వరల్డ్ కప్ 2023: రోహిత్ శర్మ‌ ఏం తప్పు చేశాడని నిందిస్తున్నారు?

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ
    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

మ్యాచ్ అనంతరం కన్నీటిని ఆపుకుంటూ మైదానం నుంచి వెనుదిరుగుతున్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను చూసి కోట్లమంది క్రికెట్ అభిమానులు కూడా రోదించారు.

నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమిని ఎదుర్కొంది.

2011 తరువాత మరోసారి కప్‌ను చేజిక్కించుకునేందుకు తీవ్రంగా పోరాడిన టీమిండియాకు చివరి మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది.

ప్రపంచ్ కప్ 2023 టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ సారధ్యంలోని జట్టు వరుస విజయాలతో ఫైనల్ వరకు వచ్చింది, రోహిత్ కెరీర్‌లోనే ఈ ప్రయాణం ఎంతో విలువైనది. తరువాతి 2027 వరల్డ్ కప్ సమయానికి రోహిత్ 40ల వయసుకు వచ్చేస్తాడు.

రోహిత్ మరో వరల్డ్ కప్ ఆడొచ్చు, కానీ అప్పటి వరకు భారత క్రికెటర్లు ఈ పరాజయం తాలూకూ బాధను భరించాల్సిందే.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే దూకుడుతో ఆడిన రోహిత్ శర్మ

రోహిత్ స్టైలే అది ..

ముంబయిలో జరిగిన 2011 వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ టైటిల్ గెలుచుకున్న సమయంలో, రోహిత్ జట్టులో లేడు. ఆ సమయంలో జట్టులో తనకు స్థానం లేకపోవడం పట్ల నిరాశ చెందాడు.

ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది. రోహిత్ శర్మ ఆశ నెరవేరలేదు కూడా.

కానీ, ఫైనల్ మ్యాచ్‌ను మాత్రమే చూసి రోహిత్ శర్మ గురించి ఒక అంచనాకు వస్తే, పొరపడినట్లే. ఆ ఒక్క మ్యాచ్‌తో రోహిత్ శర్మ సామర్థ్యం ఏంటో అర్థం కాదు.

ఈ టోర్నీలో మీరు రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను దగ్గరగా గమనిస్తే, నిస్వార్థ బ్యాటింగ్‌తోపాటు భయం లేకుండా ఇన్నింగ్స్ ఆడిన అతడి సామర్థ్యం కనిపిస్తుంది.

వ్యూహం ప్రకారం.. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, ప్రత్యర్థి జట్టును ఎదుర్కొంటూ మంచి ఆరంభాన్ని ఇవ్వాలి. రోహిత్ అదే చేశాడు, ఫైనల్ మ్యాచ్‌లోనూ స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. ఒక సమయంలో రన్ రేట్ 10కి కూడా చేరుకుంది.

రోహిత్ షాట్ ఆడబోయి అవుట్ అవడాన్ని కొంతమంది భారత మాజీ క్రికెటర్లు విమర్శించారు. 9.4 ఓవర్లో ఆ బాల్‌‌ను అనవసరంగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడని అన్నారు.

మ్యాచ్‌ను మలుపుతిప్పిన టర్నింగ్ పాయింట్ అదే అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇది నిజమే అయ్యుండొచ్చు. కానీ, రోహిత్ స్టైల్ అదే కదా. అలా షాట్‌లు ఆడే ప్రయత్నాలు ఇంతకుముందు చాలా మ్యాచ్‌ల్లోనూ చేశాడు.

తన తరువాత వచ్చే బ్యాటర్లు మెరుగైన ఇన్నింగ్స్ ఆడేందుకు వీలుగా తన పరుగులతో ఆ వేదికను సిద్ధం చేయడమే అతడి పాత్ర. ఈ మ్యాచ్‌లోనూ అదే చేశాడు. కానీ, రోహిత్ నిష్క్రమణ తరువాత బరిలోకి దిగిన బ్యాటర్లెవరూ ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొని, నిలబడలేకపోయారు.

వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ప్రపంచకప్‌లో భారతజట్టు చాలా రికార్డులు నెలకొల్పింది.

ఒక్క ఫైనల్‌తోనే ఎలా?

క్రికెట్ ప్రపంచ కప్‌ లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ ఆ లక్ష్యాన్ని సులభంగానే అధిగమిస్తుందని అనుకున్నారు. కానీ పాకిస్తాన్‌ బౌలర్లు షాహీన్ అఫ్రిదీ, హారిస్ రౌఫ్, హసన్ అలీల ప్రమాదకరమైన బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించేందుకు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తనదైన శైలిలో విజృంభించాడు.

63 బంతుల్లో 86 పరుగులు చేసి, విజయ లక్ష్యంలో 45% పరుగులను జోడించి, పాక్ ఆశలకు గండికొట్టాడు.

ఈ టోర్నమెంట్‌లో 7 ఇన్నింగ్స్‌లలో 40 పరుగులకు పైనే చేశాడు. వీటిలో 3 సార్లు వాటిని అర్ధ సెంచరీలుగా మార్చాడు. చాలామంది రోహిత్ శర్మ ఈ టోర్నీలో పెద్ద స్కోర్‌ చేయలేదని అంటుంటారు. కానీ, ఇలా చెప్పడం చాలా సులభం.

రోహిత్ శర్మ చాలాసార్లు ప్రెస్‌మీట్లలో చెప్పినట్లు, వ్యూహం ప్రకారం జట్టులో ప్రతి ఆటగాడికి నిర్దేశిత రోల్ ఇచ్చారు. రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చేయాలి. అదే చేశాడు. వ్యక్తిగత స్కోర్‌పై దృష్టి సారించలేదు.

భారత్ ఫైనల్‌కు చేరుకోవడం వెనుక రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌తో వేసిన పునాదే కీలకమైంది. తన తరువాత వచ్చే బ్యాటర్లయిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల వంటి వారు నిలదొక్కుకుని, ఇన్నింగ్స్‌ను మరింత లోతుగా ఆడి, జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లేందుకు పేస్, తగినంత సమయం చిక్కింది.

నిజానికి, 40ల పరుగులు దాటాక, తన ఇన్నింగ్స్‌లో దూకుడు తగ్గించి, పెద్ద స్కోర్ చేయడానికి రోహిత్ శర్మ ప్రయత్నించి ఉండొచ్చు కానీ, తన వ్యక్తిగత స్కోర్‌పై దృష్టి పెట్టకుండా, కేవలం జట్టులో తనకు నిర్దేశించిన రోల్‌ను నిర్వర్తించడానికి ప్రాధాన్యతనిచ్చాడు.

వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

వ్యూహ చతురత..

ఈ టోర్నీలో రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్‌తోపాటు అతడి నాయకత్వానికి కూడా సమానంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

బ్యాటర్‌గా రోహిత్ శర్మ ఆడే ఇన్నింగ్స్ దూకుడు కూడా కెప్టెన్‌గా తన వ్యూహ చతురతను అమలుచేయడంలో స్ఫూర్తినిచ్చింది. ఫలితంగా జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు సహాయ సిబ్బంది నుంచి కూడా గౌరవంతోపాటు నమ్మకాన్ని సంపాదించాడు.

సమయోచితంగా బౌలింగ్‌లో మార్పులు, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్‌లో చేసిన మార్పులు కూడా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాయి.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ వేగంగా పరుగులు చేస్తున్నప్పుడు మహమ్మద్ సిరాజ్‌కు బౌలింగ్ ఇచ్చి, పాక్‌ను కట్టడి చేశాడు.

అంతకుముందు అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ తన బౌలింగ్‌లో 76 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ, రోహిత్ శర్మ సిరాజ్‌ను నమ్మాడు.

ఒక మంచి కెప్టెన్‌ మంచి వ్యూహాన్ని అమలు చేయగలడు. కానీ, గొప్ప కెప్టెన్ మాత్రం తన జట్టులోని ఆటగాళ్ల బలాబలాలను నమ్మి, సరైన సమయంలో వారికి అవకాశం ఇచ్చి, అద్భుతాలు చేయించగలడు.

బౌలింగ్ మొదలుపెట్టిన సిరాజ్ పాక్ బ్యాటర్లు బాబర్, రిజ్వాన్‌ల 81 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.

ఈ ఎటాక్‌తో భారీ స్కోర్ చేయాలన్న పాక్ ఆశ నెరవేరలేదు. 190 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత జట్టు మెరుగైన ఫలితాలు సాధించని సమయంలో, ఆటగాళ్లకు మద్దతుగా నిలబడ్డాడు. కేవలం ప్రక్రియనే నమ్ముకుని ముందుసాగాలని, ఆ ఫలితాల ప్రభావం జట్టుపై పడనివ్వొద్దనే వ్యూహాన్ని అనుసరించే కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోనే ముందుకు నడిచాడు.

ఈ కోచ్, కెప్టెన్లు ఇద్దరూ కలిసి రెండేళ్ల ముందు నుంచే క్రికెట్ ప్రపంచకప్ లక్ష్యంగా పెట్టుకుని తెర వెనక ఉండి శ్రమించారు. ఈ ఫలితంగానే భారతజట్టు అజేయంగా ఫైనల్‌కు చేరింది.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోచ్, కెప్టెన్ మంచి సమన్వయంతో పనిచేస్తున్నారు.

శ్రేయస్ అయ్యర్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లు అనుకున్నంత రాణించలేకపోయిన సమయంలో రోహిత్ వారికి మద్దతుగా నిలిచాడు.

కెప్టెన్ తమపై ఉంచిన నమ్మకాన్ని వారు నిలబెట్టుకున్నారు. ప్రపంచకప్‌లో రాణించి, జట్టు విజయంలో భాగస్వాములయ్యారు.

ఫైనల్‌లో ఎదురైన ఓటమి బాధ రోహిత్‌ను, భారతజట్టుని, భారత క్రికెట్ అభిమానులను చాలాకాలం వెంటాడుతుంది. కానీ, కెప్టెన్‌గా రోహిత్ శర్మ సాధించిన విజయాలను మాత్రం దూరం చేయలేదు.

నిజానికి, రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్‌లో 'అన్‌సంగ్ హీరో'. మూడోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడాలనే భారత్ కలను నాలుగేళ్ల తర్వాతి కప్‌లోనైనా సరే, కచ్చితంగా నెరవేర్చగల సమర్థుడు.

వినడానికి ఇది అతిశయోక్తిగా అనిపించినా, క్రీడల్లో అసాధ్యాలను సుసాధ్యం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి.

రోహిత్ మళ్లీ కోలుకుంటాడు. తిరిగి బలమైన కమ్‌బ్యాక్‌ను ఇస్తాడు. ఎందుకంటే, రోహిత్ శర్మకు క్రికెట్ మాత్రమే తెలుసు.

కానీ, వరల్డ్ కప్ సాధించాలన్న అతడి కల చెదిరిన బాధ మాత్రం వెంటాడుతుంది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)