కీడా కోలా రివ్యూ: కోలాలో ప‌డిన కీడాతో తరుణ్ భాస్కర్ హిట్ కొట్టాడా?

కీడాకోలా

ఫొటో సోర్స్, TarunBhascker/FB

న్యూ జ‌న‌రేష‌న్ మేకింగ్‌ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుల‌లో.. త‌రుణ్ భాస్క‌ర్ పేరు క‌చ్చితంగా ఉంటుంది. పెళ్లి చూపులు సినిమాతో ఆయన చిన్న సినిమాకు ఊపిరి పోశాడు.

ఈ న‌గ‌రానికి ఏమైంది? చిత్రం మేకింగ్ ప‌రంగా, రైటింగ్ ప‌రంగా ఉన్నతంగా ఉంటుంది.

అందుకే రెండు సినిమాల‌తోనే త‌న‌కంటూ ఓ అభిమాన గ‌ణాన్ని సొంతం చేసుకొన్నాడు త‌రుణ్ భాస్క‌ర్‌. త‌న సినిమా అంటే క‌చ్చితంగా ఏదో విషయం ఉంటుంద‌న్న న‌మ్మ‌కాన్ని పొందాడు.

ఐదేళ్ల విరామం త‌ర‌వాత త‌రుణ్ నుంచి వ‌చ్చిన సినిమా కీడా కోలా. మ‌రి ఈ సినిమా ఎలా వుంది? త‌రుణ్ త‌న మార్క్‌ని మ‌ళ్లీ చూపించాడా? ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా, న‌టుడిగా త‌రుణ్ భాస్క‌ర్ ఏ మేర‌కు మెప్పించాడు?

కీడాకోలా

ఫొటో సోర్స్, facebook/VGsainma

క‌థ కొంచెం.. పాత్ర‌లు ఘ‌నం!

క‌థ సింపుల్‌. ఓ కోలా బాటిల్‌లో బొద్దింక ప‌డుతుంది. ఆ బొద్దింక‌ని అడ్డం పెట్టుకొని కంపెనీ నుంచి డ‌బ్బులు లాగాల‌ని ఇద్ద‌రు మిత్రులు ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తారు.

వీళ్ల‌కు మ‌రో గ్యాంగ్ తోడ‌వుతుంది. అంద‌రికీ డ‌బ్బులు అవ‌స‌రం.

కోలాలో ప‌డిన కీడాతో డ‌బ్బులు సంపాదించాలన్న తాప‌త్ర‌యంలో వీళ్లు చేసిన త‌ప్పులేంటి? ఇంత‌కీ డ‌బ్బులు సంపాదించ‌గ‌లిగారా, లేదా? ఇదంతా తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఇంత చిన్న లైన్‌తో ద‌ర్శ‌కుడు సినిమాని ఎలా తీయ‌గ‌లిగాడు? అని ఆశ్చ‌ర్యం వేస్తుంది.

క్రైమ్ కామెడీలో ఉండే గ‌మ్మ‌త్తే అది. లైన్ చిన్న‌దే కావొచ్చు. కానీ.. ద‌ర్శ‌కుడు ప్ర‌తిభావంతుడైతే ఆ చిన్న లైన్‌తోనే మ్యాజిక్ చేయొచ్చు.

ఈ సినిమాపై త‌రుణ్ భాస్క‌ర్ న‌మ్మ‌కం క‌థ కాదు, పాత్ర‌లు.

లూరెట్ సిండ్రోమ్‌తో బాధ ప‌డే వాస్తు, ఎలాగైనా కార్పోరేట‌ర్ అవ్వాల‌ని ఆశ ప‌డే జీవ‌న్‌, బొద్దింక‌ని అడ్డం పెట్టుకొని కోట్లు దండుకోవాల‌ని చూసే లాయ‌ర్ లంచం, బార్బీ బొమ్మ‌తో ప్రేమ‌లో ప‌డిపోయే నాయుడు.. ఇలా ఎటు చూసినా కొత్త త‌ర‌హా పాత్ర‌లే.

ఆ పాత్ర‌లు పంచే వినోద‌మే... `కీడా కోలా` బ‌లం.

కీడా కోలా సినిమా

ఫొటో సోర్స్, facebook/vgsainma

పోస్ట‌ర్ డిజైన్ నేప‌థ్యంలో సాగే సుదీర్ఘ‌మైన సీన్‌.. అందులో పంచ్‌, మ‌ధ్య‌లో చెప్పే పులి - కుక్క క‌థ ఇవ‌న్నీ బిట్లు బిట్లుగా చూడ్డానికి బాగున్నాయి.

క‌థంతా ఒకే పాయింట్ చుట్టూ తిరిగినా త‌రుణ్ మార్క్ డైలాగులు, పంచ్‌లూ, పాత్ర‌ల అమాయ‌క‌త్వం నుంచి పుట్టే వినోదం ఇవ‌న్నీ- సినిమాని ముందుండి న‌డిపించేస్తాయి.

త‌రుణ్ భాస్క‌ర్ స్క్రీన్ ప్లేలో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఈ న‌గ‌రానికి ఏమైందిలో అది క‌నిపించింది.

అందులో క్లైమాక్స్ సీన్‌లోంచి ఓ షాట్ తీసుకొని.. అక్క‌డ్నుంచి క‌థ చెప్ప‌డం మొద‌లెట్టాడు. ఇక్క‌డా అంతే.

పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేసే విధానం, వాటికంటూ కొన్ని ల‌క్ష‌ణాలు, బ‌ల‌హీన‌త‌లూ ఆపాదించిన ప‌ద్ధ‌తి, వాటిని క‌థ‌లో గ‌మ్మ‌త్తుగా వాడుకొనే విధానం.. ఇవ‌న్నీ త‌రుణ్ మార్క్‌ని సెట్ చేశాయి.

ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నింటికీ డ‌బ్బు అవ‌స‌రమని చూపించి, ఆ త‌ర‌వాత‌.. అస‌లైన డ్రామా కీడా కోలా రూపంలో ప్ర‌వేశ పెట్టాడు.

నాయుడు పాత్ర ఈ క‌థ‌కు కీల‌కం. నాయుడు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్ప‌టి నుంచీ ఈ క‌థ మ‌రింత‌గా ప‌రుగులు పెడుతుంది.

కేవ‌లం రెండు గంట‌ల క‌థ ఇది. ఇంట్ర‌వెల్ కార్డు ప‌డ‌గానే... అప్పుడే స‌గం సినిమా అయిపోయిందా అనిపిస్తుంది.

కార‌ణం... నిడివి త‌క్కువ ఉండ‌డ‌మే కాదు, ఉన్న ఆ కాసేపూ ద‌ర్శ‌కుడు సినిమాని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డం.

కీడా కోలా

ఫొటో సోర్స్, Facebook/TharunBhasckerDhaassyam

మినిమం డిగ్రీ ఉండాలి

ద్వితీయార్థంలో కీడా కోలా.. ఐదు కోట్ల డ్రామా మొద‌ల‌వుతుంది.

ఓ కూల్ డ్రింక్ బాటిల్‌లో పురుగు ఉంద‌ని నేరుగా కంపెనీ య‌జ‌మానికే ఫోన్ చేయ‌డం, ఆయ‌నేమో ఐదు కోట్ల‌కు డీల్ కుదుర్చుకోవ‌డం మ‌రీ సినిమాటిక్ లిబ‌ర్టీ అనిపిస్తుంది.

షార్ప్ షూట‌ర్స్ పేరుతో... ఓ గ్యాంగ్ దిగ‌డం, వాళ్లంద‌రికీ ఒక్కో లోపం ఉండ‌డం.. ఇవి కూడా ఫ‌న్నీగానే అనిపిస్తాయి.

మ‌ధ్య‌మ‌ధ్య‌లో పాత్ర‌ల‌న్నీ ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటాయి. అదెందుకో సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది.

చాలా చిన్న చిన్న విష‌యాలపై కూడా ద‌ర్శ‌కుడు బాగా దృష్టి పెట్టాడు.

దాంతో.. సినిమాలో అద‌న‌పు వినోదం పండే ఛాన్స్ వ‌చ్చింది.

వ‌ర‌ల్డ్ సినిమాని బాగా అర్థం చేసుకొని, ఆక‌ళింపు చేసుకొన్న త‌రుణ్ భాస్క‌ర్ త‌న సినిమాని సాదా సీదాగా ముగించ‌డం కాస్త నిరాశ ప‌రుస్తుంది.

తొలి భాగంలో వినోదం ప్ల‌స్ అయితే, ద్వితీయార్థంలో పాత్ర‌ల మ‌ధ్య క‌న్‌ఫ్యూజ‌న్ నుంచి పుట్టిన స‌ర‌దా స‌న్నివేశాలు ఈ సినిమాని కాపాడాయి.

అయితే కొన్ని పంచ్‌లూ, డైలాగులూ అర్థం చేసుకోవ‌డానికి `మినిమం డిగ్రీ ఉండాలి`.

ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలోని కొన్ని పాత్ర‌ల పేర్లు, డైలాగులు ద‌ర్శ‌కుడు సింబాలిక్‌గా వాడుకొన్నాడు.

ఇన్ని పాత్ర‌ల్ని సృష్టించిన ద‌ర్శ‌కుడు ఒక్క మ‌హిళా పాత్ర‌కు కూడా చోటివ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

ఈ క‌థ‌లో ఆడ పాత్ర‌ల‌కు ప్ర‌వేశం లేదు అని గ‌ట్టిగా అనుకొన్నాడో, లేదంటే కాక‌తాళియంగా అలా జ‌రిగిపోయిందో మ‌రి! బార్బీ బొమ్మ‌నే స్త్రీ పాత్ర‌గా ఫిక్స‌యిపోవాలేమో.

తరుణ్ భాస్కర్

ఫొటో సోర్స్, Facebook/vgsainma

వైకల్యంతో హాస్యమా ?

దర్శకుడు ఆలోచన ఏమిటో గానీ ఇందులో చాలా పాత్రలకు ఎదో ఒక వైకల్యం వుంటుంది.

వరదరాజు పాత్ర వీల్ చైర్‌కి పరిమితమై తోడుగా ఒక యూరిన్ బ్యాగ్ కూడా వుంటుంది.

వాస్తు టూరెట్ సిండ్రోమ్‌తో ఇబ్బంది పడుతుంటాడు. షూటర్స్ కళ్ళు.. కళ్ళు చిదంబరం తరహాలో తేడాగా వుంటాయి.

ఈ పాత్రలన్నీ సమతూకంగా రాసుకున్నప్పటికీ .. ఆ పాత్రలలో పుట్టే హాస్యం అందరనీ మెప్పించలేకపోవచ్చు.

వైకల్యం వున్న ఇబ్బందిలేదనే సందేశం ఇవ్వడం దర్శకుడి ఆలోచన కావచ్చు గానీ ఆ సందేశం అంతర్లీనంగా కూడా కుదరలేదు.

ఎంత కావాలో అంత‌!

ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ లో ఓ మంచి ల‌క్ష‌ణం ఉంది.

న‌టీన‌టుల నుంచి త‌న‌కేం కావాలో అది రాబ‌ట్టుకోగ‌ల‌డు. ఈసారీ అదే జ‌రిగింది.

ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పాత్ర‌కు న్యాయం చేశారు. ఎంత కావాలో అంతే న‌టించారు.

వాస్తు పాత్ర‌లో చైత‌న్య రావు బాగా చేశాడు. అత‌ని న‌త్తి ప్ల‌స్. అదే కొన్ని సంద‌ర్భాల్లో మైన‌స్‌గా మారింది.

ఇందులో ప్రధానంగా ఎనిమిది పాత్రలు కనిపిస్తాయి. సినిమా మొత్తం చూశాక అందులో హీరో ఎవరు అని చెప్పడానికి వుండదు కానీ నాయుడు పాత్ర బలంగా పండిందని చెప్పొచ్చు.

ఆ పాత్రలో తరుణ్ భాస్కర్ అభినయం, ఆహార్యం ఆకట్టుకుంది.

లంచం పాత్రలో చేసిన రాగ్ మయూర్ మరోసారి ఆకట్టుకున్నాడు. బ్రహ్మానందం తన అనుభవం చూపించారు.

ఆయ‌న క‌నిపించిన‌వి కొన్ని సీన్లే. కానీ.. నవ్వించారు. బ‌య‌ట ఎలా ఉంటారో, అంతే స‌హ‌జంగా క‌నిపించ‌డం వ‌ల్ల ఆ పాత్ర మ‌రింత ద‌గ్గ‌రైంది. సికిందర్ పాత్రలో చేసిన విష్ణుకి మంచి మార్కులు పడతాయి.

రఘురాంతో పాటు కోలా కంపెనీ చుట్టూ నడిపిన సన్నివేశాలు, పాత్రలు ఇంకాస్త వివరంగా ఉండాల్సిందనిపిస్తుంది.

కీడా కోలా

ఫొటో సోర్స్, facebook/vgsainma

కొత్త తరం సంగీతం

వివేక్ సాగర్ అందించిన సంగీతం కొత్త తరం సంగీతాన్ని చక్కగా వినిపించింది.

కీడా కోలా పాత్రల ప్రయాణంలో సంగీతం కూడా కలిసి పోయింది.

కెమెరాపతనం కూడా బావుంది. కొన్ని విజువల్స్ కూడా నవ్విస్తాయి. రెండు గంటల నిడివిగల సినిమా ఇది.

ఎడిటింగ్ ని పదునుగానే చేశారు. ఉన్న వనరులతో ప్రొడక్షన్ డిజైన్ కూడా చక్కగా చేసుకున్నారు.

తరుణ్ భాస్కర్ రాసుకున్న మాటలు ట్రెండ్‌కి తగ్గట్టు ఉన్నాయి.

కీడా కోలా లక్ష్యం చేరుకుందా ?

క్రైమ్ కామెడీ జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు పరిమితంగానే వుంటారు.

ఆ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని తీసిన చిత్రమిది. ఇప్పటికే తెలుగులో చాలా క్రైమ్ కామెడీలు వచ్చాయి.

అయితే వాటికి భిన్నంగా ఉండేలా ఈ చిత్రాన్ని కాస్త కొత్తగానే మలిచాడు దర్శకుడు.

ఈ జోనర్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులకు కీడా కోలా నచ్చే అవకాశం వుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)