ఇత్సాక్ రాబిన్: ఈ ఇజ్రాయెల్ ప్రధాని హత్య జరగకపోతే పాలస్తీనా చరిత్ర మరోలా ఉండేదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పౌలా రోసాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నఇజ్రాయెలీలు, పాలస్తీనియన్ల మధ్య సయోధ్యను తీసుకువచ్చి, శాంతికి బాటలు వేయాలనుకున్న ఓ గట్టి ప్రయత్నం అర్ధంతరంగా ఆగిపోయి 28 ఏళ్లవుతోంది.
ఇజ్రాయెల్ ప్రధాని ఇత్సాక్ రాబిన్ హత్యతో పాలస్తీనా భూభాగాల్లో శాంతి నెలకొనే ఆశలకు బీటలు వారాయి. అప్పటి నుంచి రక్తపాతం జరుగుతూనే ఉంది.
ఇంతకీ ఈ ఇత్సాక్ రాబిన్ ఎవరు? చరిత్రను తిరగరాయాలన్న ఆయన ప్రయత్నం, ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య శాంతిని నెలకొల్పాలన్న ఆయన లక్ష్యాలకు వచ్చిన అడ్డంకులేంటి?

ఫొటో సోర్స్, Getty Images
ఆ క్షణాలు..
1995 నవంబర్ 4న యూదు జాతీయవాది యిగల్ అమీర్ తన తుపాకీతో ఇజ్రాయెల్ ప్రధాని ఇత్సాక్ రాబిన్‌పై కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు ఇత్సాక్ శరీరంలోకి దూసుకువెళ్లి, ఆయన ప్రాణం తీశాయి.
ఇత్సాక్ గనుక మరణించకపోయి ఉంటే ఇజ్రాయిలీలు పాలస్తీనియన్ల మధ్య శాంతి నెలకొనేదని ఇప్పటికీ అనేకమంది అంతర్జాతీయ నిపుణులు నమ్ముతారు.
ఈ హత్యకు రెండేళ్ల ముందు ఇజ్రాయెల్ ప్రధాని ఇత్సాక్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) నాయకులు యాసిర్ అరాఫత్‌లు ఇద్దరూ కలిసి పాలస్తీనా ఏర్పాటును గుర్తిస్తూ ఓస్లో ఒప్పందాలపై సంతకాలు చేసి, నవ్వుతూ కరచాలనం చేసుకున్నారు.
దీనితో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు వస్తుందని ఇటు ఇజ్రాయెలీయులు, అటు పాలస్తీనియన్లలో భావించారు. దీంతో అతివాద ఇజ్రాయెలీ సంస్థలు, హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణలు, రక్తపాతాలు ఆగుతాయనుకున్నారు.
అయితే, దీనిని వ్యతిరేకిస్తూ ఇప్పటి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో ప్రతిపక్షాలు, ఇతర సంస్థలు నిరసనలు చేశాయి. వీరి నుంచి ఇత్సాక్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.
బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్ జెరెమి బోవెన్ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇత్సాక్‌ను వ్యతిరేకిస్తూ, ఆయన అరాఫత్, కుఫియా (పాలస్తీనియన్లు ధరించే స్కార్ఫ్)లు ధరించినట్లుగా ఉన్న పోస్టర్లు వెలిశాయని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ పట్టు కోల్పోయేలా ఇత్సాక్ తీసుకున్న నిర్ణయాన్ని ఇజ్రాయెలీ అతివాదులు జీర్ణించుకోలేకపోయారు.
హమాస్ మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్‌లో ఆత్మాహుతి దాడులకు చేస్తుండగా, వారికి లొంగిపోయి, భూభాగాన్ని వారికి ఇచ్చేసి, ఒక దేశాన్ని ఏర్పాటు చేసేందుకు రూపొందించిన ఓస్లో ఒప్పందంపై ఇత్సాక్ సంతకం చేయడాన్ని క్షమించలేకపోయారు.
4 నవంబర్ 1995న ఇత్సాక్ టెల్అవీవ్ నగరంలో లక్షమంది ప్రజల సమక్షంలో శాంతి ఒప్పందాలపై తన నిర్ణయాన్ని వెల్లడించారు.
“నేను 27 ఏళ్లు మిలటరీలో సేవలు అందించాను. శాంతి స్థాపన కోసం పోరాటం చేశాను. ఇప్పుడు ఆ సందర్భం వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వారి తరఫున, లేని వారి తరఫున కూడా శాంతిస్థాపన కోసం త్యాగానికి ముందుకు వచ్చాను. ఎక్కువశాతం ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారని నమ్ముతున్నాను” అని అన్నారు ఇత్సాక్.
ఆ ప్రసంగం తరువాత అందరూ షిర్ లాషలోమ్ (శాంతి గీతం) ఆలపించారు. వేదికను దిగిన క్షణానే యిగల్ అమీర్ తన తుపాకీతో, ఇత్సాక్‌ను వెనుకనుంచి రెండుసార్లు కాల్చారు. ఇత్సాక్ కోటులో రక్తంతో తడిసిన శాంతిగీతపు కాగితం లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
శాంతి కోసం ప్రయత్నం
ఇజ్రాయెలీ లేబర్ పార్టీకి చెందిన ఇత్సాక్ రాబిన్ రెండు పర్యాయాలు ప్రధానిగా గెలుపొందారు. 1992లో రెండోసారి గెలిచారు.
ఇజ్రాయెల్ పౌరులు మిలటరీలో సేవలు అందించడం గర్వకారణంగా భావిస్తారు. ఇత్సాక్ రాబిన్ తన కెరీర్‌ను మిలటరీ సర్వీస్‌తోనే ప్రారంభించారు. ఆయన పని చేసిన యూనిట్ ఇజ్రాయెల్ ఏర్పాటు తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్)గా మారింది.
1948లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం నాటికి ఐడీఎఫ్ కమాండర్‌గా, సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగారు ఇత్సాక్.
1967లో ఆర్మీ చీఫ్‌గా ఇత్సాక్ నేతృత్వంలో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో శత్రువులపై ఐడీఎఫ్ విజయం సాధించింది. వారం కన్నా తక్కువ సమయంలోనే ఈజిప్టు, జోర్డాన్, సిరియా, ఇరాక్‌ల సైన్యాలను ఓడించడమే కాక, సినయ్, ది గోలన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్ భూభాగాలను స్వాధీనం చేసుకుంది.
ఇత్సాక్ రాబిన్‌కు తన మిలటరీ కెరీర్‌లోనే ఇది అత్యున్నత దశ. ఆ విజయం తర్వాత, చాలామంది మిలటరీ అధికారులు అనుసరించిన మార్గాన్నే ఇత్సాక్ కూడా ఎంచుకొని, రాజకీయాల్లో చేరారు.
తొలుత వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్ అంబాసిడర్‌గా పనిచేశారు. 1973లో తిరిగి ఇజ్రాయెల్‌కు వచ్చిన సమయంలో పార్లమెంట్‌లో లేబర్ పార్టీకి డిప్యూటీగా ఎన్నికయ్యారు.
1974లో గోల్డా మెయిర్ రాజీనామా అనంతరం 1974-77ల మధ్య కాలంలో దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత 1992లో రెండోసారి ప్రధానిగా ఎన్నికై, మరణించే వరకు అదే పదవిలో కొనసాగారు.
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇజ్రాయెల్ ప్రజల్లో ఆయన పట్ల ఉన్న నమ్మకం, ఆయన మిలటరీ కెరీర్ పట్ల ఉన్న రికార్డ్ వలన ఓస్లో ఒప్పందానికి కావలసిన మద్దతు లభించింది.
“ఇత్సాక్ శాంతి స్థాపన ప్రయత్నం చివరి అవకాశమేమీ కాదు. కానీ గుర్తించదగ్గది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ పునాదుల్లో ఆయన కూడా ఒకరు. కాబట్టి ఆయన పట్ల ప్రజల్లో నమ్మకం ఉంది. ఆయన జీవితంలోని చివరి దశలో ఆయనలో వచ్చిన మార్పు నిజాయితీతో కూడుకున్నది” అని హార్వర్డ్ యూనివర్సిటీలో యూదుల చరిత్ర విభాగ ప్రొఫెసర్ డెరిక్ పెన్సలర్ అన్నారు.
ఇత్సాక్ యుద్ధాల్లో పాల్గొన్నారు. సైన్యాన్ని ముందుండి నడిపించారు. ఇజ్రాయెల్ భద్రతకు ముఖ్యమైన సైన్యాన్ని ఉద్దేశించి ఆయన చేసే ప్రసంగాలు ఇలానే సాగేవి.
“రిజర్వ్ లెఫ్టినెంట్ జనరల్, ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికుడిని, 30,743 గుర్తింపు నంబరు కలిగిన ఇత్సాక్ రాబిన్ అనే నేను.. శాంతి స్థాపన కోసం ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడని సైనికులను పోరాటానికి పంపిన నేను, ఈరోజు చెప్తోంది ఏంటంటే, మనం పోరాటాన్ని కొనసాగిస్తున్నాం.. రక్తపాతం లేని, మరణాలు లేని, గాయాలు లేని, నొప్పిలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. శాంతిస్థాపన కోసం సాగే పోరాటంలో పాల్గొంటున్నందుకు నేను గర్వపడుతున్నాను” అంటూ సైనికుల్లో స్ఫూర్తిని కలిగించేలా సాగేవి.
“ఇజ్రాయెల్ ప్రధాని పదవికి సరైన న్యాయం చేయగలిగిన వ్యక్తి ఇత్సాక్ రాబిన్” అని కాలిఫోర్నియా యూనివర్సిటీలోని వై&ఎస్ నజారియన్ సెంటర్ ఫర్ ఇజ్రాయెల్ స్టడీస్ డైరెక్టర్ డావ్ వాక్స్‌మన్ చెప్పారు.
“అరుదైన రీతిలో శాంతి ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లి, పూర్తి చేయడంలో ఇజ్రాయెల్ ప్రధాని రాబిన్ విజయం సాధించారు. తన సుదీర్ఘ మిలటరీ అనుభవం, సమర్థత వలన ఇజ్రాయెల్ పౌరులకు నమ్మకాన్ని కలిగించడంలో ఆయన సఫలమయ్యారు. తమ భద్రతలో ఏమాత్రం రాజీపడని ఇజ్రాయెల్ యూదులను ఆయన ఒప్పించగలిగారు” అన్నారు.
ఈ మద్దతుతోనే 1991 మ్యాడ్రిడ్ శాంతి సమావేశం, 1978 క్యాంప్ డేవిడ్ ఒప్పందాల పునాదులపై రూపుదిద్దుకున్న ఓస్లో ఒప్పందాలకు కీలకంగా వ్యవహరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓస్లో ఒప్పందం ఏంటి?
మిడిల్ ఈస్ట్ లాంటి అస్థిర వాతావరణంలో శాంతి చర్చలు జరగాలంటే వాటిని అత్యంత జాగ్రత్తగా జరపాల్సి ఉంటుంది.
అందుకే పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల శాంతి బృందాలు 1993లో నార్వే రాజధాని ఓస్లోలో రహస్య చర్చలు ప్రారంభించాయి. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో వైట్‌హౌస్‌లో మొదటి ఓస్లో ఒప్పందం (ఓస్లో 1 )పై సంతకం చేయడం ద్వారా ఈ చర్చలు ముగిశాయి.
అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఎదుట ఇజ్రాయెల్ తరఫున ఇత్సాక్ రాబిన్, పాలస్తీనా తరఫున యాసిర్ అరాఫత్ కరచాలనం చేసుకోవడంతో చరిత్రలో అసాధ్యమనుకున్న ఘటన సుసాధ్యంగా మారింది.
అంతేకాదు 1994లో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి షిమాన్ పెరెెజ్, పీఎల్ఓ అధ్యక్షుడు యాసిర్ అరాఫత్‌తో కలిసి ప్రధాని ఇత్సాక్ రాబిన్ నోబెల్ శాంతి బహుమతిని పంచుకున్నారు. అనంతరం రెండో ఓస్లో ఒప్పందంపై 1995లో సంతకాలు జరిగాయి.
పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల తరఫున శాంతి చర్చల ప్రతినిధిగా గుర్తించడం ప్రారంభమైంది.
దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించడానికి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అంగీకరించింది. తీవ్రవాద మార్గాన్ని విడిచిపెట్టిన పీఎల్ఓ నాయకులు జనజీవన స్రవంతిలోకి వచ్చారు.
ఓస్లో ఒప్పందాల ప్రకారం పాలస్తీనియన్లకు వారి పట్టణ ప్రాంతాలపై పరిమిత స్వీయ అధికారాలు లభించాయి. ఇది పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ (పీఎన్ఏ) ఏర్పాటుకు దారితీసింది.
అయితే, ఈ ఒప్పందాల కాలపరిమితి ఐదు సంవత్సారాలే. ఆ తర్వాత మళ్లీ చర్చలు జరిపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని ఒప్పందాల సమయంలో ఇరు పక్షాల నేతలు అంగీకరించారు.
అప్పటి నుంచి 30 సంవత్సరాలు గడిచినా, ఈ ఆకాంక్ష వాస్తవ రూపం దాల్చలేదు. చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పుడు శాంతి గురించి మాట్లాడే పరిస్థితే లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇత్సాక్ హత్యతో శాంతి ప్రక్రియ ఆగిపోయిందా?
ఇత్సాక్ రాబిన్ హత్య ఓస్లో ఒప్పందంపై తీవ్ర ప్రభావం చూపిందని చాలామంది అంగీకరిస్తారు. రాబిన్ మరణం తరువాత, షిమాన్ పెరెజ్ అధికారంలోకి వచ్చారు. కానీ, ఒక ఏడాది తర్వాత నెతన్యాహు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.
"నెతన్యాహు శాంతి ప్రక్రియను ఆపనప్పటికీ, దానిని నిర్వీర్యం చేయడానికి, అది పాలస్తీనా రాజ్యస్థాపన దిశగా అడుగులు వేయకుండా ఉండటానికి తాను చేయాల్సిందంతా చేశారు" అని ప్రొఫెసర్ డావ్ వాక్స్‌మాన్ అన్నారు.
అక్టోబర్ 7 నాటి హమాస్ ఎటాక్‌లాగే నాడు ఇత్సాక్ రాబిన్ హత్య ఇజ్రాయెలీలను షాక్‌కు గురి చేసిందని టెల్ అవీవ్ యూనివర్సిటీలో యూదుల చరిత్రను బోధించే ప్రొఫెసర్ ఒరిట్ రోజిన్ అంటారు.
శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడానికి షిమాన్ పెరెజ్ భయపడ్డారని రోజిన్ అన్నారు.
ఇజ్రాయెలీలు తీవ్రవాదాన్ని ఎన్నడూ సమ్మతించనప్పటికీ ఇత్సాక్ రాబిన్ హత్యను కొంతమంది ఇజ్రాయెలీలు పండగలా జరుపుకున్నారని ఆమె తెలిపారు.
‘‘ఆ రాత్రి సెటిల్‌మెంట్‌లలో నివసించే ఓ యూదు పూజారి నాకు ఫోన్ చేసి ఇక్కడి ఇళ్లలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నట్లు చెప్పారు’’ అని రోజిన్ వెల్లడించారు.
హత్యకు మూడు వారాల ముందు, 19 ఏళ్ల యువకుడొకరు టెలివిజన్‌లో రాబిన్ కాడిలాక్ కారు మీద ఉన్న చిహ్నాన్ని పెరికేశారు.
"మేం ఆయన కారు దాకా వచ్చాం. త్వరలో ఆయన దగ్గరకు కూడా వెళతాం’’ అని హెచ్చరించారు.
ఆయన పేరు ఇటమార్ బెన్ జివిర్. ప్రస్తుతం ఆయన ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి.
‘‘హమాస్ ఆత్మాహుతి దాడులు, ఇజ్రాయెల్ అతివాదులు కలిసి శాంతి ప్రక్రియను చంపేశారు’’ అని ఒరిట్ రోజిన్ అన్నారు.
రాబిన్ మరణం తర్వాత పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ పక్షాలు రెండూ శాంతి ప్రక్రియను కొనసాగించడానికి ప్రయత్నించలేదని విశ్లేషకులు అన్నారు.
రాబిన్ హత్య జరగ్గకపోయి ఉంటే ఏమయ్యేదో చెప్పడం కష్టం. పాలస్తీనా దేశానికి భవిష్యత్ పరిమితులు, శరణార్థుల పునరాగమనం, జెరూసలేం స్టేటస్, పాలస్తీనా భూభాగాల్లోని యూదుల స్థావరాలు వంటి ఒప్పందంలోని అనేక అంశాలు గురించి మాట్లాడకుండానే చర్చలు అంతర్ధానమైపోయాయి.
‘‘రాబిన్ స్వయంగా తాను పాలస్తీనా ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదు. కానీ, ఈ ఒప్పందాలు ఎటు దారితీస్తాయో ఆయనకు స్పష్టంగా తెలుసు" అని డావ్ వాక్స్‌మాన్ అన్నారు.
‘‘పాలస్తీనా ఒక రాజ్యంలాగే ఉంటుందని, కానీ దానిపై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతుందని, జెరూసలేం, జోర్డాన్ రివర్ వ్యాలీ తమ పరిధిలోనే ఉంటాయని నెస్సెట్ (ఇజ్రాయెల్ పార్లమెంటు)లో ఆయన చాలాసార్లు చెప్పారు’’ అని కొలంబియా విశ్వవిద్యాలయంలో చరిత్రకారుడు రాచిద్ ఖలీదీ గుర్తు చేసుకున్నారు.
పేరుకు ఓస్లో ఒప్పందాలు అమలులో ఉన్నా అవి ఎప్పుడూ పూర్తిగా ఆచరణలో లేవు. ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన ఏఎన్‌పీ తన విశ్వసనీయతను కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.
శాంతి మార్గంలోకి వెళ్లడానికి 2008లో ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ ఓల్మెర్ట్, ఏఎన్‌పీ నేత మహమూద్ అబ్బాస్ మధ్య చర్చలకు ప్రయత్నాలు జరిగాయని ప్రొఫెసర్ డెరిక్ పెన్సలర్ అన్నారు.
"నెతన్యాహు మరోసారి ప్రధాని అయ్యాక అవన్నీముగిసి పోయాయి" అని పెన్సలర్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
- ‘ఈసీ’ కోళ్లఫారాలు ఎలా పెడతారు? ఒక్కసారి రూ.కోటి పెట్టుబడి పెడితే ఏటా 35 లక్షల వరకు ఆదాయం వస్తుందా?
- ఇజ్రాయెల్ పక్షాన ఉంటూ గాజాకు సాయం చేయడంలో మోదీ ఆంతర్యం ఏమిటి?
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















