గాజా: అంబులెన్స్‌ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడి, 15మంది చనిపోయారన్న పాలస్తీనా రెడ్ క్రెసెంట్

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, అల్-షిఫా ఆసుపత్రి వద్ద వైమానిక దాడులు

గాజా సిటీలోని పెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫా ఎదుట ఉన్న అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 15 మంది వరకు చనిపోయి ఉంటారని ‘ది పాలస్తీనా రెడ్ క్రెసెంట్’ వెల్లడించింది.

ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను బీబీసీ వెరిఫై బృందం పరిశీలించింది.

అల్-షిఫా ఆసుపత్రి బయట రక్తపు మడుగులో మృతదేహాలు, గాయపడిన వారి దృశ్యాలు ఉన్నాయి.

ఇజ్రాయెల్ మిలటరీ కూడా ఈ దాడిని ధ్రువీకరించింది. ఆ అంబులెన్స్‌ను హమాస్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారని పేర్కొంది.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వైమానిక దాడిలో ధ్వంసమైనట్లుగా చెబుతున్న అంబులెన్స్

దాడుల వీడియోలు..

“హమాస్ సంస్థ మిలిటెంట్లను, ఆయుధాలను రవాణా చేసేందుకు ఈ అంబులెన్స్‌ను వినియోగిస్తోంది. ఐడీఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అంబులెన్స్‌పై దాడి చేసింది” అని ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలేవీ వెల్లడించలేదు.

“ఆ ప్రదేశం వార్ జోన్ అని, పౌరులు తమ భద్రత దృష్ట్యా అక్కడి నుంచి దక్షిణ ప్రాంతాలకు వెళ్లిపోవాలని పదే పదే చెప్పాం” అని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.

అందుకు ముందు అల్-షిఫా ఆసుపత్రి బయట జరిగిన పేలుడులో 13 మంది చనిపోయారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలుగా పేర్కొన్న మూడు వీడియోలను బీబీసీ వెరిఫై బృందం పరిశీలించింది.

ఒక వీడియోలో రోడ్డు పక్కనే రక్తపు మడుగులో కొంతమంది కదులుతుండగా, కొంతమంది వ్యక్తులు చలనం లేకుండా పడి ఉన్నారు.

ఆ ఫుటేజీలో బాంబు దాడి కారణంగా ఏర్పడిన గుంటలుకానీ, శిథిలాలుగానీ కనిపించలేదు. అంబులెన్స్ ముందు భాగం మాత్రం ధ్వంసమై ఉంది. పక్కనే ఉన్న కార్ల అద్దాలు పగిలిపోయి కనిపిస్తున్నాయి.

‘ది పాలస్తీనా రెడ్ క్రెసెంట్’ ఈ వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

రోగులను ఆసుపత్రిలో దించేందుకు వస్తున్న తమ కాన్వాయ్ ఈ దాడి కారణంగా రెండు సార్లు ఆగాల్సి వచ్చినట్లు తెలిపింది.

క్షతగాత్రులను అల్-షిఫా ఆసుపత్రి నుంచి దక్షిణాన ఉన్న రఫా క్రాసింగ్‌కు తీసుకువెళ్లే అంబులెన్స్‌ కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయని హమాస్ ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.

శుక్రవారం రోజున 28 మంది పాలస్తీనా క్షతగాత్రులు చికిత్స కోసం రావాల్సి ఉండగా, ఈ దాడి వల్ల కేవలం 17 మందిని మాత్రమే వచ్చారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గాజా

"ఆసుపత్రి కింద హమాస్ ముఖ్య స్థావరం"

ఈ పేలుడు పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షులు టెడ్రోస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

“హెల్త్ వర్కర్లు, వైద్య సదుపాయాలు, అంబులెన్సులు, రోగులు...ఇవి ఎప్పుడూ భద్రత కల్పించాల్సినవి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, వీటిని రక్షణ కల్పించాలని మళ్లీ మళ్లీ కోరుతున్నాను” అని ఆయన అన్నారు.

దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఉన్న పాలస్తీనా ఫిల్మ్ మేకర్ బిసన్ ఒవ్‌దా స్పందిస్తూ, “కొంతమంది తమ కాళ్లూ, చేతులను కోల్పోయారు. గాయాలతో ఏడుస్తూ, తమ వారి కోసం వెతకడానికి ప్రయత్నిస్తున్నారు” అన్నారు.

ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చాలా మంది ఈ ఆసుపత్రి వద్ద ఆశ్రయం పొందుతున్నారని, పగటివేళ ఆసుపత్రి ఆవరణలో, రాత్రి వేళ్లలో దగ్గరిలోని వీధుల్లో నిద్రిస్తున్నారని చెప్పారు.

అల్-షిఫా ఆసుపత్రి కింది భాగంలోనే హమాస్ ముఖ్య స్థావరం ఉందని ఇజ్రాయెల్ మిలటరీ చెప్తోంది.

గాజా

ఫొటో సోర్స్, Reuters

“స్కూల్‌పై కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది”

ఆసుపత్రి వద్ద జరిగిన దాడితోపాటు గాజా సిటిలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో చాలామంది చనిపోయారని గాజా వైద్య అధికారులు తెలిపారు. అయితే, ఇజ్రాయెల్ ఇంకా ఈ దాడిపై స్పందించలేదు.

అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల్లో 1,400 మందికి పైగా చనిపోయారని, 240 మందికి పైగా హమాస్ చెరలో బందీలుగా మారారని ఇజ్రాయెల్ తెలిపింది.

ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 9000 మందికి పైగా చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలో వైమానిక, భూతల దాడులు ముమ్మరం చేస్తున్న సందర్భంలో పౌరులను దక్షిణ గాజావైపు వెళ్లాలని పదే పదే సూచించింది. వేలమంది ఉత్తర గాజాను విడిచి వెళ్లినా, కొంతమంది మాత్రం అక్కడే ఉండిపోయారు.

దక్షిణ గాజాలోనూ దాడులు కొనసాగుతుండటం, ఆ ప్రాంతాల్లోనూ జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడకు వెళ్లిన వారు ,తిరిగి మళ్లీ తమ ప్రాంతాలకు వస్తున్నారు.

వీడియో క్యాప్షన్, గాజాలో నిరాశ్రయులకు అంతులేని కష్టాలు

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)