బ్రేకప్ మంచిది కాదు, కానీ అది మీకు మంచే చేస్తుందంటున్న నిపుణులు, ఎలా?

బంధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంధాలు తెగిపోవడం బాధాకరమైన విషయం

ప్రేమలో విఫలం కావడం, విడిపోవడం, బంధాలు తెగిపోవడం.. ఇవన్ని బాధాకరమైన అంశాలు. అంత త్వరగా బయటపడలేని మానసిక వేదనని కలిగిస్తాయి.

వీటి గురించి తరచూ వినడమే కాదు, మనమో, లేదంటే మన స్నేహితులో ఈ బాధను ఎదుర్కొనే ఉండొచ్చు.

అయితే, బ్రేకప్ కావడం, గుండెపగిలే సంఘటనలు, అనుభవాల వల్ల ఊహించని ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మనలో చాలామందికి ఈ విషయం తెలియదని అన్నారు రోజీ విల్బీ.

‘ది బ్రేక్-అప్ మోనోలాగ్స్’ పుస్తక రచయిత అయిన రోజీ విల్ఫీ, పుస్తకం రాయకముందు అదే పేరుతో పోడ్‌కాస్ట్ కూడా నిర్వహించారు.

ఈ పుస్తక రచనలో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించే కాకుండా, పోడ్ కాస్ట్ కోసం ఇంటర్వ్యూ చేసిన అతిథుల అనుభవాల ఆధారంగా మానవ సంబంధాలపై తనకు ఉన్న అవగాహనతో కొన్ని విషయాలను చర్చించారు.

ఈ పుస్తకం కోసం చాలామంది థెరపిస్టులు, సోషియాలజిస్టులు, శాస్త్రవేత్తలను కూడా కలిశారు. తన అనుభవాలను బీబీసీ రీల్స్‌తో పంచుకున్నారు రోజీ.

“బ్రేకప్ మంచిది కాదు కానీ, మీకు మంచే చేస్తుంది” అన్నారు.

ప్రేమలో విఫలం

ఫొటో సోర్స్, VCG/VCG VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రేమ కూడా ఒక వ్యసనం లాంటిదే అన్న రచయిత రోజీ విల్బీ

మనమేంటో మనకు తెలుస్తుంది

బ్రేకప్ వల్ల మన గురించి మనం పునరాలోచించడానికి, మనమెలాంటి వారమో తెలుసుకోవడంతోపాటు, మనకు రాబోయో భాగస్వామి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి? అన్న విషయాలపై స్పష్టత వస్తుందని అంటారు రోజీ విల్బీ.

“కొన్నిసార్లు బ్రేకప్ మనకు గుండెపగిలేలా చేదు అనుభవాలను ఇవ్వడంతోపాటు, మన గురించి మనకు తెలియని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ ఫలితాల వల్ల మనం భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకుంటాం” అన్నారు.

“విడిపోయిన బంధాలు మనకు కళ్లు తెరిపిస్తాయి” అన్నారు మెంటల్ హెల్త్, బిహేవియరల్ సైన్సెస్ నిపుణులైన డా. సమీర్ మల్హోత్రా.

“కొన్నిసార్లు బ్రేకప్‌ల వల్ల మనలో ఉన్న లోపాలు మనకు తెలుస్తాయి. మనల్ని మనం సరిదిద్దుకుంటాం. ఇది మనం బ్రేకప్‌ను ఎలా చూస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం ఎదుటివారిలోనే తప్పులు వెతుకుతూ పోతే, మనల్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయం” అని బీబీసీ ప్రతినిధి ఫాతిమా ఫర్హీన్‌తో అన్నారు డా. మల్హోత్రా.

“బ్రేకప్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికీ ఒక్కో అనుభవాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు బ్రేకప్ మనకు జీవిత పాఠాల్ని కూడా నేర్పిస్తుంది” అన్నారు దిల్లీకి చెందిన సైకాలజిస్ట్ పూజా శివం.

“దీని వల్ల మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. మనం కూడా ఆ బంధంలో మన వల్ల ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకోవాలి, వాటిని అంగీకరించాలి” అన్నారు.

వ్యసనంలా భావించొచ్చా?

ప్రేమ విఫలమై బాధపడే సందర్భాలను డ్రగ్ అడిక్షన్‌తో పోల్చారు రోజీ.

అందుకు గల కారణాన్ని ఆమె వివరిస్తూ, “డ్రగ్స్‌‌కు బానిస అయిన వారు వాటి నుంచి దూరంగా ఉన్న సమయంలో ఎంత వేదన పడతారో, గుండెపగిలిన వారు కూడా అలాంటి బాధనే అనుభవిస్తారు” అన్నారు.

దీనిపై డా. సమీర్ మల్హోత్రా స్పందిస్తూ, ’లవ్ కెమికల్‌గా పిలిచే ఆక్సిటోసిన్ హార్మోన్ మెదడులో ఎక్కువగా ఉత్పన్నమై, మనం ఇష్టపడే వారిని మరింత కావాలనుకునే చేస్తుందని, వారిపై ప్రేమ కలగడానికి అది కూడా కారణం “అని అన్నారు.

“చాలాసార్లు మెదడులో విడుదలయ్యే డోపమైన్ ప్రభావం వల్ల మనం ఇష్టపడే వారిని కలుసుకోవాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ బంధం తెగిపోతే ఆ వ్యక్తులు ఉండే మానసిక పరిస్థితీ, డ్రగ్‌‌కు అలవాటు పడిన వ్యక్తి అవి దొరక్కపోతే ఎలా బాధపడతారో అలానే అనిపిస్తుంది” అన్నారు.

love breakup
ఫొటో క్యాప్షన్, అందరికీ బ్రేకప్ చాలా కష్టతరమైనది

బ్రేకప్ వెంటనే మరో బంధం?

బంధాలను కొనసాగించడం వెనక ఎంతో శ్రమ ఉంటుందని రోజీ అన్నారు.

“బంధాలను కొనసాగించడం చిన్న విషయం కాదు. మన భాగస్వామి ఇష్టాయిష్టాలతోపాటు అన్నిటినీ మనం స్వాగతించాలి. ఇందుకోసం మన జీవితంలో చాలా మార్పులే రావొచ్చు..

బ్రేకప్ తర్వాత మన గురించి మనం ఆలోచించుకోవడానికి కాస్త సమయం తీసుకోవడం ముఖ్యం. ఆ విరామం తీసుకున్నాకే మరో బంధంలోకి అడుగుపెట్టాలి” అన్నారు.

“దీనర్థం జీవితాంతం బంధాలకు, ప్రేమకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవాలనో కాదు” అన్నారు.

డా. సమీర్ ఈ అభిప్రాయానికి జోడింపుగా, “చాలామంది ఓ బంధం నుంచి బయటకు రాగానే, మరో బంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇది తప్పు. దీనికన్నా మనతో మనకు ఏర్పరుచుకునే బంధం చాలా ముఖ్యం. మనకు మనమే నిబంధనలు పెట్టుకుని క్రమశిక్షణతో ఉండాలి. మన దృష్టి సృజనాత్మకపై ఉంటే బాగుంటుంది” అన్నారు.

“మన గురించి మనం ఆలోచించి, మనమేంటో తెలుసుకుంటే, పొరపాట్లను సరిదిద్దుకుని మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటాం. ఎవరో ఒకరు కావాలి, బంధాన్ని నలుగురికీ చూపించుకోవాలన్న ఆతృతతో అతను లేదా ఆమె వెంటపడి, బంధాలను ఏర్పరచుకోవడం వంటివి చేయకూడదు” అన్నారు.

డా.మల్హోత్రా దీని గురించి వివరిస్తూ, “రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాల గురించి చర్చించాలి. వాటిలో మొదటిది ఆరోగ్యకరమైన బంధం, రెండోది ఇద్దరిమధ్యా ఆరోగ్యకరమైన దూరం. అంటే, ఇద్దరూ ఒకరితో ఒకరు కలిసి ఉంటూనే, ఎవరికి వారు కాస్త సమయాన్ని కేటాయించుకోవడం ముఖ్యం. ఎందుకంటే, ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం అవసరం” అన్నారు.

love relationship

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మారుతున్న అభిప్రాయాలు..

మన దేశంలోనూ బ్రేకప్‌ల పట్ల భారతదేశంలోనూ అభిప్రాయాలు మారుతున్నాయని పూజా శివం అన్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం విషపూరితమైన బంధాల్లో కొనసాగుతూ మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించే బదులు, ఆ బంధానికి స్వస్తి పలకడమే మంచిదన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అయితే, మన దేశంలో ఇది ఇంకా క్లిష్టమైన అంశమే.

“బ్రేకప్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వారు, కుంగుబాటుకు లోనవకుండా ఆరోగ్యకరమైన అలవాట్లు, భిన్నమైన వ్యక్తులను కలవడం, తమకు తాము సమయాన్ని కేటాయించుకుని, జీవితాన్ని కొత్తగా ప్రారంభించడంపై దృష్టిసారించాలి” అన్నారు పూజా శివం.

“బ్రేకప్ తర్వాత కూడా మీరు సంతోషంగా ఉండగలరు” అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)