రష్మిక మందన్న: డీప్‌ ఫేక్ బారిన ‘పుష్ప’ హీరోయిన్. అసలేమిటీ డీప్‌ ఫేక్, వీటి తయారీ అంత సులువా?

రష్మిక మందన్న

ఫొటో సోర్స్, Rashmika Mandanna/@AbhishekSay

ఫొటో క్యాప్షన్, రష్మిక మందన్న

హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ అభ్యంతరకర వీడియో సామాజిక మాధ్యమాలను కుదిపేస్తోంది. దీనిని డీప్ ఫేక్ వీడియోగా గుర్తించారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్మిక మందన్నకూడా ఈ ఘటనపై తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా స్పందించారు.

‘‘ఆన్‌లైన్‌లో ప్రచారమవుతున్ననా డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి రావడం చాలా బాధిస్తోంది. ఈ విషయం నన్ను ఒక్కదానినే కాదు, టెక్నాలజీ దుర్వినియోగం వలన బాధితులుగానూ, నిస్సహాయులుగాను మారిన అందరిని తీవ్ర భయానికి గురిచేస్తోంది. ఈ రోజున ఒక మహిళగా, నటిగా నేను నా కుటుంబానికి, స్నేహితులకు, నాకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే ఘటన నేనే కాలేజీలోనో, స్కూల్లోనో ఉన్నప్పుడో జరిగి ఉంటే, నేను దీనిని ఎలా ఎదుర్కొని ఉంటానో ఊహించలేకపోతున్నాను. ఈ డీప్ ఫేక్ బారిన మరింత మంది పడకుండా ఉండేందుకు ఓ సమాజంగా మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని రష్మిక తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

దీనిపై నెటిజన్లనుంచి ఆమెకు మద్దతు లభించింది. ప్రసిద్ధ నటుడు అమితాబ్‌ బచ్చన్ కూడా దీనిపై స్పందించారు. చట్టానికి ఇదో బలమైన కేసు అని ఆయన ట్వీట్ చేశారు.

రష్మిక మందన్న

ఫొటో సోర్స్, @SrBachchan/X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ బారినపడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆన్‌లైన్‌లో నకిలీలు ఎంత సులువుగా జరుగుతున్నాయో ఇదొక హెచ్చరికలాంటిదన్నారు.

నకిలీలసైబర్ బెదిరింపుల నుంచి భారతీయ మహిళలను రక్షించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆమె అభ్యర్థించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఇండియా టుడే కథనం ప్రకారం ఈ వీడియోను సోషల్ మీడియాలో కోటి 40లక్షలమందికిపైగా చూశారు. అభిషేక్ కుమార్ అనే జర్నలిస్ట్ ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఇండియాలో డీప్‌ఫేక్ సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు.

రష్మిక మందన్న

ఫొటో సోర్స్, @AbhishekSay/X

రష్మిక మందన్న

ఫొటో సోర్స్, Getty Images

వీడియోలో ఏముంది?

ఇండియాటుడే కథనం ప్రకారం ఈ వీడియో అక్టోబరు 9న ఇన్‌స్టాలో షేర్ అయింది. వీడియోలో ఉన్న మహిళ నల్లటి అవుట్ ఫిట్ ధరించిన బ్రిటీషు ఇండియన్ జారా పటేల్. ఈమెకు ఇన్‌స్టాలో 4లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు.

ఈమె లిఫ్ట్‌లోకి ప్రవేశించే ఆ వీడియోనే డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా రష్మికదిగా మార్చారు. ఈ వీడియోను సునిశితంగా గమనిస్తే లిఫ్ట్‌లోకి ప్రవేశిస్తున్న జారాపటేల్ ను లిఫ్ట్ డోర్ వద్ద రష్మికలా మార్చారని అర్థమవుతుంది.

అయితే ఈ వీడియోను ఎవరు సృష్టించారన్నది తెలియలేదని ఆ కథనం పేర్కొంది.

ఈ డీప్‌ పేక్ వీడియోపై కేంద్ర సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ (ట్విటర్)లో తీవ్రంగా స్పందించారు. తప్పుడు సమాచారానికి సంబంధించి డీప్ ఫేక్ అత్యంత ప్రమాదకరం, హానికరమైనవిగానూ పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈవిషయంలో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ చట్టప్రకారం నడుచుకోవాలని, యూజర్లు తప్పుడు సమాచారం పోస్టు చేయకుండా అడ్డుకోవాలని, ఇలాంటి సమాచారన్ని, వీడియోలను 36 గంటల్లోగా తొలగించాలని, లేనిపక్షంలో భారతీయ శిక్షాస్మృతి రూల్ 7 కింద బాధితులు కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు.

డిజిటల్ యూజర్ల భద్రతకు, నమ్మకానికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

రష్మిక మందన్న

ఫొటో సోర్స్, @Rajeev_GoI/X

రష్మిక మందన్న

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ డీప్‌ఫేక్ వీడియోలు?

ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్ కంటే ప్రమాదకరమైనవి డీప్ ఫేక్ వీడియోలు. వీటి సాయంతో వీడియోలో మనుషుల్నే మార్చేయొచ్చు. లేని మనుషుల్ని ఉన్నట్లు, చేయని పనుల్ని చేసినట్లు చూపించొచ్చు.

ఎక్కువగా సెలెబ్రిటీలే ఈ డీప్ ఫేక్‌ల బారిన పడుతున్నారు. చాలామంది పోర్న్ స్టార్ల శరీరాలకు సెలెబ్రిటీల మొహాలను జోడించి డీప్ ఫేక్ పోర్న్ వీడియోలను రూపొందిస్తున్నారు. రివెంజ్ పోర్న్ కోసం కూడా వీటిని ఉపయోగిస్తున్నారు

సోషల్ మీడియాలో లక్షకు పైగా మహిళల చిత్రాలను నకిలీ పద్దతుల ద్వారా నగ్నంగా మార్చి ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నట్లు ఒక నివేదిక తెలిపింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫొటోల్లో మహిళల ఒంటిపై ఉన్న దుస్తులను డిజిటల్‌గా తొలగించి,

ఆ న్యూడ్ ఫోటోలను టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారు.

కొంత మంది దీని కోసం చిన్న వయసు పిల్లలను కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇంటలిజెన్స్ కంపెనీ సెన్సిటీ తెలిపింది.

కాకపోతే, ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఒక కంపెనీ మాత్రం దీనిని కేవలం వినోదం కోసమే చేస్తున్నట్లు చెబుతోంది.

బీబీసీ ఈ సాఫ్ట్‌వేర్‌ని పరిశీలించింది. సాఫ్ట్‌వేర్‌ పనితనం అంత సవ్యంగా కనిపించలేదు.

ఈ వ్యవహారంలో "డీప్ ఫేక్ బాట్" ని వాడినట్లు సెన్సిటీ చెబుతోంది.

కంప్యూటర్ ద్వారా నిజమైన చిత్రాలను, వీడియోలను పోలినట్లు ఉండే డీప్ ఫేక్‌ని సృష్టిస్తారు. ఇవి అచ్చంగా నిజమైన ఫొటోలలానే కనిపిస్తాయి. కొంత మంది సెలబ్రిటీల నకిలీ నగ్న చిత్రాలను తయారు చేసేందుకు ఈ టెక్నాలజీ వాడుతూ ఉంటారు.

అయితే, ప్రైవేటు వ్యక్తుల ఫోటోలను ఇలా చేయడం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామమని సెన్సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జో ప్యాట్రిని అన్నారు.

“ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడానికి సోషల్ మీడియాలో పబ్లిక్‌గా పెట్టిన ఫోటోలు చాలు" అని ఆయన హెచ్చరించారు.

అబ్రహం లింకన్

ఫొటో సోర్స్, MYHERITAGE

డీఫ్ ఫేక్ తో ఫేక్ న్యూస్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా కంప్యూటర్లో రూపొందించిన వీడియోలను డీప్ ఫేక్ అంటారు. వాటిని ప్రస్తుత ఫొటోల ద్వారా రూపొందిస్తారు.

ఇజ్రాయెల్ కంపెనీ డీ-ఐటీ 'డీప్ నోస్టాల్జియా' టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, సజీవంగా ఉన్నవారి అంతకు ముందు వీడియోల ఆధారంగా ఆ కంపెనీ తమ అల్గారిథంకు శిక్షణ ఇచ్చింది. దాని ద్వారా ప్రజల ముఖాలు, వాళ్ల భావాలు మార్చి వీడియోలు రూపొందించవచ్చు.

మై హెరిటేజ్ వెబ్ సైట్‌లో క్వీన్ విక్టోరియా, ఫ్లోరెన్స్ నైటింగేల్ లాంటి చారిత్రక ప్రముఖుల యానిమేటెడ్ వీడియోలు చేశారు. ఈ నెల మొదట్లో ఒక కంపెనీ ఇదే టెక్నాలజీని ఉపయోగించి ఒక అబ్రహాం లింకన్‌ వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది. దానిని లింకన్ జన్మదినం సందర్భంగా పోస్ట్ చేశారు.

ఈ వీడియో కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ మాట్లాడుతున్నట్లు చూపించారు.

ఈ టెక్నాలజీని ఉపయోగించి చాలామంది తమ పూర్వీకుల యానిమేటెడ్ వీడియోలు చేసి ట్విటర్‌లో పెట్టడం మొదలెట్టారు. కొంతమంది వాటిని అద్భుతంగా ఉన్నాయని చెబితే, మరికొంతమంది మాత్రం ఈ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు.

డిసెంబర్‌లో చానల్ 4 ఒక 'డీప్ ఫేక్ క్వీన్‌' వీడియోను రూపొందించింది. అందులో రాణి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. ఈ టెక్నాలజీ ద్వారా ఎలా ఫేక్ న్యూస్‌ వ్యాపించేలా చేయవచ్చో ఈ వీడియోతో హెచ్చరించారు.

నకిలీ ఫోటోలు, వీడియోలు

ఓటర్లను మభ్యపెట్టేందుకు డీప్ ఫేక్ అస్త్రాలు

ప్రస్తుతం అనేక పరిణామాలకు దారితీస్తున్న నకిలీ వార్తలే ఓ పెద్ద సమస్య అనుకుంటుంటే, కొంతకాలంగా డీప్ ఫేక్ వీడియో, ఆడియోలు, చిత్రాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.

నకీలీ వార్తల మాదిరిగానే కొందరు ఉద్దేశపూర్వకంగా డీప్ ఫేక్ వీడియో, ఆడియో క్లిప్పులు, ఫొటోలు రూపొందించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది.

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రత్యర్థులు డీప్ ఫేక్‌లను అస్త్రాలుగా వాడుకునే ప్రమాదం ఉందని కొందరు అమెరికా రాజకీయ నాయకులు అంటున్నారు.

"ఇప్పటికే నకిలీ ఫొటోలతో మన మధ్య విభేదాలు సృష్టించేందుకు, అసంతృప్తులను ప్రోత్సహించేందుకు అమెరికా శత్రుదేశాలు ప్రయత్నిస్తున్నాయి" అని అమెరికా రపబ్లికన్ సెనేటర్ మార్కో రుబియో కొన్ని నెలల క్రితం ఆరోపించారు.

అత్యాధునిక అప్లికేషన్లతో రూపొందించే డీప్ ఫేక్‌లను గుర్తించడం పెను సవాలుగా మారుతోందని సైబర్ సెక్యూరిటీ సంస్థ జీరీఫాక్స్‌కు చెందిన నిపుణుడు మాథ్యూ ప్రైస్ అన్నారు.

కొత్త రకమైన కృత్రిమ మేధస్సుకు డీప్ ఫేక్ ఒక ఉదాహరణ. ఏదైనా భావజాల వ్యాప్తికి డీప్ ఫేక్‌లను రూపొందిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది.

ఉచిత సాఫ్ట్‌వేర్లతో డీప్ ఫేక్‌లను సులువుగా తయారు చేయొచ్చు. అందుకే కొన్ని దేశాలు ఈ విషయంలో కొత్త చట్టాలను రూపొందిస్తున్నాయి. చాలా దేశాలు డీప్ ఫేక్ నేరాలను హింస, బ్లాక్‌మెయిల్, కాపీరైట్ చట్టాల పరిధిలోకి తెస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :