నేపాల్ భూకంపం: ‘ప్లేట్లు, గిన్నెలతో తవ్వి శిథిలాల కింద ఉన్న వారి కోసం వెతికాం’

నేపాల్ భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శార్ద్ కేసీ
    • హోదా, బీబీసీ నేపాల్

నేపాల్‌లో సంభవించిన భూకంపం సృష్టించిన విధ్వంసం కారణంగా 150 మందికి పైగా చనిపోయారు. 350 మందికి పైగా గాయపడ్డారు.

నిరాశ్రయులుగా మారిన వేలాదిమంది, చలిలో బయటే పడుకుంటున్నారు.

భూకంపంతో తీవ్రంగా ప్రభావితమైన జాజర్‌కోట్, పశ్చిమ రుకుమ్ జిల్లాలు శుక్రవారం నుంచి అనేకసార్లు చిన్న చిన్న ప్రకంపనలకు లోనయ్యాయి.

భూకంప ప్రభావితులైన ఈ మారుమూల గ్రామాల్లో బీబీసీ పర్యటించింది. బాధితులను కలిసింది.

నేపాల్ భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మట్టి ఇళ్లకు తీవ్ర నష్టం కలిగింది

భూకంప మృతుల భారీ చితి

జాజర్‌కోట్ జిల్లా నాల్గడ్ మున్సిపాలిటీ పరిధిలోని చివురీ గ్రామం దిగువన థులీ భేరీ నది ప్రవహిస్తుంది.

నదీ ప్రవాహంతో పాటు అక్కడి వారి రోదనలు కూడా వినిపిస్తున్నాయి. నదీ ఒడ్డున 13 మంది భూకంప మృతులను ఉంచారు. మృతుల్లో మహిళలతో పాటు పిల్లలు కూడా ఉన్నారు.

ఆత్మీయులను కోల్పోయిన బాధతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన కొందరు మహిళలను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

చివురి గ్రామంలో మరణించిన మహిళలు, పిల్లలతో కలిపి 13 మంది మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు.

ఆరు మృతదేహాలను ఒకే చితిపై ఉంచి దహనం చేశారు. మిగతా వారికి వేర్వేరుగా చితిని ఏర్పాటు చేశారు.

చివురి గ్రామంలో 186 ఇళ్లు ఉంటాయి. మరణించిన వారిలో దళిత బస్తీలో నివసించే హీరె కామీ, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఒకవేళ త్వరగా స్పందించి ఉంటే హీరె కామీ బతికి ఉండేవారని ఆయన బంధువులు, పొరుగువారు అంటున్నారు.

నేపాల్ భూకంపం

‘‘అర్ధరాత్రి గ్రామంలో రోదనలు, బాధలు మిన్నంటాయి. ఏం జరుగుతుందో మాకేం అర్థం కాలేదు. మేం చూసినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న హీరె కామీ మాట్లాడుతూనే ఉన్నాడు’’ అని ఆనాటి రాత్రి ఘటనను హరి బహదూర్ చునారా తలుచుకున్నారు.

హీరె కామీని రక్షించడానికి ప్రయత్నించిన వారిలో హత్తీరామ్ మహర్ అనే యువకుడు కూడా ఉన్నాడు.

ఆ ఇంటి శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడానికి గ్రామస్థులంతా గిన్నెలు, ప్లేట్లు, ఇంట్లోని ఇతర సామగ్రితో తవ్వుతూ శిథిలాలను తొలగించడానికి ప్రయత్నించినట్లు హత్తీరామ్ చెప్పారు.

హీరె రామ్ ఇరుక్కుపోయిన చోటును చూపించారు మహర్. ‘‘నేనిక్కడ ఉన్నానంటూ హీరె రామ్ అరిచాడు. మేం అతను ఉన్న వైపుకు వెళ్లాం. అంతలోనే అతను చనిపోయాడు’’ అని మహర్ గుర్తు చేసుకున్నాడు.

తన లాగే హీరె కామీ కూడా భారత్‌లో పనిచేసేవాడని హత్తీరామ్ చెప్పారు. కొన్ని రోజుల క్రితమే ఇంటికి తిరిగొచ్చాడని తెలిపాడు.

నేపాల్‌లో అతిపెద్ద పండుగల్లో ఒకటైన తిహార్ వేడుకల అనంతరం తాము తిరిగి భారత్ వెళ్లాల్సి ఉందని ఆయన చెప్పారు.

ఆయన కూతుళ్లలో పెద్దదైన ఒక బాలిక ప్రాణాలతో బయటపడ్డారు. తన కుటుంబం అంతా చనిపోయిందని తెలుసుకున్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

చితి మంటలు ఆరగానే బాధలో ఉన్న గ్రామస్థులంతా కొండపైన ఉన్న తమ గ్రామం వైపు నడిచారు. భూకంపం కారణంగా ఆ గ్రామం అంతా ధ్వంసమైంది.

నేపాల్ భూకంపం
ఫొటో క్యాప్షన్, చివురీ గ్రామంలో ఒకేసారి 13 మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు

సహాయం కోసం బాధితుల నిరీక్షణ

సహాయం కోసం ఎదురుచూస్తోన్న హరి బహదూర్ చునారా మాట్లాడుతూ, తల దాచుకోవడానికి తమకింత చోటు కూడా లేదని చెప్పారు.

తమకు సహాయం అందుతుందో లేదో అనే సందిగ్ధంలో ఆయన ఉన్నారు.

భూకంప ప్రభావానికి ఎక్కువగా గురైన ప్రాంతాల్లో జాజర్‌కోట్‌లోని నాల్గడ్ మున్సిపాలిటీ ఒకటి.

ఇక్కడ 52 మంది చనిపోయినట్లు మున్సిపాలిటీ సమాచార అధికారి జునా షాహి చెప్పారు.

కానీ, ప్రాణాలతో బయటపడిన వారికి ఎలా సహాయం చేయాలో అర్థం కావట్లేదని అన్నారు.

చలి నుంచి పిల్లలను ఎలా రక్షించాలో తెలియట్లేదని హత్తీరామ్ మహర్ ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘వారు రాత్రంతా బయటే ఉండాల్సి వస్తోంది. టెంట్లు అందిస్తే సహాయకంగా ఉండేది’’ అని మహర్ అన్నారు.

భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులుగా మారారు

థులీ భేరీ నదికి మరో ఒడ్డున ఆఠ్‌బిస్కోట్ మున్సిపాలిటీలో నివసించే గణేశ్ మల్లాను ఆసుపత్రిలో చేర్చారు. ఆయనను హెలీకాప్టర్‌లో ఆసుపత్రికి తీసుకొచ్చారు.

‘‘నా ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. భార్య, కుమారుడికి దెబ్బలు తగిలాయి. వారు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు’’ అంటూ ఆయన రోదించారు.

భూకంపం వచ్చిన తర్వాత ఉదయం పూట గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారి వివరాలను తొలుత తెలుసుకోలేదు.

‘‘మొదట మేం కేస్-1, కేస్-2 అని రాసుకుంటూ గాయపడిన వారికి చికిత్స చేయడం మొదలుపెట్టాం. కొంతమందికి దుస్తులు కూడా లేవు. మేమే ఇచ్చాం’’ అని ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ పదమ్ గిరి చెప్పారు.

ఆయన చెప్పినదాని ప్రకారం, ఆ ఆసుపత్రిలో 30 మంది క్షతగాత్రులకు చికిత్స జరుగుతోంది.

నేపాల్ భూకంపం

నేపాల్ భూకంపం కేంద్రం

భూకంప కేంద్ర స్థానమైన బారెకోట్‌లో అంతగా నష్టం జరగలేదని అంటున్నారు.

భూకంప ప్రభావానికి గురైన అన్నిప్రాంతాల్లో మట్టి, రాళ్లతో కట్టిన ఇళ్లన్నీ ధ్వంసం అయ్యాయని బీబీసీతో స్థానిక టీచర్ గణేశ్ జీసీ చెప్పారు.

కొన్ని ఇళ్లు, ఒక గ్లాస్ పగిలినట్లుగా పగిలిపోయాయని ఆయన అన్నారు. కొన్ని ఇళ్లలో గోడలు కూలిపోగా, కొన్ని బీటలు వారినట్లు చెప్పారు.

కాంక్రీట్, సిమెంట్ ఇళ్లు దెబ్బతినలేదని అన్నారు.

‘‘వరదలు వచ్చినా , కొండచరియలు విరిగిపడినా పేదవారే ఇబ్బంది పడతారు. భూకంపం కూడా పేదవారికే నష్టాన్ని కలిగించింది’’ అని ఆయన వాపోయారు.

వీడియో క్యాప్షన్, భూకంపంతో భర్తను, కడుపులో బిడ్డను కోల్పోయిన మహిళ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)