దొడ్డిదారిన అమెరికా వెళ్లి పట్టుబడిన 96 వేల మంది భారతీయులు.. వాళ్లంతా అక్కడి వరకు ఎలా వెళ్లారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
నిరుడు అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య కాలంలో సుమారు 96 వేల 917 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి పట్టుబడ్డారు.
అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన తాజా గణాంకాలతో ఈ విషయం బయటపడిందని వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇలా అక్రమంగా అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య కొన్నేళ్లుగా పెరుగుతూ పోతోంది.
2020-21లో 30,662 మంది, 2021-22లో 63,927 మంది దొడ్డిదారిన అమెరికా వెళ్లారు.
ఇలా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన సుమారు 97 వేల మంది భారతీయుల్లో ఎక్కువ మంది గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల వారు.
పట్టుబడినవారిలో 30 వేల మంది కెనడా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, 41 వేల మంది మెక్సికో బార్డర్ వైపు నుంచి ప్రయత్నించారు.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి పట్టుబడినవారిలో కుటుంబాలు, ఒంటరి యువకులు, మైనర్లు ఉన్నారు. అక్కడ చనిపోయిన వారిలో ఒంటరి యువకులతోపాటు 730 మంది మైనర్లు ఉన్నారు.

ఫొటో సోర్స్, POOL/GETTY IMAGES
అమెరికన్ ఎంపీ ఏమన్నారు?
ఈ విషయంపై యూఎస్ సెనేట్‌లో చర్చ జరిగింది.
''అరెస్టైన వారిలో ఒక్కొక్కరూ నాలుగు విమానాలు మారుతూ అమెరికా బార్డర్‌కు చేరుకున్నారు. కొంత మంది ఫ్రాన్స్ మీదుగా మెక్సికో వచ్చి, అక్కడి నుంచి బార్డర్‌కు సమీపంలోని విమానాశ్రయానికి, మళ్లీ అక్కడి నుంచి బస్సుల్లో బార్డర్‌కు చేరుకున్నారు'' అని సెనేటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డ్ నవంబర్ 2న యూఎస్ సెనేట్‌లో చెప్పారు.
''ఒక్క 2023లోనే 45 వేల మందికి పైగా భారతీయులు దక్షిణ సరిహద్దు నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు'' అని ఆయన తెలిపారు.
మూడంచెల వ్యవస్థ
గుజరాత్ నుంచి అక్రమంగా అమెరికాకు పంపిస్తున్న 'త్రీ లేయర్ నెట్‌వర్క్' (మూడంచెల వ్యవస్థ)ను ఇటీవల గుజరాత్ పోలీసులు ఛేదించారు. ఆ ముఠా నాయకుడు భరత్ పటేల్ అలియాస్ బాబీ పటేల్‌ను అరెస్టు చేశారు.
బాబీ పటేల్ అరెస్టుతో ఈ త్రీ లేయర్ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పోలీసుల కథనం ప్రకారం...
మొదటి లెవల్ - గుజరాత్:
ఎవరైనా అక్రమంగా అమెరికాకు వెళ్లాలనుకుంటే బాబీ పటేల్‌ను, లేదా అతని మనుషులను కలుస్తారు. వారే అందుకు అవసరమైన పత్రాలను ఏర్పాటు చేస్తారు.
అలా వెళ్లాలనుకునే వ్యక్తికి పాస్‌పోర్టు ఉంటే దానికి అనుగుణంగా పత్రాలు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ పాస్‌పోర్టు లేకపోతే అది కూడా వాళ్లే చూసుకుంటారు.
అక్కడి నుంచి యూరప్, లేదా కెనడా వెళ్లేందుకు వీసా తెప్పిస్తారు. అందుకు అవసరమైన బ్యాంకు ఖాతా దగ్గరి నుంచి ఐటీ రిటర్న్స్ వరకూ అన్నీ వాళ్లే చూసుకుంటారు. లేదంటే, నకిలీ కంపెనీలతో నకిలీ పత్రాలు తయారు చేస్తారు.
ఎవరైనా ఒక వ్యక్తి బాబీ లేదా అతని మనుషులను కలిసినప్పుడు వాళ్లు చేసే మొదటి పని అతనికి ఏ దేశం నుంచి సులభంగా విజిటర్ వీసా వస్తుందో పరిశీలించడం.

ఫొటో సోర్స్, Getty Images
రెండో లెవల్ - దిల్లీ:
మొదటి లెవల్‌లో పత్రాలు ఏర్పాటైన తర్వాత, విజిటర్ వీసాపై ఏ దేశానికి వెళ్లాలనుకొంటున్నారో దిల్లీలోని సదరు దేశపు దౌత్య కార్యాలయానికి ఆ వ్యక్తి వెళ్లాల్సి ఉంటుంది.
దిల్లీ ప్రయాణం, అక్కడ ఏర్పాట్లన్నీ దిల్లీలో ఉండే వ్యక్తి చూసుకుంటారు.
మూడో లెవల్ - మెక్సికో:
అలా స్కెంజెన్ వీసా పొందిన వ్యక్తి స్వేచ్ఛగా యూరోపియన్ యూనియన్‌లోని 22 దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
అక్కడి నుంచి మెక్సికో వెళ్లొచ్చు. ఒకవేళ వీసా దొరక్కపోతే 'వీసా ఆన్ అరైవల్' విధానం మెక్సికోలో ఉంది. అలా యూరోపియన్ వీసాతో సులభంగా అమెరికా సరిహద్దుకు చేరుకోవచ్చు.
ఉదాహరణకు, ఎవరికైనా యూరోపియన్ యూనియన్‌లోని ఆస్ట్రియా, హంగేరీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు విజిటర్ వీసా లభిస్తే అక్కడ కొద్ది రోజులు ఉండి, అక్కడి నుంచి వీసా ఆన్ అరైవల్ విధానం కింద మెక్సికో చేరుకోవచ్చు. అక్కడి నుంచి సులభంగా అమెరికా బార్డర్‌కు వెళ్లొచ్చు.
గుజరాత్ నుంచి మెక్సికో చేరుకునే వరకూ ఈ మూడంచెల వ్యవస్థ అన్ని వ్యవహారాలూ చూసుకుంటుంది.

ఫొటో సోర్స్, REUTERS
'పావురం' పద్ధతిలో అక్రమంగా అమెరికాకు..
అమెరికాలోకి అక్రమ చొరబాట్లు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. అయితే, 9/11 దాడుల తర్వాత టూరిస్ట్ వీసా, వర్కింగ్ వీసా, పౌరసత్వం వంటి చట్టాలను అమెరికా కఠినతరం చేసింది. దానితో పాటు, అక్రమ చొరబాటుదారుల సమస్యపై కూడా దృష్టి పెట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో పంజాబీలు, హరియాణాకు చెందిన చాలా మంది అమెరికా వెళ్లి స్థిరపడేందుకు 'పీజియనింగ్' (పావురం) పద్ధతిని అనుసరిస్తున్నారు. వ్యక్తులను అక్రమంగా అమెరికాకు పంపించే ప్రక్రియను పీజియనింగ్‌గా పిలుస్తున్నారు.
సమాచారం చేరవేసేందుకు పావురాలను ఉపయోగించే పద్ధతి భారత్‌లో శతాబ్దాలుగా ఉంది. ఒక నైపుణ్యం కలిగిన పావురం పెంపకందారు పావురాన్నిపెంచి, దానికి శిక్షణ ఇచ్చి శాంతిదూతగా లేదా సమాచారం చేరవేసేందుకు ఉపయోగించేవారు.దాని నుంచి ఈ పీజియనింగ్ అనే పదం పాపులర్ అయింది.
అదే తరహాలో అమెరికా వెళ్లాలనుకునే వారిని క్రీడా పోటీలు, పంజాబీ సంగీత పర్యటనలు, భజనలు, భక్తి సంగీతం పేరుతో అమెరికాకు తీసుకెళ్తారు.
అలా చట్టపరంగా అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత తమ పాస్‌పోర్టును ధ్వంసం చేసి అక్కడ ఉండిపోతారు.
ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్లిన ఆర్గనైజర్ మొక్కుబడిగా స్థానిక అధికారులకు సమాచారం ఇస్తారు. ఇలాంటి ‘పీజియన్ల’ గురించి తెలిసినప్పటికీ అక్కడి అధికారులు పెద్దగా పట్టించుకోరు.
అలా అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండేందుకు చేసే ప్రయత్నం ఒక్కసారి ఫలిస్తే, ఇక అతను అక్కడ స్థిర నివాసం ఉంటున్న తమ ఊరి వారినో లేక తెలిసిన వారినో సంప్రదిస్తారు. వాళ్లు అక్కడ ఉండేందుకు ఆశ్రయం కల్పించడంతోపాటు పని, ఆహారం వంటి సౌకర్యాలు కల్పించేందుకు సాయం చేస్తారు.
గుజరాతీల కంటే పంజాబ్, హరియాణా నుంచి ఇలాంటి పీజియన్లు ఎక్కువగా ఉంటారని ఆ వ్యాపారంతో సంబంధమున్న వ్యక్తులు చెబుతున్నారు.
ఇటీవల పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ 19 ఏళ్ల నాటి ఇలాంటి ఒక కేసులో అరెస్టయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
'డాంకీ రూట్'
ఏదైనా దేశం వెళ్లేందుకు వివిధ దేశాల మీదుగా దొడ్డిదారిలో వెళ్లడాన్ని 'డాంకీ ఫ్లైట్' విధానంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు దానినే డాంకీ రూట్‌గా కూడా పిలుస్తున్నారు.
''గాడిదలు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు ఆ ప్రదేశమంతా తిరుగుతాయని, అలాగే విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులు దొడ్డిదారిలో చుట్టూ తిరిగిరావడంతో 'గాడిద' అనే పదం స్థిరపడిందని, ఆ తర్వాత అదే పదాన్ని మీడియా కూడా వాడడం మొదలుపెట్టింది'' అని పంజాబ్ జర్నలిస్ట్ దలీప్ సింగ్ చెప్పారు.
మొదట్లో ఈ పదం స్థానికంగానూ, వార్తాపత్రికలకే పరిమితం. అయితే, వాషింగ్టన్ డీసీలో 'మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్' 2014 ఫిబ్రవరి నివేదికలో 'డాంకీ ఫ్లైట్స్' అనే పదాన్ని ప్రస్తావించడంతో ఆ పదం అంతర్జాతీయంగా స్థిరపడిపోయింది.
అక్రమంగా ఇంగ్లండ్ వెళ్లాలనునే వారు స్కెంజెన్ వీసా అనుమతి ఉన్న దేశాలకు విజిటింగ్ వీసాపై వచ్చి, అక్కడి నుంచి ఇంగ్లండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
ఆ సమయంలో ఇంగ్లండ్ యూరోపియన్ యూనియన్‌లో భాగంగా ఉండడంతో స్కెంజెన్ వీసా దేశాల నుంచి సులభంగా వెళ్లే అవకాశం ఉండేది. ట్రక్కుల్లో దాక్కుని, చిన్నచిన్న పడవల్లో యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి అక్రమంగా ఇంగ్లండ్ వెళ్లేందుకు ప్రయత్నించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాకు చాలా దారులు
''ఎక్కడి నుంచి, ఏ మార్గంలో అమెరికా వెళ్లాలనేది ఆ వ్యక్తి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి వయసు, లింగం, విద్యార్హతలు, ఆర్థిక స్తోమత, రిస్క్ తీసుకునే సామర్థ్యం, శారీరక దారుఢ్యం వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. వాటిని బట్టి ఆ వ్యక్తికి ఏది సరైన మార్గమో ఎంచుకుంటాం'' అని విదేశాలకు పంపించడమే వ్యాపారంగా చేసుకున్న ఒక బ్రోకర్ చెప్పారు. ఆయన తన వివరాలు బయటికి చెప్పేందుకు ఇష్టపడలేదు.
''కొంత మంది అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే ఉద్యోగం చేయాలని అనుకుంటారు. మరికొందరు చదువుకుంటూనే డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అక్కడ కాలేజీలు, యూనివర్సిటీల్లో వంద శాతం హాజరు తప్పనిసరనే నిబంధనలు ఉన్నాయని చెబుతుంటాం. ముఖ్యంగా కెనడా, మెక్సికో బార్డర్‌లు అనువుగా ఉంటాయి'' అని ఆయన అన్నారు.
''ఎవరైనా డాంకీ ఫ్లైట్ విధానాన్ని ఎంచుకుంటే వాళ్లు లాటిన్ అమెరికా లేదా దక్షిణ అమెరికా మీదుగా సుదీర్ఘమైన, ప్రమాదకరమైన ప్రయాణం చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత దిల్లీ, ఇంకా విదేశీ బ్రోకర్లను సంప్రదించాలి. వాళ్ల కమీషన్లు కూడా అందులో ఉంటాయి. ఖర్చు ఎక్కువవుతుంది. అయినా, వంద శాతం గ్యారెంటీ లేదు'' అన్నారు.
ఎవరైతే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి, వారి ప్రొఫైల్ నిబంధనలకు అనుకూలంగా లేదో అలాంటి వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అలాంటి వాళ్లు అమెరికా చేరుకోగలిగినప్పటికీ అక్కడ చాలా కష్టపడి పనిచేసేందుకు సిద్ధపడాల్సి ఉంటుంది.
అమెరికా వెళ్లేందుకు సుమారు రూ.20 లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ ఖర్చవుతాయి. అలాగే, దారిలో ఎదురయ్యే డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలు, అవినీతి అధికారులకు సమర్పించుకునేందుకు అదనంగా డబ్బులు అవసరమవుతుంటాయి. ప్రయాణంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యల వల్ల ఖర్చు పెరుగుతుంటుంది.
ఇవి కూడా చదవండి:
- ‘‘కళ్లు తెరచి చూసేసరికి, సైనికుల కాలి దగ్గర పడి ఉన్నాను. గాయపడిన నా కాలిపై వారు ఆరు సిగరెట్లతో కాల్చారు.’’
- సముద్రంలోనే నివాసం, శరణార్థులకు ఆవాసంగా విలాసవంతమైన ఓడ
- ‘మా దేశం నుంచి వెళ్లిపోండి’.. భారతీయ విద్యార్థులకు కెనడా హెచ్చరిక.. వారి అడ్మిషన్లు ఫోర్జరీవంటూ ఆరోపణలు
- అమెరికా ఆశలు చూపించి బాలి తీసుకెళ్లి బంధించారు.. భారతీయులను కిడ్నాప్ చేస్తున్న ఇండొనేసియా ముఠా
- మహిళల అక్రమ రవాణా: ‘అమ్మాయిలంటే వాళ్లకు జంతువులతో సమానం, అమ్మడం, కొనడం వాళ్లకు మామూలే’














