విష ప్రాణులు, చెట్లపై నుంచి శరీరంపై పడే జలగలు.. ఆ భయంకర పర్వతం ఎక్కి శాస్త్రవేత్తలు ఏం చేశారు?

ఎకిడ్నా

ఫొటో సోర్స్, Expedition Cyclops

    • రచయిత, జోనా ఫిషర్, చార్లీ నార్త్‌కాట్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవల ఇండోనేషియా పర్యటనకు వెళ్లినపుడు వారికి అటెన్‌బరో లాంగ్-బీక్డ్ ఎకిడ్నా అనే అరుదైన, పురాతన క్షీరదం కనిపించింది.

ఎకిడ్నా వీడియోలను విడుదల చేశారు శాస్త్రవేత్తలు. ఈ జంతువు అంతరించిపోయిందని అందరూ భావిస్తూ వచ్చారు, కానీ అది ఇప్పటికీ ఉన్నట్లు ఈ ఫుటేజీతో రుజువయింది.

స్పైకీ, బొచ్చు, ముక్కుతో ఉన్న ఈ ఎకిడ్నాలను "జీవించే శిలాజాలు" అని పిలుస్తుంటారు. అంటే అవి చాలా కాలం నుంచి ఉన్నాయి, ఏళ్లుగా పెద్దగా మారలేదు. ఈ ఎకిడ్నాకు గతంలో సర్ డేవిడ్ అటెన్‌బరో పేరు పెట్టారు.

డైనోసార్‌లు భూమిపై సంచరించిన సమయంలో అంటే దాదాపు 200 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇవి పుట్టాయని అంచనా.

ఇప్పటివరకు ఈ 'జాగ్లోసస్ అటెన్‌బరోగీ' నిర్దిష్ట జాతి ఉందని నిరూపించడానికి కేవలం మ్యూజియాల్లోనే నమూనాలే సాక్ష్యాలుగా ఉండేవి.

కెమెరా ట్రాప్ ఫుటేజీలో అటెన్‌బరో ఎకిడ్నాను గుర్తించిన క్షణంపై డాక్టర్ జేమ్స్ కెంప్టన్ బీబీసీతో మాట్లాడుతూ "నేను, నా టీమ్ ఉల్లాసంగా ఉన్నాం. మా సాహసయాత్ర చివరి రోజున మేం సేకరించిన ఫుటేజీలో ఇది వచ్చింది'' అంటూ సంతోషం పంచుకున్నారు.

ఇంతకీ ఈ శాస్త్రవేత్తలు ఇండోనేషియాలో ఎక్కడ పర్యటించారు? అంత అరుదైన జంతువులు ఎలా కనుగొన్నారు?

వీడియో క్యాప్షన్, అంతరించిపోయింది అనుకున్న ఎకిడ్నా మళ్లీ కనిపించింది

సైక్లోప్స్ పర్వతాలలో ప్రయాణం

డాక్టర్ కెంప్టన్ నేతృత్వంలోని వివిధ దేశాల శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టానికి 2,000 మీటర్ల ఎత్తులో ఉన్న కఠినమైన వర్షారణ్య ప్రాంతమైన సైక్లోప్స్ పర్వతాల గుండా నెల రోజులు ప్రయాణం చేసింది.

''సైక్లోప్స్ పర్వతాల పైభాగం నిజంగా ప్రత్యేకమైనది, మనకు ఇంకా తెలియని అనేక జాతులు ఉన్నాయి, అయితే వాటి రక్షణ అవసరం'' అని బృందంలో భాగమైన గిసన్ మోరిబ్ అన్నారు.

సెండర్వాసిహ్ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ విద్యార్థి గిసన్ .

ఈ పర్యటనలో శాస్త్రవేత్తలు ఎకిడ్నా మాత్రమే కాకుండా కొత్త రకాల కీటకాలు, కప్పలను కూడా కనుగొన్నారు. రకరకాల పక్షులను కూడా చూశారు,

వారు అధిక సంఖ్యలో ఉన్న చెట్ల కంగారూలతో పాటు ప్యారడైజ్ పక్షులను కూడా చూశారు, ఇవి ప్రత్యేకమైన, రంగురంగుల పక్షులు.

వీడియో క్యాప్షన్, ఎకిడ్నా తొలి చిత్రాలు చూడండి

ఇంతకీ ఏంటీ ఎకిడ్నా?

ఇది ఒక ప్రత్యేకమైన క్షీరదం, డక్-బిల్డ్ ప్లాటిపస్ మాదిరే ఇది కూడా గుడ్లు పెడుతుంది. నాలుగు రకాల ఎకిడ్నాలలో మూడింటికి పొడవైన ముక్కులు ఉంటాయి.

వీటిలో అటెన్‌బరో ఎకిడ్నా, వెస్ట్రన్ ఎకిడ్నాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

గతంలో సైక్లోప్స్ పర్వతాల వద్దకు శాస్త్రవేత్తలు వెళ్లినప్పుడు 'అటెన్‌బరో ఎకిడ్నా'లు అక్కడే ఉండవచ్చని సూచించే దాని ముక్కుకు సంబంధించిన ఆధారాలు భూమిలో లభించాయి.

అయితే వారు కచ్చితమైన రుజువు కోసం పర్వతాలలో ఎత్తైన భాగాలను చేరుకోలేకపోయారు. గత 62 ఏళ్లుగా అటెన్‌బరో ఎకిడ్నాకు ఏకైక సాక్ష్యం ఒక నమూనా, దాన్ని నెదర్లాండ్స్‌లోని ట్రెజర్ రూమ్ ఆఫ్ నేచురాలిస్‌లో చాలా సురక్షితంగా ఉంచారు.

కమ్మింగా

ఫొటో సోర్స్, BBC/JONAH FISHER

ముళ్ల పందిలా కనిపించొచ్చు

62 ఏళ్ల ఎకిడ్నాను పట్టుకుని ఇది "చాలా నునుపుగా ఉంది" అని నేచురలిస్‌లోని కలెక్షన్ మేనేజర్ పెపిజ్న్ కమ్మింగా చెప్పారు.

అది ముళ్ల పందిలా కనిపించొచ్చు ఎందుకంటే దాన్ని పీటర్ వాన్ రాయెన్ అనే డచ్ వృక్షశాస్త్రజ్ఞుడు మొదట సేకరించినపుడు సరైన విధానంలో భద్రపరచలేదు.

1998లో అది వేరే ఎకిడ్నా రకానికి చెందిన చిన్న వయసుగల ప్రాణి కాదని, పూర్తిగా పెరిగిన, విభిన్నమైన ఎకిడ్నా అని X-కిరణాల ద్వారా నిరూపణ అయినపుడు మాత్రమే దీని ప్రాముఖ్యం స్పష్టమైంది.

అప్పుడే ఆ జాతికి సర్ డేవిడ్ అటెన్‌బరో పేరు పెట్టారు. ఇప్పటివరకు ఈ నమూనా ఒక్కటి మాత్రమే తెలిసినందున ఆ జాతి అంతరించిపోయిందని అందరూ భావించారని కమ్మింగా తెలిపారు.

''ఇది నమ్మశక్యం కాని వార్త'' అని అంటున్నారు కమ్మింగా.

ఎకిడ్నా

ఫొటో సోర్స్, Getty Images

ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమంటే..

సైక్లోప్స్ పర్వతాలు నిటారుగా ఉంటాయి, అక్కడ అన్వేషించడం ప్రమాదకరం.

శాస్త్రవేత్తలు ఎకిడ్నా కనిపించే ఎత్తైన ప్రదేశాలకు చేరుకోవడానికి నాచు, చెట్ల వేర్లతో ఉన్న ఇరుకైన గట్లను, కొండలను అధిరోహించవలసి ఉంటుంది. అంతేకాదు, వాళ్లు పర్వతాలు ఎక్కుతున్న సమయంలో అక్కడ రెండుసార్లు భూకంపం కూడా వచ్చింది.

"జారిపోతుంటారు. గాయాలు అవుతుంటాయి. మీ చుట్టూ విష జంతువులు తిరుగుతుంటాయి, కాటేస్తే చనిపోయేంత విష పాములు ఉంటాయి" అని కెంప్టన్ తెలిపారు.

"ప్రతి చోటా జలగలు ఉన్నాయి. అవి నేలపై మాత్రమే కాదు, చెట్లను ఎక్కుతాయి, చెట్ల నుంచి వేలాడతాయి, మీ రక్తాన్ని పీల్చుకోవడానికి మీపై పడతాయి" అని వివరించారు.

గ్రీకు కీటకాల నిపుణులు లియోనిడాస్

ఫొటో సోర్స్, EXPEDITION CYCLOPS

ఫొటో క్యాప్షన్, ఇది నిజంగా గుర్తిండిపోయే యాత్ర అని అంటున్నారు గ్రీకు కీటకాల నిపుణులు లియోనిడాస్.

'ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నా'

శాస్త్రవేత్తలు సైక్లోప్స్ ఎత్తైన భాగాలకు చేరుకున్న తర్వాత, ఆ పర్వతాలు కొత్త జాతులతో నిండి ఉన్నాయని వారికి స్పష్టమైంది.

"నా తోటి శాస్త్రవేత్తలు, నేను సంబరపడుతూనే ఉన్నాం" అని గ్రీకు కీటకాల నిపుణులు డాక్టర్ లియోనిడాస్-రొమానోస్ డావ్రానోగ్లో చెబుతున్నారు.

"మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం, ఎందుకంటే ఇది కొత్తది, ఎవరూ చూడలేదు, ఓ మై గాడ్, నేనిది చూస్తున్నట్లు నమ్మలేకపోతున్నా. ఇది నిజంగా గుర్తిండిపోయే యాత్రే'' అని అన్నారు లియోనిడాస్.

యాత్ర మొదటి వారంలో డాక్టర్ డావ్రానోగ్లౌ చేయి విరిగింది, అయినా కూడా నమూనాలను సేకరించడానికి పర్వతాలలోనే ఉన్నారాయన.

ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కీటక జాతులను ధృవీకరించారని, ఇంకా చాలా ఉన్నాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

పూర్తిగా చెట్లలో నివసించే కొత్త రకం రొయ్యలను, గతంలో తెలియని గుహలను కూడా ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

రొయ్య

ఫొటో సోర్స్, EXPEDITION CYCLOPS

పవిత్ర పర్వతాలు

ఎకిడ్నాలు నివసించే సైక్లోప్స్ పర్వతాల ప్రాంతాలను చేరుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ పర్వతాలు పవిత్రమైనవని స్థానిక పాపువాన్‌ల నమ్మకం.

"పర్వతాలను ల్యాండ్ లేడీగా భావిస్తారు" అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మడేలిన్ ఫూట్ చెప్పారు. "వారి సంపదకు విలువ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టకూడదు'' అని ఆయన అంటున్నారు

ఈ శాస్త్రవేత్తల బృందం స్థానిక గ్రామాలతో కలిసి పని చేసింది. అంటే వారు వెళ్లలేని ప్రదేశాలు కొన్ని ఉన్నాయని శాస్త్రవేత్తలు అంగీకరించారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే స్థానిక సంప్రదాయం ప్రకారం వివాదాలను పరిష్కరించడంలో అరుదైన, కనుగొనలేని ఈ అటెన్‌బరో ఎకిడ్నా ముఖ్య పాత్ర పోషిస్తోంది.

ఇక్కడి ప్రజల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం వస్తే ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఒక వ్యక్తికి ఎకిడ్నాను కనుగొనమని, మరొకరికి ఒక రకమైన చేపను కనుగొనమని చెప్పేవారు.

''వారికి దశాబ్దాలు కూడా పట్టవచ్చు'' అని ఫూటే అంటున్నారు. అంటే అది శాంతికి ప్రతీక అని, కమ్యూనిటీలో ఘర్షణను తొలగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎకిడ్నా, ఇతర కొత్త జాతులను వెలుగులోకి తీసుకురావడం వల్ల సైక్లోప్స్ పర్వతాల సంరక్షణకు సహాయపడుతుందని కెంప్టెన్ ఆశిస్తున్నారు.

పొడవాటి ముక్కులున్న అటెన్‌బరో ఎకిడ్నా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నప్పటికీ, ఇది ప్రస్తుతం ఇండోనేషియాలో రక్షిత జాతి కాదు.

అందులో ఎన్ని బతికున్నాయో, అవి మనుగడ సాగించగలవో లేదో శాస్త్రవేత్తలకు తెలియదు.

ఈ వర్షారణ్యంలో ఇంకా చాలా జాతులు కనిపించొచ్చని, ఎకిడ్నా వంటి ప్రత్యేకమైన జాతులు, వాటి నివాసాలైన ఈ అడవులను పరిరక్షించాల్సిన అవసరముందని కెంప్టెన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)