విరాట్ కోహ్లీ: తండ్రి మరణం, అదే సమయంలో రంజీ మ్యాచ్.. అప్పుడు విరాట్ ఏం చేశాడంటే..

కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాహ్నవి మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశమంతా టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న సంబరాల్లో ఉండగా.. క్రికెట్ లెజెండ్‌ విరాట్ కోహ్లీ తన అభిమానులకు నిరాశ కలిగించే వార్తను చెప్పాడు.

బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి, ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత కోహ్లీ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు.

కుర్రాళ్ళకు అవకాశమిచ్చే సమయం ఆసన్నమైందని విరాట్ కోహ్లీ చెప్పాడు.

2010 జూన్‌లో టీ20 ఇంటర్నేషనల్స్‌లో కోహ్లీ అరంగేట్రం చేశాడు. సుమారు 14 ఏళ్ల పాటు టీ20 మ్యాచ్‌లను ఆడిన తర్వాత కోహ్లీ ఇప్పుడు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

‘‘ఇదే నా చివరి టీ20 ప్రపంచకప్. మేం సాధించాలనుకున్నది ఇదే. ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవాలనుకున్నాం. ఆ కల నెరవేరింది. ఇక ఇప్పుడు యువతకు అవకాశమిచ్చే సమయం ఆసన్నమైంది. ఇది మా సుదీర్ఘ నిరీక్షణ. మా అందరి కల సాకారమైంది’’ అని టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ చెప్పాడు.

కోహ్లీ, రోహిత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో విరాట్ కోహ్లీ, తన కూతురును ఎత్తుకున్న రోహిత్ శర్మ

సచిన్ ప్రపంచ రికార్డును ఎప్పుడు బ్రేక్ చేశాడు?

సచిన్ తెందూల్కర్‌కు గతంలో విశేష ప్రేక్షకాదరణ, ప్రేమ దక్కేవి. అంతే ప్రేమ, అభిమానం పొందే అదృష్టం కోహ్లీకి దక్కింది.

సచిన్ తెందూల్కర్ సైతం తన వారసత్వాన్ని విరాట్ కోహ్లీ ముందుకు తీసుకెళ్తాడని 2012 మార్చిలోనే అంచనా వేశారు.

సచిన్ నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా, 2023 నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును విరాట్ అధిగమించాడు.

దీంతో పాటు సింగిల్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును కూడా విరాట్ అందుకున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

సచిన్ ఊహించినట్లే..

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 100వ సెంచరీ చేసిన సందర్భంగా పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘‘మీ 100 సెంచరీల రికార్డును భవిష్యత్తులో ఎవరు అధిగమిస్తారు?’’ అని ఆ కార్యక్రమంలో సచిన్‌ను ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ప్రశ్నించారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంటూ సచిన్ చెప్పగానే అక్కడున్న చాలా మంది ఆశ్చర్యపోయారు.

విరాట్ నిజంగానే చాలా ఘనతలు సాధించాడు.

కోహ్లీ దూకుడు ప్రవర్తనతో ఒకానొక సమయంలో అతన్ని‘‘బిగ్‌డా హువా బేటా (మాట వినని కుమారుడు)’’ అని పిలిచేవారు.

కానీ, ఇప్పుడు కోహ్లీ, భారత అభిమానుల గుండెల్లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గ్లోబల్ క్రికెట్‌కు ముఖచిత్రంగా మారాడు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ వల్లే ఆ నిర్ణయం తీసుకున్నారా?

ముంబయిలో జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సమావేశంలో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి విరాట్ కోహ్లీని ఉదాహరణగా ప్రస్తావించారు.

మాజీ ఒలింపియన్, 2028 ఒలింపిక్స్-పారాలింపిక్స్ స్పోర్ట్స్ డైరెక్టర్ నికోలో కాంప్రిని, క్రికెట్ ఆట పాపులారిటీ గురించి మాట్లాడుతూ కోహ్లీ గురించి ఉదహరించారు.

‘‘ఈ రోజు సోషల్ మీడియాలో కోహ్లీ, అత్యంత పాపులారిటీ కలిగిన మూడో అథ్లెట్. ఆయనకు 34 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ముగ్గురు అమెరికా సూపర్‌స్టార్లు లెబ్రాన్ జేమ్స్, టైగర్ వుడ్స్, టామ్ బ్రాడీ కంటే సోషల్ మీడియాలో కోహ్లీకి ఫాలోయర్లు ఎక్కువ’’ అని అన్నారు.

‘‘కోహ్లీ బ్రాండ్’’ అనేది క్రికెట్ ఆటకు ఎలా ఉపయోగపడుతోందనే దానికి ఇది ఒక ఉదాహరణ.

కానీ, ఇంత విజయాన్ని సాధించడం అంత తేలికేం కాదు. కఠోర శ్రమ, అధిక అంచనాల ఒత్తిడి, నిలకడగా రాణించాలనే ఒత్తిడిలను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు మానసిక దృఢత్వం ఈ విజయాల్లో పాత్ర పోషించింది.

తల్లి సరోజ్‌తో కోహ్లీ(2008 నాటి ఫోటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తల్లి సరోజ్‌తో కోహ్లీ(2008 నాటి ఫోటో)

తండ్రి మరణం.. అదే సమయంలో రంజీ మ్యాచ్

కోహ్లీ మానసిక దృఢత్వాన్ని తెలిపే ఘటన 2006లో జరిగింది.

అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ పక్షవాతం కారణంగా మంచం పట్టారు. అప్పుడు విరాట్ కోహ్లీకి 17 ఏళ్లు. అతను రంజీ ట్రోఫీలో దిల్లీకి ఆడుతున్నాడు. దిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కర్ణాటకతో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు.

అదే రోజు రాత్రి ప్రేమ్ కోహ్లీ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ చనిపోయారు. రాత్రి 2 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

తన క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన తండ్రిని కోల్పోవడం విరాట్‌కు పెద్ద షాక్. కానీ, విరాట్ ధైర్యంగా ఉన్నాడు. ఇంటికి బంధువులు రావడం మొదలైంది. విరాట్ కంట నీరు రానివ్వలేదు.

తెల్లవారుజామున దిల్లీ కోచ్ చేతన్ శర్మకు ఫోన్ చేసి తన తండ్రి మరణ వార్తను చెప్పి, రంజీ మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాలనుకున్నట్లు వెల్లడించాడు.

స్టేడియానికి వెళ్లి తన సహచరులను కలిసినప్పుడు కోహ్లీ కన్నీళ్లు ఆగలేదు. కానీ, వెంటనే తమాయించుకొని మైదానంలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 90 పరుగులు చేశాడు.

ఆ కఠిన సమయంలో విరాట్ చూపించిన అంకితభావం, అతని ప్రవర్తనతో ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోయారు.

తన ఇన్నింగ్స్‌ ముగిశాక, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

విరాట్‌లో ఆ రోజు రాత్రి నుంచి పరిణతి కనిపించినట్లు ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ తల్లి సరోజ్ చెప్పారు.

అన్న వికాస్‌తో కలిసి విరాట్ కూడా ఇంటి బాధ్యతలు పంచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విరాట్ వెనుదిరిగి చూడలేదు.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

విరాట్‌కు ‘చీకూ’ అనే పేరెలా వచ్చింది?

ఒకసారి భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతుండగా వికెట్ కీపింగ్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, మైదానంలోనే కోహ్లీని ‘చీకూ’ అంటూ పిలిచాడు.

ఆ తర్వాత నుంచి చీకూ అనే పేరు వరల్డ్ ఫేమస్ అయిపోయింది. అప్పటివరకు క్రికెట్ ప్రపంచంలో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’గా పేరున్న కోహ్లీకి అప్పటి నుంచి చీకూ అనే ముద్దు పేరు వచ్చింది.

అయితే, తనకు చీకూ అనే పేరు ఎప్పుడు, ఎలా వచ్చిందనే విషయాన్ని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో స్వయంగా కోహ్లీ వెల్లడించాడు.

దిల్లీ తరపున చిన్న వయసులోనే రంజీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు తన హెయిర్‌స్టయిల్‌పై ఎక్కువ ధ్యాస పెట్టినట్లు కోహ్లీ చెప్పాడు.

జుట్టును చాలా చిన్నగా కత్తిరించుకునేవాడినని అన్నాడు. ఆ సమయంలో కోహ్లీకి చిన్న పిల్లల తరహాలో నిండుగా బుగ్గలు ఉండేవి. దీంతో తన సహచరుల్లో కోహ్లీ బొద్దుగా, ప్రత్యేకంగా కనిపించేవాడు.

దిల్లీ జట్టు కోచ్‌లలో ఒకరికి కోహ్లీని చూడగానే అప్పటి ప్రముఖ కామిక్ పాత్ర అయిన ‘చంపక్’ అనే కుందేలు గుర్తు వచ్చి, అప్పటి నుంచి కోహ్లీని చీకూ అని పిలవడం మొదలుపెట్టారు. అలా తనకు చీకూ అనే పేరు వచ్చినట్లు కోహ్లీ చెప్పాడు.

అయితే 2019 నవంబరు 5న తన 31వ పుట్టినరోజు సందర్భంగా విరాట్ కోహ్లీ, తనకు తాను ఒక భావోద్వేగ లేఖను రాసుకున్నాడు. బొద్దుగా, నిండు బుగ్గలతో ఉండే కుర్రాడి దశ నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ వరకు తన క్రికెట్ ప్రయాణాన్ని కోహ్లీ అందులో ప్రస్తావించాడు.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, TWITTER

‘విరాట్ తరం’ ఆరంభానికి పునాది ఎలా పడింది?

2008 ఫిబ్రవరిలో మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహించాడు.

అండర్-19 జట్టులో అతడు అద్భుతంగా రాణించి ఆరునెలల వ్యవధిలోనే భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

2008 శ్రీలంక పర్యటనలో సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ గాయాల పాలవ్వడంతో విరాట్‌కు భారత జట్టులో చోటు దక్కింది. వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో అరంగేట్రంలోనే విరాట్ అర్ధసెంచరీ చేశాడు.

2010లో జింబాబ్వే‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 జట్టులోకి ప్రవేశించగా.. 2011లో వెస్టిండీస్ టూర్‌లో టెస్టు జట్టులోకి వచ్చాడు.

ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోహ్లీ ఆడుతున్నాడు.

అవిశ్రాంత పోరాటం, పరుగులు సాధించాలనే కసితో పాటు నిలకడ, అంకితభావం కారణంగా కోహ్లీని సచిన్ తెందూల్కర్‌తో పోల్చడం మొదలుపెట్టారు.

అండర్-19 వరల్డ్ కప్‌ సమయంలో కోహ్లీ(2008 నాటి ఫోటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అండర్-19 వరల్డ్ కప్‌ సమయంలో కోహ్లీ(2008 నాటి ఫోటో)

వరల్డ్ క్రికెట్‌లో విరాట్‌ను తరచూ మరో సచిన్‌గా చూస్తారు.

విరాట్ ఈ అధిక అంచనాల ఒత్తిడిని తీసుకోలేదు. కోహ్లీకి స్వయంగా సచిన్ తెందూల్కర్ మార్గనిర్దేశం చేశారు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సచిన్‌ను గౌరవపూర్వకంగా భుజాలపై మోసిన వారిలో విరాట్ కూడా ఉన్నాడు.

విరాట్‌కు ఆట పట్ల ఉన్న ఇష్టం, సంకల్పం అతన్ని రోజురోజుకీ మెరుగయ్యేలా చేసింది.

2011-12లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. కానీ, తన తొలి టెస్ట్ సెంచరీని కోహ్లీ ఈ సిరీస్‌లోనే సాధించాడు.

అడిలైడ్‌లో జరిగిన నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో తన సహచరులంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతున్నప్పటికీ, అతడు తెలివిగా ఆడుతూ తనవైన ప్రత్యేక షాట్లతో 116 పరుగులు చేశాడు.

నాడు సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి పెద్ద క్రికెటర్లు రాణించలేకపోయిన ఆ పిచ్‌పై కోహ్లీ ఈ ఘనతను సాధించాడు.

ఈ అసాధారణ సెంచరీతో భారత క్రికెట్‌లో ‘విరాట్ తరం’ ఆరంభానికి పునాది పడింది.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2012 ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ

విరాట్ మొండి ప్రవర్తనపై విపరీతమైన చర్చ

దూకుడుగా, ముక్కుసూటిగా ఉండే విరాట్ కోహ్లీ స్వభావంపై 2011-12 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా విపరీతంగా చర్చ జరిగింది.

ఆస్ట్రేలియా క్రికెటర్లు, అభిమానుల స్లెడ్జింగ్‌కు వెన‌క్కు తగ్గకుండా కోహ్లీ అంతే దూకుడుగా వారిని ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్రముఖ ఆటగాళ్లతో ఏ పోటీలో కూడా విరాట్ ఎక్కడా తగ్గలేదు.

ఆస్ట్రేలియాతో తర్వాతి సిరీస్‌లో కూడా కొత్త తరం క్రికెటర్‌గా కోహ్లీ కనిపించాడు. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో మిచెల్ జాన్సన్‌కు విరాట్ మధ్య జరిగిన గొడవలో అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

కొన్నిసార్లు మొండిగా వ్యవహరించే అతని తీరు చాలాసార్లు చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో చాలా మందికి అది నచ్చలేదు.

కానీ, ఆటలో అతను చూపించిన అంకితభావం భారత యువ అభిమానులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షించింది.

అదే సమయంలో విరాట్ కఠిన శ్రమ, అంకిత భావం గురించి తరచుగా ఎంఎస్ ధోనీతోపాటు జట్టు సహచరులంతా ప్రశంసించేవారు.

‘ప్లే హార్డ్’ అనే అతని వైఖరి భారత సరిహద్దులను దాటి ప్రపంచ దేశాల్లో అతనికి అభిమానులను సంపాదించి పెట్టింది.

ఆస్ట్రేలియాలో కోహ్లీకి విపరీత అభిమాన గణం ఉండగా, పాకిస్తాన్ అభిమానులు కూడా తమ పిల్లలు కోహ్లీలా ఆడాలని కోరుకుంటారు.

గత ఏడాది భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించింది. ట్రినిడాడ్‌లో మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ వికెట్ కీపర్ జోషువా డిసిల్వా తల్లి విరాట్ కోహ్లీని ప్రేమగా హత్తుకోవడం క్రికెట్ అభిమానులు వీడియోల్లో, ఫోటోల్లో చూసే ఉంటారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

‘ఛేజ్ మాస్టర్‌’ అనే బిరుదు

విరాట్ ఆడే కవర్‌డ్రైవ్‌లు, గ్రౌండ్ స్ట్రోక్స్ చూడటం అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది.

అవుట్ స్వింగ్ లేదా ఆఫ్‌ స్టంప్‌కు ఆవల వెళ్తున్న బంతుల్ని మైదానంలో ఖాళీల మధ్య నుంచి విరాట్ తరలిస్తుంటే చూడటం బాగుంటుంది. పరుగుల ఛేదనలో విరాట్‌కు తిరుగు ఉండదు. చేజింగ్‌ కళలో విరాట్ ప్రావీణ్యం పొందాడు.

లక్ష్య ఛేదనలో విరాట్ బ్యాట్ ఎప్పుడో అరుదుగా మొరాయిస్తుంది. చేజింగ్‌లో భారత్‌ను గెలిపించేలా, ప్రత్యర్థిని ఎదుర్కోవడం, బౌండరీలు బాదడం వంటి సవాళ్లలో కోహ్లీ నిలకడగా విజయం సాధిస్తాడు. అందుకే విరాట్‌కు ‘ఛేజ్ మాస్టర్’ అనే బిరుదు వచ్చింది.

ప్రపంచంలో ఎక్కడ ఆడినా విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ అస్త్రశస్త్రాలన్నీ బయటకు తీస్తాడు.

ఎప్పుడు ఏ షాట్ ఆడాలి, సహచరులతో భాగస్వామ్యాలు నెలకొల్పడం, దూకుడైన బౌలర్లను ధాటిగా ఎదుర్కోవడం, పిచ్ పరిస్థితులను అంచనా వేస్తూ ఆడటం, అవసరానికి తగినట్లుగా వ్యూహాలు మార్చడం వంటివి కోహ్లీ మ్యాచ్‌లో అమలు చేస్తాడు.

విరాట్ ఆటలో ఇవన్నీ ప్రత్యేక నైపుణ్యాలు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

తిరుగులేని ఫిట్‌నెస్

విరాట్ ఫిట్‌నెస్ కూడా అమోఘం.

2018లో అనారోగ్యం కారణంగా విరాట్ వీగన్‌లా మారిపోయాడు. అంటే మాంసంతో పాటు డెయిరీ ఉత్పత్తులను తన డైట్ నుంచి తప్పించాడు.

డైట్, వ్యాయామం విషయంలో విరాట్ చాలా కచ్చితంగా ఉంటాడు. ఈ లక్షణాలన్నీ విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ జట్టులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి.

ధోనీ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్‌గా ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాడు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

కెప్టెన్‌గా అలా మొదలుపెట్టాడు..

2014 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టుకు ముందు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వేలుకు గాయమైంది. మ్యాచ్ సమయానికి గాయం తగ్గకపోవడంతో అకస్మాత్తుగా విరాట్ కోహ్లీకి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

ఇలా భారత టెస్టు జట్టును నడిపించే మొదటి అవకాశం కోహ్లీకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా తన ప్రతిభను కోహ్లీ నిరూపించుకున్నాడు.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

విరాట్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగింది?

2021-22 సంవత్సరం విరాట్‌కు సవాలుగా నిలిచింది. కోహ్లీ బ్యాట్ ఎలాంటి మ్యాజిక్‌ చేయలేకపోయింది. సులువుగా పరుగులు రాబట్టే కోహ్లీ పరుగులు చేయలేకపోయాడు. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీని వదులుకున్నాడు.

అవిశ్రాంత క్రికెట్ కారణంగా అతను అలసిపోయాడు. అది తన బ్యాటింగ్ ప్రదర్శనల్లో కనిపించేది. 2022లో కోహ్లీ, ఆటకు నెల రోజుల సుదీర్ఘ బ్రేక్ ఇచ్చాడు. 2008 నుంచి ఆటలోని అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న ఒక క్రికెటర్ ఇలా చేయడం చాలా అరుదైన విషయం.

అయితే, ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై సెంచరీతో విరాట్ అద్భుత పునరాగమనం చేశాడు. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయంగా 82 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు.

అప్పటినుంచి విరాట్ తన మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. ఉత్సాహంగా పరుగులు సాధిస్తున్నాడు. జట్టులో ఇప్పుడు కొత్త లుక్‌లో సీనియర్ ప్లేయర్‌ పాత్రను పోషిస్తున్నాడు.

కానీ, ఈ పునరాగమనం అంతా తేలిగ్గా జరగలేదు.

2022లో స్టార్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ- ‘‘అప్పుడు కనీసం ఒక నెల పాటు నేను నా బ్యాట్‌ను ముట్టలేదు. గత పదేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. నాలో ఇంకా క్రికెట్ ఆడే సమర్థత, ఆ కసి ఉందని నాకు నేనే చెప్పుకున్నా. ముందుకు వెళ్లమని నా మెదడు చెబుతుండగా, బ్రేక్ తీసుకోవాలని నా శరీరం సూచించేది. నాకు విశ్రాంతి కావాలి. అందుకే నేను బ్రేక్ తీసుకున్నా.

అందరూ తాము మానసికంగా దృఢంగా ఉన్నామని అనుకుంటారు. కానీ, ప్రతీ దానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితుల్ని తెలుసుకోవాలి. లేకపోతే పరిస్థితులు చేజారుతాయి. ఆ సమయంలో నేను మానసికంగా ఇబ్బంది పడ్డాను. దీన్ని అంగీకరించడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. మీరు మానసికంగా దృఢంగా ఉండొచ్చు. కానీ, ప్రతీసారి మీలోని బలాన్ని మాత్రమే చూపించి కష్టాలను దాచుకోవాలనేది దీని అర్థం కాదు’’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మానసిక ఆరోగ్యం గురించి కోహ్లీ బహిరంగంగా చర్చించడాన్ని చాలా మంది ప్రశంసించారు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

అనుష్క శర్మతో జీవితం

విరాట్, అనుష్క మొదటిసారి 2013లో ఒక షాంపూ అడ్వర్టైజ్‌మెంట్‌ షూట్‌లో కలుసుకున్నారు. తర్వాత వారి మధ్య స్నేహం, రిలేషన్‌షిప్ ఏర్పడ్డాయి.

2014 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తన ప్రేయసి అని ప్రకటించాడు. తర్వాత ఆ టూర్‌కు తనతోపాటు అనుష్కను తీసుకెళ్లేందుకు అనుమతి పొందాడు.

ఇంగ్లండ్‌లో టూర్‌ ఆరంభంలో విరాట్ లయను అందుకోలేకపోవడంతో అనుష్క-కోహ్లీ జోడీపై విమర్శలు వచ్చాయి.

మిగతా వాటిని పక్కనబెట్టి ఆటపై దృష్టి పెట్టాలంటూ అభిమానులు, ఫాలోయర్ల నుంచి కోహ్లీకి సూచనలు వచ్చేవి.

విరాట్-అనుష్క జోడీ ఈ వ్యాఖ్యలను పట్టించుకోలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

2016లో కూడా వీరిద్దరూ ఇదే రకమైన విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

2017లో అంటే దాదాపు ఏడాది తర్వాత ఇటలీలో ఒక ప్రైవేటు వేడుకగా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

సెలబ్రిటీ హోదా, డిమాండింగ్ కెరీర్లు ఉన్నప్పటికీ ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితాలను ఎలా సమతౌల్యం చేసుకోవాలో అనుష్క- విరాట్ జోడీ చూపించింది.

వీడియో క్యాప్షన్, భారత్ వరుస విజయాలకు డ్రెస్సింగ్ రూమ్‌ కారణమా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)