దీపికా పదుకొణె: ‘శరీరం మరొకరితో ఉన్నా, మనసు మాత్రం రణ్‌వీర్‌తోనే’ అని అన్నారంటూ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నసీరుద్దీన్
- హోదా, బీబీసీ కోసం
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ’కాఫీ విత్ కరణ్’ కొత్త సీజన్‌లో గెస్ట్‌లుగా వచ్చిన దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్‌ల జంట, తమ వ్యక్తిగత జీవితం గురించి ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పని విషయాలను షేర్ చేసుకున్నారు.
అయితే, రిలేషన్ గురించి, కమిట్మెంట్ గురించి దీపికా పదుకొణెె చేసిన వ్యాఖ్యల విషయమై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆమె మంచి మహిళ కాదని కొందరు, రణ్‌వీర్ పనికి మాలిన వాడు అంటూ మరికొందరు వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు.
ఇంతకీ దీపికా చేసిన వ్యాఖ్యలేంటి? ప్రేమ, పెళ్లి, బంధం, వైవాహిక జీవితం గురించి ఆమె చెప్పిన మాటలు ఎందుకింత చర్చకు దారి తీశాయి?

ఫొటో సోర్స్, Getty Images
దీపికా ఏమన్నారు?
దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్‌లు కలిసి వచ్చిన ఈ షోలో తమ రిలేషన్ ఎలా మొదలైందో చెప్పారు దీపికా.
రణ్‌వీర్‌తో రిలేషన్ గురించి తాను మొదట అంత సీరియస్‌గా లేనని దీపిక చెప్పారు. అప్పట్లో తన మానసిక స్థితి సరిగా లేదని ఆమె వెల్లడించారు.
‘‘నేను అప్పుడు ఒంటరిగా ఉన్నాను. ఒక బాధాకరమైన రిలేషన్ నుంచి అప్పుడే బయటకు వచ్చాను. నాకు ఆ సమయంలో ఎవరితో కమిట్ కావాలన్న ఆలోచన లేదు. కానీ, కొంతమందితో సరదాగా గడిపాను. ఆ సమయంలో అతను నా జీవితంలో ప్రవేశించాడు. అయితే మేమిద్దరం మొదట్లో ఈ బంధాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ సమయంలో వేరే వ్యక్తులతో కూడా కలిసి ఉండగలిగినా, తిరిగి మళ్లీ ఒక చోటికి చేరేవాళ్లం’’ అని ఆమె చెప్పారు.
తాను కొందరు వ్యక్తులతో కూడా స్నేహం చేశానని చెప్పారు. అయితే, అవతలి వ్యక్తిగానీ, తానుగానీ ఆ బంధంలో కమిట్ కాలేదని ఆమె చెప్పారు.
తాను కొంతమందితో కలిసి సరదాగా గడిపినా, వారి పట్ల ఆకర్షితురాలైనా సరే, కమిట్‌మెంట్ అనేది మాత్రం లేదని, మనసులో మాత్రం రణ్‌వీర్ ఉండేవాడనీ దీపికా చెప్పారు.
రణ్‌వీర్ ప్రపోజ్ చేశాకే తమ బంధం సీరియస్ బంధంగా మారినట్లు ఆమె వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రోలింగ్ ఎందుకు?
తాను మానసికంగా రణ్‌వీర్‌తోనే ఉన్నట్లుగా దీపికా చెప్తూ, ఇంగ్లీషులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే ట్రోల్స్‌కు దారి తీశాయి.
‘నా శరీరం మరొకరితో ఉన్నా, నా మనసు మాత్రం ఎప్పుడూ రణ్‌వీర్‌తోనే ఉండేది’ అన్న అర్థం వచ్చేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిని పట్టుకుని దీపికా వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మెదలుపెట్టారు.
రణ్‌వీర్ సింగ్‌తో స్నేహం మొదలైన సమయంలోనే ఇతరులతో కూడా సన్నిహితంగా ఉన్నట్లు అర్థం వచ్చేలా చెప్పడం ఈ వ్యతిరేకతకు కారణమైంది.
అంతకుముందు దీపికా జనం నుంచి సానుభూతి పొందడానికి డిప్రెషన్ పేరుతో నాటకం ఆడారని, ఇప్పుడు అంతా బాగున్నప్పుడు సెక్స్ గురించి మాట్లాడుతున్నారని, ఆమె వ్యక్తిత్వం మంచిది కాదంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. దీపికాతోపాటు రణ్‌వీర్‌ను విమర్శిస్తూ ఇద్దరూ అవకాశవాదులంటూ కొందరు విమర్శించారు.
ఈ సందర్భంగా రణ్‌వీర్ పాత ఇంటర్వ్యూలు, పాత రిలేషన్లను గుర్తు చేస్తూ ఆయనపై కూడా విమర్శలు చేశారు.
ఇలాంటి వారు సరదా కోసమే రిలేషన్లు పెట్టుకుంటారని, పార్ట్‌నర్‌కు విశ్వాసంగా ఉండరని, వారికి ద్రోహం చేస్తారని అర్థం వచ్చేలా మీమ్స్ కూడా షేర్ అయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
సంబంధాల గురించి మాట్లాడటం తప్పా?
సాధారణంగా ఒక రిలేషన్‌ను ముగించినప్పుడు దాని వలన కలిగే వేదన, డిప్రెషన్‌ల గురించి ఎవరూ బహిరంగంగా చెప్పరు. కానీ దీపికా మాత్రం డిప్రెషన్ వల్ల తాను ఎంత బాధను అనుభవించారో, దానిని అధిగమించేందుకు ఏం చేశారో చెప్పారు.
చాలా మంది తనను చూసి స్ఫూర్తిని పొందుతారని ఆమె భావించే అలా చెప్పారు.
కానీ, ఇప్పుడు విషయం ఇది కాదు.
మన సమాజంలో సంబంధాల గురించి స్త్రీ, పురుషులు తమ అభిప్రాయాలను చూసే దృష్టిలో వైరుధ్యం కనిపిస్తుంది.
పురుషుడు తన సంబంధాల గురించి మాట్లాడటాన్ని ఒకలా, అదే సంబంధాల గురించి స్త్రీ మాట్లాడటాన్ని మరొకలా చూస్తుంది.
ఒకవేళ ఇప్పుడు దీపికా చెప్పిన మాటలే, రణ్‌వీర్ గనుక అని ఉంటే ఇలానే ట్రోల్స్ ఉండేవా? ఉండకపోవచ్చు, లేదంటే అసలు ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను కూడా సంతరించుకోకపోవచ్చు. గతంలో ఇలాంటి చాలా ఉదాహరణలను మనం గమనించొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రోల్స్ చేయడం సరైనదేనా?
అసలు దీపికా శారీరక సంబంధం గురించి మాట్లాడారా? ఒకరికి దగ్గరవడం, సన్నిహితంగా ఉండటం అంటే, శారీరకంగా కలిసినట్లేనా? అన్నది కూడా ప్రశ్నే.
నిజానికి ఆమె లైగింకంగా దగ్గరవడం గురించి మాట్లాడకపోయినా, అదే అర్థం వచ్చిందంటూ మొదలైన వివాదమే ఇందతా.
ఒకవేళ ఆమె ఇదే అర్థం వచ్చేలా అన్నా కూడా, ఇక్కడ చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి.
ఒక స్త్రీ తనకు నచ్చిన భాగస్వామిని వెతుక్కోవడంలో తప్పేంటి? పెళ్లిచూపుల్లో వారు చూసిన మొదటి వ్యక్తినే వివాహం చేసుకుంటున్నారా? జాతకాలు కలవడం లేదని పురుషులు ఎక్కువ మంది స్త్రీల జాతకాల కోసం వెతికిన సందర్భాలు లేవా? కుటుంబం, డబ్బు, హోదా అంటూ రకరకాల అంశాలపై రెండు, లేదా అంతకన్నా ఎక్కువ సంబంధాలు చూడటం లేదా?
అయితే, ఇక్కడ చర్చకు వచ్చే విషయం ఏంటంటే, ఎంపిక చేసుకోవడం గురించి కాదు.. శృంగారం గురించి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు శృంగారం గురించి మాట్లాడటానికి కూడా భయపడతారు. శరీరం స్త్రీదే అయినప్పటికీ దానిపై అధికారం మాత్రం పురుషుడిదే కావాలి.
అందుకే ఏ స్త్రీ అయినా సరే, స్నేహం గురించి, ఎక్కువ మంది పురుషులతో స్నేహం గురించి మాట్లాడుతుందంటే, ఆమె మాటలపై అసహనం పెరుగుతుంది.
స్త్రీ, పురుషుల శృంగార జీవితాలను ఒకేలా చూడరు. మహిళ శృంగార జీవితం అనేది ఆమె వ్యక్తిత్వం, గౌరవం, పరవును నిర్దేశిస్తుంది. ఇదే దీపిక విషయంలోనూ జరిగింది. ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్న వారంతా దీపిక వ్యాఖ్యల పట్ల భయంతో ఇలా విమర్శలు చేస్తున్నారని అనుకోవాలా?
ఒకవేళ స్త్రీ కూడా పురుషుల మాదిరిగానే శృంగార జీవితాన్ని తనకు నచ్చినట్లుగా సాగిస్తే, ఈ పురుషాధిక్య సమాజం ఇలానే స్పందిస్తుందా?
రణ్‌వీర్‌పైనా విమర్శలు..
మరొక ఆసక్తికరమైన విషయమేంటంటే, దీపికా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నంతసేపు రణ్‌వీర్ ఆమె పక్కనే మౌనంగా కూర్చుని ఉన్నారు. ట్రోలర్స్ ఆయన మెదడులోని ఆలోచనలను కూడా పసిగట్టినట్లుగా రాశారు.
కొంతమంది రణ్‌వీర్ కేవలం ఆమెకు బానిసలా, ఆమె గత బంధాల గురించి చెప్తూ ఉంటే, ఏ స్పందనా లేకుండా కూర్చున్నాడని కామెంట్లు చేశారు. అసలు నిజమైన మగాడు దీనిని ఎలా సహించగలడు? అన్నట్లు ప్రశ్నించారు.
ఇది మగాడి ప్రవర్తనకు విరుద్ధంగా ఉందని, ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలి అన్నట్లుగా కూడా కొందరు వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ పురుషుడు తన భాగస్వామి ఇలాంటి విషయాల గురించి చెప్పినప్పుడు, తన స్నేహితుల గురించి, గతం గురించి నిర్భయంగా మాట్లాడినప్పుడు ఏమీ అనకుండా మౌనంగా ఉంటే అతడిని ‘బానిస’గా ఈ ట్రోలర్స్ గుర్తిస్తారని ఇక్కడ అర్థం అవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
దీపికా మాత్రమే ఇలా మాట్లాడగలరు..
దీపికా వ్యాఖ్యల పట్ల వచ్చిన విమర్శలు చూస్తుంటే, మహిళలు ఇలా వారి మనసుల్లో మెదిలే మాటలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తే అది పురుష సమాజం వినడానికి ఇష్టడని, అవమానకరమైన విషయంగా భావిస్తుందా?
దీపికా ఎప్పుడూ తన మనసులోని మాటలే చెప్తారు. విమర్శల గురించి, ప్రజల స్పందనల గురించి పట్టించుకోరు.
గతంలో దిల్లీలోని జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి జరిగిన సమయంలో కూడా ఆమె వెళ్లి మౌనంగానే తన సానుభూతి తెలిపి వచ్చారు. ఆ సమయంలోనూ విమర్శలకు గురయ్యారు.
ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
- ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్‌లో మరణ శిక్ష.. అసలేం జరిగింది?
- పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఎందుకు మారలేదు? 4 ప్రధాన కారణాలు ఇవే...
- ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధానికి దిగుతుందా?
- ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ ఏనాటిది, ఎలా మొదలైంది? 9 పదాల్లో సంక్లిష్ట చరిత్ర
- గాజా ప్రజలను కాపాడండి: ఐక్యరాజ్య సమితిలో కన్నీరు పెట్టుకున్న పాలస్తీనా ప్రతినిధి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















