మ్యాక్స్‌వెల్ వీరోచిత డబుల్ సెంచరీ.. అఫ్గానిస్తాన్‌పై ఆస్ట్రేలియా అనూహ్య విజయం

వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 128 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మ్యాక్స్‌వెల్

ఓడిపోతారనుకున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్ అద్భుత పోరాటం అఫ్గనిస్తాన్ చేతిలో ఆ జట్టు ఓటమిని తప్పించింది.

ముంబయి వాంఖడే స్టేడియంలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అనూహ్య, అద్భుత విజయం సాధించింది.

292 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోదిగిన ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేజ్ చేస్తుందని భావించగా మొదట్లో అందుకు భిన్నంగా జరిగింది.

అఫ్గానిస్తాన్ బౌలర్ల ధాటికి ఒక దశలో ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ దశలో క్రీజులో ఉన్న మ్యాక్స్‌వెల్ ఆట మొత్తాన్ని తన చేతిలో తీసుకున్నాడు.

7 వికెట్లకు 91 పరుగుల నుంచి మొదలైన మ్యాక్స్‌వెల్ మాయాజాలం మ్యాచ్ కడ వరకు కొనసాగింది.

జట్టు లక్ష్యం 292 పరుగులు కాగా, అందులో 201 పరుగులు మ్యాక్స్ వెల్ బ్యాట్ నుంచి జాలువారినవే అంటే అతని ఆట తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

వన్ మ్యాన్ షో అనే మాటకు అర్ధంలా సాగింది మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్.

వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మ్యాక్స్‌వెల్

10 సిక్సులు, 21 ఫోర్లతో డబుల్ సెంచరీ చేసి ఈ వరల్డ్ కప్‌‌లో ‌అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు మ్యాక్స్ వెల్ . ఈ మ్యాచ్ లో 128 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.

తన వీర విహారానికి ఆకాశమే హద్దు అన్నట్లు మ్యాక్స్ వెల్ చెలరేగిపోవడంతో స్కోరుబోర్డు మెల్లమెల్లగా కరిగిపోవడం ప్రారంభించింది. మ్యాచ్ అఫ్గానిస్తాన్ చేజారడమూ మొదలైంది.

ఒక దశలో పరుగులు చేయడానికి శరీరం సహకరించకపోవడంతో, సింగిల్స్ వదిలేసి కేవలం ఫోర్లు, సిక్సులపైనే దృష్టి పెట్టాడు మ్యాక్స్ వెల్.

కాలు అడుగువేయనిచ్చే పరిస్థితి లేకపోవడం, రిటైర్డ్ హార్ట్ అయ్యే పరిస్థితి రావడంతో తరువాతి ప్లేయర్ క్రీజులోకి రావడానికి కూడా సిద్ధమయ్యాడు.

కానీ, నొప్పిని పంటిబిగువున భరిస్తూ ఆడటానికే మొగ్గు చూపాడు మ్యాక్స్ వెల్. అదే ఆటను మలుపు తిప్పింది కూడా.

సింగిల్స్, డబుల్స్ తీస్తూ వికెట్ల మధ్య పరుగెత్తే పరిస్థితి లేకపోవడంతో మ్యూక్స్ వెల్ పూర్తిగా ఫోర్లు, సిక్సులు కొట్టడం ప్రారంభించాడు.

ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడం, మళ్లీ స్ట్రైకింగ్ తీసుకుని సిక్సులు, ఫోర్లు బాదడమే పనిగా పెట్టుకున్నాడు.

ఒక దశలో 91 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ముందు కొండంత లక్ష్యం ఉండగా, కేవలం మూడు వికెట్లు తీస్తే అఫ్గానిస్తాన్ గెలిచే పరిస్థితి ఉంది.

అప్పటి వరకు జరిగిన ఆట చూసిన వారికెవరికైనా ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ మరో చాంపియన్‌ను మట్టి కరిపించబోతోందని భావించారు.

అందరూ ఒకటి తలిస్తే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ మ్యాక్స్ వెల్ ఆట సాగింది.

బ్యాట్‌ను మంత్రదండంలా మార్చి, ఫోర్లు, సిక్సులతో కొండంత లక్ష్యాన్ని గోరంతగా మార్చాడు.

మరోపక్క కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నెమ్మదిగా ఆడుతూ 68 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి, మ్యాక్స్‌‌‌వెల్‌కు అండగా నిలవడం ద్వారా కమ్మిన్స్ కూడా ఈ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

మ్యాచ్‌ తమ చేతుల్లో ఉందనుకున్న అఫ్గాన్ ఆటగాళ్ల సంబరంపై నీళ్లు చల్లుతూ, తన దగ్గరికి వచ్చిన ప్రతి బంతినీ ఉతికి ఆరేసే పని పెట్టుకున్న మ్యాక్స్ వెల్, సిక్సర్ ద్వారా డబుల్ సెంచరీని దాటడంతోపాటు, తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

ఆదిలో తడబడిన ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా లాంటి జట్టు ఈ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేజ్ చేస్తుందని భావించగా అందుకుభిన్నంగా జరిగింది.

అఫ్గానిస్తాన్ బౌలర్ల ధాటికి ఒక దశలో ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

స్కోరు బోర్డు పైన సాంతం 4 పరుగులు కూడా చేరకుండానే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రవిస్ హెడ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపింది అఫ్గాన్.

మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 18 పరుగులకు అజ్మతుల్లా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన మిషెల్ మార్ష్ 2 ఫోర్లు, 2 సిక్సులతో ఊపు మీదున్నట్టు కనిపించినా నవీన్ ఉల్ హక్ కు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు.

ఆదుకుంటాడనుకున్న లంబూషేన్‌ను రహ్మత్‌షా రనౌట్ చేయడంతో ఆస్ట్రేలియా కష్టాలు పెరిగిపోయాయి.

మ్యాక్స్‌వెల్ మాయాజాలం మొదలు కావడంతో ఆట స్వరూపం మారిపోయింది.

వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరుగెత్తడానికి శరీరం సహకరించకపోవడంతో స్ట్రైకింగ్‌లో ఉంటూ సిక్సులు, ఫోర్లు సాధించాడు మ్యాక్స్‌వెల్

అంతకు ముందు ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీలో అఫ్గానిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాకు ఒకింత సవాలుతో కూడిన లక్ష్యాన్ని ముందుంచగలిగింది.

అఫ్గాన్ జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)