శ్రీలంకపై 302 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరిన భారత్.. చెలరేగిన షమీ, సిరాజ్

మొహమ్మద్ షమీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ షమీ

ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది.

గురువారం శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ 302 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది.

ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా ఏడో విజయం.

358 పరుగుల లక్ష్య చేధనలో శ్రీలంక కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది.

భారత్ నిర్దేశించిన 358 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు.

భారత పేసర్లు షమీ, సిరాజ్ ధాటికి తట్టుకోలేక శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది.

చెత్త రికార్డును తప్పించుకున్న శ్రీలంక

వన్డే చరిత్రలో అత్యల్ప స్కోరు 35. శ్రీలంక ఈ మ్యాచ్‌లో ఒక దశలో 29/8 వద్ద నిలిచింది.

ఈ దశలో మరో రెండు వికెట్లు కోల్పోయి ఉంటే వన్డేల్లో అత్యల్ప స్కోరు చేసిన చెత్త రికార్డు శ్రీలంక పేరిట వచ్చి ఉండేది.

కానీ కసున్ రజిత, తీక్షణ రాణించడంతో శ్రీలంక ఆ గండాన్ని తప్పించుకుంది.

వన్డేల్లో శ్రీలంక ఇప్పటివరకు చేసిన అత్యల్ప స్కోరు 50. ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్‌తో మ్యాచ్‌లోనే శ్రీలంక ఈ అత్యల్ప స్కోరును నమోదు చేసింది.

అయితే, ఈ మ్యాచ్‌లో ఎలాగోలా 55 పరుగులు చేసింది.

షమీ రికార్డులు

ఈ మ్యాచ్‌లో 5 ఓవర్లలో 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. వన్డేల్లో ఇదే అతని అత్యుత్తమ ప్రదర్శన.

దీనితో పాటు షమీ ఖాతాలో ఇతర రికార్డులు కూడా చేరాయి.

భారత్ తరఫున వన్డేల్లో ఎక్కువసార్లు 5 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా జవగల్ శ్రీనాథ్ (3 సార్లు) పేరిట ఉన్న రికార్డును షమీ తన పేర రాసుకున్నాడు.

షమీ 4 సార్లు ఇలా ఒక మ్యాచ్‌లో 5 వికెట్లను పడగొట్టాడు. వరల్డ్ కప్ టోర్నీల్లోనే షమీ మూడుసార్లు 5 వికెట్లను సాధించడం విశేషం.

అలాగే, వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (45) తీసిన బౌలర్‌గా కూడా షమీ ఘనత సాధించాడు.

ఈ 45 వికెట్లలో ఒక్కటి కూడా ఎల్బీ డబ్ల్యూ లేదు. ఇందులో 13 బౌల్డ్ కాగా, 32 క్యాచ్ అవుట్లు ఉన్నాయి.

గతంలో ఈ రికార్డు జహీర్ ఖాన్ పేరిట ఉండేది. జహీర్ 23 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో 44 వికెట్లు పడగొట్టగా, షమీ 14 మ్యాచ్‌ల్లోనే 45 వికెట్లను తీశాడు.

సిరాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిరాజ్

మొదట సిరాజ్

బుమ్రా వేసిన తొలి బంతికే నిస్సంక (0) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే శ్రీలంక వికెట్‌ను కోల్పోయింది.

ఇక రెండో ఓవర్‌లో బంతిని అందుకున్న సిరాజ్ కూడా దిముత్ కరుణరత్నెను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. తర్వాత అదే ఓవర్‌లో సదీర సమర విక్రమ (0)ను కూడా సిరాజ్ అవుట్ చేయడంతో శ్రీలంక 2 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.

తర్వాత కుషాల్ మెండిస్ (1)ను బౌల్డ్ చేసిన సిరాజ్ శ్రీలంక టాపార్డర్‌ను కూల్చాడు. అప్పటికి శ్రీలంక స్కోర్ 4/3. అంటే 3 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

భారత బౌలర్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత్‌కు తొలి వికెట్‌ను బుమ్రా అందించాడు.

షమీకి 5 వికెట్లు

మ్యాచ్ 10వ ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని మహ్మద్ షమీకి అందించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెండు వరుస బంతుల్లో వరుసగా చరిత్ అసలంక (1), హేమంత (0)లను షమీ అవుట్ చేశాడు.

ఆ ఓవర్ మూడో బంతికి అసలంక, నాలుగో బంతికి హేమంత పెవిలియన్ చేరారు.

తర్వాత దుష్మంత చమీర (0), ఏంజెలో మ్యాథ్యూస్ (12), కసున్ రజిత (14)లను అవుట్ చేసిన షమీ, శ్రీలంకను కోలుకోనివ్వలేదు.

శ్రీలంక ఇన్నింగ్స్‌లో రజిత చేసిన 14 పరుగులే టాప్ స్కోర్.

రవీంద్ర జడేజాకు శ్రీలంక చివరి వికెట్ లభించింది. దిల్షాన్ (5)ను జడేజా అవుట్ చేయడంతో శ్రీలంక జట్టు మొత్తం 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది.

కోహ్లి, గిల్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రెండో వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యం

భారత్ బ్యాటింగ్ ఎలా చేసింది?

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (4) ఆరంభంలోనే అవుట్ అయ్యాడు.

మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లిలు జంటగా అద్భుతంగా ఆడారు.

ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.

విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో తన 70వ వన్డే అర్థ శతకాన్ని పూర్తి చేయగా.. శుభ్‌మన్ గిల్ తన 11వ వన్డే అర్థ శతకాన్ని అందుకున్నాడు.

వ్యక్తిగత స్కోరు 92 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ అవుట్ కాగా.. విరాట్ కోహ్లి 88 పరుగులకు పెవిలియన్ చేరి ఇద్దరూ సెంచరీలు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు.

3 పరుగుల వ్యవధిలోనే భారత్ వీరిద్దరి వికెట్లను కోల్పోయింది.

భారత్ బ్యాటింగ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

వీరిద్దరూ ఔటైన తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు క్రీజ్‌లోకి వచ్చారు. శ్రేయస్ అయ్యర్ తన బ్యాటింగ్ ప్రతిభను చూపించాడు.

36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీ అందుకున్నాడు.

34వ, 35వ, 36వ ఓవర్లలో వరుస సిక్స్‌లతో ఆశ్చర్యపరిచాడు.

మరోవైపు క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన కేఎల్ రాహుల్ 21 పరుగులే చేసి అవుట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)