క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది?

క్రికెట్ వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరల్డ్ కప్‌లో నాలుగు విజయాలు సాధించిన అఫ్గాన్ జట్టు
    • రచయిత, జోయా మతీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 7 నవంబర్‌న జరిగిన మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోరు.

ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను 91 పరుగులకే 7 వికెట్లతో దెబ్బకొట్టి మరో అద్భుతాన్ని సృష్టించడానికి ప్రయత్నించింది అఫ్గానిస్తాన్ జట్టు.

ఈ మ్యాచ్‌ ఫలితం ప్రతికూలంగానే వచ్చినా, సంక్షోభం, తాలిబన్ల పాలనతో స్థిరత్వం లేని దేశపు జట్టు మాత్రం తమ ఆటతీరుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

15 మంది ఆటగాళ్ల జట్టులో 11 మంది క్రికెటర్లు 25 ఏళ్లలోపు వారే. మూడో ప్రపంచ కప్ ఆడుతున్న జట్టు, ఆస్ట్రేలియాని కట్టడి చేసింది.

ఆ తరువాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేసిన వీరోచిత ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మ్యాచ్ తరువాత అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా మీడియాతో మాట్లాడుతూ.. “చాలా నిరుత్సాహపడ్డాం. క్రికెట్ సరదా ఆట. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు” అన్నాడు.

అయితే, అఫ్గానిస్తాన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరూ ఊహించని రీతిలో అద్భుతంగా రాణించింది.

2015లో ప్రపంచకప్‌కు అర్హత సాధించాక, 2023కు ముందు జరిగిన రెండు ప్రపంచకప్ టోర్నీల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఇప్పుడు నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఈ విజయాల్లో ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి చాంపియన్ జట్లు కూడా ఉన్నాయి.

బీబీసీతో ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్‌కు చెందిన సీనియర్ క్రికెట్ రైటర్ సిద్ధార్థ్ మొంగా మాట్లాడుతూ, “అఫ్గాన్ జట్టు సాధించిన పురోగతి అద్భుతం. 25 ఏళ్ల సమయంలో క్వాలిఫైయింగ్ లీగ్స్‌లో చివరి స్థానం నుంచి ప్రపంచ కప్‌లో దాదాపు సెమీస్‌ స్థాయిని అందుకోవడం చిన్న విషయం కాదు. ఇది సాధించాలంటే ఇతర జట్లకు 60-70 సంవత్సరాలు పడుతుంది” అని అన్నారు.

ఇబ్రహీం జద్రాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ కప్‌లో సెంచరీ చేసిన తొలి అఫ్గాన్ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్

సంక్షోభ పరిస్థితుల నుంచి పైపైకి..

జట్టు తీవ్ర అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2021 ముందు వరకు వారు అఫ్గాన్ రిపబ్లిక్ జాతీయ గీతాన్ని ఆలపించేవారు. ఆ తరువాత తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

అయితే, ఆ ప్రభుత్వం క్రికెట్ జట్టును గుర్తించింది. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తాలిబన్ల ప్రభుత్వం చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంది.

“వారు మాకు స్వేచ్ఛనిచ్చారు. గతేడాది మేం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో 1.2 మిలియన్ డాలర్లు సాయంగా ఇచ్చారు” అని బీబీసీతో చెప్పారు బోర్డ్ సీఈవో నసీబ్ ఖాన్.

సవాళ్లు ఉన్నప్పటికీ అఫ్గాన్ జట్టు ప్రపంచకప్‌లో అద్భుతాలు చేసింది. 21 ఏళ్ల అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఆస్ట్రేలియాపై సాధించిన సెంచరీతో తొలి అఫ్గాన్ క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అఫ్గాన్ విజయం సాధించింది.

“జట్టు సాధించిన పురోగతిని అదృష్టం కొద్దీ సాధించినట్లుగా భావించకూడదు. సమయం అనుకూలించిన రోజు ఏ జట్టునైనా సరే ఓడించే సామర్థ్యం ఉన్న టీం ఇది” అన్నారు మాజీ అఫ్గానిస్తాన్ కెప్టెన్, ప్రస్తుత టీం అసిస్టెంట్ కోచ్ రయీస్ అహ్మద్‌ జాయ్.

“అఫ్గాన్‌లకు క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ అసాధారణమైనది. ఆ ప్రేమే మా జట్టును నడిపిస్తోంది” అన్నారు.

హస్మతుల్లా షాహిదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌పై విజయంలో కీలకంగా మారిన కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ ఆట

రెండింటిలోనూ రాణింపు..

అఫ్గాన్‌ జట్టు బౌలింగ్ లైనప్ ఏ దశలోనైనా ప్రత్యర్థి జట్టును కట్టడి చేసేలా 2001లో జట్టు ఏర్పడిన నాటి నుంచే ఉందని సిద్ధార్ధ్ అన్నారు. అయితే, ఇప్పుడు జట్టు బ్యాటింగ్‌లోనూ పురోగతి కనిపిస్తోందని అన్నారు.

నిలకడగా ఇన్నింగ్స్ ఆడుతూ విజయాన్ని సాధించడంలో అఫ్గాన్ బ్యాటర్లు పరిణితి సాధించారు. ఆ ప్రదర్శన కూడా మనం ఈ ప్రపంచకప్‌లో చూశాం.

పాకిస్తాన్, అఫ్గాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను తీసుకుంటే, పాక్ జట్టు నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలో దిగిన అఫ్గాన్ బ్యాటర్లు తొలుత విజృంభించినా, ఆ తరువాత ఇన్నింగ్స్‌ను నిలకడగా కొనసాగించారు. షాహిదీ మిడిల్ ఇన్నింగ్స్‌లో రన్ రేట్‌ను కొనసాగిస్తూ, ఎలాంటి రిస్క్‌లు తీసుకోకుండా ఇన్నింగ్స్‌ ఆడాడు. పాకిస్తాన్ బౌలింగ్ ఎటాక్‌ను కూడా ఎదుర్కొని, ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది అఫ్గాన్ జట్టు.

“ఇందులో గుర్తించాల్సిన విషయమేంటంటే, జట్టులో ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి వీరే స్టార్ ఆటగాళ్లు అని చెప్పడానికి లేదు. జట్టులోని ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఆడుతూ, విజయంలో తమ పాత్ర పోషిస్తున్నారు” అని సిద్ధార్థ్ అన్నారు.

దశాబ్దాల కష్టం, అభివృద్ధి చెందుతున్న దేశవాళీ క్రికెట్‌‌తోపాటు అంతర్జాతీయంగా లభిస్తున్న గుర్తింపు కూడా పురోగతికి కారణం.

పాఠశాల స్థాయి నుంచి టీ20 లీగ్స్ వరకు అఫ్గాన్‌లోని 34 ప్రావిన్స్‌లో వేలసంఖ్యలో క్రికెట్ క్లబ్బులు ఉన్నాయి. కాబూల్‌, జలాలాబాద్, ఖోస్త్ వంటి నగరాలతోపాటు 15 చిన్నస్థాయి క్రికెట్ మైదానాలలో దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి.

ష్పగీజా (సిక్స్ రన్స్) పేరిట జరిగే దేశవాళీ క్రికెట్ లీగ్‌కు మంచి ఆదరణ ఉంది. కాబూల్‌లో ఎనిమిది జట్లు తలపడే ఈ లీగ్‌ను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారు.

అఫ్గాన్ క్రికెటర్లలో ఆరుగురికి పైగా ఆటగాళ్లు అంతర్జాతీయ టీ20 టోర్నీలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, కరేబియన్ దేశాల్లో జరిగే చిన్న టోర్నరమెంట్లలో పాల్గొంటున్నారు.

దేశంలో క్రికెట్‌కు అనువైన సదుపాయాలను కల్పించడం జట్టుకు చాలా కలిసొచ్చిందని నసీబ్ ఖాన్ అన్నారు.

అంతకు ముందు క్రికెటర్లు భారత్, దుబాయ్‌లలో శిక్షణ తీసుకునేవారు. ఇప్పుడు అఫ్గాన్‌లోనే శిక్షణకు అవసరమైన అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు.

అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో ప్రతి అంతర్జాతీయ క్రికెటర్ దేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని చెప్పారు అహ్మద్‌ జాయ్

దీని వలన జట్టులో కొత్త ఉత్సాహం రావడంతోపాటు యువ క్రీడాకారులు, ప్రతిభ కలిగిన వారిని కూడా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని జాయ్ అన్నారు.

ఈ ఫలితంగానే జట్టులో అతిచిన్న వయస్కుడైన 18 ఏళ్ల నూర్ అహ్మద్, 38 ఏళ్ల మొహమ్మద్ నబీతో కలిసి ఆడేందుకు అవకాశం దక్కింది.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది

పాకిస్తాన్‌లో శరణార్థులుగా ఆట నేర్చుకుని..

భారత్, పాకిస్తాన్‌లతో పోలిస్తే, అఫ్గాన్‌లో క్రికెట్ పట్ల పెరుగుతున్న ఆదరణ ఇటీవలి కాలంలో పెరిగింది. 1979లో సోవియట్ యూనియన్-అఫ్గాన్‌ పరిస్థితుల తరువాత అఫ్గాన్ ఆటగాళ్లు పాకిస్తాన్‌లో శరణార్ధులుగా వెళ్లి క్రికెట్‌‌ను నేర్చుకున్నారు.

తిరిగి తమ దేశానికి వచ్చాక ఆ ఆటను కొనసాగించారు కానీ, తొలినాళ్లలో వారికి ఇది ఈజీ కాలేదు. అఫ్గాన్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితులు యుద్ధం, బాంబు దాడులు, అపహరణల వంటి సవాళ్లను ఎదుర్కొంది జట్టు.

“ఆ భయం మమ్మల్ని వదిలిపెట్టలేదు. మా జీవితంతోపాటు ఆట భవిష్యత్తును కూడా సమతుల్యం చేసుకుంటున్నాం” అన్నారు టీం అసిస్టెంట్ కోచ్.

“1990ల్లో తాలిబన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన సమయంలో కూడా పురుషులను క్రికెట్ ఆడనివ్వడంపై ఎలాంటి నిషేధమూ విధించలేదు. చెప్పాలంటే ఇతర అథ్లెట్లతో పోలిస్తే మరింత నిరాబడరంగా వారి డ్రెస్సింగ్ ఉండేది” అన్నారు మోంగా.

ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అఫ్గాన్ క్రికెటర్లకు దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. వారంతా సెలబ్రిటీలుగా మారారు. యువతపై వారి ప్రభావం కనిపిస్తోంది. హోర్డింగులపై వారి పోస్టర్లు కనిపిస్తున్నాయి. స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లాగా అవ్వాలని అహ్మద్‌ జాయ్ కుమారుడు కలలు కంటున్నాడు.

క్రికెట్ వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

చిగురిస్తున్న అశలు..

భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్న సమయంలో భారత్ వేదికగా జట్టు సాధిస్తున్న ప్రదర్శన చూసి వేలమంది అఫ్గానీయుల్లో ఆశలు మరింత పెరిగాయి.

మూడేళ్ల క్రితం భారతదేశానికి వచ్చిన ఫర్షీద్ ముహమ్మద్ మాట్లాడుతూ, “క్రికెట్ మాలాంటి అలిసిన దేశానికి ఆశ కల్పించింది” అన్నారు.

“ప్రస్తుతం టోర్నీలో ఏం జరుగుతుందో చెప్పలేం. అయితే, అఫ్గాన్ జట్టు మాత్రం పలు దేశాలతో బైలేటరల్ టోర్నమెంట్లు ఆడాలని అనుకుంటోంది. కానీ, చాలా బోర్డులు అఫ్గాన్‌తో ఆడేందుకు ముందుకు రాకపోవచ్చు” అన్నారు సిద్ధార్థ్.

ఇందుకు కారణం చెప్తూ, అఫ్గాన్‌కు మహిళా క్రికెట్ జట్టు గానీ, మహిళలను క్రీడల్లో ప్రోత్సహించే వ్యవస్థగానీ లేదని అన్నారు.

తాలిబన్ల పాలనలో మహిళల స్వేచ్ఛ, హక్కులు అణిచివేతకు గురయ్యాయి. ఇప్పటికే మహిళా క్రికెట్ జట్టు దేశం విడిచి, ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది.

“అయితే, ఒకటి మాత్రం చెప్పొచ్చు. క్రికెట్ ఆట పట్ల మక్కువ చూపిస్తున్న యువత దేశంలో ఉంది. ఈ ఆట నుంచి వారి భవితను మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంది. అఫ్గానిస్తాన్‌కు ఎదిగేందుకు అవకాశం ఉంది’’ అన్నారు సిద్ధార్థ్.

మంగళవారం జరిగిన మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి చేరింది అఫ్గాన్ జట్టు. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.

“నేను నా జట్టును చూసి గర్వపడుతున్నాను. దక్షిణాఫ్రికాను సమర్థంగా ఎదుర్కొని, మా అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తాం” అన్నారు షాహిదీ.

అఫ్గాన్ మరో అద్భుతం సాధించేందుకు సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)