ప్రెషర్ కుక్కర్ పేలకూడదంటే పాటించాల్సిన 9 జాగ్రత్తలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వితోర్ తవారిస్
- హోదా, బీబీసీ న్యూస్
దాదాపు ప్రతి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ వాడతాం. కుక్కర్‌లో వంట సులభం. ఆహార పదార్థాలు సమంగా ఉడుకుతాయి కూడా!
అయితే ప్రెషర్ కుక్కర్ పేలిపోయిందని, వంట చేస్తున్నవారికి గాయాలు అయ్యాయనే వార్తలు కూడా వింటుంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది?
ప్రెషర్ కుక్కర్‌ను సురక్షితంగా ఎలా వాడాలో తెలియకపోవడమే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
మరి, ఇది పేలకూడదంటే ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
ప్రెషర్ కుక్కర్ పేలకుండా ఉండాలంటే ఈ 9 జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- ప్రెషర్ కుక్కర్‌ను వినియోగించే ముందు సేఫ్టీ మాన్యువల్‌ను పూర్తిగా చదవాలి
- కుక్కర్‌లోని ఆవిరి బయటకు పంపే వాల్వ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
- కుక్కర్ సామర్థ్యానికి మించి ఆహార పదార్థాలను ఉడికించడం మంచిది కాదు.
- నీరు లేకుండా ప్రెషర్ కుక్కర్‌ను వినియోగించకూడదు.
- ప్లాస్టిక్ క్యాన్లు, పాత్రలు కుక్కర్‌లో పెట్టి వంట చేయొద్దు. దీని వల్ల అవి పేలిపోయే ప్రమాదం ఉంది.
- కుక్కర్‌ను గ్యాస్‌పై ఉడికించే ముందు మూత సరిగా పెట్టారో, లేదో చూసుకోవాలి.
- గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు, ఆవిరి మొత్తం పోయేంత వరకు ఆగాలి.
- ఒకవేళ త్వరగా మూత తెరవాలని అనుకుంటే, కుక్కర్‌పై చల్లటి నీటిని పోయాలి. కానీ, వాల్వ్ నుంచి వచ్చే ఆవిరిని తగలకుండా చూసుకోవాలి.
- మూత తెరిచే ముందు ఆవిరి మొత్తం పోయిందో, లేదో చూసుకోవాలి. బలవంతంగా మూత తీసే ప్రయత్నం చేయొద్దు.

ప్రెషర్ కుక్కర్ పేలి ముఖానికి గాయాలు, ఇంటి పైకప్పు ధ్వంసం
మధ్యాహ్న సమయంలో తన ఇంట్లో వంట చేస్తున్నారు బ్రెజిల్‌కు చెందిన 52 ఏళ్ల మరియా ద సిల్వ.
గ్యాస్ బర్నర్‌పై ఓ వైపు ప్రెషర్ కుక్కర్‌లో బీన్స్, మరోవైపు అన్నం వండుతున్నారు. ఉన్నట్లుండి ప్రెషర్ కుక్కర్ పేలిపోయి, కుక్కర్‌లోని బీన్స్ నేరుగా మరియా ముఖంపై చింది, ముఖం కాలిపోయింది.
“ఊహించని ఆ ఘటనకు నా కళ్లు మూసుకుపోయాయి. భయం, బాధతో కేకలు వేశాను. సాయం కోసం అరిచాను” అంటూ ఆ ఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆ ఘటనలో ఇంటి పైకప్పు దెబ్బతింది, వంటగది కిటికీలు ధ్వంసమయ్యాయి.
కుటుంబ సభ్యులు మరియాను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
సెకండ్ డిగ్రీ కాలిన గాయాలు అయ్యాయని వైద్యులు నిర్ధరించి, తొమ్మిది రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి, చికిత్స చేశారని చెప్పారు మరియా.
ఈ ప్రమాదం జరగడానికి వారం ముందు తన భర్త కుక్కర్ వాల్వ్‌ను గట్టిగా మూసివేశారని, ఇంట్లో వాళ్లు ఆ వాల్వ్ నుంచి వచ్చే శబ్దానికి భయపడకుండా ఉండటానికి అలా చేశారని తెలిపారు.
వినడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా, తమకు కుక్కర్‌లోని ఆవిరి బయటకు వెళ్లేందుకు వాల్వ్‌ను తెరిచే ఉంచాలన్న విషయం తెలియదని చెప్పారు.
మరియాకు, ఆమె భర్తకే కాదు, చాలా మందికి ప్రెషర్ కుక్కర్ పనితీరుపై అంత అవగాహన లేదు.
‘రోజు వారీ పరికరాల్లో దాగిన ఫిజిక్స్ గురించి తెలుసుకోవాలి’
“అవగాహనారాహిత్యమే భయాలకు, ప్రమాదాలకు కారణం” అన్నారు 70 ఏళ్ల వైద్యురాలు మార్కస్ బరెట్టో.
దశాబ్దాలుగా బ్రెజిల్‌లోని ఒక డెర్మటాలజీ సెంటర్‌లో సర్జన్‌గా సేవలందిస్తూ, ప్రెషర్ కుక్కర్ పేలిన ఘటనల్లో తన వద్దకు వచ్చే పేషంట్లకు ఆమె చికిత్స చేస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది పేద మహిళలు, గృహిణులు ఉంటారని, టీనేజర్లు కూడా గాయపడిన సందర్భాలు ఉన్నాయని డాక్టర్ బరెట్టో వివరించారు.
తన దగ్గరకు వచ్చిన కేసుల్లో చూపు కోల్పోయిన బాధితులు కూడా ఉన్నారని తెలిపారు.
“ప్రెషర్ కుక్కర్‌ను ఎలా వాడాలో తెలిసినవారు అసలు భయపడరు” అన్నారు ప్రొఫెసర్ జెనిర్.
“నా విద్యార్థుల్లో చాలా మంది ప్రెషర్ కుక్కర్ అంటేనే భయపడతారు. కానీ ప్రెషర్ కుక్కర్ పనితీరు, వాల్వ్‌ను శుభ్రం చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలిశాక వారిలో భయం పోతుంది. వాల్వ్ మూసుకుపోకుండా శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. కుక్కర్ పేలకుండా ఉండాలంటే, ముఖ్యంగా చూడాల్సింది ఇదే” అన్నారు.
దీనితోపాటు మూత, కుక్కర్ పాత్రను పూర్తిగా మూసివేసే రబ్బర్ వాచర్‌ను కూడా సరిచూసుకోవాలి.
బ్రెజిల్‌లోని ఒక ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ అయిన లియాండ్రో పొసామై, తన తరగతుల్లో ప్రెషర్ కుక్కర్‌ను ఎలా వినియోగించాలన్న అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరిస్తారు.
“మన రోజు వారీ పరికరాల్లో దాగున్న ఫిజిక్స్‌ను మనం అసలు గుర్తించం. కానీ విద్యార్థులకు ప్రయోగాలతో వివరిస్తే త్వరగా అర్థం చేసుకుంటారు” అన్నారు లియాండ్రో.
మెటీరియల్స్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన లియాండ్రో ఇంజినీర్ కూడా.
“ఉదాహరణకు హైస్కూల్ విద్యార్థులకు కుక్కర్‌లో ఒత్తిడి పెరిగినప్పుడు, గ్యాస్ బర్నర్ మంట స్థాయిని తగ్గించడం ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించవచ్చని తెలియాలి. అందుకు కారణమేంటంటే, కుక్కర్‌లో ఉన్న నీరు అప్పటికే ఉచ్చస్థాయి వేడిని గ్రహించేసుకుంది, ఇంక ఉడికించనవసరం లేదని తెలియాలి. దీని వలన వంట సమయం తగ్గడమే కాదు, గ్యాస్ కూడా ఆదా అవుతుంది’’ అని వివరించారు.
“అయితే, కొన్ని ఆహార పదార్థాలను వండే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒక్కోసారి వాల్వ్ మూసుకుపోయే ప్రమాదం ఉంది” అన్నారు లియాండ్రో.
“ఒకవేళ వాల్వ్ నుంచి నీరు బయటకు వస్తోందంటే అది చాలా ప్రమాదకరం. ఏదో తప్పు జరుగుతోందని గ్రహించాలి. వెంటనే గ్యాస్ ఆఫ్ చేయాలి. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి” అని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
- ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్‌లో మరణ శిక్ష.. అసలేం జరిగింది?
- పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఎందుకు మారలేదు? 4 ప్రధాన కారణాలు ఇవే...
- ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధానికి దిగుతుందా?
- ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ ఏనాటిది, ఎలా మొదలైంది? 9 పదాల్లో సంక్లిష్ట చరిత్ర
- గాజా ప్రజలను కాపాడండి: ఐక్యరాజ్య సమితిలో కన్నీరు పెట్టుకున్న పాలస్తీనా ప్రతినిధి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














