వరల్డ్ కప్ 2023: ఈ బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబుల్ హసన్ చుట్టూ ఎందుకిన్ని వివాదాలు?

షకీబుల్ హసన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2018లో అంపైర్‌తో గొడవపడుతున్న షకీబుల్ హసన్‌
    • రచయిత, అనంత్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ చుట్టూ వివాదాలే.

2007లో టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన షకీబుల్ హసన్ ఇప్పటివరకు అన్ని ఫార్లాట్మలో కలిపి 10 సెంచరీలు చేయగా, 753 వికెట్లు తీశాడు. వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు.

15-16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో చాలా సందర్భాల్లో అతడి తీరు, నిర్ణయాల పట్ల ఇటు క్రికెట్ అభిమానుల నుంచే కాక అటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ నిపుణుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు నవంబర్ 6వ తేదీన దిల్లీలో బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు షకీబ్.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్‌ను ‘టైమ్డ్ అవుట్’ చేయాలన్న నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్‌లో మాథ్యూస్ ‘టైమ్డ్ అవుట్’ అయిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.

షకీబుల్ హసన్‌

ఫొటో సోర్స్, Getty Images

అసలేంజరిగింది?

వన్డే ప్రపంచ కప్‌-2023లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 24.2 ఓవర్లలో 135 పరుగుల వద్ద సదీర సమర విక్రమ వికెట్‌ను కోల్పోయింది.

అప్పుడు శ్రీలంక స్కోరు 24.2 ఓవర్లలో 135/4.

సమరవిక్రమ స్థానంలో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేశాడంటూ బంగ్లాదేశ్ అప్పీలు చేయడంతో అతడిని టైమ్డ్ అవుట్‌(Timed Out)గా అంపైర్లు ప్రకటించారు.

ఇలా అతడు ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అవుట్‌ అయ్యి, పెవిలియన్ చేరాల్సి వచ్చింది. జట్టు స్కోరు 24.2 ఓవర్లలో 135/5గా మారింది.

పురుషుల లేదా మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అయితే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరుసార్లు టైమ్డ్ అవుట్‌ ఘటనలు జరిగాయి.

‘టైమ్డ్ అవుట్’ తర్వాత మాథ్యూస్, బంగ్లాదేశ్ కెప్టెన్, ఆల్‌రౌండర్‌ షకీబుల్ హసన్‌ పేర్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.

సమరవిక్రమ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన మాథ్యూస్, షకీబుల్ హసన్ వేసే బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాడు.

తలపై హెల్మెట్‌ను సరిచేసుకుంటుండగా హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది.

వెంటనే మరో హెల్మెట్ కావాలని అడగడంతో చమీర కరుణరత్నె అతనికి ఇంకో హెల్మెట్‌ను అందించాడు.

ఈ సమయంలో అక్కడే ఉన్న అంపైర్ మరాయిస్ ఎరాస్మస్‌తో షకీబుల్ హసన్ నవ్వుతూ ఏదో మాట్లాడుతూ కనిపించాడు.

ఆ తర్వాత, మాథ్యూస్ క్రీజులోకి వచ్చిన రెండు నిమిషాల్లో తొలి బంతిని ఎదుర్కోవడంలో విఫలమైనందున టైమ్డ్ అవుట్‌గా ప్రకటిస్తున్నట్లు అంపైర్ చెప్పారు.

అప్పటికీ సమర విక్రమ అవుటై 3 నిమిషాల 20 సెకన్లు అయ్యింది.

తొలుత అంపైర్ జోక్ చేస్తున్నాడని భావించిన మాథ్యూస్.. ఎరాస్మస్, స్క్వేర్ లెగ్ అంపైర్ రిచర్డ్ మధ్య చర్చ జరుగడంతో షాక్‌ అయ్యాడు.

క్రీజులోకి వచ్చాక హెల్మెట్ స్ట్రాప్ తెగిపోవడంతో ఎక్కువ సమయం అవసరమైందని తన వాదనలను అంపైర్‌కు వినిపించాడు మాథ్యూస్.

తర్వాత షకీబుల్ హసన్‌తో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ, అతడు తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోలేదు.

దీంతో మాథ్యూస్‌ను టైమ్డ్ అవుట్‌గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయంతో మాథ్యూస్‌తోపాటు శ్రీలంక జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

మైదానం నుంచి వెనక్కి తిరిగి వస్తూ, బౌండరీ లైన్ దాటాక, మాథ్యూస్‌ అసహనంతో హెల్మెట్‌ను విసిరేశాడు.

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షకీబుల్ హసన్‌ 'టైమ్డ్ అవుట్' అప్పీల్‌పై విమర్శలు

విజయం వరించింది కానీ..

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. కానీ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ మాత్రం వార్తల్లో నిలిచింది. షకీబ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టేడియంలో మొదలైన విమర్శలు, సోషల్ మీడియాలోనూ కొనసాగుతున్నాయి.

మ్యాచ్ అనంతరం షకీబ్ మాట్లాడుతూ, ఇది దురదృష్టకరం కానీ న్యాయమైనదే అని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

క్రీడా స్ఫూర్తితో ఈ అప్పీల్‌ను వెనక్కు తీసుకోవాలని అనిపించలేదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఇలాంటి సందర్భాల్లో ఐసీసీ దీనిని పరిగణలోకి తీసుకుని, నిబంధనలు మార్చాలి అన్నారు.

తాను యుద్ధంలో పోరాడుతున్నట్లుగా అనిపించిందంటూ షకీబ్ అల్ హసన్ అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాశాయి.

తన అవుట్‌పై ఏంజెలో మాథ్యూస్ స్పందిస్తూ, ‘‘ఇది బంగ్లాదేశ్‌కు, షకీబ్ అల్ హసన్‌కు కూడా అవమానకరం. వారు ఇలా క్రికెట్ ఆడాలని భావిస్తే అందులో ఏదో లోపం ఉంది. ఇప్పటివరకు షకీబ్ పట్ల నాకు ఎంతో గౌరవం ఉండేది. అదంతా పోయింది. మా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి. మేం వాటిని తరువాత ప్రదర్శిస్తాం’’ అన్నాడు.

మాథ్యూస్‌, షకీబుల్ మధ్య వివాదం

ఫొటో సోర్స్, Getty Images

విమర్శలతోనే..

షకీబుల్ హసన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాక, అతడిపై నిషేధం విధించాలని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ స్పందించారు.

మ్యాచ్ కామెంటేటర్ మహ్మద్ కైఫ్ స్పందిస్తూ, "మాథ్యూస్ క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత తన హెల్మెట్ స్ట్రాప్ తెగినట్లు గుర్తించాడు. ఇలా ఎన్నిసార్లు జరిగే అవకాశం ఉంటుంది? బ్యాట్ విరిగిన సందర్భంలో బ్యాట్ కోసం అడుగుతాం కదా?" అన్నాడు.

బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్‌ను ఉద్దేశిస్తూ, "మీరు ఈరోజు చేసిన పని నాకేం నచ్చలేదు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది అని వ్యాఖ్యానించాడు.

అంతర్జాతీయ క్రికెటర్లయిన గౌతం గంభీర్, షోయబ్ అక్తర్‌లతోపాటు పలువురు కూడా షకీబుల్ హసన్‌ నిర్ణయాన్ని విమర్శించారు.

అయితే, కొంతమంది మాత్రం ఈ విమర్శలతో ఏకీభవించలేదు.

షకీబుల్ హసన్‌ను ఈ విషయంలో మరీ ఎక్కువగా విమర్శించకూడదని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి అన్నారు.

"షకీబుల్ హసన్‌ను అంతలా విమర్శించాల్సిన అవసరం లేదు. షకీబుల్ హసన్‌ ఐసీసీ నిబంధనలను అనుసరించే ఈ అప్పీల్ చేశాడు. ఏంజెలో మాథ్యూస్ ఎంత ప్రమాదకరమైన బ్యాటరో షకీబ్‌కు తెలుసుకదా. ఈ సందర్భంలో మ్యాచ్‌ను గెలవడానికి ఈ అడుగు వేశాడు. అయితే, ఇప్పుడంతా క్రీడాస్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారు. అయితే, రోజూ క్రికెట్‌ను చూసేవారికి, అంతా ప్రొఫెషనల్ ప్లేయర్లే అన్న విషయం తెలుసు. ఇప్పుడు మ్యాచ్‌ను గెలవాలనే ఉద్దేశంతోనే అందరూ బరిలోకి దిగుతున్నారు. ఈ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు" అన్నారు.

షకీబ్ విమర్శల బారిన పడటం ఇదే తొలిసారి కాదు. తన ప్రవర్తన కారణంగా గతంలోనూ విమర్శలపాలయ్యాడు.

అంపైర్‌తో వివాదం

ఫొటో సోర్స్, Getty Images

కెమెరాలో అసభ్యకర సైగలు

2014లో ఢాకాలో శ్రీలంక, బంగ్లాదేశ్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తన ప్రవర్తన కారణంగా మూడు వన్డే మ్యాచ్‌ల నిషేధంతోపాటు రూ.2,26,821.97 జరిమానా కట్టాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 24 పరుగులు చేసిన షకీబుల్ హసన్‌ అవుటయ్యాడు.

పెవిలియన్‌‌లో కామెంటేటర్లతో మాట్లాడుతున్న సమయంలో తన దగ్గరకు వచ్చిన కెమెరాను ఉద్దేశించి అసభ్యకరమైన సైగలు చేశాడు షకీబ్.

అతడు చేసిన సైగలను చాలామంది ఖండించారు. ఈ పని వల్ల నిషేధంతోపాటు, జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది.

షకీబుల్ హసన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షకీబుల్ హసన్‌ ప్రవర్తనపై గతంలోనూ విమర్శలు వచ్చాయి

వైరల్ అయిన స్టంప్ బ్రేకింగ్ వీడియో

ఈ సంఘటన తర్వాత షకీబుల్ హసన్‌కు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతడి ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఒక వీడియోలో షకీబుల్ హసన్‌ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తిస్తూ, స్టంప్‌ను తీసి నేలపై విసిరిన దృశ్యాలు ఉన్నాయి.

ఈ వీడియో 2021లో జరిగిన ఢాకా ప్రీమియర్ లీగ్‌కు సంబంధించినదని తెలుస్తోంది.

2010లో న్యూజీలాండ్, బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో అక్కడి సిబ్బందిని బ్యాట్‌తో కొడతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ మ్యాచ్‌లో షకీబుల్ హసన్‌ 92 పరుగుల వద్ద ఉన్నప్పుడు సైట్ స్క్రీన్ వద్ద ఇబ్బంది తలెత్తింది. ఈ సమయంలో అక్కడికి వెళ్లిన షకీబ్, సైట్ స్క్రీన్ దగ్గర నిలబడిన వ్యక్తిని దూషించాడని, బ్యాట్‌తో అతడిపై దాడి చేస్తానని బెదిరించినట్లుగా కనిపించింది.

ఈ మ్యాచ్ అనంతరం రెఫరీ షకీబుల్ హసన్‌ను హెచ్చరించి వదిలేశారే తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

షకీబుల్ హసన్‌

ఫొటో సోర్స్, Getty Images

డ్రెస్సింగ్ రూంలో..

న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ కథనం ప్రకారం 2018 నిదాహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

ఈ మ్యాచ్‌లో నోబాల్‌కు సంబంధించిన అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం వివాదానికి దారి తీసింది.

ఈ సమయంలో షకీబుల్ హసన్ కోపంగా తన జట్టులోని బ్యాటర్‌ను క్రీజ్ నుంచి వెనక్కు పిలిచాడు.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.అయితే, బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూంలోని గ్లాస్ డోర్ ధ్వంసమైందన్న వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించి షకీబ్ క్షమాపణలు తెలిపాడు. తాను, తన ఆటగాళ్లు ఉద్వేగంతో ప్రవర్తించడం వలన ఇలా జరిగిందని చెప్పాడు.

అయితే, సోమవారం శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించి షకీబుల్ నిర్ణయాన్ని, అతడి గత వివాదాలతో కలిపి చూడొద్దని విజయ్ లోకపల్లి అన్నారు.

"అందరికీ షకీబుల్ ఎలాంటి ఆటగాడో తెలుసు. కానీ, మాథ్యూస్‌ విషయంలో షకీబుల్ నిర్ణయాన్ని విమర్శిస్తూ, అతడి గత వివాదాలను ఇందులోకి లాగకండి" అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: ఇంగ్లండ్‌లో జరిగే అంధుల క్రికెట్‌ పోటీల్లో ఆడనున్న ఉత్తరాంధ్ర బాలికల కథ

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)