ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా: సమ ఉజ్జీల సమరంలో నెగ్గేదెవరు? ఏ జట్టు ‘టెన్షన్’ ఏమిటి?

రోహిత్ శర్మ, బవుమా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండియాను రోహిత్ శర్మ ముందుండి నడిపిస్తుండగా, కెప్టెన్ బవుమా ఫామ్ దక్షిణాఫ్రికాకు ఆందోళన కలిగిస్తోంది.

వన్డే ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు కోల్‌కతా వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి.

ఈ టోర్నీలో ఇరు జట్లు మంచి ఫామ్‌లో ఉండటమే కాదు, ప్రత్యర్థి జట్లను సునాయాసంగా ఓడిస్తున్నాయి.

ఇప్పటికే సెమీస్ చేరిన ఇండియా, సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో మొదటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. టోర్నీలో ప్రదర్శన పరంగా ఈ రెండు జట్లనే టైటిల్ ఫేవరెట్‌గా ఎక్కువ మంది అభిమానులతోపాటు విశ్లేషకులూ భావిస్తున్నారు.

దాంతో నేడు జరిగే మ్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని టీవీల ముందు కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు.

ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించి టోర్నీలో ఓట‌మే ఎరుగని జ‌ట్టుగా నిలిచింది టీమిండియా. మ‌రోవైపు సఫారీ జట్టు, ఒక్కటి మాత్ర‌మే ఓడి ఆరింటిలో గెలుపొందింది.

ఈ ఏడింటిలో టీమిండియా ఐదుసార్లు ఛేజింగ్ చేసి గెలిచింది. సౌతాఫ్రికా మాత్రం ఆరింటిలో ఐదుసార్లు మొదట బ్యాటింగ్ చేసి గెలిచింది.

సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల బలాబలాలెలా ఉన్నాయి? కీలక ఆటగాళ్లెవరు? ఏ ఆటగాడిని కట్టడి చేస్తే ఏ జట్టుకు ప్రయోజనం? కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎలా ఉంటుంది?

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

టీమిండియా బలాలు ఇవీ

కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత బ్యాటింగ్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. టాప్ -5 బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు.

సీనియర్ బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉండటం, కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టోర్నీలో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో జట్టును ముందుండి నడిపించడం టీమిండియాకు కొండంత బలం.

వీరికి తోడుగా యువ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ కూడా ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం.

ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ 442 పరుగులు చేయగా, రోహిత్ 402 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ టీమిండియాకు కీలకం కానున్నారు.

భారత జట్టుకు బలమేదంటే ఎక్కువగా వినిపించే విభాగం బ్యాటింగ్. అయితే ఈసారి బౌలింగ్ దళం కూడా టీమిండియాను టాప్‌లో నిలబెట్టింది.

బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

భారత బౌలింగ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది ముందుగా స్పిన్.

అయితే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీలతో కూడిన భారత పేస్ బౌలింగ్ త్రయం అంచనాలను తలకిందులు చేస్తూ టోర్నీలో దూసుకెళుతోంది.

ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను ఈ త్రయం కట్టడి చేస్తూ టీమిండియా విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు ఇండియా ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదుసార్లు ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేయడంలో వీరి పాత్ర కీలకం. ఈ ఐదింటిలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజీలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకలు ఉన్నాయి.

తమ బౌలర్ల అద్భుత ప్రదర్శనకు మాటలు రావడం లేదని, వారి గురించి ఏం చెప్పగలమని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు కూడా.

బుమ్రా ఏడు మ్యాచుల్లో 15 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్ల జాబితాలో కొనసాగుతున్నాడు.

షమీ అయితే 3 మ్యాచ్‌లలోనే 14 వికెట్లు తీశాడు. సిరాజ్ తనదైన రోజున ప్రత్యర్థి జట్టును ఎంతైనా ఇబ్బంది పెట్టగలడు. శ్రీలంకతో మ్యాచ్‌లో మిడిలార్డర్‌ను కుప్పకూల్చి, ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశాడు.

స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే 10 వికెట్లు తీశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కుల్దీప్ కీలకం కానున్నాడు.

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

బలహీనత అదే

జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా టోర్నీకి దూరమవడం టీమిండియాకు ఇబ్బంది కలిగించేదే.

జట్టులో ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా మీడియా సమావేశంలో స్పందించారు.

"నిజానికి మాకు సరైన ఆరో ఆప్షన్ లేదు. ఆరో బౌలర్ లేకుండానే గత నాలుగు మ్యాచ్‌లు ఆడాం" అని ద్రవిడ్ అన్నాడు.

ప్రపంచ కప్ ముందు కూడా ఆరో బౌలర్ లేకుండానే ఆడామని గుర్తుచేశారు ద్రవిడ్.

దక్షిణాఫ్రికా జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఒకప్పటి దక్షిణాఫ్రికా ఇదేనా?

ఐసీసీ ప్రధాన టోర్నీలో దురదృష్టవంతులెవరూ అంటే ముందుగా వినిపించే పేరు దక్షిణాఫ్రికా జట్టు. ‘చోకర్స్’ అని ఈ జట్టును ఎద్దేవా చేసేవారూ ఉన్నారు.జట్టులో ఎంత మంది స్టార్ ప్లేయర్లున్నా ఐసీసీ కీలక మ్యాచ్‌లకు వచ్చే సరికి చతికిలపడిపోతారనే అపప్రథే దీనికి కారణం.

నాకౌట్ వరకు ఎలాగో లాక్కొచ్చినా కీలక పోరులో తడబడతారు. బాగా ఆడిన రోజు వాతావరణం వారిని ఇబ్బంది పెట్టేది. వర్షం వల్ల వారిని టోర్నీలో ముందుకెళ్లకుండా చేసిన ఘటనలు ఉన్నాయి మరి! అలాంటి జట్టు ఈ వరల్డ్‌ కప్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది.

టోర్నీలో సఫారీ జట్టు ఆడిన మొదటి మ్యాచ్‌లోనే మిగతా జట్లకు సవాల్ విసిరే ప్రదర్శన చేసింది. శ్రీలంకపై ఏకంగా 428 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టులోని ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం గమనార్హం. ఆ తర్వాత ఆడిన మ్యాచ్‌లలో కూడా అదే తరహా ఆటతీరు ప్రదర్శించి, భారీ విజయాలు నమోదు చేసింది.

డీకాక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డీకాక్ అయితే టోర్నీలోనే టాప్ స్కోరర్

దక్షిణాఫ్రికా ప్రధాన బలం అతడే

ఓపెనర్ క్వింటన్ డీకాక్ అయితే టోర్నీలోనే టాప్ స్కోరర్. గత ఏడు మ్యాచ్‌లలో అతను 77.85 సగటుతో 545 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలున్నాయి.

మిగతా సఫారీ బ్యాటర్లు కూడా మంచి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

వాండర్ డసెన్ రెండు, మార్‌క్రమ్, క్లాసెన్‌లు చెరో సెంచరీ సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

ఇక సౌతాఫ్రికా బౌలింగ్ యూనిట్ కూడా బలంగానే ఉంది. ఆ జట్టు ప్రధాన బౌలర్ మార్కో జాన్సన్. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించాడు.

మరో ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ 14 వికెట్లు తీశాడు. స్పిన్నర్ తబ్రైజ్ షంషీ రెండు మ్యాచ్‌లే ఆడినా 6 వికెట్లు తీశాడు.

బవుమా

ఫొటో సోర్స్, Getty Images

ఆందోళన కలిగిస్తున్న కెప్టెన్ ఫామ్

సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్ బవుమా ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. కీలక టోర్నీలో జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ పరుగులు చేయడంలో తడబడుతున్నాడు.

ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో 22.20 సగటుతో కేవలం 111 పరుగులు మాత్రమే చేశాడు. తమ కెప్టెన్ కీలక మ్యాచ్‌లోనైనా ఫామ్‌లోకి రావాలని సఫారీలు ఆశిస్తున్నారు.

కుల్దీప్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధానాస్త్రాలు స్పిన్నర్లేనా?

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్ సాధారణంగా స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంటుంది. అయితే ఈసారి పిచ్ అటు ఫాస్ట్, ఇటు స్పిన్ రెండింటికి అనుకూలంగా ఉండే అవకాశముందని క్రిక్ ఇన్ ఫో వార్తాసంస్థ తెలిపింది.

ఇరు జట్ల స్పిన్ బలాలు పరిశీలిస్తే టీమిండియాకు కుల్దీప్ యాదవ్ ప్రధానాస్త్రంగా మారే అవకాశం ఉంది.

కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షంషీని భారత్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.

మైదానంలో మంచు ప్రభావం చూపే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)