బిగ్‌బాస్ విన్నర్, యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్... రేవ్ పార్టీలకు పాము విషాన్ని సప్లయ్ చేశారా?

ఫొటో సోర్స్, @ELVISHYADAV
బిగ్ బాస్ విజేత, యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్ సహా ఆరుగురిపై రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఎఫ్ఐర్ నమోదైనట్టు ఏఎన్ఐ న్యూస్ఏజెన్సీ తెలిపింది.
పోలీసులు తమ దాడులలో భాగంగా 9 పాములను కూడా స్వాధీనం చేసుకున్నారు. వైల్డ్‌లైఫ్ రక్షణ చట్టం 1972 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పీపుల్ ఫర్ యానిమల్స్ తరపున బీజేపీ ఎంపీ మనేకా గాంధీ ఫిర్యాదు చేశారు. ‘యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్ తన ముఠాలోని ఇతర సభ్యులతో కలిసి పాము విషాన్ని, పాములను నోయిడాలోని ఫామ్ హౌస్‌లో రహస్యంగా దాచి ఉంచినట్టు ’’ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
‘‘ ఈ పార్టీకి విదేశీ యువతులను ఆహ్వానించారు. పాము విషాన్ని, ఇతర మత్తు పదార్థాలను వినియోగించారు’’
ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఎల్వీష్ యాదవ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
‘‘ఈ విషయం బయటకు వచ్చేలా ఉచ్చు వేశాం. 11 పైథాన్లు, కోబ్రాలు సంఘటనాస్థలంలో లభించాయి. అక్కడ ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వారు రేవ్ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఈ పార్టీలలో పాముల నుంచి తీసిన విషాన్ని విక్రయిస్తారు. ఈ విషాన్ని తీసుకునేవారికి హాని జరుగుతుంది’’ అని మనేకా గాంధీ ఓ ప్రైవేటు టీవీ ఛానల్ తో మాట్లాడుతూ చెప్పారు.
‘‘ రేవ్ పార్టీలు ఆగుతాయా లేదా అన్నది మా సమస్య కాదు. ఎవరైతే అడవి నుంచి పాములను తీసుకువచ్చి, వాటినుంచి విషాన్ని సేకరించి వాటి చావుకు కారణమయ్యారో వారిని అరెస్ట్ చేయించడమే మా పని. మా టీమ్ ఈ విషయాన్ని స్వయంగా యూట్యూబ్‌లో చూసింది. ఎల్వీష్ యాదవ్ కు ఒక పార్టీ నిర్వహిస్తున్నట్టు చెప్పగానే, అతను ఐదుగురు వ్యక్తులను పరిచయం చేశాడు, పార్టీలో పాయిజన్ సప్లై చేస్తానని చెప్పారు’’అని మనేకా గాంధీ తెలిపారు.

ఫొటో సోర్స్, @ELVISHYADAV
ఆరోపణలపై ఎల్వీష్ ఏమన్నారు?
ఎఫ్ఐఆర్ నమోదయ్యాక, ఎల్వీష్ యాదవ్ శుక్రవారం వివరణ ఇచ్చారు.
దీనిపై సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.
‘‘నేనీరోజు నిద్రలేచేసరికి, నేను మత్తుమందులతో పట్టుబడినట్టుగా వార్తలు వస్తున్నాయి. నాకు వ్యతిరేకంగా వస్తున్న ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధం, నిరాధారం. వాటిల్లో ఒక్కశాతం కూడా నిజం లేదు’’ అని చెప్పారు.
‘‘యూపీ పోలీసులకు సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో నా ప్రమేమయం ఒక్కశాతం ఉందని తేలినా పూర్తి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ యూపీ పోలీసులకు, అధికారులకు, సీఎం యోగి ఆదిత్యనాథ్ కు విజ్ఞప్తి చేశాను..’’
‘‘తగిన ఆదారం లభించేవరకు నా పేరును ప్రస్తావించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాపై వచ్చిన ఆరోపణతో నాకెటువంటి సంబంధం లేదు’’ అని ఎల్వీష్ పేర్కొన్నాడు.

ఫొటో సోర్స్, FB/ELVISH
ఎవరీ ఎల్వీష్ యాదవ్?
ఎల్వీష్ యాదవ్ ఓ ప్రసిద్ధ యూట్యూబర్. సోషల్ మీడియాలో ఈయన చాలా పాపులర్. యూట్యూబ్‌లో ఈయనకు కోటి 60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో కోటి 30 లక్షల మందికిపైగా అభిమానులు ఉన్నారు.
ఎల్వీష్ యాదవ్ కు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎల్వీష్ యాదవ్ అనేపేరుతో ఒక ఛానల్ ఉంది.
ఎల్వీష్ యాదవ్ వ్లోగ్స్ పేరుతో మరొకటి ఉంది. ఎల్వీష్ యాదవ్ సరదా వీడియోలు చేస్తుంటారు. హాస్యాన్ని పండించే ఆయన వీడియోలు చాలా ప్రసిద్ధి చెందాయి.
తన హర్యానా యాసా, ప్రత్యేక శైలితో ఈయన యువతలో బాగా పాపులర్ అయ్యారు. ఎల్వీష్ పాటలు పాడటం, నటించడం చేస్తుంటారు. ఆయన 1997 సెప్టెంబర్ 14న ఎల్వీష్ యాదవ్ హర్యానాలోని గురుగ్రామ్‌లో జన్మించారు.
2016లో తన యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్వీష్ బీకాం చదివారు. ఈయన పూర్వనామం సిద్ధార్థ్ యాదవ్.
కానీ, ఆయన అన్న సిద్ధార్థ్ యాదవ్‌ను ఎల్వీష్ యాదవ్‌గా మార్చాలనుకునేవారు.
తన అన్న అకాలమరణంతో సిద్ధార్థ్ తన పేరును ఎల్వీష్ యాదవ్‌గా మార్చుకున్నారు.
యూట్యూబ్ కారణంగా ఎల్వీష్ యాదవ్ చాలా తొందరగానే ప్రసిద్ధి పొందింది. పాపులర్ అయ్యారు.
ఎల్వీష్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర బోలెడు విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
ఇవికూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














