వరల్డ్ కప్: కేఎల్ రాహుల్ ఫాస్టెస్ట్ సెంచరీ, నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం

కేఎల్ రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం (ఫాస్టెస్ట్ సెంచరీ) సాధించిన భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు.

బెంగుళూరులో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో కేవలం 64 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు కేఎల్ రాహుల్. అందులో 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచకప్‌లో భారత్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే.

దీంతో ఇప్పటి వరకూ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఈ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు. గత నెలలో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 63 బంతుల్లో సెంచరీ కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ కలిసి చివరి 10 ఓవర్లలో 126 పరుగులు చేశారు. చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు సాధించారు.

పక్కా ప్లాన్‌తో ఇలా పరుగుల వరద పారించామని రాహుల్ చెప్పాడు.

‘‘ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు. చివరి 10 ఓవర్లలో వేగంగా పరుగులు చేయాల్సి ఉంటుంది. శ్రేయాస్ క్రీజులో నిలదొక్కుకుని ఉన్నాడు. మేం ఏం చేయాలో ప్లాన్ చేసుకున్నాం. దానిని పక్కాగా అమలు చేశాం’’ అని కేఎల్ రాహుల్ వివరించాడు.

“ఫీల్డ్‌లో కొంత సమయం గడపడం, కొన్ని బంతులు ఆడే అవకాశం రావడం బాగుంది” అని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో గెలిచి, సెమీ ఫైనల్‌పై దృష్టి సారిస్తామన్నాడు.

"ఈ ఇన్నింగ్స్‌‌తో మాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అది భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను" అని రాహుల్ వివరించాడు.

ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌తోనే కాదు కీపర్‌గా కూడా కేఎల్ రాహుల్ బాగా రాణిస్తున్నాడు.

‘‘వికెట్ కీపింగ్‌తోపాటూ బ్యాటింగ్ చేయడం వల్ల అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ వస్తాయి. కానీ ఆట పూర్తయ్యేవరకూ ఉండటాన్ని ఎంజాయ్ చేస్తా’’ అని రాహుల్ అన్నాడు.

కేఎల్ రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం

మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో నెదర్లాండ్స్ విఫలమైంది. 47.5 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

410 పరుగులు చేయడం ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. గతంలో 2007లో బెర్ముడాపై భారత్ 413 పరుగులు చేసింది.

నెదర్లాండ్స్ బౌలర్లు వేసిన బంతులకు భారత బ్యాటర్లు సిక్సర్ల మీద సిక్సర్లు బాదేశారు. మొత్తం 16 సిక్సులు కొట్టారు. అందులో శ్రేయస్ అయ్యర్ అత్యధికంగా ఐదు సిక్సర్లు కొట్టి 94 బంతుల్లో 128 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ చెరో నాలుగు సిక్సర్లు బాదారు. కెప్టెన్ రోహిత్ శర్మ రెండు సిక్సర్లు, విరాట్ కోహ్లీ ఒక సిక్స్ కొట్టారు.

భారత అగ్రశ్రేణి బ్యాటర్లలందరూ అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డును సృష్టించారు.

వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో భారత జట్టులోని టాప్‌ 5 బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఇద్దరు సెంచరీలు కూడా చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)