భారత్ తర్వాత చైనాతో కెనడాకు గొడవ ఎందుకు వచ్చింది?

చైనా, కెనడా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

భారత్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతలతో ఇటీవల వార్తల్లో నిలిచిన కెనడాకు తాజాగా చైనాతో విభేదాలు వచ్చాయి.

అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల ఉల్లంఘన, అనవసర సైనిక దూకుడు చర్యలకు సంబంధించి చైనా, కెనడా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

ఈ రెండింటి మధ్య తాజా వ్యవహారం దక్షిణ చైనా సముద్రంతో ముడిపడి ఉంది. దీనిపై చైనా చాలా ఆందోళనగా ఉంది.

పెద్దదైన ఈ సముద్ర ప్రాంతాన్ని చైనా తన సొంతమని చెబుతోంది. అయితే ఈ ప్రాంతంలోని పలు ఇతర దేశాలు చైనా వాదనను సవాలు చేస్తున్నాయి.

దక్షిణ చైనా సముద్రం మీదుగా వెళ్తున్న తమ హెలికాప్టర్లను చైనా యుద్ధ విమానాలు ప్రమాదం కలిగిస్తున్నాయని కెనడా ఆరోపించింది.

కెనడా హెలికాప్టర్ తమ దీవుల వైపు వెళ్లినట్లు చైనా చెబుతోంది. ఇలా వెళ్లడానికి కారణాలు తెలియవని అంటోంది.

చైనా, కెనడా

ఫొటో సోర్స్, REUTERS

చైనావి 'ప్రమాదకర కార్యకలాపాలు' అంటూ కెనడా ఆరోపణలు

దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల మీదుగా ఎగురుతున్న తమ హెలికాప్టర్‌ను చైనా యుద్ధ విమానాలు ప్రమాదంలోకి నెట్టాయని కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ అన్నారు.

కెనడా హెలికాప్టర్‌కు అతి దగ్గరగా వచ్చిన చైనా యుద్ధ విమానాలు, ఫ్లెయర్‌ పేల్చడం (హెచ్చరికగా మంటలను వదలడం) ద్వారా హెలికాప్టర్ సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేశాయని ఆయన శుక్రవారం చెప్పారు.

చైనా జెట్‌లు ఇటీవల తమ హెలికాప్టర్‌ పైనుంచి వెళ్లాయని, దీంతో హెలికాప్టర్ అటూ ఇటూ కదిలిపోయిందని బ్లెయర్ వెల్లడించారు.

దీని తర్వాత మరో జెట్, హెలికాప్టర్ ముందు మంటలను పేల్చింది. వాటి నుంచి తప్పించుకోవడానికి అకస్మాత్తుగా తమ హెలికాప్టర్ గమనాన్ని మార్చాల్సి వచ్చిందని తెలిపారు.

“ఈ విధంగా అందర్నీ అనవసరంగా ప్రమాదంలో పడేశారు. చైనా యుద్ధ విమానాలు చేపట్టిన ఈ చర్యలు చాలా ప్రమాదకరమైనవి’’ అని ఆయన అన్నారు.

చైనా రక్షణ మంత్రి

ఫొటో సోర్స్, MOD.GOV.CN

ఫొటో క్యాప్షన్, చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి జాంగ్ షావోగాంగ్

కెనడా ఉద్దేశాలు హానికరమంటూ చైనా వ్యాఖ్యలు

బ్లెయర్ చేసిన వ్యాఖ్యలపై శనివారం చైనా స్పందించింది. ‘‘కెనడా హెలికాప్టర్ దురుద్దేశపూర్వకంగా, రెచ్చగొట్టే పనులకు పాల్పడింది’’ అని చైనా బదులిచ్చింది.

కెనడా యుద్ధనౌక హెచ్‌ఎంసీఎస్ ఒట్టావా పేరును ప్రస్తావిస్తూ చైనా రక్షణ శాఖ ప్రతినిధి జాంగ్ షావోగాంగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘ఇటీవల కెనడాకు చెందిన ‘హెచ్‌ఎంసీఎస్ ఒట్టావా’ నుంచి వచ్చిన హెలికాప్టర్, చైనాకు చెందిన జిషా దీవుల వైపుకు వెళ్లింది. ఈ ఘటనపై చట్టాల ప్రకారం దర్యాప్తు చేయాలని నౌకా దళాన్ని, వైమానిక దళాన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కోరింది. అంతేకాకుండా అనేక హెచ్చరికలు జారీ చేసింది. అయితే, కెనడా హెలికాప్టర్ స్పందించకపోవడంతోపాటు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ రెచ్చగొట్టే పనులు చేసింది’’ అని ప్రకటనలో అన్నారు.

ఈ విషయంలో కెనడా అతిగా వ్యవహరిస్తోందంటూ చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఆరోపించారు.

"కెనడా చర్యలు చైనా చట్టాలను, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా చైనా సార్వభౌమాధికారం, భద్రతను ప్రమాదంలో పడేస్తాయి. ప్రమాదాలను నివారించేందుకు సముద్ర కార్యకలాపాల్లో నియంత్రణ పాటించాలని కెనడా వైమానిక దళాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని అన్నారు.

కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయర్

రెండు వారాల్లో రెండో గొడవ

చైనా వైమానిక దళం ప్రమాదకర వైఖరి అవలంబిస్తోందంటూ కెనడా ఆరోపించడం రెండు వారాల్లో ఇది రెండోసారి అని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

దీనికంటే ముందు అక్టోబర్‌లో చైనా యుద్ధ విమానాలు తమ నిఘా విమానానికి అయిదు మీటర్ల దగ్గరకు వచ్చాయని కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ చెప్పారు.

ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలు సక్రమంగా అమలు అవుతున్నాయా, లేదా అని చూసేందుకు ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగంగా తమ పర్యవేక్షణ విమానం ఎగురుతున్నట్లు కెనడా తెలిపింది.

చైనా ఈ ఘటనపై స్పందిస్తూ, కెనడా విమానం చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంది.

తాజాగా కెనడా హెలికాప్టర్ విషయంలో కూడా చైనా ఇదే వ్యాఖ్యను చేసింది.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనా యుద్ధ విమానాలపై అమెరికా ఏమంది?

ఈ మధ్య కాలంలో చైనా సైనిక విమానాలు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాయని అమెరికా వ్యాఖ్యానించినట్లు వార్తాసంస్థ రాయిటర్స్ పేర్కొంది.

‘‘దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ గగనతలంలో ఎగురుతున్న అమెరికా మిలిటరీ విమానాల దగ్గరకు రావడం ద్వారా చైనా యుద్ధ విమానాలు అనవసర దూకుడు ప్రదర్శించాయి' అని మే నెలలో అమెరికా పేర్కొంది.

ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో దక్షిణ చైనా సముద్రం మీదుగా వివిధ దేశాల నౌకలు, విమానాలు వెళ్లడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

శనివారం చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి జాంగ్ షావోగాంగ్ మాట్లాడుతూ, "మా సార్వభౌమాధికారం, భద్రత, సముద్ర హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు దక్షిణ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి చైనా సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)