ఇండియా తొమ్మిది మందితో బౌలింగ్ ఎందుకు వేయించింది? ద్రవిడ్, రోహిత్ ప్లాన్ అదేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రభాకర్ వద్ది
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత క్రికెట్ అంటే ముందుగా గుర్తొచ్చేది బ్యాటింగ్. దశాబ్దాలుగా టీమిండియా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తూ వస్తోంది. అయితే ప్రస్తుత వన్డే వరల్డ్ కప్‌లో బ్యాటింగ్ విభాగంతోపాటు బౌలింగ్ దళం కూడా అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను మెప్పిస్తోంది.
టోర్నీ లీగ్ దశలో మొత్తం తొమ్మిది మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది భారత్. ఇప్పటివరకు ఆడిన ఐసీసీ టోర్నీలతో పోలిస్తే ఈ టోర్నీలో భారత ఆటతీరు భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ తీరు.
జస్ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ సిరాజ్ , మొహమ్మద్ షమీలతో కూడిన పేస్ త్రయం, ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను క్రీజులో నిలువనీయడం లేదు. బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ జట్టుకు విజయాలను కట్టబెట్టేశారు పేసర్లు, స్పిన్నర్లు.
అయితే ఆదివారం బెంగళూరులో నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత బౌలింగ్‌లో ఈ టోర్నీలో ఇప్పటివరకు కనిపించని ప్రత్యేకత కనిపించింది. ఏకంగా తొమ్మిది మంది భారత ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. అది కూడా స్పెషలిస్టు బౌలర్లకు పూర్తి కోటా ఇవ్వకుండానే. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ అలా ఎందుకు చేశాడు?
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు వరకు, ఇండియా ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఆరుసార్లు ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేయడంలో బుమ్రా, సిరాజ్, షమీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ పాత్ర కీలకం. ఈ ఆరింటిలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.
అంతటి బలమైన బౌలింగ్ దళం ఉన్న ఇండియా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కొత్త వ్యూహాన్ని పరీక్షించింది.

ఫొటో సోర్స్, Getty Images
హార్దిక్ పాండ్యా దూరం కావడంతో ఆరో బౌలర్ లోటు
జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇది టీమిండియాను కలవరపెట్టింది. జట్టులో ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా గత వారం జరిగిన మీడియా సమావేశంలో స్పందించాడు.
"నిజానికి మాకు సరైన ఆరో బౌలింగ్ ఆప్షన్ లేదు. ఆరో బౌలర్ లేకుండానే గత నాలుగు మ్యాచ్‌లు ఆడాం" అని ద్రవిడ్ ప్రస్తావించాడు. ప్రపంచ కప్ టోర్నీకి ముందు కూడా ఆరో బౌలర్ లేకుండానే ఆడామని గుర్తుచేశాడు.
ద్రవిడ్ అలా మాట్లాడినా కూడా జట్టు వ్యూహం మరొకటి ఉందని నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో స్పష్టమైంది.
మైదానంలో ఏ బౌలర్ ఎప్పుడు గాయపడతాడో చెప్పలేం, ఒకవేళ మ్యాచ్ మధ్యలో బౌలర్ గాయపడి, బౌలింగ్ చేయలేని స్థితిలో ఉంటే ఎలా? దీని గురించి టీం మేనేజ్‌మెంట్ ఆలోచించింది. నాకౌట్ దశ మొదలయ్యే లోపే అన్నింటికి సిద్దంగా ఉండాలని యోచించింది. ఆరో బౌలర్ లోటును భర్తీ చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించింది. అవసరమైతే స్పెషలిస్ట్ బౌలర్లతోపాటు బ్యాటర్లకు బంతి ఇవ్వాలని ప్రణాళిక రచించింది.
స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం కనిపించింది.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో వారంతా బౌలింగ్ చేశారు.
కోహ్లీ, గిల్, సూర్య కుమార్, రోహిత్‌లలో ఎవరు మెప్పించారు?
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మినహా అందరితో బౌలింగ్ చేయించింది టీమ్ మేనేజ్‌మెంట్.
ఇన్నింగ్స్ 22వ ఓవర్ రవీంద్ర జడేజా వేశాడు. ఆ తర్వాత కోహ్లీ వచ్చాడు. కోహ్లీతో బౌలింగ్ చేయించొచ్చు అనే వార్తలు ఇంతకుముందే వచ్చినా, ఈ మార్పు చాలా మంది ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించింది. కోహ్లీ తన తొలి ఓవర్లో ఏడు పరుగులు ఇచ్చాడు.
24వ ఓవర్ మళ్లీ జడేజా వేశాడు. 12 పరుగులు ఇచ్చాడు. కోహ్లీ మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. విరాట్ వేసిన మూడో బంతిని డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ సరిగా ఆడలేకపోయాడు. బ్యాట్ అంచును తాకిన బంతి రెప్పపాటులో వికెట్ కీపర్ రాహుల్ చేతుల్లో పడింది. కోహ్లీ ఖాతాలో ఒక వికెట్ వచ్చి చేరింది.
మిడిల్ ఓవర్లలో కోహ్లీ మొత్తం మూడు ఓవర్లు వేసి, 13 పరుగులు ఇచ్చాడు.
తర్వాత ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ కూడా తలా రెండు ఓవర్లు వేసినా, ప్రభావం చూపలేకపోయారు. గిల్ 11 పరుగులు ఇచ్చాడు. సూర్య కుమార్ రెండు సిక్సర్లు సహా 17 పరుగులు సమర్పించుకున్నాడు.
రోహిత్ 48వ ఓవర్ వేశాడు. క్రీజులో పాతుకుపోయి అర్ధసెంచరీ చేసి, నెదర్లాండ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచిన తేజ నిడమానూరును ఔట్ చేశాడు. ఐదో బంతికి అతడు ఇచ్చిన క్యాచ్‌ను షమీ అందుకున్నాడు. అదే చివరి వికెట్. 411 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
కోహ్లీ, రోహిత్‌ల బౌలింగ్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు.
''ఈ ఇద్దరు వికెట్లు తీయడం దీపావళి కానుక. రాబోయే వారంలో 9-0 విజయాలు కాస్తా 11-0 అవ్వాలి. శుభాకాంక్షలు'' అని అతడు ఎక్స్ (ట్విటర్)లో రాశాడు.
నవంబరు 15న జరిగే సెమీ ఫైనల్లో, ఆ తర్వాత ఫైనల్లో భారత్ గెలవాలని ఆకాంక్షిస్తూ, అతడు ఇలా శుభాకాంక్షలు చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభావం చూపని షమీ
నెదర్లాండ్స్ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ బౌలర్లు బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. అయితే, గత మ్యాచుల్లో బాగా రాణించిన షమీ, ఈ మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు.
టోర్నీలో నెదర్లాండ్స్ మ్యాచ్‌కు ముందు నాలుగు మ్యాచ్‌లు ఆడిన షమీ 16 వికెట్లు తీశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే పటిష్ఠ న్యూజిలాండ్ జట్టుపై ఐదు వికెట్లు తీయగా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో నలుగురిని ఔట్ చేశాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.
అయితే ఆదివారం ఆరు ఓవర్లు వేసిన షమీ ఏకంగా 41 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఇపుడు తొమ్మిది ఆప్షన్స్ ఉన్నాయి : రోహిత్ శర్మ
తొమ్మిది మంది బౌలింగ్ చేయడంపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు.
తమ జట్టు భారీ స్కోరు చేయడంతో బౌలింగ్ విషయంలో ప్రత్యామ్నాయాలను ప్రయత్నించే అవకాశం లభించిందని ద్రవిడ్ చెప్పాడు. జట్టులో అందరూ రాణిస్తున్నారని, కోహ్లీ కూడా వికెట్ తీశాడని గుర్తుచేశాడు.
ఆరో బౌలర్ ఆప్షన్‌ను దృష్టిలో పెట్టుకొనే జట్టును ఖరారు చేస్తామని చెప్పాడు ద్రవిడ్.
జట్టులో ఐదుగురు బౌలర్లే ఉన్నప్పుడు ఆరో బౌలర్ ఆప్షన్ మైండ్‌లో ఎప్పడూ ఉంటుందన్నాడు రోహిత్. టీమ్‌లో అలాంటి ఆప్షన్స్ క్రియేట్ చేయాలని, ఈ మ్యాచ్‌లో అలాంటి అవకాశం వచ్చిందని వివరించాడు.
"ఈ రోజు మాకు తొమ్మిది ఆప్షన్స్ ఉన్నాయి, ఇది చాలా ముఖ్యం. జట్టుగా మేం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాం. ఏం చేయగలమో చూడాలనుకున్నాం. దానికి ఇది సరైన మ్యాచ్ అనుకున్నాం '' అని వ్యాఖ్యానించాడు రోహిత్.
భారత్, న్యూజిలాండ్ మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియంలో నవంబరు 15 బుధవారం సెమీ ఫైనల్ జరుగనుంది.
ఇవి కూడా చదవండి:
- విష ప్రాణులు, చెట్లపై నుంచి శరీరంపై పడే జలగలు.. ఆ భయంకర పర్వతం ఎక్కి శాస్త్రవేత్తలు ఏం చేశారు?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















