దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?

వర్షంలో తడుస్తున్న అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో, కృత్రిమ వర్షం అనేది కొత్త పదమేమీ కాదు.

కరవు, వడగాడ్పులు, తుపాన్లు, వరదలు, కార్చిచ్చు వంటివి తలెత్తినప్పుడు, పరిస్థితిని నియంత్రించడానికి కృత్రిమ వర్షాన్ని ఒక ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు.

ప్రస్తుతం దిల్లీలో పెరుగుతున్న కాలుష్యం, దాని కారణంగా తలెత్తుతున్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా కృత్రిమ వర్షాలపై చర్చ జరుగుతోంది.

దిల్లీలో కొన్ని రోజులుగా కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. ఎంత తీవ్రంగా అంటే, దిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 401-500 మధ్య నమోదవుతోంది.

నిపుణులు చెప్పినదాని ప్రకారం, ఏక్యూఐ 0- 50 మధ్య ఉంటే దాన్ని మంచి గాలిగా పరిగణిస్తారు. 51- 100 మధ్య ఉంటే సంతృప్తికరంగా, 101-200 మధ్య ఉంటే 'మధ్యస్థం'గా, 201-300ల మధ్య ఉంటే అధ్వాన్నమని (పూర్), 301- 400 మధ్య ఉంటే తీవ్ర అధ్వాన్నమని (వెరీ పూర్), 401-500 మధ్య ఉంటే ప్రమాదకరంగా పరిగణిస్తారు.

దిల్లీలోని తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం అనేక ప్రకటనలు చేసింది.

దిల్లీ మంత్రి

ఫొటో సోర్స్, ANI

కాలుష్య నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.

ప్రభుత్వం చేసిన అన్ని సూచనల్లోకెల్లా క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించాలనే అంశం ఎక్కువగా చర్చనీయాంశమైందని చెప్పారు.

భౌగోళిక పరిస్థితి దృష్ట్యా ప్రతీ ఏడాది ఈ సమయంలో దిల్లీతో పాటు ఉత్తర భారత్‌లోని అనేక నగరాల్లో కాలుష్యం తీవ్రంగా ఉంటుందని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.

కృత్రిమ వర్షాలతో ఈ కాలుష్యం ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని ఆయన చెప్పారు.

‘‘ఐఐటీ కాన్పూర్‌ నిపుణులతో మేం సమావేశమయ్యాం. సుప్రీం కోర్టు నుంచి అనుమతి లభిస్తే ప్రభుత్వం దీన్ని అతి త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇది విజయవంతమైతే దిల్లీలోనే కాకుండా ఉత్తర భారతం అంతటా అత్యంత ప్రభావవంతమైన సాంకేతికత అందుబాటులో ఉంటుంది’’ అని అన్నారు.

ఈ నేపథ్యంలో కృత్రిమ వర్షం అంటే ఏంటి? దీన్ని ఎలా సృష్టిస్తారు? కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో ఇది ఎంత ప్రభావవంతంగా ఉంటుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమివ్వడానికి, ఐఐటీ కాన్పూర్‌లోని సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎస్‌ఎన్ త్రిపాఠితో బీబీసీ మాట్లాడింది. ఆయన చెప్పిన విషయాలను ఇక్కడ చర్చిద్దాం.

కృత్రిమ వర్షాలు

ఫొటో సోర్స్, Getty Images

కృత్రిమ వర్షం అంటే ఏమిటి?

వాతావరణంలో ఏర్పడిన మేఘాల కారణంగా కురిసే వర్షాన్ని సహజ వర్షం అంటారు.

అయితే, చాలా సార్లు మేఘాలు ఏర్పడతాయి. కానీ, వాటిలోని కొన్ని అసంపూర్ణ ప్రక్రియల కారణంగా అవి వానలుగా మారలేవు. ఒకవేళ వర్షం కురిసినా అది మేఘాల వరకు మాత్రమే పరిమితమవుతుంది. అంతేతప్ప నేలను చేరదు.

కానీ, ఒక ప్రత్యేక సాంకేతికత ద్వారా మేఘాలలో ఉత్ప్రేరకాలను చొప్పించి వర్షం పడేలా ప్రేరేపిస్తారు. ఇలా కురిసే వర్షాన్నే కృత్రిమ వర్షం అని ఈ టెక్నాలజీని క్లౌడ్ సీడింగ్ అంటారు.

క్లౌడ్ సీడింగ్

ఫొటో సోర్స్, Getty Images

క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి?

క్లౌడ్ (మేఘం), సీడింగ్ (విత్తనాలను నాటడం) అనే రెండు పదాల కలయికతో క్లౌడ్ సీడింగ్ అనే పదం ఏర్పడింది.

ఇది వింతగా అనిపించవచ్చు కానీ, సాధారణ భాషలో చెప్పాలంటే మేఘాలలో వర్షపు విత్తనాలను (ఉత్ప్రేరకాలు) నాటే ప్రక్రియను క్లౌడ్ సీడింగ్ అంటారు.

విత్తనాలుగా అంటే ఉత్ప్రేరకాలుగా సిల్వర్ అయోడైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ వంటి పదార్థాలను వాడతారు.

విమానాల సహాయంతో ఈ పదార్థాలను మేఘాలలో వెదజల్లుతారు.

ఈ పదార్థాలు మేఘంలో ఉండే నీటి బిందువులను ఘనీభవించేలా చేస్తాయి. తర్వాత ఈ మంచు ముక్కలు ఇతర ముక్కలకు అతుక్కుపోయి మంచురేకులు(స్నోఫ్లేక్‌)గా ఏర్పడతాయి. ఈ మంచు రేకులు తర్వాత నేలపై పడతాయి.

కృత్రిమ వర్షాలు

ఫొటో సోర్స్, Getty Images

క్లౌడ్ సీడింగ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది.

క్లౌడ్ సీడింగ్‌ను అమెరికన్ శాస్త్రవేత్త విన్సెంట్ జె. షెఫర్ కనుగొన్నారు.

అమెరికాలో 1940లలో ముఖ్యంగా క్లౌడ్ సీడింగ్‌పై పరిశోధనలు జరిగాయి.

క్లౌడ్ సీడింగ్ గురించి ప్రొఫెసర్ ఎస్.ఎన్ త్రిపాఠి వివరించారు.

“మేఘాలు లేని చోట సీడింగ్ చేయలేం. కాబట్టి ముందుగా మేఘాలు ఉన్నాయా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ మేఘాలు ఉంటే అవి ఏ ఎత్తులో ఉన్నాయి? వాటి లక్షణాలు, వాతావరణ పరిస్థితి ఏంటి? అనే అంశాలను పరిశీలించాలి. సూచిక సహాయంతో మేఘంలో ఎంత నీరు ఉందో తెలుసుకోవాలి. దీని తర్వాత మేఘాల్లోని తగిన ప్రదేశాల్లో ఒక ప్రత్యేక రసాయనాన్ని (ఉప్పు లేదా లవణాల మిశ్రమం) జల్లుతారు. ఈ రసాయనం, మేఘాల్లో వర్షపు బిందువులు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆ తర్వాత వర్షం రూపంలో నేలను చేరుతుంది’’ అని వివరించారు.

ఇదే కాకుండా, మేఘాలకు విద్యుత్ షాక్ ఇచ్చే సాంకేతికత కూడా ఉంటుంది. ఈ సాంకేతికతతో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఇందులో డ్రోన్‌లతో మేఘాలకు విద్యుత్ షాక్ ఇస్తారు.

యుఏఈ 2021లో ఈ సాంకేతికతను ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని సృష్టించింది.

కృత్రిమ వర్షాలు

ఫొటో సోర్స్, Getty Images

కృత్రిమ వర్షాలు ఎప్పుడు అవసరం?

సాధారణంగా కరవు, వరద పరిస్థితులను ఎదుర్కోవటానికి కృత్రిమ వర్షాలను కురిపిస్తారు.

భరించలేని ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్‌, తుపానులు, కార్చిచ్చులు, కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు.

ఇజ్రాయెల్‌లో సహజ వానలు చాలా తక్కువ. కాబట్టి ఇజ్రాయెల్ తరచుగా కృత్రిమ వర్షాలను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రోజుల్లో, యూఏఈ కూడా వీటిని పరిశోధన కార్యక్రమాల్లో ఉపయోగిస్తోంది.

కాలుష్య నియంత్రణలో కృత్రిమ వర్షాలు ప్రభావం చూపుతాయా?

చైనా, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌ సమయంలో విమానం, గ్రౌండ్ బేస్డ్ గన్‌ల సహాయంతో క్లౌడ్ సీడింగ్ చేసింది. కాలుష్య నియంత్రణలో ఇది వారికి చాలా సహాయపడింది.

భారత్ గురించి చెప్పాలంటే, ఇంతకుముందు ఇక్కడ కూడా క్లౌడ్ సీడింగ్ జరిగింది. కానీ, ఇప్పటివరకు విదేశాలకు చెందిన విమానాలు, సీడింగ్ సాధనాలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సహాయంతో భారత్‌లో క్లౌడ్ సీడింగ్ చేశారు.

భారత్‌లో తొలిసారిగా ఐఐటీ కాన్పూర్ స్వయంగా క్లౌడ్ సీడింగ్‌లో వాడే రసాయనాన్ని అభివృద్ధి చేసింది. విమానం కూడా ఐఐటీ కాన్పూర్‌దే. సీడింగ్ సాధనాలు కూడా భారత్‌లోనే తయారయ్యాయి. కాబట్టి దిల్లీలో వీటిని వాడితే, పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో క్లౌడ్ సీడింగ్ చేసినట్లు అవుతుంది.

ఇది విజయవంతం అవుతుందా? లేదా? అనేది సీడింగ్ మీద ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ సీడింగ్ సరిగ్గా జరిగితే, ప్రతీ అంశంలోనూ దాని ప్రభావం కనిపిస్తుంది. ఒక పెద్ద ప్రాంతంలో వర్షం కురిసినప్పుడు, కాలుష్యం దానంతట అదే నియంత్రణలోకి వస్తుంది.

క్లౌడ్ సీడింగ్

ఫొటో సోర్స్, Getty Images

క్లౌడ్ సీడింగ్ మొదట ఎప్పుడు చేశారు?

ప్రస్తుతం చాలా దేశాలు క్లౌడ్ సీడింగ్‌ను ఉపయోగిస్తున్నాయి.

50కి పైగా దేశాలు క్లౌడ్ సీడింగ్‌ను ప్రయత్నించాయని 2017లో ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ అంచనా వేసింది.

వీటిలో ఆస్ట్రేలియా, జపాన్, ఇథియోపియా, జింబాబ్వే, చైనా, అమెరికా, రష్యా దేశాలు ఉన్నాయి.

భారతదేశం కూడా దీన్ని ప్రయోగించింది.

భారత్‌ తరహాలోనే కాలుష్యంతో సతమతమవుతున్న చైనా ఎక్కువగా క్లౌడ్ సీడింగ్‌ను వాడుతోంది.

2008 బీజింగ్‌ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్‌కు ముందు చైనా మొదటిసారి క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించింది.

భారత్ మొదటగా 1984లో దీనిని వాడింది. ఆ సమయంలో తమిళనాడులో తీవ్ర కరవు ఏర్పడింది. 1984-87, 1993-94 మధ్య తమిళనాడు ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ సహాయం తీసుకుంది.

త2003, 2004లో కర్ణాటక ప్రభుత్వం కూడా క్లౌడ్ సీడింగ్‌పై ప్రయోగాలు చేసింది. అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్‌ సహాయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)