సచిన్ ‘49 సెంచరీల’ ప్రపంచ రికార్డును సమం చేయడంపై విరాట్ కోహ్లీ ఏమన్నాడు? తెందూల్కర్ ఇచ్చిన కితాబు ఏమిటి?

సచిన్, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సచిన్, విరాట్ కోహ్లీ (పాత ఫోటో)

"ఈ మ్యాచ్‌ ప్రపంచ‌ కప్‌లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువేనని అనుకున్నా. ఆ ఉత్సాహంతోనే ఈ రోజు నిద్రలేచా".

దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న అత్యధిక వన్డే సెంచరీల(49) ప్రపంచ రికార్డును తాను సమం చేయడంపై విరాట్ కోహ్లీ స్పందన ఇది.

ప్రపంచ‌కప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 49వ సెంచరీ కొట్టాడు.

తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును అందుకున్న కోహ్లీని సచిన్

ఎక్స్(ట్విటర్ )లో అభినందించాడు.

''విరాట్, బాగా ఆడావు. 49 (ఏళ్ల) నుంచి 50 (ఏళ్ల)కు రావడానికి నాకు 365 రోజులు పట్టింది. నువ్వు కొద్ది రోజుల్లోనే 49 నుంచి 50కి వెళ్లి , నా రికార్డును బ్రేక్ చేస్తావని ఆశిస్తున్నా. అభినందనలు!!'' అని సచిన్ రాశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

కోహ్లీ ఏమన్నాడు?

నవంబరు 5న తన 35వ పుట్టినరోజున కోహ్లీ ఈ సెంచరీ చేశాడు. సచిన్‌తో కలిపి పుట్టినరోజున సెంచరీ చేసిన ఏడుగురు బ్యాటర్లలో విరాట్ ఒకరు.

కోహ్లీ 121 బంతుల్లో 101 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.

‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌’గా నిలిచిన కోహ్లీని, సచిన్ ప్రశంసలపై అడిగినప్పుడు భావోద్వేగంతో స్పందించాడు. తన హీరో సచినేనని చెప్పాడు.

"తెందూల్కర్ సందేశం చాలా ప్రత్యేకం. నిజాయతీగా చెప్పాలంటే, వన్డే ఇంటర్నేషనల్స్‌లో నా హీరో రికార్డును సమం చేయడం నాకు చాలా పెద్ద గౌరవం. ప్రజలు పోల్చడాన్ని ఇష్టపడతారని తెలుసు, నేనెప్పుడూ ఆయనంత గొప్పగా ఉండనేమో. మనం సచిన్ వైపు చూడటానికి ఒక కారణం ఉంది. బ్యాటింగ్ విషయంలో సచిన్ పరిపూర్ణుడు. నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నా, నా దేశం కోసం గేమ్ గెలవడానికి ప్రయత్నిస్తున్నా. నా హీరో ఆయనే. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, సచిన్ ఆడుతుంటే టీవీలో చూసిన రోజులు నాకింకా గుర్తు. కాబట్టి ఇక్కడ నిలబడి ఆయన నుంచి ఈ ప్రశంసలు పొందడం అంటే నాకు చాలా ఎక్కువ" అని కోహ్లీ తెలిపాడు

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

'అభిమానులే దీనిని ప్రత్యేకం చేశారు'

కోహ్లీతోపాటు శ్రేయాస్ అయ్యర్ (87 బంతుల్లో 77 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ (24 బంతుల్లో 40), రవీంద్ర జడేజా(15 బంతుల్లో 29 పరుగులు) రాణించడంతో దక్షిణాఫ్రికాకు భారత్ 327 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా చతికిలపడింది. 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలడంతో భారత్ 243 పరుగుల తేడాతో భారీ విజయాన్నిసొంతం చేసుకుంది.

రవీంద్ర జడేజా ఐదు, మొహమ్మద్ షమి, కుల్‌దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. మొదటి వికెట్ మొహమ్మద్ సిరాజ్ పడగొట్టాడు.

టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పందించిన తీరు, తన బ్యాటింగ్ సరళిపై కోహ్లీ మాట్లాడుతూ- ''ఓపెనర్లు ఇచ్చిన ఆరంభం చూసి, బ్యాటింగ్ పిచ్ అనుకుంటారు. కానీ, బంతి పాతబడుతున్న కొద్దీ పరిస్థితులు మారుతుంటాయి. చివరి వరకు ఉండాలని మేనేజ్‌మెంట్ నుంచి మెసేజ్ వచ్చింది. జట్టు స్కోరు 315 దగ్గరికొచ్చాక అనుకున్నదానికంటే ఎక్కువే చేశామని మాకు తెలుసు. నేను నా ఆటను ఆస్వాదిస్తున్నా, దానికంటే ముఖ్యంగా జట్టు కోసం నా వంతు స్కోరు అందించగలుగుతున్నా'' అని చెప్పాడు.

"ఇది చాలా పెద్ద గేమ్. నిజాయతీగా చెప్పాలంటే మేం టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆడిన జట్లలో ఇదే(దక్షిణాఫ్రికానే) గట్టి ప్రత్యర్థి. వారు గొప్ప క్రికెట్ ఆడారు. జట్టు కోసం బాగా ఆడాలని ఉంటుంది. ఇది(49వ సెంచరీ) నా పుట్టినరోజున నమోదు కావడంతో, అభిమానులు నాకు ప్రత్యేకం చేశారు’’ అని వివరించాడు కోహ్లీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)