అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు తమకు క్రికెట్ నేర్పించిన పాకిస్తాన్‌ను కాదని భారత్‌ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిర్జీ ఏబీ బేగ్
- హోదా, బీబీసీ ఉర్దూ, దిల్లీ
భారత్‌లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో అఫ్గానిస్తాన్ అనూహ్య విజయాలతో క్రికెట్ అభిమానులను నివ్వెరపరుస్తోంది. టీమిండియా తర్వాత అభిమానులు ఎక్కువ ఇష్టపడుతున్న జట్టేదైనా ఉందంటే అది అఫ్గానిస్తానే.
మొదట డిఫెండింగ్ చాంపియన్‌గా ప్రపంచ కప్ బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ఓడించి అఫ్గానిస్తాన్ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అదే ఊపులో పాకిస్తాన్‌ను కూడా ఓడించి కొత్త చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ విజయమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అయితే, ఇప్పుడు ఆ జట్టును అంతకుముందు ఉన్న అఫ్గాన్ జట్టుగా చూడలేం. ప్రపంచ క్రికెట్‌లో మరో శాశ్వత జట్టుగా అఫ్గానిస్తాన్ ఎదిగిందని చెప్పొచ్చు.
భారత్‌లోని క్రికెట్ అభిమానులు కూడా తమ సొంత జట్టు తర్వాత ఇంకెవరికైనా మద్దతు ఇస్తున్నారంటే అది అఫ్గానిస్తాన్ మాత్రమే. ఈ ప్రేమ కేవలం అభిమానుల నుంచి మాత్రమే కాదు, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు, విశ్లేషకులు కూడా అఫ్గానిస్తాన్ జట్టు విజయం తర్వాత ఆనందంతో డ్యాన్స్ కూడా చేశారు.
భారతీయుల ఆదరణపై అఫ్గాన్ ప్రజలు, అఫ్గాన్ జట్టు సభ్యులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
దీంతో, అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకి భారత్‌లో ఇంత ఆదరణ ఎలా? అఫ్గాన్ జట్టుకి భారత్‌ను రెండో ఇల్లుగా ఎందుకు భావిస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
'అఫ్గాన్ ఆటగాళ్లకు బ్యాట్ పట్టుకోవడం నేర్పించింది పాకిస్తాన్'
ఇదే ప్రశ్నను కెనడియన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మొయినుద్దీన్ హమీద్‌ను అడిగాం. పాకిస్తాన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్‌పై హమీద్ పుస్తకం రాశారు. క్రికెట్‌ను అతిదగ్గరగా గమనిస్తూ ఉంటారు.
మొయినుద్దీన్ హమీద్ బీబీసీ ఉర్దూతో ఫోన్‌లో మాట్లాడుతూ'' దాని వెనక అనేక చారిత్రక, రాజకీయ కారణాలున్నాయి. అఫ్తానిస్తాన్, భారత్ ఇరుగుపొరుగు దేశాలు కానప్పటికీ, వాటి మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ కంటే అఫ్గానిస్తాన్‌నే భారత్ ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇప్పుడు భారత్‌లో కనిపిస్తున్న పరిస్థితి కూడా అంతే.'' అన్నారు.
''ప్రతి విషయంలోనూ అఫ్గానిస్తాన్‌కు పాకిస్తాన్ సాయం చేసింది. లక్షలాది మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించింది. అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టును తయారు చేయడంలోనూ పాకిస్తాన్‌ది కీలకపాత్ర. అయితే, ఈ విషయం పాకిస్తాన్ ప్రజలకు తెలియదు. అదే ఇండియా - పాకిస్తాన్ విషయానికి వస్తే అఫ్గానిస్తాన్ ప్రజలు సాంప్రదాయికంగా భారత్‌కు మద్దతు ఇవ్వడం కనిపిస్తుంది'' అన్నారు.
''క్రీడల విషయానికి వస్తే, బ్యాట్ ఎలా పట్టుకోవాలో పాకిస్తాన్ ఆటగాళ్లు మాకు నేర్పించారు. కబీర్ ఖాన్, రషీద్ లతీఫ్, ఇంజమామ్ ఉల్-హక్, ఉమర్ గుల్ వంటి పాకిస్తానీ క్రికెటర్లు అఫ్గాన్ క్రికెట్ జట్టు శిక్షణలో కీలకపాత్ర పోషించారు. అక్కడికి వెళ్లి కోచింగ్ ఇచ్చేవారు'' అని హమీద్ చెప్పారు.
''రషీద్ లతీఫ్, ఇంజమామ్‌కి అఫ్గానీ భాష 'పష్తో' రాకపోయినా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆటగాళ్లు వాళ్ల భాషలోనే శిక్షణ ఇచ్చేవాళ్లు. అలాగే, రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు అఫ్గానిస్తాన్‌లో పుట్టారు. ఆశ్రయం కోసం పాకిస్తాన్ వచ్చినప్పుడు ఇక్కడే క్రికెట్ నేర్చుకున్నారు. పాకిస్తాన్‌లోనే స్కూల్, కాలేజీ చదువులు కూడా చదువుకున్నారు'' అని తెలిపారు.
అయితే, అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ పాకిస్తాన్‌కి బదులు భారత్ వైపు మొగ్గుచూపడం అర్థం కావడంలేదని హమీద్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండో ఇల్లు
అఫ్గానిస్తాన్‌లో అమెరికా భద్రతా దళాలను మోహరించినప్పటి నుంచి అభివృద్ధి పనుల కోసం భారత్ వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. 2021 మధ్యలో తాలిబాన్లు అఫ్గాన్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి అఫ్గాన్ క్రికెట్ జట్టుకు భారత్ ఆశ్రయం ఇస్తోంది. చాలా మంది నిపుణులు భారత్‌ను అఫ్గాన్ క్రికెట్ జట్టుకు రెండో ఇల్లుగా చూస్తున్నారు.
మరో స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆదేశ్ కుమార్ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ, ''అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టును తయారు చేసింది పాకిస్తానే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, వాళ్లు వదిలేసిన తర్వాత అఫ్గానిస్తాన్ ఆటగాళ్లకు భారత్ శిక్షణ ఇచ్చింది. నోయిడా, డెహ్రాడూన్‌లో వాళ్లకి బీసీసీఐ శిక్షణ ఇప్పించింది'' అని ఆదేశ్ అన్నారు.
రెండు దేశాల మధ్య పాత సంబంధాలు కూడా ఇందులో కీలకమని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లు ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే జరుగుతున్నాయి. అందువల్ల అఫ్గానిస్తాన్ జట్టుకి ప్రాధాన్యం పెరిగింది.
''రాజకీయ కారణాల వల్ల ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో పాకిస్తానీ ఆటగాళ్లు లేరు. అఫ్గాన్ ఆటగాళ్లు కనిపిస్తున్నారు. అందువల్ల కొత్త క్రికెట్ అభిమానులకు వారితో ఒక రకమైన అనుబంధం ఉంది'' అని ఆదేశ్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ ప్రపంచ కప్‌లో అఫ్గానిస్తాన్ క్రికెటర్ల ఆట చూస్తుంటే ఈ సారి ఐపీఎల్‌లో అఫ్గాన్ ఆటగాళ్లు ఎక్కువ మంది ఉండేట్లు కనిపిస్తున్నారు.
బీసీసీఐ మద్దతుతో భారతీయ కంపెనీ అమూల్ అఫ్గానిస్తాన్ జట్టును స్పాన్సర్ చేస్తోంది. భారత క్రికెటర్ అజయ్ జడేజా జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. అఫ్గాన్ జట్టుతో ఆయన ఉండడం భారతీయుల ఆదరణకు మరో కారణం.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో చర్చ
అఫ్గానిస్తాన్ జట్టు భారత్ వైపు మొగ్గుచూపుతుండడం, భారత్‌లో వారికి లభిస్తున్న ఆదరణ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.
''అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు పాకిస్తాన్‌లో క్రికెట్ నేర్చుకున్నారు. కానీ ఆశ్చర్యమేంటంటే, వాళ్లు ఇండియాని తమ రెండో ఇల్లుగా చెబుతుంటారు. అఫ్గాన్ అభిమానులు కూడా ఎప్పుడూ పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా, ఇండియాకే మద్దతు ఇస్తున్నారు'' అని ఎక్స్ యూజర్ అర్ఫా ఫిరోజ్ జకీ పోస్ట్ చేశారు.
మరో నెటిజన్ ది కైపుల్లాయ్ ఇలా రాశారు. ''బీసీసీఐ చాలా తప్పులు చేసింది. కానీ, అఫ్గాన్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు ఒక స్టేడియం, ఆటగాళ్లకు సౌకర్యాలు, శిక్షణ ఇప్పించిన ఘనత మాత్రం బీసీసీఐకే దక్కుతుంది.
అఫ్గానిస్తాన్ క్రికెట్ మెరుగుపడేందుకు బీసీసీఐ చాలా సాయం చేసింది. ఈరోజు క్రికెట్ ప్రపంచంలో అఫ్గాన్ ఆటగాళ్ల ప్రగతికి, మనం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం బీసీసీఐనే'' అని పోస్ట్ చేశారు.
అందుకు చాలా మంది నెటిజన్లు మద్దతు కూడా తెలిపారు.
''అది వాస్తవం. భారత్‌లో అఫ్గానిస్తాన్ జట్టుకి దక్కిన ఆదరణ కూడా వేరే లెవెల్. దానికి ఆటగాళ్లందరూ కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు. వాళ్లు క్రమంగా ఎదగాలని మేం కోరుకుంటున్నాం'' అని అనుపమ సింగ్ అనే నెటిజన్ రాశారు.
''అఫ్గానిస్తాన్ జట్టుకి తాలిబాన్ల మద్దతు ఇసుమంతైనా లేదు. అయినా వాళ్లు చాలా సాధించారు. ప్రపంచ స్థాయి ఆటను ప్రదర్శించారు. వాళ్లని అలా చూడడం చాలా సంతోషంగా ఉంది. అఫ్గాన్లు సంతోషంగా నవ్వడం చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది వాళ్లని అలా చూడడం'' అని జర్నలిస్ట్ నజ్రానా యూసుఫ్‌జాయ్ పోస్ట్ చేశారు.
ఇర్ఫాన్ పఠాన్ డ్యాన్స్ చేయడంపై అఫ్గాన్లు ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ, పాకిస్తాన్ అభిమానులకు మాత్రం రుచించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
''మన పొరుగునే ఉన్న వాళ్లు మనం ఓడిపోతే డ్యాన్స్ చేయాలనుకున్నారు. కానీ, మన సోదరులు మాత్రం మన విజయంతో డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ల కలలు కలలుగానే మిగిలిపోయాయ్. ఇర్ఫాన్ భాయ్‌కి, భారతీయ స్నేహితులందరికీ ధన్యవాదాలు'' అని మరో అఫ్గానీ పాకిస్తాన్‌ను ఉద్దేశించి రాశారు.
అఫ్గానిస్తానీయుల సోషల్ మీడియా పోస్టులు చూస్తే పాకిస్తాన్‌ను వాళ్లు ప్రత్యర్థిగా చూస్తున్నట్లుగా ఉంది.
అయితే, అఫ్గానిస్తాన్ అభిమానులు భారత్‌కు మద్దతు ఇవ్వడం తనకు అంతుచిక్కడం లేదని జర్నలిస్ట్ మొయినుద్దీన్ హమీద్ అన్నారు.
''పాకిస్తాన్‌తో అఫ్గానిస్తాన్ సరిహద్దు పంచుకుంటోంది. వాళ్లకి ఓడరేవు కూడా లేదు. పాకిస్తాన్ వాళ్లకి దారి ఇవ్వడం వల్లే వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయి'' అన్నారు.
''అఫ్గానిస్తాన్‌తో భారత్‌కు గతంలో కంటే బలమైన వాణిజ్య సంబంధాలున్నాయి'' అని జేఎన్‌యూలో పర్షియన్ ప్రొఫెసర్, అఫ్గాన్ వ్యవహారాల నిపుణులు మహమ్మద్ మజరుల్ హక్ గతంలో బీబీసీతో చెప్పారు.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్గాన్‌తో భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలు లేవు. కానీ, సాంకేతిక సహకారం రూపంలో భారత్ ప్రభావం చాలా బలంగా ఉందని ఆయన అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో భారత్ పలు ప్రాజెక్టులు చేపట్టింది. వాటి కోసం దాదాపు 3 బిలియన్ డాలర్లు (సుమారు 24,969 కోట్లు) వెచ్చించింది.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ వరల్డ్ కప్ 2023: టీమ్ ఇండియా స్పీడ్‌కు బ్రేక్ వేయగల జట్టు ఏదైనా ఉందా?
- భారత్-పాకిస్తాన్ క్రికెట్: ఇరుజట్లు మైదానంలో బద్ధశత్రువులే, కానీ బయట మంచి మిత్రులు....
- క్రికెట్ ప్రపంచ కప్ 2023: సొంతగడ్డపై అభిమానుల కేరింతలతో భారత్ మరోసారి వరల్డ్ కప్ గెలుస్తుందా?
- డ్రీమ్ 11 యాప్‌లో క్రికెట్ ఆడి ఈ ఎస్సై కోటిన్నర ఎలా గెలుచుకున్నారు? ఆ తర్వాత ఏమైంది?
- క్రికెట్ వరల్డ్ కప్-1996: ఈడెన్ గార్డెన్స్‌లో వేలాది మంది ప్రేక్షకుల ముందు వినోద్ కాంబ్లీ ఎందుకు ఏడ్చారు... శ్రీలంక చేతిలో భారత్ అప్పుడు ఎలా ఓడిపోయంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














