కశ్మీర్: అమర్‌నాథ్ గుహ మార్గంలో రోడ్డు నిర్మాణానికి అడ్డు చెబుతున్నదెవరు?

అమర్‌నాథ్ యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ కోసం

కశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహకు వెళ్లే మార్గంలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణం పనులపై తాజాగా వివాదం రాజుకొంది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) ఇటీవల ఎక్స్ (ట్విటర్)లో దీనికి సంబంధించి ఒక వీడియోను షేర్ చేసింది. దక్షణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహకు వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణం దృశ్యాలు అందులో ఉన్నాయి.

అయితే, ఆ వీడియో వైరల్ కావడంతో, జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి.

ఇలాంటి నిర్మాణాలతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని, భవిష్యత్తులో భారీ ప్రమాదాలు జరిగే ముప్పు కూడా ఉంటుందని ఆ పార్టీలు చెబుతున్నాయి.

అమర్‌నాథ్ యాత్ర

ఫొటో సోర్స్, MAJID JAHANGIR

ఇలాంటి సున్నితమైన ప్రాంతంలో రోడ్డును నిర్మించడంపై నిపుణులతోపాటు సాధారణ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ యూసుఫ్ తారిగామి అన్నారు.

‘‘అమర్‌నాథ్ యాత్ర కోసం ఎంతో భక్తితో వచ్చే ప్రజలు సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఇక్కడ సురక్షితం అంటే కేవలం భద్రతా కోణంలోనే కాదు. కఠిన వాతావరణ పరిస్థితులు, ప్రమాదాల నుంచీ వారు సురక్షితంగా ఉండాలి. ఇక్కడ ఇలాంటి రోడ్లను నిర్మించాల్సిన అవసరం లేదని మేం భావిస్తున్నాం’’ అని తారిగామి చెప్పారు.

అమర్‌నాథ్ యాత్రతో చాలా మంది ఉపాధి ముడిపడి ఉంటుందని, రోడ్డు నిర్మాణంతో వారు చాలా ప్రభావితం అవుతారని తారిగామి అన్నారు.

అమర్‌నాథ్ యాత్ర

ఫొటో సోర్స్, ANI

నిరసన ఎందుకు?

శ్రీనగర్‌, అమర్‌నాథ్ గుహ మధ్య దూరం 131 కి.మీ.

సముద్రానికి 12,756 అడుగుల ఎత్తులో ఈ గుహ ఉంటుంది.

అమర్‌నాథ్ గుహ చుట్టూ హిమనీనదాలు, మంచు పర్వతాలు ఉంటాయి. ఇక్కడికి యాత్రికులు చేరుకునేందుకు పహల్గామ్, బాల్టాల్‌లలో స్థానికులు సాయం చేస్తారు.

యాత్రికుల కోసం గుర్రాలతోపాటు చేతులతో మోసే పల్లకీలను కూడా వారు అందుబాటులో ఉంచుతారు.

పహల్గామ్‌ నుంచి అమర్‌నాథ్‌కు చేరుకోవడానికి 20 కి.మీ. ప్రయాణించాలి. బాల్టాల్ నుంచి 14 కి.మీ. ఉంటుంది. ఈ మార్గాల్లో మొత్తం కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. దీంతో గుర్రాలు, పల్లకీ సేవలను యాత్రికులు ఉపయోగించుకుంటారు. తాజా రోడ్డు నిర్మాణంతో స్థానికుల ఉపాధిపై ప్రభావం పడుతుందని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

సీనియర్ నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకుడు, ఎంపీ హుస్సేన్ మసూదీ స్పందిస్తూ- ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టే ముందు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించారు.

‘‘దీని కోసం ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ)నిర్వహించి ఉంటే, ఆ నివేదికను ప్రజల ముందు పెట్టండి. పర్యావరణ నిపుణులు ఏం చెప్పారో ప్రజలకు తెలియాలి. ఎందుకంటే దీనితో భవిష్యత్ తరాలపైనా ప్రభావం పడే ముప్పుంటుంది’’ అని అన్నారు.

‘‘భవిష్యత్ తరాలకూ ఇదే పర్యావరణాన్ని సురక్షితంగా అందించడం మన బాధ్యత. భారత రాజ్యాంగం, అంతర్జాతీయ చట్టాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.

అమర్‌నాథ్ యాత్ర

ఫొటో సోర్స్, BRO VIDEO GRAB

బీఆర్‌వో ఏం చెబుతోంది?

జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తంచేయడంతో 2023 నంబరు 10న బీఆర్‌వో ఒక ప్రకటన విడుదల చేసింది. యాత్రికుల సౌకర్యం కోసమే తాము రోడ్ల విస్తరణ చేపడుతున్నామని, పర్యావరణ జాగ్రత్తలన్నీ తీసుకున్నామని తెలిపింది.

‘‘సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అమర్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లే మార్గాలను విస్తరిస్తున్నాం’’ అని చెప్పింది.

‘‘2012లో పర్యావరణ ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న అనంతరం యాత్రికుల సౌకర్యం కోసం సుప్రీంకోర్టు ఆ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుత రోడ్లను మెరుగుపరచడం, సున్నితమైన ప్రాంతాల్లో గోడలు, సెక్యూరిటీ రెయిలింగ్‌ల నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర పనులు చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది’’ అని వివరించింది.

వాహనాలు వెళ్లేలా రోడ్డును విస్తరిస్తున్నారనే వార్తలను బీఆర్‌వో ఖండించింది. ‘‘వాటిలో ఎలాంటి నిజమూ లేదు. యాత్రికులు కాలి నడకన వెళ్లేలా ఈ మార్గాన్ని మరింత విస్తరిస్తున్నాం’’ అని పేర్కొంది.

అమర్‌నాథ్ యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

ట్రాక్‌కు మరమ్మతు

బాల్టాల్ నుంచి అమర్‌నాథ్ గుహ వరకూ ట్రాక్, రోడ్డు మరమ్మతుల పనులు ఇదివరకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వ రోడ్డు, భవనాల శాఖ నియంత్రణలో ఉండేవి.

పహల్గామ్ రోడ్డు పనులు పహల్గామ్ డెవలప్‌మెంట్ అథారిటీ నియంత్రణలో ఉండేవి.

అయితే, 2022 సెప్టెంబరులో రోడ్డు నిర్వహణ, మరమ్మతు పనులను బీఆర్‌వోకు అప్పగించారు.

ప్రస్తుతం సంగమ్ బేస్ నుంచి గుహ దిగువ ప్రాంతానికి తీసుకెళ్లే రోడ్డును బీఆర్‌వో విస్తరించింది. దిగువ గుహ ప్రాంతం నుంచి ప్రధాన గుహకు వెళ్లే మార్గం వెడల్పును కూడా పెంచింది.

బాల్టాల్ ట్రాక్ నుంచి బరారీమార్గ్ మధ్య రోడ్డును 2023 జూన్‌లోనే విస్తరించారు.

రోడ్డు నిర్మాణంతో యాత్ర సులభతరం: బీజేపీ

యాత్రికుల కోసం గుహ వరకూ రోడ్డును నిర్మిస్తే, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకూడదని జమ్మూకశ్మీర్ బీజేపీ అంటోంది.

ఈ విషయంపై పార్టీ జమ్మూకశ్మీర్ విభాగం అధికార ప్రతినిధి ఆల్తాఫ్ ఠాకుర్ మాట్లాడుతూ.. ‘‘జమ్మూ-శ్రీనగర్ ప్రధాన రాహదారి పనులు జరిగేటప్పుడు పర్యావరణ అనుమతులన్నీ తీసుకున్నారు. ఇప్పుడు అమర్‌నాథ్ రోడ్డు నిర్మాణ పనుల సమయంలోనూ అవే నిబంధనలు అనుసరించారు’’ అని ఆయన అన్నారు.

‘‘రోడ్డు ఎక్కడ నిర్మిస్తున్నారో అందరికీ తెలుసు. అక్కడ చెట్లను కూడా పడగొట్టలేదనేది స్పష్టం. అక్కడ కేవలం రాతి కొండలే ఉన్నాయి. వాటిని కొంచెం తొలగిస్తే, ఎవరికైనా అభ్యంతరం ఎందుకు? ఆ రోడ్డు నిర్మాణంతో పర్యావరణంపై ప్రభావం పడుతుందని నేను అనుకోవడం లేదు. రోడ్డు నిర్మాణం ద్వారా యాత్ర సులభతరం అవుతుంది’’ అని ఆయన అన్నారు.

కశ్మీరీ పండిట్, రాజకీయ కార్యకర్త మోహిత్ బాన్ స్పందిస్తూ- అమర్‌నాథ్ యాత్రకు ఇక్కడ ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ, వాహనాలు వెళ్లేలా రోడ్డు వేయడమే అసలు సమస్యని అన్నారు.

‘‘ఎందుకంటే అడవి మధ్యలో కాంట్రీటు వేస్తే పర్యావరణం దెబ్బతింటుంది. ఇక్కడకు వస్తున్న యాత్రికుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఫలితంగా కొన్ని రోజుల్లోనే గుహలోని శివలింగం కరిగిపోతోంది’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, కొత్త ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మూడేళ్లలో ఏ మేరకు నెరవేరిందా?

పీడీపీ ఏం అంటోంది?

అమర్‌నాథ్ గుహ మార్గంలో రోడ్డు నిర్మాణం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అంటోంది.

ఈ విషయంపై పీడీపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ మెహబూబ్ బైగ్ మాట్లాడుతూ- ‘‘అమర్‌నాథ్‌ మార్గంలో రోడ్డు వేయడమనేది చాలా సున్నితమైన అంశం. కానీ, బీజేపీ ప్రతి అంశాన్నీ రాజకీయానికి అనువుగా మార్చుకుంటోంది. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే ఏ అంశాన్ని ఆ పార్టీ వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. ఇది చాలా బాధాకరం. లౌకికవాద దేశంలో మతాన్ని ఇలా ఉపయోగించుకోకూడదు’’ అని అన్నారు.

అయితే, ఈ విషయంలో జమ్మూకశ్మీర్ రాజకీయ పార్టీలు ముస్లిం కార్డును ఉపయోగిస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.

దీనిపై పార్టీ అధికార ప్రతినిధి ఆల్తాఫ్ ఠాకుర్ మాట్లాడుతూ- ‘‘త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే ముస్లిం ప్రజలను తమ వైపు లాక్కునేందుకు ఇక్కడి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2008లోనూ వారు ఇలానే చేశారు’’ అని విమర్శించారు.

2008లో అమర్‌నాథ్ భూమి వివాదం కొన్ని నెలలపాటు ప్రకంపనలు సృష్టించింది. నాడు అమర్‌నాథ్ బోర్డుకు గుహ చుట్టుపక్కల భూములను అప్పగించడంపై పెద్దయెత్తున నిరసనలు జరిగాయి. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో నిరసనకారులు శాంతించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)