రైతుబంధు పథకానికి, ఎన్నికల సంఘానికి ఏమిటీ సంబంధం? ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఏం చేయచ్చు, ఏం చేయకూడదు...

ఫొటో సోర్స్, Getty Images/KALVAKUNTLACHANDRASHEKARRAO/FB
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో రైతు బంధు పథకం కింద డబ్బు జమ చేయడానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఎన్నికల సంఘం అనుమతిస్తేకానీ కేసీఆర్ సర్కార్ ఎందుకు డబ్బులు జమ చేయలేకపోయింది?
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాలలో ప్రధాని మోదీ పర్యటించిన సందర్భంలో కొన్ని ప్రజాకర్షక ప్రకటనలు చేశారు. ఈ ప్రకటన ఓటర్లను ప్రభావితం చేసినట్టవుతుందా?
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో కేంద్రం ఇలాంటి ప్రకటన చేయవచ్చా? అదే సమయంలో ఆయా రాష్ట్రాలలోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రులు ఒక పథకాన్ని కొనసాగించడానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఎందుకు కావాల్సి వచ్చింది?
నిజానికి రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా ఎన్నికల ముందు ఉండే ఆపద్ధర్మ ప్రభుత్వాలు విధానమైనపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. ఇందుకు ఎన్నికల నియమావళి అనుమతించదు. అలాంటప్పుడు ఈ ఆపద్ధర్మప్రభుత్వాలు ఎందుకు, వాటి పనేంటి, ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
విన్‌స్టన్ చర్చిల్‌తో మొదలు
రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఇంగ్లండ్ ప్రధానిగా ఉన్న విన్‌స్టన్ చర్చిల్ తన పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలనే ఉద్దేశంతో ఇంగ్లండ్ రాజుకు తన రాజీనామా సమర్పించారు. అయితే ఎన్నికలు పూర్తయ్యేదాకా ప్రభుత్వ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా రాజు చర్చిల్‌ను కోరారు. దీనికే కేర్‌టేకర్ (ఆపద్ధర్మ) ప్రభుత్వమని పేరు పెట్టారు. అప్పట్లో ఈ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఈ ఆపద్ధర్మ ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయాలేవీ తీసుకోరాదని కూడా నిర్ణయించారు. ఈ సంప్రదాయమే ప్రజాస్వామ్య దేశాలలో కేర్‌టేకర్ ప్రభుత్వాలు ఏర్పడేందుకు మార్గం చూపిందనే భావన ఉంది.
భారత దేశంలో ఒక ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుని, మరోసారి ఎన్నికయ్యే ముందు వ్యవధిలో ఉండేదే ఆపద్ధర్మ ప్రభుత్వం.అంటే ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక ఈ ఆపద్ధర్మ ప్రభుత్వాలు మనుగడలోకి వస్తాయి. ఆ సమయంలో అప్పటివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వమే ఆపద్ధర్మ ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది.
అయితే, కొన్ని సందర్భాలలో ప్రభుత్వం సభ విశ్వాసం కోల్పోయినపుడు సభానాయకుడు రాష్ట్రపతిని కానీ గవర్నర్‌ను కానీ సభను రద్దు చేయాలని కోరవచ్చు. ఆ సమయంలో సభ రద్దుచేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండమని రాష్ట్రపతి, గవర్నర్ కోరవచ్చు.
పై రెండు సందర్భాలలోనూ పాలనా పరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఏర్పడతాయి. అవిశ్వాసాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఉంటాయి.

ఫొటో సోర్స్, GOVT INDIA
ఆపద్ధర్మ ప్రభుత్వాలే ఎందుకు?
ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాకా లేదా, సభ విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం స్థానంలో రాష్ట్రపతో, గవర్నరో ప్రభుత్వ పగ్గాలు తీసుకోకుండా, ఆయా ప్రభుత్వాలనే ఎందుకు కొనసాగించాలనే ప్రశ్న రావచ్చు. ఇండియా ప్రజాస్వామ్య దేశం. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనకే తప్ప ప్రెసిడెన్షియల్ రూల్ కు చోటులేదు. అందుకే ప్రభుత్వం రద్దయినా ఆపద్ధర్మ ప్రభుత్వమే ఉండటానికి ఇదో ప్రధాన కారణం.
భారత రాజ్యాంగంలో ఎక్కడా ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రస్తావన లేదు. వీటి నియంత్రణకు లక్ష్మణరేఖలు కూడా లేవు. దీంతో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రపతి ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగానే ఉంటుంది.
ఆపద్ధర్మ ప్రభుత్వాల గురించి మాజీ కేంద్ర సమాచార కమిషనర్, మహీంద్ర యూనివర్సిటీలో లా ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మాడభూషి శ్రీధర్ ను బీబీసీ సంప్రదించింది.
‘‘ఆపద్ధర్మ ప్రభుత్వం గురించి రాజ్యంగంలో ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే రాష్ట్రంలో అసెంబ్లీలో అధికార పార్టీ విశ్వాస పరీక్ష నెగ్గలేనప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వానికి బదులు గవర్నర్ పాలన విధించే అవకాశం ఉంది. కానీ కేంద్రంలో అటువంటి వెసులుబాటు లేదు. ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ విధించే అవకాశమే లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వమే ఉంటుంది" అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కేర్ టేకర్ ప్రభుత్వాలు - దేశ ప్రతిష్ఠ
ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఉన్నప్పుడు దేశభద్రత, ప్రతిష్టకు సంబంధించిన సమస్యలు తలెత్తినపుడు అవి పూర్తిస్థాయి ప్రభుత్వాలుగానే వ్యవహరించాయి.
ముఖ్యంగా ఆరునెలలపాటు ఆపద్ధర్మ పీఎంగా ఉండి రికార్డు సృష్టించిన వాజ్‌పేయి పాలనా కాలంలోనే కార్గిల్ యుద్ధం జరిగింది.
ఇలాగే చంద్రశేఖర్ ప్రభుత్వ హయాంలోనూ విదేశీ రుణాల చెల్లింపు కోసం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచన మేరకు బంగారు నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వద్ద తాకట్టు పెట్టారు. ఈ రెండు సందర్భాలు దేశ ప్రతిష్ట, భద్రతకు సంబంధించినవే. ఆపద్ధర్మ ప్రధానులు అయినా దేశ ప్రతిష్ఠను కాపాడారు.
ఆర్టికల్ 74 ప్రకారం మంత్రిమండలి నిర్ణయాలకనుగుణంగా రాష్ట్రపతి వ్యవహరించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రెసిడెంట్ నామమాత్రమైనప్పటికీ కొన్నిసందర్భాలలో వారు కూడా తమదైన ముద్ర చూపించారు.
చరణ్ సింగ్ ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డి ఎలక్షన్ ఫండింగ్ ఆర్డినెన్సును అడ్డుకున్నారు. అలాగే వీపీసింగ్, చంద్రశేఖర్ ప్రభుత్వాల హయాంలో ఆర్థికపరమైన నిర్ణయాలకు అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ అడ్డుకట్ట వేశారు.
ఇక గుజ్రాల్ హయాంలోనైతే అప్పటి ప్రెసిడెంట్ కేఆర్ నారాయన్, గుజ్రాల్ సర్కారు కేర్ టేకర్ కాదంటూ దానికి సంపూర్ణ అధికారాలు ఉన్నాయంటూ గుజ్రాల్ నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు.
ఆపద్ధర్మ ప్రభుత్వం ఆరునెలలకు మించి ఉండటానికి వీలులేదు. పార్లమెంట్ రెండు సెషన్స్ మధ్య విరామం ఆరునెలలకు మించి ఉండకూడదని రాజ్యంగంలోని ఆర్టికల్ 85 స్పష్టం చేస్తోంది. ఇప్పటిదాకా చరణ్‌సింగ్ (సుమారు 5నెలలు), తరువాత వాజ్‌పేయీ (సుమారు 6 నెలలు ) కేర్‌టేకర్ ప్రభుత్వాలను ఎక్కువకాలం నడిపినవారిగా రికార్డులెక్కారు.

ఫొటో సోర్స్, Getty Images
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెబుతోంది?
ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఎలా ఉండాలో ఎన్నికల సంఘం నియమావళి తెలిపింది. ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఎన్నికలను ప్రభావితం చేసే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు.
ఎన్నికల సమయంలో మంత్రులు తమ అధికారిక పర్యటనలను ఎన్నికల పనులతో కలపకూడదు. అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని ఉపయోగించుకోకూడదు. అధికారిక విమానాలు, వాహనాలు, యంత్రాలు సిబ్బంది సహా ప్రభుత్వ రవాణాను అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.
వార్తాపత్రికలు ఇతర మాధ్యమాలలో ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు జారీ చేయకూడదు. రాజకీయ వార్తల పక్షపాత కవరేజీ కోసం అధికారిక మాస్ మీడియాను దుర్వినియోగం చేయకూడదు. అధికారంలో ఉన్న పార్టీ అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో విజయాల గురించి ప్రచారం చేయకూడదు.
మంత్రులు, ఇతర అధికారులు నిధులు, గ్రాంట్లు/చెల్లింపులను మంజూరు చేయకూడదు. మంత్రులు, ఇతర అధికారులు - ఏ రూపంలోనైనా ఆర్థిక గ్రాంట్లు లేదా వాగ్దానాలు ప్రకటించకూడదు.
ఏ రకమైన ప్రాజెక్టులు లేదా పథకాలకు శంకుస్థాపన చేయకూడదు. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేలా, ప్రభుత్వ, పబ్లిక్ అండర్‌టేకింగ్‌లు మొదలైన వాటిలో ఏదైనా తాత్కాలిక నియామకాలు చేయకూడదు.
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు తాము అభ్యర్థిగా లేదా ఓటరుగా లేదా అధీకృత ఏజెంట్ హోదాలో తప్ప ఏ పోలింగ్ స్టేషన్ లేదా కౌంటింగ్ ప్రదేశంలోకి ప్రవేశించకూడదు.
తెలంగాణలో ఎన్నికల నియామవళి అమల్లో ఉంది కాబట్టే రైతు బంధు పథకం కింద ఇచ్చే సొమ్మును కేసీఆర్ సర్కార్ జమ చేయలేకపోయింది. అయితే ఈ పథకం ఇప్పటికే అమల్లో ఉందని సర్కారు చేసిన విజ్ఞప్తికి ఈసీ సానుకూలంగా స్పందించి రైతుబంధు సొమ్ము జమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
‘‘ఆపద్ధర్మ ప్రభుత్వాలు గీతదాటకుండా చూడటమెలా అంటే ఎన్నికల కమిషన్ గట్టిగా స్వతంత్రంగా వ్యవహరించాలి. టీఎన్ శేషన్ లా.. నియమావళి కచ్చితంగా అమలు చేయగలిగితే ఆపద్ధర్మ ప్రభుత్వాలకు ముకుతాడు వేయవచ్చు. దీనివల్ల ఫెయిర్ ప్లే (నిష్పక్షపాతంగా ఎన్నికలు) కు అవకాశం ఉంటుంది. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం అరికట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే" అని మాడభూషి శ్రీధర్ వివరించారు.
ప్రజాస్వామ్యంలో చెక్ అండ్ బాలెన్సెస్ ముఖ్యమని, అందుకే ఎన్నికల కోడ్ అవసరమని చెప్పారు సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు.
అయితే గతంలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 45 రోజులు ఉండేదని, ఇప్పుడు దీనిని నెలరోజులకే కుదించారని ఆయన చెప్పారు.
ప్రజాప్రభుత్వాలను ఎక్కువ కాలం నిర్ణయాలు తీసుకునే వీలులేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టే ఏకకాలంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఒక్కోరాష్ట్రంలో ఒక్కోసారి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు చేసే పరిస్థితి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆపద్ధర్మ పీఎంగా ఇందిరాగాంధీ... సుప్రీం కోర్టులో రిట్
1971లో ఇందిరాగాంధీ ఆపద్ధర్మ పీఎంగా ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఆమె కేర్‌టేకర్‌గా ఉండటంపై సుప్రీం కోర్టులో రిట్ దాఖలైంది.
1970 డిసెంబరులో లోక్‌సభ రద్దుకు ఇందిర సిఫార్సు చేశారు.ఈ మేరకు 5వ సాధారణ లోక్‌సభ ఎన్నికలు 1971లో జరిగాయి. అయితే లోక్‌సభ రద్దు అయినప్పటి నుంచి, తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ ప్రభుత్వమే కొనసాగింది.
ఆ సమయంలో ఆపద్ధర్మ పీఎంగా ప్రభుత్వం రాజ్యంగబద్ధతను సవాలు చేస్తూ మద్రాసుకు చెందిన న్యాయవాది యూఎన్ రావు కోర్టులో కేసు వేశారు.
ఆర్టికల్ 83(2) ప్రకారం లోక్‌సభను రద్దు చేస్తారు. అలాగే 75 (3) ప్రకారం మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యులుగా ఉంటారు. దీంతో లోక్‌సభే రద్దయినప్పుడు ఈ మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహించాలి? అనే ప్రశ్నను లేవనెత్తుతూ యు.ఎన్.రావు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్టికల్ 53(1) ప్రకారం ప్రెసిడెంట్ కార్యనిర్వహాకాధికారాలను స్వయంగా ఆయనగానీ, తన కింద అధికారుల ద్వారాగానీ ఉపయోగించుకోవచ్చని చెపుతోంది. అలాంటప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఎందుకనేది ఆయన వాదన.
అయితే ఈ కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది.
దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్ళారు. దీనిపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఆపద్ధర్మ ప్రభుత్వాలు తప్పుకాదని పేర్కొంది. ఇది పార్లమెంటరీ సంప్రదాయమేనని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, CHARAN SINGH ARCHIVES
ఆశపెడితే తప్పే
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సభలలోనే కేంద్రం ప్రజాకర్షక పథకాలు ప్రకటనలు చేయడంపై మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ "ఎన్నికలు జరుగుతున్నవేళ కేంద్రం ఆయా రాష్ట్రాలలో ప్రజాకర్షక పథకాలు ప్రకటించ సరి కాదు. అయితే తమ విధానాలు చెబితే తప్పులేదు. కానీ ఇది చేస్తాను అని ఆశపెట్టడం కచ్చితంగా ఉల్లంఘనే" అన్నారు.
రాజ్యంగం పేర్కొనని ఆపద్ధర్మ ప్రభుత్వాలు తమ తదుపరి ఎన్నికల కోసం అధికార దుర్వినియోగం చేయకుండా చూడాలంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుందని మాడభూషి శ్రీధర్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్రం ప్రజాకర్షక పథకాలు ప్రకటన చేయడం.. నైతికంగా సరైనది కాదని, అందుకే ఏకకాలంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరిపితే ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు.
ఇవి కూడా చదవండి :
- ‘పని’ చేయకుండా మనీ సంపాదించడం ఎలా?
- ఏటీఎం కార్డు మీద 5 రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయని మీకు తెలుసా... ఈ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
- అహ్మదాబాద్: భారత ప్రేక్షకులు, టీమిండియా ఆటగాళ్ల తీరుపై ఆస్ట్రేలియా మీడియా ఏం రాసింది?
- వరల్డ్ కప్ 2023: రోహిత్ శర్మ ఏం తప్పు చేశాడని నిందిస్తున్నారు?
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














