ఖాన్ యూనిస్‌లో దాడి తర్వాత పరిస్థితులు
    • రచయిత, మెర్లిన్ థామస్, షెరీన్ షరీఫ్, అహ్మద్ నూర్, లమీస్ అల్తాబీ
    • హోదా, బీబీసీ వెరిఫై, బీబీసీ అరబిక్

ఉత్తర గాజాను ఖాళీ చేసి ప్రజలు వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ మిలిటరీ పలు సూచనలు చేసిన తర్వాత లక్షల మంది దక్షిణ గాజాకు తరలిపోయారు.

కానీ, ఇప్పుడు దక్షిణ గాజాలో కూడా ఇజ్రాయెల్ బాంబు దాడులు జరుపుతుండటంతో గాజాలోని ఏ ప్రాంతం కూడా పౌరులకు సురక్షితం కాదంటూ ఐక్యరాజ్యసమితి, ఇతర సహాయ సంస్థలు హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దక్షిణ గాజాలో సాధారణ పౌరులకు ఉన్న ప్రమాదాన్ని మెరుగ్గా అర్థమయ్యేలా చేసేందుకు బీబీసీ వెరిఫై బృందం అక్కడ జరిగిన నాలుగు దాడులను గుర్తించి, విశ్లేషించింది.

గాజా పౌరులకు జారీ చేసిన కొన్ని హెచ్చరికలు, ఖాళీ చేయాలంటూ వారికి చేసిన సూచనలను మేం చూశాం. దక్షిణ గాజాలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించే ప్రకటనలు కూడా వాటిలో ఉన్నాయి.

ఈ సూచనల్లో మ్యాప్‌లతో పాటు ప్రజలు వెళ్లాల్సిన ప్రాంతాల దిశను సూచించే గుర్తులు ఉన్నాయి.

దక్షిణ గాజాలో జరిగిన మూడు దాడులను మేం పరిశీలించగా, ప్రజల్ని వెళ్లాల్సిందిగా సూచించిన ప్రాంతాల్లో లేదా వాటికి సమీపంలోనే ఈ బాంబు దాడులు జరిగినట్లు మా పరిశీలనలో తేలింది.

గాజా ప్రజలకు వివిధ మార్గాల్లో సమాచారం చేరవేస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చెప్పింది. విమానాల నుంచి లేఖలు జారవిడవటం, అరబిక్ భాషలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అంతర్జాతీయ సంస్థలు సహా పౌరుల ద్వారా హెచ్చరికలు చేస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది.

ఐడీఎఫ్ సోషల్ మీడియాలో పంచుకున్న సూచనలను ఈ కథనంలో మేం పరిశీలించాం.

ఇజ్రాయెల్

ఖాన్ యూనిస్- 10 అక్టోబర్

ఉత్తర గాజాలోని రిమల్ ప్రాంతంతో పాటు, దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్‌లో కలిపి 200కు పైగా లక్ష్యాలను రాత్రికిరాత్రే తమ యుద్ధ విమానాలు ఛేదించినట్లు అక్టోబర్ 10న ఐడీఎఫ్ చెప్పింది.

అయితే, బీబీసీ ఆ రోజున సెంట్రల్ ఖాన్ యూనిస్‌లో జరిగిన ఒక బాంబు దాడిని పరిశీలించి దాడి తీవ్రతను, దాడి జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు ప్రయత్నించింది.

దాడి తర్వాత పబ్లిష్ అయిన వీడియోల్లో సిటీ సెంటర్‌లో ధ్వంసమైన భవనాలు, శిథిలాలు కనిపిస్తాయి.

ఖాన్ యూనిస్‌లోని మసీదు మినార్ల ఆధారంగా మేం ఆ ప్రాంతాన్ని ధ్రువీకరించాం.

మసీదు మినార్ మాత్రమే కాకుండా ధ్వంసమైన భవనాలు, శిథిలమైన ఇళ్లు, కార్ల ఫొటోలను కూడా మేం పరిశీలించాం.

వీడియో ఫుటేజీలో కనిపించిన ఫార్మసీ గుర్తును ఈ ఫోటోల్లో కూడా చూడొచ్చు.

ఫోటోలు తాజా దాడులవేనా, లేదా గతంలో జరిగినవా అనే అంశాన్ని నిర్ధరించేందుకు మేం ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ను కూడా ఉపయోగించాం.

ఐడీఎఫ్ అధికార ప్రతినిధి అవికే ఆడ్రీ, అక్టోబర్ 8 ఉదయాన ట్విటర్‌లో హెచ్చరిస్తూ ఒక ట్వీట్ చేశారు.

సురక్షితంగా ఉండాలంటే తమ ఇళ్లు వదిలేసి వేరే ప్రాంతానికి తరలి వెళ్లాలంటూ గాజాలోని వివిధ ప్రాంతాల్లో నివసించే పౌరులకు ఆయన అరబిక్‌ భాషలో సూచనలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో సెంట్రల్ ఖాన్ యూనిస్‌ నగరానికి ఆగ్నేయాన కొన్ని కిలోమీటర్ల దూరంలోని అబాసన్ అల్ కబీరా, అబాసర్ అల్ సఘీరా అనే రెండు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఖాన్ యూనిస్ సిటీ సెంటర్‌కు వెళ్లిపోవాల్సిందిగా అక్టోబర్ 8న ట్వీట్ ద్వారా తెలియజేశారు.

ఆ రెండు పరిసర ప్రాంత ప్రజల కోసం ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోలో వారి ఇళ్లను హైలైట్ చేస్తూ, ఖాన్ యూనిస్‌కు వెళ్లే దారిని బాణం గుర్తుతో చూపిస్తూ మ్యాప్‌ను రూపొందించారు.

ఇదే కాకుండా ప్రజలకు ఇంకా వేర్వేరు సూచనలు కూడా చేసే అవకాశాన్ని మేం కొట్టిపారేయలేం. కానీ, బీబీసీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలను పొందలేదు.

ఇజ్రాయెల్

రఫా-11 అక్టోబర్

దక్షిణ గాజాలో మరుసటి రోజు మరో దాడి జరిగినట్లు బీబీసీ ధ్రువీకరించింది. ఈజిప్ట్ సరిహద్దుకు సమీపాన ఇది జరిగింది.

అక్టోబర్ 11న జరిగిన ఈ దాడి రఫా సెంటర్‌లోని నెమా స్క్వేర్‌ను తాకింది. దాడి తర్వాతి విధ్వంసాన్ని చూపించే సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోను బీబీసీ చూసింది.

దాడికి ముందు నెమా స్క్వేర్‌కు సంబంధించిన ఫోటోలను ఉపయోగిస్తూ, వీడియోలోని భవనాల ఆకారాలను బట్టి అవి నెమా స్క్వేర్‌కు చెందినవే అని మేం గుర్తించగలిగాం.

రఫా నివాసితుల కోసం అక్టోబర్ 8న ఐడీఎఫ్ జారీ చేసిన హెచ్చరికలో సురక్షితంగా ఉండటం కోసం రఫా సిటీ సెంటర్‌లోని షెల్టర్లకు తక్షణమే వెళ్లిపోవాలంటూ చెప్పింది.

రఫా పరిసర ప్రాంత ప్రజల కోసం విడుదల చేసిన మ్యాప్‌లో ప్రజలంతా ‘రఫా’ దిశగా వెళ్లాలంటూ సూచించే బాణం గుర్తును చూడొచ్చు.

ఇజ్రాయెల్

ఖాన్ యూనిస్- 19 అక్టోబర్

ఇది జరిగి ఎనిమిది రోజులు గడిచిన తర్వాత ఖాన్ యూనిస్‌లో మరో దాడి జరిగింది. అక్కడి గామల్ అబ్దెల్ నాసిర్ వీధిలో ఇది జరిగింది.

నగరంలోని ప్రధాన దారుల్లో ఒకదాని సమీపాన కూలిపోయిన భవనాల వీడియోలను చూడటం ద్వారా మేం ఈ దాడిని ధ్రువీకరించాం. ఆ వీడియోలోని భవనాల ఆకారాలను, అదే ప్రాంతంలోని ఇతర చిత్రాలను సరిపోల్చడం ద్వారా మేం ఈ దాడి, ఖాన్ యూనిస్‌లో జరిగినట్లుగా ధ్రువీకరించగలిగాం.

దాడి తర్వాతి వీడియో ఫుటేజీలో చనిపోయిన వారిని, గాయపడిన వారిని శిథిలాల నుంచి బయటకు తీసి సమీపంలోని నాసిర్ ఆసుపత్రికి తరలించడం కనిపిస్తుంది.

మీ భద్రతతోపాటు మీ ప్రియమైనవారి భద్రత మీకు ముఖ్యమైతే వెంటనే దక్షిణ ఖాన్ యూనిస్‌కు వెళ్లాలంటూ గాజా ప్రజలకు అక్టోబర్ 16న ఐడీఎఫ్ ఒక హెచ్చరిక జారీ చేసింది.

ఉత్తర గాజా

సెంట్రల్ గాజా శరణార్థి శిబిరాలు- అక్టోబర్ 17, 18

ఉత్తర, సెంట్రల్ గాజాలో నాలుగు శరణార్థి శిబిరాలు ఉన్నాయి. వాటిలో రెండింటిపై దాడుల్ని బీబీసీ ధ్రువీకరించింది.

అక్టోబర్ 17న అల్-బురేజీ శిబిరంపై దాడి తర్వాత పరిణామాలకు సంబంధించిన సోషల్ మీడియా ఫుటేజీలో భారీ శిథిలాలు, మంటలు, రక్తసిక్తమైన మృతదేహాల ఫోటోలు కనిపించాయి.

ఈ ఫుటేజీలోని భవనాలను, న్యూస్ ఏజెన్సీల ఫోటోలతో సరిపోల్చడం ద్వారా మేం దీన్ని ధ్రువీకరించాం.

అక్కడ కనిపించే మసీదు ఆధారంగా ఆ ప్రదేశాన్ని కూడా ధ్రువీకరించాం.

అక్కడికి సమీపంలోని అల్-నుసెరత్ శిబిరంలో మరుసటి రోజు అంటే అక్టోబర్ 18న దాడి జరిగింది.

అంబులెన్స్‌లు, రాళ్ల గుట్టలు, మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు, ధ్వంసమైన బేకరీని చూపే దాడి తదనంతర పరిణామాలకు సంబంధించిన సోషల్ మీడియా ఫుటేజీని మేం ధ్రువీకరించాం.

వీడియోలో కనిపించే పేర్లను, దాడికి ముందు తీసిన ఫోటోల్లో కనిపించే పేర్లతో సరిపోల్చడం ద్వారా మేం దాన్ని గుర్తించాం.

తూర్పు, దక్షిన మఘాజి ప్రాంతంలోని నివాసితులను సెంట్రల్ గాజాలోని శిబిరాలకు వెళ్లాలంటూ అక్టోబర్ 8న హెచ్చరికలు చేశారు. కానీ, అక్కడ ఎలాంటి శిబిరాలు ఉన్నట్లుగా కనిపించడం లేదు.

ఐడీఎఫ్ స్పందన ఏమిటి?

ఈ కథనంలో పేర్కొన్న ప్రతీ దాడికి సంబంధించిన తేదీలు, స్థానాల సమాచారాన్ని ఐడీఎఫ్‌కు బీబీసీ అందించింది.

ఈ ప్రదేశాల్లో ఐడీఎఫ్ బలగాలు దాడులు చేశాయా, దాడులకు ముందు హెచ్చరికలు జారీ చేశాయా అని మేం వారిని అడిగాం.

ఈ ప్రశ్నకు స్పందిస్తూ, ఈ నిర్దిష్ట స్థానాలకు సంబంధించిన తదుపరి సమాచారాన్ని అందించలేమని ఐడీఎఫ్ చెప్పింది.

భద్రత కోసం గాజా పౌరులను దక్షిణం వైపుకు వెళ్లాలని చెప్పామని, అయితే గాజాలో ఉగ్రవాదులు ఉన్న అన్ని ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

‘‘అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, పౌరులకు నష్టం వాటిల్లకుండా ఐడీఎఫ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. దాడులకు ముందు హెచ్చరికలు జారీ చేయడం కూడా ఈ చర్యల్లో భాగమే’’ అని చెప్పింది.

వీడియో క్యాప్షన్, గాజాను వదిలి ఈజిప్టు చేరుకునేందుకు రఫా క్రాసింగ్ దగ్గర వేల మంది ఎదురుచూపులు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)