ఫిలిప్పీన్స్: ఈ చిన్న దేశం చైనాను ఎందుకు ప్రపంచం ముందు నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది?

దక్షిణ చైనా సముద్రంలోని తమ సరుకు రవాణా బోట్లలో ఒకదానిని చైనా తీర రక్షక నౌక ఢీ కొట్టిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది.
దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అందులో ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ షిప్, చైనీస్ మిలీషియా షిప్‌లు ఢీకొనడం కనిపిస్తుంది.
దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, చైనాల మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. అయితే గత కొన్ని నెలలుగా పరిస్థితులు మారాయి.
సముద్రంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఈ ఘర్షణల తాలుకూ వీడియోలను ఫిలిప్పీన్స్ తమ దేశంలోని మీడియాకు అందిస్తోంది. తద్వారా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తోంది.
దక్షిణ చైనా సముద్రంలో అంతగా లోతులేని ప్రాంతంలో ఇలాంటి ఘటనను ఫిలిప్పీన్స్ జర్నలిస్టులు చిత్రీకరించడం వారంలో ఇది రెండోసారి.
ఈ ప్రదేశాన్ని సెకండ్ థామస్ షోల్, అయుంగిన్ షోల్ లేదా రెయిన్ ఐ రీఫ్ అని పిలుస్తారు.

ఫొటో సోర్స్, Reuters
ఫిలిప్పీన్స్ ఎందుకలా చేస్తోంది?
ఈ ఘటన హఠాత్తుగా కెమెరాకు చిక్కినదేమీ కాదు. చైనా ఆధిపత్య ప్రయత్నాలను ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అనుసరించిన విధానంలో ఇదొకటి.
అక్కడి సముద్ర ప్రాంతాన్ని చైనా ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఫిలిప్పీన్స్ ఆరోపిస్తోంది.
‘‘మనం ఈ ఏడాది ముఖ్యమైన మార్పును చూశాం. ఇది పారదర్శకంగా జరుగుతున్న పోరాటం’’ అని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం 'గోర్డియన్ నాట్ సెంటర్' ఎమెరిటస్ కల్నల్ రేమండ్ పావెల్ అభిప్రాయపడ్డారు.
ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో స్థానిక మీడియాకు ఇటువంటి ఘర్షణల వీడియోలను విడుదల చేసినప్పటి నుంచి ఇది మొదలైంది.
వివాదాస్పద జలాల వద్దకు బీబీసీతో సహా పలువురు జర్నలిస్టులను తమ పడవలు, విమానాల్లో తీసుకెళ్లడం ప్రారంభించింది ఫిలిఫ్పిన్స్.
"చైనాతో వివాదాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఉద్దేశించినదే ఈ ప్రయత్నం" అని కల్నల్ రేమండ్ పావెల్ అన్నారు.
అయితే ఈ వ్యూహంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫిలిప్పీన్స్ వేసిన ఈ పథకం పారినట్లు కనిపిస్తోందని ఫ్రీమాన్ ఎస్పోగ్లీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన ఒరియానా స్కైలార్ మాస్ట్రో అంటున్నారు.
‘‘చైనా కదలికలు ఒక్కసారిగా ఆగిపోయాయి’’ అని ఒరియానా తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/VIRMA SIMONNETTE
ఫిలిప్పీన్స్ సామగ్రి ఎక్కడికి పంపుతోంది?
దక్షిణ చైనా సముద్రంలోని సియెర్రా మాడ్రే ఓడను ఫిలిపినో నౌకా దళం ఔట్‌పోస్టుగా ఉపయోగిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో ట్యాంకులను ల్యాండ్ చేయడానికి దీన్ని తయారుచేశారు.
వియత్నాం యుద్ధంలో అమెరికా నౌకా దళం దీన్ని ఉపయోగించింది. 1970లో ఈ ఓడను వియత్నాం నౌకాదళానికి ఇచ్చారు. 1975లో సైగాన్ పతనం తరువాత ఇది ఫిలిప్పీన్స్ వద్దకు చేరింది.
1999లో ఈ పురాతన నౌకను ఫిలిప్పీన్స్ తీరానికి 160 కి.మీ. దూరంలోని ఓ బండ రాయిపై వదిలేశారు. తొమ్మిది మంది ఫిలిప్పీన్స్ సైనికుల బృందం ప్రస్తుతం ఇందులో ఉంది.
2014లో బీబీసీ బృందం ఆ ఓడను సందర్శించింది. ఆ సమయంలో ఓడ చాలా దెబ్బతిని కనిపించింది. దానికి పెద్ద రంధ్రం పడటంతో సముద్రపు అలల నీరు లోపలికి వస్తోంది.
చైనా, ఫిలిప్పీన్స్ మధ్య సంబంధాలు బాగున్న రోజుల్లో సియెర్రా మాడ్రేకు సామగ్రి పంపడానికి చైనీస్ కోస్ట్ గార్డ్ అనుమతి ఇచ్చింది.
తాజాగా ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొనడంతో ఈ సరఫరాను చైనా అడ్డుకుంది.
అయితే ఓడ మెల్లగా మునిగిపోతున్నందున ఫిలిప్పీన్స్ తమ సైనికులను అక్కడి నుంచి పంపేయాలని చైనా భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఓడను రహస్యంగా బాగు చేస్తున్నారా?
ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి ఫిలిప్పీన్స్ విదేశాంగ విధానం భిన్నంగా ఉంది.
చైనాతో స్నేహంగా ఉండాలనే మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు మార్కోస్. ఆయన అమెరికాకు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఫిలిప్పీన్స్‌లోని స్పెషల్ ఎకనమిక్ జోన్‌లోకి చైనా చొరబాటు అంశాన్ని కూడా ఆయన గట్టిగా ప్రస్తావించారు.
ఇది ఇప్పటికే చర్చనీయాంశమైంది. సియోర్రా మాడ్రేకు ఫిలిప్పీన్స్ ఆహారం, నీటిని, ఇతర సరుకులను తీసుకెళుతోంది. అదే సమయంలో నిర్మాణ సామగ్రిని కూడా రహస్యంగా తీసుకెళ్తున్నారు.
‘‘వారు ఈ ఓడ లైఫ్‌ను ఎలా పెంచుతారో, దాన్ని బాగుచేయడానికి ఇంకా ఏం చేస్తారో చూడాలి. సియెర్రా మాడ్రేకు కాలం చెల్లింది. త్వరలో అది పూర్తిగా నాశనం కావచ్చు" అని కల్నల్ పావెల్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓడ లేకపోతే ఏమవుతుంది?
సియోర్రా మాడ్రే కారణంగా ఈ ప్రాంతంలో చైనా, ఫిలిప్పీన్స్ మధ్య వివాదం పెరిగే అవకాశం ఉంది.
అయుంగిన్ షోల్‌లో ఈ ఓడను నిలిపి ఉంచడంపై ఫిలిప్పీన్స్ చాలా పట్టుదలగా ఉంది. ఇటు చైనా కూడా తగ్గడం లేదు. ఈ ప్రాంతాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
అయితే ఈ సియోర్రా మాడ్రే ఓడ అక్కడ లేకుండా పోతే ఏమవుతుంది? దక్షిణ చైనా సముద్రంలోని ఇతర చోట్ల చేసినట్లుగానే ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తీసుకుంటుందా ?
లేకపోతే అయుంగిన్ షోల్‌లో ఫిలిప్పీన్స్ మరో ఓడ పెట్టి లంగరు వేస్తుందా ? ఆ సమయంలో అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది?
వీటిపై ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. కానీ, ఆ రోజు త్వరలోనే రావొచ్చు.
ఇవి కూడా చదవండి:
- గాజా చరిత్ర: ఎన్నో విధ్వంసాలు, విపత్తులు, విషాదాలను భరించిన వేల ఏళ్ళనాటి నగరం
- గాజా రిపోర్టర్: 'కళ్ళతో చూడలేని వాటిని చూడాల్సి వస్తోంది... కెమేరా వెనుక నిలబడి చాలా సార్లు ఏడ్చాను'
- సైనిక పాలనలో ట్రాన్స్‌విమెన్ పై అత్యాచారం, హింస కేసులో 40 ఏళ్ల తర్వాత వాంగ్మూలం...బాధితులు ఏం చెప్పారంటే
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















