పుట్టిన రోజు కానుకగా గ్రనేడ్, ఆర్మీ చీఫ్ సన్నిహితుడి దుర్మరణంపై అనుమానాలేంటి?

ఫొటో సోర్స్, UKRAINIAN MEDIA
- రచయిత, పాల్ కిర్బీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పుట్టిన రోజు కానుకగా వచ్చిన గ్రనేడ్ పేలడంతో యుక్రెయిన్ సాయుధ దళాల అధినేత వాలెరీ జలుజ్నీ సన్నిహితుడు హెన్నాడీ చెస్ట్యకోవ్ దుర్మరణం పాలయ్యారు.
39 ఏళ్ల మేజర్ హెన్నాడీ చెస్ట్యకోవ్ పుట్టిన రోజు సందర్భంగా సహోద్యోగులు ఇచ్చిన బహుమతులను తీసుకుని తన ఫ్లాట్‌కి వచ్చారు.
కొడుకుతో కలిసి ఈ బహుమతులను తెరిచి చూస్తున్నప్పుడు గ్రనేడ్ పేలింది.
ఈ ప్రమాదంలో హెన్నాడీ చెస్ట్యకోవ్ అక్కడికక్కడే మరణించగా...ఆయన 13 ఏళ్ల కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు.
‘‘గిఫ్ట్‌గా వచ్చిన గ్రనేడ్‌ను హెన్నాడీ కొడుకు తన చేతులోకి తీసుకుని రింగ్‌ను పట్టుకుని తిప్పడం ప్రారంభించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన హెన్నాడీ పిల్లాడి చేతులో నుంచి గ్రనేడ్‌ను లాగేసుకుంటుండగా గ్రనేడ్ పేలింది’’ అని హోమ్ మంత్రి ఐహోర్ క్లైమెంకో చెప్పారు.
ఈ ప్రమాదాన్ని ‘‘విషాదకరమైన ఘటన’’గా అభివర్ణించారు. దీనిపై అధికారిక విచారణ జరుగుతుందని, అప్పటి వరకు ప్రజలు శాంతంగా ఉండాలని మంత్రి కోరారు.
కియోవ్ శివారుల్లోని చైకీలో ఉన్న ఫ్యామిలీ ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన పేలుడు పదార్థాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జరిగిందని పోలీసులు అంటున్నారు.
అయితే, ఇదే ఫ్లాట్‌లో మరో ఐదు గ్రనేడ్లను గుర్తించారు.
సైన్యంలోని తన సహోద్యోగుల నుంచి మేజర్ హెన్నాడీకి ఈ బహుమతులు వచ్చినట్లు క్లైమెంకో తెలిపారు.
ఘటన జరిగిన ప్రాంతంలో ఫ్లాట్‌లోని ఫ్లోర్‌పై ఇతర గిఫ్ట్ బ్యాగ్‌లతో పాటు గ్రనేడ్లను కూడా చూడొచ్చు. విస్కీ బాటిల్‌తో సహా బ్యాగ్‌లో గ్రనేడ్‌ను తీసుకొచ్చినట్లు తెలిసింది.
గ్రనేడ్ ఆకారంలో ఉన్న గ్లాస్‌లతో పాటు గిఫ్ట్ బ్యాగ్‌లో బాటిల్ ఉందని, ఆయన బ్యాగ్ తెరవడానికి ప్రయత్నించేటప్పుడు పేలుడు జరిగిందని యుక్రెయిన్‌కా ప్రావ్‌దా అనే యుక్రెయిన్ వార్తా సంస్థకు సంబంధిత వర్గాలు తెలిపాయి.
‘‘మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేయడం చాలా కష్టం. అందుకే, కంబాట్ గ్రనేడ్లు, మంచి విస్కీ బాటిల్‌ను ఇస్తున్నాను’’ అంటూ ఈ బహుమతిని ఇచ్చేటప్పుడు ఆయన సహోద్యోగి చెప్పినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.
సన్నిహితుడిని కోల్పోయిన జనరల్ జలుజ్నీ, యుక్రెయిన్ సైన్యానికి, వ్యక్తిగతంగా తనకి హెన్నాడీ చెస్ట్యకోవ్ మరణం తీరని నష్టమని కన్నీళ్లు పెట్టుకున్నారు.
2022 ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి మేజర్ చెస్ట్యకోవ్ ఆయన దగ్గర నమ్మకమైన వ్యక్తిగా పని చేశారని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
యుక్రెయిన్ సైన్యానికి చెస్ట్యకోవ్ మరణం భారీ ఎదురుదెబ్బ.
ఇటీవల దక్షిణ ప్రాంతం జపోరిజ్జియాలో యుద్ధక్షేత్రానికి దగ్గర్లో జరిగే ఒక అవార్డుల కార్యక్రమంపై రష్యా జరిపిన దాడిలో 19 మంది సైనికులు మరణించారు.
ప్రమాదకరమైన ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
మేజర్ చెస్ట్యకోవ్ మరణం నిర్లక్ష్యం వల్ల జరిగిందని ప్రొ ప్రెసిడెన్షియల్ ఎంపీ మర్యానా బెజుల్హా చెప్పారు.
‘‘ నిర్లక్ష్యం కారణంగా పుట్టిన రోజునే హెన్నాడీ చెస్ట్యకోవ్ చనిపోతారని నేనసలు అనుకోలేదు. గ్రనేడ్లను బహుమతులుగా ఎవరూ ఇవ్వరు’’ అని ఆయన అన్నారు.
కొంతమంది యుక్రెయిన్ నిపుణులు ఈ పేలుడుకు గల కారణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జనరల్ జలుజ్నీని లక్ష్యంగా చేసుకున్నారని, తన సన్నిహితుడు హెన్నాడీ చెస్ట్యకోవ్ పుట్టిన రోజు వేడుకలకు ఆయన హాజరవుతారని వారు భావించారని అందుకే గ్రనేడ్లను బహుమతిగా ఇచ్చినట్లు కొందరు అంటున్నారు.
రష్యా ఆక్రమణ దళాలకు వ్యతిరేకంగా యుక్రెయిన్ యుద్ధ పరిస్థితిని గత వారమే చీఫ్ కమాండర్ సమీక్షించారు.
ఈ యుద్ధంలో ప్రతిష్టంభన ఏర్పడిందనే వార్తలను ఇటు క్రెమ్లిన్, అటు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఖండించారు.
‘‘ ప్రజలు అలసిపోయారు. వివిధ రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ, ఎలాంటి ప్రతిష్టంభన లేదు’’ జెలెన్‌స్కీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ భూకంపం: ‘ప్లేట్లు, గిన్నెలతో తవ్వి శిథిలాల కింద ఉన్న వారి కోసం వెతికాం’
- మీ నియోజకవర్గం అభ్యర్థులు వీరే...119 స్థానాలలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే
- సెమీస్‌లో ఇండియా ప్రత్యర్థి ఎవరు? భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడతాయా?
- టైమ్డ్ అవుట్: అప్పీల్ వెనక్కి తీసుకోనన్న షకీబ్, ఇది కామన్‌సెన్స్‌కు సంబంధించిన అంశమన్న మాథ్యూస్
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














